సంక్లిష్టమైన కథలు
కథలలో సంక్లిష్టత గురించిన చర్చలు
చాలా సరదాగా ఉంటాయి. అసలు సంక్లిష్టత అంటే
ఏమిటి? అది కథకి గుణమా! దోషమా! అనే విషయంపై ఒక కచ్చితమైన అభిప్రాయం ప్రముఖ తెలుగు కథకులు
కానీ విమర్శకులు కానీ ఎక్కువగా
వెలువరించినట్లు కనిపించదు. అయితే సాధారణంగా
కథలపై జరిగే చర్చలలోను సాహితీ సమావేశాలలోను మాత్రం ఒక కథను మెచ్చుకునే కొన్ని
సందర్భాలలో అది చాలా “సంక్లిష్టం”గా ఉందని చెప్పడం గమనిస్తూ ఉంటాము. దానిని బట్టి కథలలో “సంక్లిష్టత” అనే లక్షణాన్ని గుణంగానే
పరిగణిస్తున్నారని అర్థమవుతుంది.
అయితే అసలు సంక్లిష్టత అనే మాటని అందరూ ఒకేవిధంగా అర్ధం చేసుకుంటున్నారా! లేక ఎవరి
నిర్వచనాలు వారికి ఉన్నాయా! అని పరిశీలించినపుడు, నాకు పరిచయం ఉన్న కొందరు
ప్రసిద్ధ కథకులతోను విమర్శకులతోను అలాగే సాహిత్యంపై ప్రత్యేకమైన ఆసక్తి ఉన్న
కొందరు పాఠకులతోను చర్చించినపుడు ఎక్కువమంది
సంక్లిష్టత గురించి ఈ క్రింది విధంగా
అభిప్రాయపడుతున్నారని అర్థమయింది.
ప్రతి కార్యానికీ ఒక కారణం ఉంటుంది. ఈ
కార్యకారణ సంబంధాలు కొన్ని సార్లు చాలా సూటిగా సరళంగా ఉంటాయి. ఒక కార్యాన్ని ప్రభావితం చేసే అంశాలు
ఎక్కువగా లేనపుడూ వైరుధ్యాలతో లేనపుడూ ఆ సమీకరణం స్పష్టంగా ఉంటుంది. అంటే కారణం తెలియగానే కార్యాన్నీ ,
కార్యం తెలియగానే కారణాన్నీ సులభంగా
చెప్పేసే అవకాశం ఉంటుంది. అందుకు
విరుద్ధంగా ఒక విషయాన్ని ప్రభావితం చేసే
కారణాలు ఎక్కువగా ఉన్న సందర్భాలలోనూ అవి విభిన్నమయినవైన సందర్భాలలోనూ ఆ
సమీకరణాన్ని అర్ధం చేసుకోవడం, సాధించడం కష్టతరమవుతూ ఉంటుంది. “సంక్లిష్ట”మవుతూ ఉంటుంది. అంటే ఒక కార్యానికి కారణాన్ని,
కారణానికి కార్యాన్ని స్పష్టంగా చెప్పడం దుస్సాధ్యమవుతుంది.
(కష్టము, సంక్లిష్టము – ఈ రెండింటి మధ్య ఇంకా సూక్ష్మమయిన విభాగం చేయవచ్చుననే
అభిప్రాయం కూడా ఈ చర్చలలో నాకు లభించినప్పటికీ, ఈ వ్యాసాన్ని అంత లోతుకు తీసుకు వెళ్ళకుండా ప్రస్తుతం
సంక్లిష్టత పట్ల ఉన్నాయని నేను
భావిస్తున్న అర్థాలు/అపార్థాలకే దీనిని
పరిమితం చేస్తున్నాను. ఈ పదానికి మరికొంత లోతైన నిర్వచనం భవిష్యత్తులో ఏర్పడుతుందని
ఆశిస్తున్నాను.)
అయితే “సంక్లిష్టత” అనే పదాన్ని చర్చకు పెట్టినపుడు, ఒక సిద్ధాంతంగా
సూత్రప్రాయంగా దాని గురించి మాట్లాడినపుడు పైన పేర్కొన్నటువంటి అవగాహన, వివరణ
వినిపిస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం చాలా
సందర్భాలలో “అస్పష్టత”నే సంక్లిష్టతగా పరిగణించబడడం కనిపిస్తూ ఉంది. అంటే ఒక రచన “అస్పష్టం”గా ఉంటే
చాలు “సంక్లిష్టంగా ఉంది” అనడం
కనిపిస్తోంది. ఎంత అస్పష్టంగా ఉంటే అంత
సంక్లిష్టం అని భావించడమూ కనిపిస్తోంది.
సంక్లిష్టత వలన కొంత అస్పష్టత ఏర్పడే అవకాశం ఉండవచ్చు. కానీ అస్పష్టతలన్నీ
సంక్లిష్టతలు కావు కదా! అస్పష్టత అనేది కథలో వివిధ రకాలుగా ఏర్పడే అవకాశం ఉంది. ప్రతి
కార్యానికీ కారణం ఉంటుందనుకున్నాము. ఆ
కారణాలు ఎక్కువైనపుడూ అవన్నీ “కలిసి” ఒక విషయాన్ని(కార్యాన్ని) ప్రభావితం
చేసినపుడు అది సంక్లిష్టమవుతుందనీ కనుక అందులో కొంత అస్పష్టత ఉంటుందనీ అనుకుంటున్నాం. అయితే అస్పష్టత
అనేది ఈ ఒక్క సందర్భంలోనే ఏర్పడదు. ఒక కార్యానికి అసలు సంబంధమే లేని కారణాలనన్నిటినీ ఏకరువు పెట్టినపుడు, సంబంధం ఉన్న కారణాలని సైతం చెప్పకుండా వదిలేసినపుడు
కూడా అస్పష్టత ఏర్పడుతుంది. ఆ అస్పష్టతకు మూలం విషయంలోని సంక్లిష్టత కాదు. రచనలోని
అసమర్థత. కానీ రచనలోని ఈ లోపాన్ని దోషంగా చూడకపోగా గుణంగా భావించడం చాలా
సందర్భాలలో కనబడుతోంది. పాత్రచిత్రణలో వైరుధ్యాలనీ పాత్రోన్మీలనలో అసంబద్దాలని కూడా
“సంక్లిష్టత”గా భావించడం కనిపిస్తోంది.
అయితే అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తోంది అని ఆలోచిస్తే అందుకు మూలకారణం
సులభంగానే అర్థమవుతుంది. ‘సంక్లిష్టతలో అస్పష్టత ఉంటుంది’ అన్న అవగాహనే ఈపరిస్థితికి కారణం. ఒకసారి ఆ అవగాహనకి వచ్చాక
దానికి కొనసాగింపుగా సంక్లిష్టత ఉన్న కథలలో అస్పష్టత ఉంటుందని భావించడం... అది అలా
సాగి సాగి చివరికి కొందరు అస్పష్టతనే
సంక్లిష్టతగా విశ్వసించడం జరుగుతోంది.
ఇక్కడ మనం గ్రహించవలసినది ఏమిటంటే
కనీసం సాహిత్యానికి సంబంధించినంతవరకు సంక్లిష్టతకీ అస్పష్టతకీ సంబంధం
లేదు. విషయం యెంత సంక్లిష్టమైనదైనా కథ
అస్పష్టంగా ఉండనవసరం లేదు. మళ్ళీ మాట్లాడితే ఉండకూడదు. జీవితంలోని సంక్లిష్టతలు అందరికీ స్పష్టంగా
అర్ధం కావు, నిజమే. కానీ అలాంటి ఒక సంక్లిష్టతని గమనించి అది తనకు స్పష్టంగా
అర్థమయిందనుకున్నపుడు, ఆ రహస్యాన్ని తాను నలుగురికీ సమర్థవంతంగా
చెప్పగలననుకున్నపుడు మాత్రమే రచయిత కథ
వ్రాస్తే ఇక అపుడు అస్పష్టత ప్రసక్తి ఉండదు.
నిజానికి జరగవలసినది అదే.
ఒక వ్యక్తి ఉన్నాడు. నిన్నటివరకు
ఒకరకంగా మాట్లాడినవాడు తెల్లవారేసరికి పూర్తిగా మారిపోయాడు! జీవితంలో అలా ఎందుకు
జరిగిందో మనకి అర్థం కాకపోవచ్చు. అందుకు కారణాన్ని మనం కనిపెట్టలేకపోవచ్చు. ఆ
కారణాన్ని కనిపెట్టడానికి మనకి సహాయం చేసేదే సాహిత్యం. కనుక కథలో మనకి ‘కారణం’
అస్పష్టత లేకుండా అర్థం కావాలి.
ఈమాట విన్న వెంటనే “అంటే ఏమిటి? ప్రతీదీ వాచ్యంగా చెప్పాలా కథలో!” అని కొందరు
ప్రశ్నిస్తూ ఉంటారు. వాచ్యంగా చెప్పనవసరం
లేదు, వ్యంగ్యంగా చెప్పదలచుకుంటే అలాగే చెప్పవచ్చు. గుంభనగా చెప్పదలచుకుంటే
గుంభనగానే చెప్పవచ్చు. కానీ చెప్పాలి! చెప్పకపోతే ఆ కథ వలన పెద్ద ప్రయోజనం ఉండదు. అటువంటి కథకి
“సంక్లిష్టమైన కథ” అని బిరుదు ఇచ్చి ప్రశంసించడం వలన ఒరిగేదేమీ ఉండదు.
ఇంకొక విషయం ఉంది. “కథలో ప్రతీదానికీ కారణం చెప్పాలి అన్న నియమం
ఏమిటి? అసలు జీవితంలో కొన్ని విషయాలకి కారణాలే ఉండవు. ఎందుకిలా జరిగింది! అన్న ప్రశ్నే అక్కడ
అసంబద్ధం అయ్యే సందర్భాలు ఉంటాయి. అప్పుడేం చేయాలి?” అని కూడా కొందరు
ప్రశ్నిస్తారు. ఈప్రశ్న “కాల్పనిక సాహిత్యం” యొక్క మూలతత్త్వాన్నే అర్థం చేసుకోక
పోవడం వలన వచ్చే ప్రశ్న. నిజానికి దీనికి
సమాధానం చెప్పుకోవడం చాలా సులభం.
రామారావు ప్రతి రోజూ పొద్దున్నే శంకరవిలాస్ కి వెళ్ళి రెండు ఇడ్లీలు తిని కాఫీ
త్రాగుతాడు. ఒకరోజు మసాలా దోసె తిన్నాడు. ఎందుకు? జీవితంలో అయితే ఈ ఎందుకు అనే
ప్రశ్నకు అర్థం లేదు. దానికి ఒక కారణం ఉండవలసిన
అవసరమూ లేదు. కానీ కథలో! కథలో అయితే కారణం ఉండాలి. కథలో గనక రామారావు రోజూ పొద్దున్నే
రెండు ఇడ్లీలు తింటాడు అనేది వ్రాసి ఉంటే
ఒకరోజు మసాలా దోసె ఎందుకు తిన్నాడో కూడా తెలియాలి.
ఈ విషయాన్ని అర్థం చేసుకోని కొందరు పాఠకులూ
విమర్శకులూ జీవితచరిత్రలలోను
పురాణాలలోను ప్రతి విషయానికీ కారణాలు వెతకడము, కాల్పనిక సాహిత్యంలో మాత్రం ఏ
విషయానికీ కారణం ఉండనక్కర్లేదనడము మనకి కనిపిస్తూ ఉంటుంది. రచయితలు కథలో అనవసరపు విషయాలు చేర్చీ అవసరమైన
విషయాలు వదిలేసీ అస్పష్టతని సృష్టిస్తే దానిని “సంక్లిష్టత”గా విశ్లేషించడమూ కనిపిస్తుంది.
అయితే కథలలో అసమగ్రతలు, వైరుధ్యాలు, అసంబద్ధాలు, అనవసరపు విషయాలు – ఇటువంటి
దోషపూరితమైన మాటలన్నీ మాయమయ్యి వాటన్నిటి స్థానంలో “సంక్లిష్టత” అనే
ప్రశంసాపూర్వకమైన ఒకే మాట ప్రతిష్టితమవడం
ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ ఈ పరిస్థితి మారాల్సిన సమయం వచ్చిందని మాత్రం అనిపిస్తోంది.
జీవితంలోని సంక్లిష్టతలని స్పష్టంగా సమర్ధవంతంగా అర్థం చేయగల కథలు మాత్రమే సంక్లిష్టత ఉన్న కథలుగా నిర్వచించబడడం
సమంజసమనీ అనిపిస్తోంది.
*****
కామెంట్‌లు
ఇటువంటి వ్యాసాలను ఒక సంకలనంగా అచ్చు వేయిస్తే సాహిత్య విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది