తారకము

అంధకారంలో అగమ్యంగా నడుస్తున్నపుడు

పాండిత్యం సాయం కోరాను

అది చిరువెలుగై ప్రకాశించింది

గమ్యాన్ని మాత్రం ఆ వెలుగులో

నన్నే వెతుక్కోమంది 

 

అనుమానం అగాథమై అడ్డం వచ్చినపుడు 

తర్కాన్ని గట్టిగా పట్టుకున్నాను

అది తాడులా అవతలిగట్టుకి వూగింది

అక్కడ నేను కాలు మోపేలోపూ   

అంతే వేగంతో నను వెనక్కి లాగింది

 

అహమూ మోహమూ నిలువెత్తు అలలై ఎగసినపుడు

శ్రద్ధని ఎలుగెత్తి పిల్చాను

అది నావలా నది మధ్యకు నడిచివచ్చింది

ఆదరంగా నవ్వి

నను దరిచేర్చగలనని మాట యిచ్చింది

******

కామెంట్‌లు

భీమరాజు వెంకటరమణ చెప్పారు…
నిజానికి బయట నుండి వచ్చిన పాండిత్యమే లోపల అనుమానాన్ని,అహాన్ని జనింపజేస్తుంది.వీటన్నిటినీ వదలగలిగితే ఆపన్న హస్తం మన భుజం మీదే కనపడుతుంది.
దాసరి వెంకట రమణ చెప్పారు…
శ్రద్ధ మాత్రమే మార్గం చూపగలదన్న మాట 👌

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సతీసుమతి

సంక్లిష్టమైన కథలు