నా స్నేహితుడు
అలసిన ప్రపంచమంతా ఆదమరచి నిద్రించేటపుడు.., చంద్రుడూ, తారలూ మాత్రమే తొంగి చూస్తున్నపుడు.., అలవోకగా ఆకాశం నుండి దిగివచ్చిన అప్సరకాంతలా వుంది సంధ్య.
చక్కటి చిరునవ్వుతో సూర్యుడికి సుప్రభాతం పలుకుతూ, అందంగా ముగ్గుపెట్టే సంధ్యని చూస్తే ఏ అజ్ఞాత చిత్రకారుడి తపఃఫలమో అనిపిస్తుంది.
ఏ రోజయినా, ఏ కాలమయినా సంధ్య ముగ్గు వేసే సమయంలో ఒక్క నిమిషం కూడా తేడా వుండదు.
ఆ దృశ్యాన్ని మిస్ అవకూడదన్న బలమయిన కోరిక వల్ల కాబోలు .. నాకు మెలకువ వచ్చే సమయంలోనూ అరనిమిషం తేడా వుండదు.
కానీ సూర్యుడికీ, ప్రకృతికీ ఆ పంక్ట్యుయాలిటీ వుండదు కదా! అందుకే సంధ్య ముగ్గుకి నేపధ్యం మాత్రం ఒక్కోరోజు ఒక్కో రకంగా వుంటుంది. ఈ రోజు అది అద్భుతంగా వుంది.
తెల్లవార్లూ శ్రమపడి సంధ్యని మలచిన చిత్రకారుడు తెల్లవారుతూందని తెలీగానే ఎక్కడి కుంచెలు అక్కడ పారేసి పారిపోయాడో! ఏమో! ఆకాశంలో ఎరుపు, తెలుపు, నలుపు, నీలం . అన్ని రంగులూ అల్లిబిల్లిగా అంటుకుని వున్నాయి. ఆ రంగుల మధ్యలోనుంచి .. తెల్లటి పరికిణీ, ఓణీలో విచ్చిన నందివర్ధనం పూవులా నడిచి వచ్చింది సంధ్య.
తననే మురిపెంగా చూస్తున్న నా వైపు తిరిగి "గుడ్ మార్నింగ్ అంకుల్ " అంది అలవాటుగా.
అలవాటంటే ఒకనాటి అలవాటు కాదు. దాదాపు పన్నెండేళ్ళ అలవాటు.
ఏ సెంటిమెంట్ కీ లొంగని నేను కూడా ప్రొద్దున్నే సంధ్య మొహం చూడకుండా వుండటాన్ని యిబ్బందిగా ఫీలయ్యేంతగా అయిపోయిన అలవాటు.
"కాలేజ్ వుందా యివాళ!" అన్నాను.
"ఊ" అంటూ లోపలికి వెళ్ళబోయింది. మళ్ళీ అంతలోనే ఆగి "ఎందుకు!" అంది అనుమానంగా.
నేను మాట్లాడలేదు.
"కథ చెప్తారా!"
"అనుకున్నాను" నవ్వాను నేను.
"అయితే కాలేజ్ మానేస్తాన్లే. ఇవాళ అంత ముఖ్యమయిన క్లాసులేమీ లేవు. ఇంట్లోనే కొంచెం పనుంది. ఒక గంటాగి రానా!"
తలవూపాను. అది చూడగానే యిక ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయడం యిష్టం లేనట్లు తూనీగలా లోపలికి పరుగెత్తింది.
నేను ఏమైనా వ్రాసే అలవాటు అయిదారేళ్ళ క్రితమే వదిలేశాను. ఇపుడు ఏ రచన అయినా నేను చెప్తుంటే సంధ్య వ్రాసి పెట్టాల్సిందే. అదే నా కుడిచేయి.
ఇపుడిలా నాలో ఒక భాగంగా అనిపిస్తున్న సంధ్య, మేము ఈ యింట్లోకి వచ్చేసరికి నాలుగేళ్ళ పిల్ల.
అప్పుడు నేనొక వర్ధమాన రచయితని. క్రొత్తగా ఉద్యోగంలో చేరిన రోజులు... క్రొత్తగా పెళ్ళయిన రోజులు.
క్రొత్త ఆలోచనలు..ఉత్సాహం.
ఈ యింట్లో అడుగుపెట్టిన గంట లోపలే కనిపించింది సంధ్య... ప్రక్క యింట్లో ఆడుకుంటూ.
మూడు చక్రాల బండి తోసుకుంటూ.. వచ్చీ రాని మాటలతో "ఓ.." అని అరుస్తూ.. ఈ యింటి దాకా వచ్చింది.
వాకిట్లో క్రొత్త మనిషి కనపడగానే టక్కున ఆగిపోయింది. పెద్ద పెద్ద కళ్ళతో ఆరిందాలా చూస్తూ.
అప్పటివరకూ.. పిల్లలంటే .. వాళ్ళని ఏదో వింతలోకంలో నుంచి వచ్చిన వాళ్ళలా చూస్తూ దూరంగా పారిపోయేవాడిని నేను. ఆక్షణం అసలు నాకేమనిపించిందో నాకే తెలీదు.
అప్రయత్నంగా చేతులు సాచాను.
"పాపా! రా!" అంటూ పిలవలేదు.
అసలు అలాంటివేమీ నాకు చేతకావు కూడా. కానీ ఆశ్చర్యం ఏమిటంటే నేను అలా చేతులు సాచగానే, ఆ చక్రాల బండి అలాగే వదిలేసి... ఏమాత్రం కొత్త లేకుండా .. తడబడే అడుగులతో నా దగ్గరికి వచ్చి కాళ్ళని చుట్టేసుకుంది సంధ్య.
నేను గాల్లోకి ఎగరేసి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాను. అంతే. ఆ తర్వాత అలా అది ఒక అద్భుతమైన అనుబంధం అయిపోయింది.
నా రచనలూ.. పేరుప్రతిష్టలూ పెరిగినంత వేగంగా సంధ్య పెరిగిపోయింది.
తనకి పదకొండేళ్ళప్పుడనుకుంటా .. ఒక రోజు ప్రొద్దున పూట .. తోటలో మొక్కలు పరీక్ష చేస్తూ పచార్లు చేస్తున్నాను నేను.
ప్రక్క యింట్లో.. వాళ్ళ అమ్మ చేత జడ వేయించుకుంటున్న సంధ్య కనిపిస్తోంది. వాళ్ళ మాటలు లీలగా వినిపిస్తున్నాయి.
సంధ్య అంటోంది. "అమ్మా! రేపు మా స్కూల్లో ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ వుంది. నేను వ్రాయనా!" అని.
"నీకేం వస్తుంది!" అంది ఆవిడ.
"కాదమ్మా.. ఎవరి చేతైనా చెప్పించుకుని వ్రాయాలి. టాపిక్ ముందే చెప్పేశారు."
"సరే బాగానె వుంది. నీకు చెప్పేవాళ్ళెవరున్నారిపుడు!" యిది జరిగే పని కాదన్నట్లుగా ఆవిడ లోపలికి వెళ్తుంటే, జడకి రబ్బర్ బాండ్ పెట్టుకుంటూ మెల్లగా అంది సంధ్య, "అంకుల్ చేత చెప్పించుకుంటాను. నాకే ఫస్ట్ ప్రయిజ్ వస్తుంది." అని.
వింటూన్న నా మనసు ఆనందంతో వులిక్కిపడింది. జీవితంలో నాకు ఎన్నో అవార్డులు వచ్చాయి.కానీ, ఏవీ నాకు ఆ మాటలంత సంతోషం కలిగించలేదు.
అప్పటికి అది చిన్నపిల్ల. నా పుస్తకాలు ఒక్కటి కూడా చదవలేదు. ఉపన్యాసాలు వినలేదు. కానీ నేను చెప్పే వ్యాసానికే ఫస్ట్ ప్రయిజ్ వస్తుందన్న దాని నమ్మకం.. ఆ నమ్మకం నాకు కలిగించిన ఆనందం..
ఆనందించడానికి తర్కం ఎందుకు!
ఆ ఆనందంలోనే కొట్టుకుపోతూ నేను నిల్చుని వుంటే ., ఈ లోపు వాళ్ళ అమ్మ అంది. "..సర్లే. ఇపుడు ఆయన నీకు అవన్నీ చెప్తారా! క్రొత్త పుస్తకమేదో వ్రాస్తున్నట్లున్నారు. వెళ్ళి విసిగించకు."
ఆమాటలు పూర్తిగా వినిపించుకోనేలేదు సంధ్య. పరుగెత్తుకుంటూ వెళ్ళి పుస్తకమూ, పెన్నూ పట్టుకొచ్చింది.
నేను ఏమీ ఎరగని వాడిలా లోపలికి వచ్చేసి, నా కుర్చీలో కూర్చున్నాను.
ఆది వచ్చి అడిగాక వ్యాసం చెప్పాను.
నిజానికి వ్యాసం చెప్పడం నాకు చేతకాలేదు. పదేళ్ళ పిల్లల స్థాయికి దిగి చెప్పడం నాకు తెలీలేదు.
అయితే చిత్రమేమిటంటే.. నేను ఏ స్థాయి వరకూ దిగగలిగానో ఆ స్థాయిని సంధ్య ఎగిరి అందుకుంది. అర్ధం చేసుకుని వ్రాసి, ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంది.
నేను చెప్తుంటే వ్రాసి పెట్టడం.., నా కథలన్నీ ఫెయిర్ చేయడం., అసలు ఒకటేమిటి!
రోజులు గడిచేకొద్దీ నా ఆలోచనల స్థాయి పెరిగి, మనసు చురుకుగా పరుగెడుతుంటే, వయసుతో బలహీనమయిన శరీరం దాన్ని అందుకోలేకపోయేది. అలసిపోయి ఆగిపోయేవాడినే.
కానీ అదిగో.. సరిగ్గా ఆ లోటే సంధ్య తీర్చింది.
అయితే.. సంధ్య యింతగా నా జీవితంలోకి వచ్చేసినా, నేను మాత్రం తనని చాలా రోజులు గమనించనేలేదు.
నారచనల ప్రభావం.. నా మాటల ప్రభావం తనమీద ఎంతగా వుందో గుర్తించనే లేదు.
గుర్తించాక చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించింది. నా ఆలోచనలు, యిష్టాలు, వ్యక్తిత్వం .. నా కళ్ళముందే నాకన్నా అందమైన రూపు దాల్చి నిలబడితే కలిగే సంతోషం .. నిజంగా వర్ణిండానికి సాధ్యం కాదు.
అయితే యింతగా నన్ను అర్ధం చేసుకున్న సంధ్యలో నాకు చిరాకు కలిగించే విషయం ఒకటుంది.
ప్రతిరోజూ పూజ అంటూ టైం వేస్ట్ చేయడం .. ప్రతి ఆదివారం గుడికి వెళ్ళడం.
నేను ఎంతటి నాస్తికుడినో, ఈ పూజల్నీ, వ్రతాల్నీ ఎంతగా విమర్శిస్తానో తెలిసి కూడా తను దేవుడిని నమ్మడం చూస్తే నాకు ఆశ్చర్యంగా వుంటుంది.
ఇంకా చిత్రమేమిటంటే... తను నాలో కూడా "దేవుడి"నే చూస్తోంది.
తన ఫ్రెండ్స్ అందరూ దాని ఆరాధన చూసి వెక్కిరిస్తారట. "ఏమంటున్నాడు మీ దేవుడు!" అని అడుగుతారట...
నేను ఆలోచనల్లో వుండగానే….సంధ్య ఎప్పుడు వచ్చిందో! పెన్నూ, పేపర్స్ తో రెడీగా కూర్చుని.. "అంకుల్.. చెప్తారా!" అంటూ పిల్చింది.
నేను తలతిప్పి ఒక్కక్షణం పరీక్షగా తనవైపే చూశాను. తలంటి పోసుకున్న తల.., నుదుటి మీద తిలకం క్రిందుగా చిన్న కుంకుమ బొట్టు.., జడలో కుంకుమ అంటిన గన్నేరు పూలు..
కొద్దిగా పనుండడం ఏమిటో.. ఒక గంట ఆగి వస్తాననడం ఎందుకో నాకు అర్ధమయింది.
"గుడికి వెళ్ళావా!" అన్నాను.
నా గొంతులో స్పష్టంగా వినిపించిన చిరాకుకి ఒక్కసారి తలెత్తి చూసింది. చిన్నగా నవ్వి మళ్ళీ తల దించుకుంది.
నాకు ఒళ్ళు మండిపోయింది. ఇదే.. ఈ ఒక్క విషయమే నాకు చిరాకు తెప్పించేది. అన్ని విషయాలలో నా మాటకి మించినది లేదనే పిల్ల ఈ ఒక్క విషయం ఎందుకు ఒప్పుకోదు!
ఆ క్షణమే నిర్ణయించుకున్నాను నేను. ఎలా అయినా సంధ్యకి ఈ దేవుడు అనే పిచ్చి వదల్చాలని. రెండు గంటల తర్వాత సంధ్య యింటికి వెళ్తుంటే చెప్పాను. "సాయంత్రం అయిదు గంటలకి రా! బయటకి వెళ్దాం." అని.
"ఎక్కడికి!" అని అడగలేదు అది. అప్పుడే కాదు.. సాయంత్రం బయల్దేరాక కూడా.
నేను కారు డ్రయివ్ చేస్తుంటే ప్రక్కనే కూర్చుని ఏదో పుస్తకం చదువుకోసాగింది. కారు వూరు పొలిమేరలు దాటేస్తుంటే మాత్రం కాస్త ఆశ్చర్యంగా చూసింది.
ఊర్లూ.. మైదానాలూ.. దాటుతూ దాదాపు మూడు గంటలు ప్రయాణించాక వినబడింది.. దూరంగా సముద్రపు హోరు.
పరిసరాలన్నీ నిర్మానుష్యంగా వున్నాయి.
చుట్టూ సరుగుడు చెట్లు.. మధ్యలో సన్నటి మట్టి రోడ్డు. ఆ రోడ్డు మీదనుంచి కారు ఎగిరెగిరి పడ్తూ వెళ్తోంది.
అప్పుడడిగింది సంధ్య "ఎక్కడికొచ్చాం!" అని.
"తెలీదు" అన్నాను.
నిజంగానే నాకు తెలీదు. ఈ ప్రక్కనే వున్న పల్లెటూరికి రెండు మూడు సార్లు సముద్ర స్నానానికి వచ్చాను నేను... నా చిన్నతనంలో.
కానీ ఇప్పుడు ఆ వూరు దాటి, సముద్రం వెంబడి చాలా దూరం వచ్చేశాం. ఈ ప్రాంతాన్ని ఏమంటారో నాకు తెలీదు.సముద్రపు హోరు వింటూ కారుని సముద్రానికి దగ్గరగా తీసుకు పోతున్నానంతే.
అలా తీసుకుపోతూనే అడిగాను...
"దేవుడ్ని ఎందుకు నమ్ముతావు సంధ్యా నువ్వు!" అని.
అది సమాధానం చెప్పలేదు. "మీరెందుకు నమ్మరు అంకుల్!" అంటూ ఎదురు ప్రశ్న వేసింది.
నేను జవాబు చెప్పబోయాను. ఈ లోపలే .. "కనిపించడు కాబట్టి అని చెప్పకండి. అది పాత వాదన. కనిపించని వాటన్నిటినీ లేవు అనుకోవాలని సైన్స్ కూడా చెప్పదు." అంది.
ఈ విషయంలో సంధ్య ఆలోచనలని ఇలా బయటకి లాగాలని నాకు ఎప్పటినుంచో వున్నా.. ఇవాళ్టి నా ప్లాన్ వేరు.
అందుకే తనతో వాదన పెట్టుకోకుండా " ఏమో! దేవుడు వున్నాడేమో అన్న అనుమానం నాకెప్పుడూ రాలేదు" అన్నాను.
నా గొంతులో అల్లరి గుర్తించిందేమో, తను కూడా మొహంలో విషాదం నింపుకుని అంది. "ప్చ్. దేవుడు వున్నాడేమో అని అనుమానం కలిగేంతగా మీహృదయం ఎప్పుడూ స్పందించలేదంటే మీరు చాలా దురదృష్టవంతులు. "
నేను ఉలిక్కిపడ్డాను. నాకు ప్రొద్దుటి దృశ్యం గుర్తొచ్చింది. ప్రొద్దున సంధ్య ముగ్గు వేసేటపుడు .. ఆకాశాన్ని, ఆహ్లాదకరమయిన ఆ వాతావరణాన్ని చూస్తూ 'ఏ చిత్రకారుడి సృష్టో!' అని తలపోయడం…'నిజంగా దేవుడు వున్నాడేమో, లేకపోతే యింతటి అద్భుత చిత్రాన్ని ఎవరు గీయగలరు!' అనుకుని పరవశించడం..
ఆ జ్ఞాపకంలోనుంచి తేరుకుని మెల్లగా అన్నాను. "అంటే.. ఒకటి రెండు సార్లు వున్నాడేమో అని కూడా అనిపించిందనుకో.."
తనని ఏడిపిస్తున్నానని అర్ధమయినట్లూ సంధ్య నవ్వింది. "చూశారా మరి మీకు ఒకటి రెండు సార్లయినా వున్నాడేమో అనిపించింది కదా! నాకు మాత్రం ఒక్కసారి కూడా లేడేమో అనిపించలేదు." అంది నోరు సున్నాలా చుట్టి గారంగా.
"ఇప్పుడనిపిస్తుంది" కారు ఆపుతూ అన్నాను నేను.
పున్నమి చంద్రుడి వెలుగులో చాలా దూరం వరకూ వున్న నిర్మానుష్య వాతావరణం స్పష్టంగా తెలుస్తోంది.
అంతదూరంలో సముద్రం భయంకరంగా కనిపిస్తోంది. మరోవైపు ..కనుచూపు మేరవరకూ సరుగుడు చెట్లే..
ఆ వాతావరణం .. ఆ నిశ్శబ్దం.. ఒక్క క్షణం నాకే ఒళ్ళు జలదరించింది.
"దిగు" అన్నాను ఆశ్చర్యంగా చూస్తూన్న సంధ్యతో.
మెల్లగా దిగి కారు చుట్టూ తిరిగి నా వైపు వచ్చింది.
"..ఎం..త.. బాగుంది!" అంది ఉద్వేగం నిండిన కంఠంతో చుట్టూ చూస్తూ.
"బాగుందా!"
"ఊ" వెన్నెలలో కళ్ళు మిలమిలా మెరుస్తుండగా చెప్పింది.
"భయం వేయడం లేదూ!"
"ఉహు. .. భయం కాదు గానీ .. ఏదోగా అనిపిస్తోంది. ఇంత పెద్ద పెద్ద ఇసుక తిన్నెలూ.. దూరంగా అంత పెద్ద సముద్రం…. ఆ తర్వాత ఆకాశం.... అన్నీ యిలా అంతు తెలీనట్లుగా కనిపిస్తుంటే.. ఇంత పెద్ద సృష్టిలో నేనెంత అల్పురాల్ని కదా! అనిపిస్తోంది. అసలు…. అసలు యిదంతా సృష్టించిన దేవుడు ఇంకెంత గొప్పవాడో కదా అనిపిస్తోంది. ఆయన్ని ఒక్కసారి చూడగలిగితే..! అనిపిస్తోంది.”
"అనిపిస్తుంది. అనిపిస్తుంది" కచ్చగా అనుకున్నాను నేను.
నాకు చాలా ఈర్ష్య కలిగింది. ఈర్ష్య!!
అవును. ఈర్ష్యే కలిగింది.
అసలు … ఒక మనిషి మీద .. సారీ, దేవుడి మీద యింత ప్రేమ ఏమిటి ఈ పిల్లకి! తను ఎప్పుడూ చూడనైనా చూడని వాడి మీద ప్రేమేమిటసలు!
విసురుగా వెళ్ళి కార్లో కూర్చున్నాను.
"ఇంకొంచెం సేపు వుందాం అంకుల్!" అంది సంధ్య గారంగా.
"ఉండు" చెప్పాను నేను. "నువ్విక్కడే వుండు. నిన్ను నేను వెనక్కి తీసుకెళ్ళడం లేదు."
సంధ్య ఆశ్చర్యంగా చూసింది.
"అదిగో.. యిక్కడినుంచి దూరంగా దీపాలు కనిపిస్తున్నాయే .. ఆ పల్లె కనీసం నాలుగు కిలోమీటర్లు వుంటుంది. నువు అక్కడిదాకా నడిచినా, అక్కడినుంచి మనవూరికి యిపుడు బస్సులు ఏమీ వుండవు. ఆ పల్లెవాళ్ళు ఎవరయినా నీకు హెల్ప్ చేస్తారో లేదో తెలీదు. చూస్తాను నువ్వేం చేస్తావో." కారు స్టార్ట్ చేస్తూ చెప్పాను.
"అంకుల్" సంధ్య కంగారుగా నా చేయి అందుకోబోయింది.
తన మొహంలో కనిపిస్తున్న అయోమయాన్ని ఆనందంగా చూస్తూ చెప్పాను నేను.
"..అవును. నిన్నిక్కడే వదిలేసి వెళ్తున్నాను. గుడ్డిగా దేవుడిని నమ్మడం వల్ల ప్రయోజనం ఏమీ వుండదని నీకు తెలియాలి. ఆలోచన.. తార్కిక జ్ఞానం ముఖ్యమనీ .. ఎప్పటికైనా మనిషిని ప్రమాదాల నుంచి రక్షించేవి అవేననీ నీకు ఈ రోజు అర్ధం కావాలి."
షాక్ తిన్నట్లుగా చూస్తూ సంధ్య తన చేతులు వెనక్కి తీసుకుంది.
అచేతనంగా అలా నిలబడిపోయిన తనని చూస్తే స్పృహ తప్పి పడిపోతుందేమో అనిపించింది.
ఇంకొక్క క్షణం ఆగితే కారు దిగేసే వాడినే. కానీ ఈ లోపే సంధ్య తేరుకుంది.
మళ్ళీ అదే అల్లరి నవ్వు పెదవుల మీద మెరుస్తుండగా అడిగింది.
"పరీక్ష పెడుతున్నారా! ఎవరికి? ..నాకా!.. దేవుడికా!.."
నాకు చిర్రెత్తుకొచ్చింది.
కారు రివర్స్ చేసుకుంటూ అన్నాను. "నువ్వెంత ప్రమాదంలో వున్నావో నీకు అర్ధం కావడం లేదు. అంతగా మొద్దుబారిపోయింది నీ బుర్ర. మూఢంగా ఆలోచించేవాళ్ళ మెదళ్ళన్నీ యింతే. ఒక బేస్ లేకుండా.. కనపడని దేని చుట్టూనో చక్కర్లు కొడుతూ వుంటాయి. వాస్తవాన్ని ఆలోచించలేవు. వాళ్ళంతే. వాళ్ళ వల్ల ఏమీ కాదు. వాళ్ళు ఏమీ చేయలేరు."
ఒక్క క్షణం మాటలు ఆపి, చివరిసారిగా సంధ్య వైపు చూశాను. ఏమాత్రం ఏడుపు మొహం పెట్టినా, నవ్వేసి "తమాషా చేశాన్లే... కారెక్కు." అందామని.
కానీ.. కానీ.. అప్పటికి కూడా దాని మొహంలో చెక్కుచెదరని నమ్మకం.
"..ఏమీ చేయలేరు, ఏమీ చేయలేరు, అంటారేమిటి అంకుల్! నాస్తికులూ, హేతువాదులూ చేసే పనులన్నీ మేమూ చేయగలం. ఆలోచించగలం, కష్టపడగలం.
కానీ వాళ్ళందరూ ఆశ వదిలేదుకున్న లాస్ట్ మినిట్ లో కూడా మేమొక పని చేయగలం తెలుసా! వాళ్ళు చేయలేని పని….."
మధ్యలో ఆపడంతో నేను క్యూరియస్ గా చూశాను.
"దేవుడ్ని ప్రార్ధించడం.." కళ్ళలో అల్లరి వరదలా కనిపిస్తుండగా పూర్తి చేసింది.నాకు నవ్వూ, కోపం .. రెండూ వచ్చాయి.
జంకూ గొంకూ లేకుండా అది అలా నిల్చునే వుంది. నేను కారు స్టార్ట్ చేసుకుని వచ్చేశాను.
మూడు కిలోమీటర్లు యివతలికి వచ్చాక అప్పుడు కారు ఒక ప్రక్కగా ఆపి టైం చూశాను. ఎనిమిదిన్నర అయింది. కాళ్ళు సీట్లో బార్లా చాపుకుని సిగరెట్ వెలిగించాను.
ఏం చేస్తుంది సంధ్య! సరుగుడు చెట్ల మధ్య ఒంటరిగా కూర్చుని .. వెన్నెలనీ, వెన్నెలకవతలి చీకటినీ.. ఎగిరెగిరి పడే సముద్రాన్నీ చూస్తూ వుండుంటుందా!
నడక మొదలుపెట్టిందేమో! నలభై నిమిషాలన్నా పడుతుంది ఇక్కడిదాకా రావడానికి. ఈలోపల ఓ కునుకు తీసి లేవచ్చా!
నా ఆలోచనకి నన్ను నేనే తిట్టుకున్నాను. ఇంకా నయం! అలా వదిలిపెట్టి వచ్చింది కాక నిద్రపోవడం కూడానా!
దానికంటే ఏ భయమూ లేదు కానీ …. నాకు మాత్రం ఎలాంటి నిర్మానుష్య వాతావరణంలో వదిలేసి వచ్చానో తల్చుకుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది. ఇంకొక సిగరెట్ వెలిగించి రోడ్డువైపే దృష్టి నిలిపి కూర్చున్నాను.
"సంధ్యని నాతోపాటు ఫంక్షన్ కి తీసుకువెళ్తున్నాను. రేపు ప్రొద్దున వస్తాం." అని చెప్పొచ్చాను ఇంట్లో.
నాతో వచ్చింది కాబట్టి సంధ్య క్షేమం గురించి వాళ్ళకేమీ ఆదుర్దా వుండదు. అది నాకు ప్రాణం కన్నా ఎక్కువ అని అందరికీ తెలుసు.
ఆడపిల్ల పుడితే సుస్మిత అన్న పేరు పెట్టాలని, మెడిసిన్ చదివించాలని వుండేది నాకు.
“మొదటి కోరిక తీరక పోయినా రెండో కోరిక తీర్చుకోవాలి. సంధ్యని డాక్టర్ ని చేయాలి. అంతకంటే ముందు ఈ మూఢ నమ్మకాలూ, అమ్మమ్మ ఆలోచనలూ వదలగొట్టాలి. " చలికి వణుకుతూ మరోసారి అనుకున్నాను.
నా కళ్ళ మీదికి నిద్ర కూరుకు వస్తోంది. తెరవాలని ప్రయత్నించే కొద్దీ అవి బరువుగా వాలిపోతున్నాయి.
అలా ఎంత సేపు గడిచిందో!
దూరంగా ఏదో పక్షి అరుపు వినిపించడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను.
టైం పదకొండు.
పదకొండయ్యిందా!
రెండున్నర గంటలసేపు యిలా కూర్చుండిపోయానా నేను!
సంధ్యరాలేదేమిటి! ఏం చేస్తోందక్కడ! రావ్డానికి భయపడి అక్కడే కూర్చుందా!
కారు దిగి మెల్లగా వెనక్కి నడవసాగాను. శాలువా, మఫ్లరూ.. నా ఏర్పాట్లన్నీ నేను చేసుకునే వచ్చాను. అవసరం లేకపోయినా టార్చ్ లైట్ కూడా తీసుకువచ్చాను.
సంధ్య ఎదురు పడుతుందేమోనని జాగ్రత్తగా చూసుకుంటూ నడవసాగాను.
సగం దూరం వచ్చేటప్పటికి ఆయాసం మొదలయింది. భయమూ, కంగారూ కూడా ఎక్కువయ్యాయి.
కారు తీసుకు రావలసింది. ఇప్పుడు వెనక్కి నడవడం కూడా కష్టమే. ఈ మధ్య కాలంలో యింత నడక ఎప్పుడూ నడవలేదు.
మొత్తం మూడు కిలోమీటర్లూ నడిచేసరికి పన్నెండయ్యింది.
భయకరమైన నిశ్శబ్దం నేపధ్యంగా సముద్రపు హోరు.
కనుచూపు మేరలో సంధ్య కనపడలేదు. గుండె ఆగిపోయినట్లయింది.
సముద్రం ఒడ్డున ఈ చివరినుంచి ఆ చివరివరకూ పరుగెత్తాను. ఎక్కడా లేదు.
కణతల మీద నుంచి ధారాపాతంగా చెమట కారసాగింది.
ఎక్కడ వదిలి వెళ్ళాను నేను! ఇక్కడా! ఇంకొంచెం పైనా!
ఇక్కడేననిపిస్తోంది. టార్చ్ లైట్ వేసుకుని కారు ఆగిన చోటు కోసం వెదకసాగాను.
నాకేమీ అర్ధం కావడం లేదు. భయంతో గుండె ఆగిపోయేలా వుంది.
వెనక్కి తిరిగి సరుగుడు తోపులోకి నడిచాను.
అక్కడా లేదు.
కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తే ఒక చెట్టుని ఆసరా చేసుకుని నిలబడ్డాను.
"భగవంతుడా!" అన్నాయి నా పెదవులు అప్రయత్నంగా. మరుక్షణం మనసు వులిక్కిపడింది. ఏమిటిది! ఏమనుకున్నాను నేనిపుడు!
"భగవంతుడా!”అన్నానా! .. "భగవంతుడా!” అన్నానా! .....
సంధ్య యిలానే అంటుంది. అచ్చం ఇలానే. ఏ కష్టం వచ్చినా "భగవంతుడా1" అంటుంది. విన్నప్పుడల్లా నేను అరుస్తూ వుంటాను.
అలాంటిది నేను భగవంతుడా అన్నానా! నా మీద నాకే అసహ్యంగా అనిపించింది.
సిగ్గుతో తల వాలిపోతున్నట్లుగా అనిపించింది. అప్పుడు కనిపించింది దూరంగా సంధ్య. గుండెపోటును కూడా లక్ష్యపెట్టకుండా పరుగెత్తాను. చలికి ముడుచుకుని పడుకుని వున్న సంధ్యని చూస్తే కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి.
నేను మనిషినా! రాక్షసుడినా!
ఇంకొక వారం రోజుల్లో పరీక్షలు వ్రాయాల్సిన పిల్లని అర్ధరాత్రి ఇలా చలిలో వదిలేసి .. అన్నం లేకుండా .. నీళ్ళు లేకుండా ..
నా నోట్లో నుంచి మాట కూడా సరిగా రాలేదు.
"సం..ధ్యా..!
ఒక్కసారి భుజం మీద తట్టగానే లేచి కూర్చుంది.
నిజంగా నిద్ర పోతోందో! దొంగ నిద్రో!
మొహం ఇందాక నేను వెళ్ళేటపుడు ఎంత తేటగా వుందో.. ఇపుడూ అలాగే వుంది.
బాసింపట్టు వేసుకుని కూర్చుంటూ అడిగింది. "ఏమిటంకుల్ అపుడే వచ్చేశారు! పరీక్ష రేపు ప్రొద్దున వరకూ కాదా!" అని బద్ధకం నిండిన గొంతుతో.
"అసలు నీకేమయినా బుద్ధుందా!" ఒళ్ళు తెలీని కోపంతో అరిచాను నేను.
“నేను నీకేం చెప్పి వెళ్ళాను! నువ్వేం చేస్తున్నావు! అర్ధరాత్రిపూట... యిలాంటిచోట.. అంత ఒళ్ళు తెలీనట్లు పడుకుని నిద్ర పోతావా! నీ ప్రక్కనుంచి పాము వెళ్ళింది తెలుసా! నేను రావడం ఒక్క క్షణం ఆలశ్యం అయివుంటే చచ్చిపోయి వుండేదానివి".
"నిజం!!" కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది సంధ్య.
నేను తడబడ్డాను. మొహం సీరియస్ గా పెట్టి అడిగాను. "నేనెపుడయినా అబద్ధాలు చెప్పానా!"
సంధ్య నవ్వింది. "ఎపుడూ చెప్పరు. అందుకే ఎప్పుడైనా చెప్తే దొరికిపోతారు." అంది.
నాకూ నవ్వొచ్చింది. సంధ్య చేయి పట్టుకుని లేస్తూ అన్నాను. "పాములు కాకపోతే మరొకటి. ఇక్కడసలు ఏమీ ప్రమాదాలే లేవనుకున్నావా! ఆ మాత్రం భయం లేకపోతే ఎలా!"
సంధ్య వెనక్కి తిరిగింది. రెండు చేతులూ నడుము మీద పెట్టుకుని తల కొంచెం పైకెత్తి అడిగింది. "నాకెందుకు అంకుల్ భయం! మీరున్నారుగా!"
సంధ్య తల మీద రెండు మొట్టికాయలు వేశాను నేను.
"గడుసు పిల్లా! ఎంత చక్కగా ప్లేటు ఫిరాయిస్తున్నావూ!" అన్నాను.
"ప్లేటు ఫిరాయించానా!"
"ఊ. మరి! నేను వెళ్ళేటపుడేమో .. నాకేం భయం లేదు అంతా దేవుడే చూసుకుంటాడు అన్నావు. ఇపుడు ఆ దేవుళ్ళెవరూ సహాయానికి రాకపోయేసరికి .. "అంకుల్! మీరుండగా నాకేం భయం" అంటున్నావు. వదిలింది కదా దేవుడి మీద భక్తి!!.."
నా మాటలు పూర్తవుతూండగానే సంధ్య నవ్వడం మొదలు పెట్టింది. నవ్వుతూనే వుంది రెండు నిమిషాలవరకూ.
"ఎందుకు! ఎందుకు!" అన్నాను నేను.
నా చేయి గట్టిగా పట్టుకుని, నా భుజం మీద తల ఆనించి నడుస్తూ అడిగింది. "నాకు మీరు దేవుడితో సమానమని నేను యిదివరకెపుడూ మీతో చెప్పలేదా అంకుల్" అని.
నేను ఠక్కున ఆగాను. సంధ్య మొహంలోకి చూస్తూ "ఇదిగో.. యిదే ప్లేటు ఫిరాయించడమంటే.." అనబోయాను.
నేను ఏమనబోతున్నానో తెలిసిన దానిలా చేయెత్తి నన్ను ఆపింది సంధ్య.
"అంకుల్ మీకు తెల్సు. నాకు మీరంటే చాలా ఆరాధన. దేవుడేననుకునేంత ఆరాధన. మీకే కాదు. ఆ విషయం అందరికీ తెలుసు. మా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు మీగురించి మాట్లాడాలన్నా "మీ దేవుడు" అనే అంటారు. అలాంటపుడు... ఈరోజు నా నమ్మకానికి విరుద్ధంగా ఏం జరిగిందని నేను దాన్ని వదులుకోవాలి చెప్పండి!" నిలదీసినట్లు అది అడుగుతుంటే .. ఆ వితండవాదానికి నాకు కోపం వచ్చింది. విసురుగా చేయి వదిలించుకోబోయాను.
అది గ్రహించి సంధ్య నా చేయిని యింకాస్త గట్టిగా పట్టుకుంది. మెడ చుట్టూ త్రిప్పి రెండోవైపుకి తీసుకుంది. "ఎందుకు అంకుల్ అంత కోపం! మీరే కదా.. మనసులో అనిపించిన ప్రతి విషయాన్నీ ఎక్స్ ప్రెస్ చేయగలిగి వుండాలీ..., దేనికీ భయపడకూడదు.. అని చెప్పారు!"
బుంగమూతితో అది అలా అడుగుతుంటే నాకు చాలా ముద్దొచ్చింది. ఎన్నెన్ని మాటలు నేర్చిందీ! అనిపించింది.
చిన్నగా నవ్వి చెప్పాను.
"కోపం కాదమ్మా. చూడు. మనం చక్కగా వాదించగలం కదా అని ఒక బలహీనమయిన విషయాన్ని బలంగా చిత్రీకరించకూడదు. వాదనే ధ్యేయమయితే నీకంటే గొప్పగా నేనూ వాదించగలను. కానీ నిజం అనేది ఒకటుంది. కనబడని దేవుడి మీద భక్తి వుండడం వల్ల ప్రయోజనం ఏమిటి చెప్పు! కనపడే ఎందరో మనుషులనీ, విషయాలనీ నమ్మకుండా, గౌరవించకుండా .... ఒక మిధ్యని నమ్మడం మూడత్వం కాదూ! హేతువు దొరకని పనులు చేస్తూ దానివల్ల నాకు ఆనందం కలుగుతుంది అంటే... ఇక అందుకు సమాధానమూ లేదు, ప్రతివాదనా లేదు." విరక్తిగా అన్నాను నేను.
సంధ్య మాట్లాడలేదు. తలవంచుకుని నడవసాగింది. నేనూ ఏం మాట్లాడలేదు. కారు వరకూ మౌనంగా నడిచాం. ఏమిటో మనసంతా విసుగు నిండింది. తల్చుకుంటే నేను చేసిన పని నాకే చిరాకు కలిగిస్తోంది.
ఏమిటసలు ఈ వాదనలు! ఎవరి నమ్మకాలు వాళ్ళకి వుంటాయి. ఒకళ్ళ మనసుని మరొకరు మార్చడం అనేది ఎప్పుడూ జరగదు. ఎందుకిలా ఫూల్ లా బిహేవ్ చేశాను నేను!
ఆలోచిస్తూనే కార్లో కూర్చున్నాను. మౌనంగా డ్రైవ్ చేయసాగాను.
సంధ్య ఫ్లాస్క్ తెరిచింది. అందులో కాఫీ వుండడం చూసి "కాఫీ త్రాగుతారా అంకుల్!" అని అడిగింది.
వద్దన్నట్లు తలవూపాను.
కాసేపు ఆగి మెల్లగా బిస్కెట్ పాకెట్ తెరిచింది. చేయి ముందుకు చాస్తూ "బిస్కెట్లు!" అంది.
నేను మాట్లాడలేదు.
సంధ్య కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. "మీకు కోపం వచ్చింది కదూ!"
"లేదు" అనాలనుకున్నాను. కానీ గొంతు తెరవాలనీ, మాట్లాడాలనీ అనిపించలేదు.
ఒక్కసారిగా ఏడుపు తోసుకొచ్చింది సంధ్య గొంతులోనుంచి.
"అసలు ఈ అమ్మాయికి యింకేం చెప్పద్దు. తనెలా పోతే నాకెందుకు అనుకుంటున్నారా!" బిక్కమొహంతో అడిగింది.
"ఛ.ఛ. అదేంకాదు." అనాలనుకున్నాను. కానీ అనలేకపోయాను. ఎలా అంటాను! సరిగ్గా అవే మాటలు యింతకుముందు నేను అనుకున్నాను మరి! నేను మౌనంగా వుండిపోవడం చూసి సంధ్య గట్టిగా వూపిరి పీల్చింది. ఒక్కక్షణం నావైపు తదేకంగా చూసి "నేనేమైనా చెప్పుకోవచ్చా!" అంది.
నేనేం మాట్లాడలేదు.
"అందుకే నాకు దేవుడంటే యిష్టం. ఆయనెప్పుడూ మీలాగా కోపం తెచ్చుకోరు." అంది కసి అంతా గొంతులో నింపి.
ఆ అన్న తీరుకి నేను తలతిప్పి తనవైపు చూడకుండా వుండలేకపోయాను.
"..అవును. ఆయనతో నాకెపుడు వాదన రాదు. నేను చెప్పేది అబద్ధమయితే అది ఆయనకి తెలుసు. నేను వాదించలేను. నిజమయితే అదీ ఆయనకి తెలుసు. వాదించాల్సిన అవసరం లేదు."
సంధ్య చెప్తుంటే నేను నవ్వాను. మనస్పూర్తిగా నవ్వాను.
ఎడమచేయి దాని తల మీద వేసి అటూ యిటూ వూపుతూ "ఎక్కడినుంచి వచ్చాయి నీకీ వితండవాదాలు!" అన్నాను.
అది బుంగమూతితో తల విదిలించుకుంది.
కాళ్ళు రెండూ పైకి పెట్టుకుని, సీట్లో చిన్నపిల్లలా ముడుచుకు కూర్చుంది. రెందూ చేతులూ కట్టుకుని ఎదురుగా చూస్తూ చెప్పింది.
"నేనేమీ తెలివితక్కువగా .. మూర్ఖంగా దేవుడిని నమ్మడం లేదు. నేను ఆయన కోసం వెచ్చించే సమయం వృధా కాదు. దానివల్ల మిగతా సమయంలో చురుకుగా వుండేందుకు కావలసిన శక్తీ, శాంతీ లభిస్తాయి నాకు.
మీకేం తెల్సు ఆయన ఎంత మచి ఫ్రెండ్ అవుతాడో! నా వయసుతో.. ఆలోచనాస్థాయితో.. సంపదతో... వేటిల్తోనూ సంబధం లేకుండా ఆయన నాతో ఫ్రెండ్ షిప్ చేస్తాడు.
పోతన పద్యాలు విన్నాడు. నా మాటలూ వింటాడు. త్యాగయ్య పాటలు విన్నాడు. .. అవి నేను పాడినా వింటాడు.
ఆయన నాకంటే ఎంతో పెద్దవాడయిన మా లెక్చరర్ కి ఎంత ఫ్రెండో.. మా ప్రిన్సిపాల్ కి ఎంత ఫ్రెండో ... నాకూ అంతే ఫ్రెండు.
చిన్నప్పుడు... నాలాగానే చందమామ కోసం ఏడ్చిన నేస్తం. వెన్నముద్దలు దొంగిలించిన సావాసగాడు.
ఇప్పుడు.. మధురంగా వేణువు ఊదగల చెలికాడు."
గడగడా చెప్తున్న సంధ్య ఒక్కసారి ఆగి వూపిరి పీల్చుకుంది.
"మీకెలా చెప్పేది నేను! ఆయన ఎప్పుడయినా ఎక్కడైనా నాకు నేస్తం. మిగతా ప్రపంచానికీ, నాకూ మధ్య వున్న లింక్. మీకు తెలుసా! ఈ ప్రపంచం అంతా నా ఫ్రెండ్ సృష్టించిందే! ఇంకో విషయం తెలుసా! వీళ్ళలో... ఈ మనుషుల్లో... చాలా మంది నా ఫ్రెండ్ కి ఫ్రెండ్సే. ఆయన్ని ప్రేమించడానికి యింతకన్నా ఏం కారణాలు కావాలి నాకు చెప్పండి"
పెద్ద పెద్ద కళ్ళతో నా వైపు అమాయకంగా చూస్తూ అడిగింది. నేను జవాబు చెప్పలేకపోయాను.
"ఎందుకు చెప్పాలి!" అన్న ఆలోచనతో కాదు.
నిజంగానే నాకు సమాధానం తెలియలేదు. మొట్టమొదటిసారిగా నాకు నా ఆలోచనని విమర్శించుకోవాలని పించింది. నేనే పొరపాటు పడుతున్నానా!
సంధ్య గొంతు మెల్లగా వినబడింది.
"అంకుల్ నేను చిన్నదాన్ని. మీతో యింత వాదన చేయడం తప్పేమో నాకు తెలీదు. కానీ నాకు మీరంటే చాలా యిష్టం. మన ఆనందాన్ని మనకి యిష్టమయిన వాళ్ళకి పంచాలనిపిస్తుంది. మనం చూసిన అద్భుతాలు వాళ్ళకీ చూపాలనిపిస్తుంది.
అందుకే యిదంతా చెప్పాను. అది కూడా కాక....." మాట సగంలో ఆపి ఆలోచనలో పడింది సంధ్య.
నేను తలతిప్పాను. ఎందుకలా ఆపేసిందో అర్ధం కాలేదు. "ఏమిటి! చెప్పు!" అన్నాను ఉత్కంఠగా.
సంధ్య తల వెనక్కి వాలుస్తూ అంది " అదే ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. అసలు అది కరెక్టో తప్పో నాకు తెలీదు. కానీ నాకు అనిపిస్తుంది, మనిషికి ఎప్పుడూ తనకు మించిన ఆదర్శం ఒకటుండాలని. జీవితంలో మనం ఎదుగుతూంటే.. ఎపుడూ మనం ఎంత ఎదిగామో.. అంతకన్నా కొంచెం ఎక్కువ... కొంచెమే ఎక్కువ ఎత్తులో మన ఫ్రెండ్ వుండాలి. అతనికి మన గతమూ, వర్తమానమూ... వ్యక్తిత్వమూ… వ్యసనాలూ... అన్నీ తెలిసి వుండాలి.
మనల్ని విపరీతంగా ప్రేమిస్తూ వుండాలి. మళ్ళీ మనం తలపెట్టబోయే పనులకీ... ఆలోచనలకీ.. ప్రయత్నాలకీ అతను ఆదర్శం కావాలి.
అలాంటి వ్యక్తులు మనుషుల్లో దొరకడం... దొరికినా నిలబడడం ఎంత కష్టం చెప్పండి!"
సంధ్య అడుగుతూంటే నేను నివ్వెరపోయాను. కారు నా చేతుల్లో ఎలా నడుస్తూందో నాకే అర్ధం కావడం లేదు. ఆలోచనలకు అతీతమమయిన స్థితిలో నా మనసు దాని మాటలు వినసాగింది.
".. అలా ఆలోచించినపుడల్లా నాకు మీరు కూడా దేవుడ్ని నమ్మితే బాగుండుననిపిస్తుంది. మీకు అంతటి గొప్ప ఫ్రెండ్ ... మీ స్థాయిలో ఆలోచించగల ఫ్రెండ్ ఎక్కడ దొరుకుతాడు చెప్పండి! నిజానికి ... నిజానికి నాకు మీరున్నారు. మరి మీకెవరున్నారు చెప్పండి!!"
నిశ్చేష్టుడనయ్యాను నేను. మాటలు మర్చిపోయి చాలా సేపయింది.
మెల్లమెల్లగా తెల్లవారుతూంటే... కారు అప్పుడే వూర్లోకి ప్రవేశిస్తోంది. నా మనసు కూడా నెమ్మది నెమ్మదిగా చేతన నింపుకుంటోంది.
..గొప్ప గొప్ప మేధావులూ, సంస్కర్తలూ, హేతువాదులూ.. చివరిరోజుల్లో దేవుడ్నెందుకు నమ్ముతారు! ఏమవుతుంది వాళ్ళకి! చచ్చిపోతామనుకునేసరికి భయం మొదలవుతుందా! అనుకునేవాడిని యిదివరకు నేను.
ఆ అనుమానానికి యిపుడు సమాధానం దొరికినట్లుగా అనిపిస్తోంది.
అంతటి జ్ఞానం సంపాదించాక ... వాళ్ళకి ఫ్రెండ్ షిప్ చేసేందుకు మనసుకి దగ్గరగా దేవుడొక్కడే కనిపిస్తాడేమో!
నాలో చాలా రోజులుగా నలుగుతున్న అసహనానికి శాంతి దొరికినట్లుగా అనిపించింది.
ఎవరితోనూ కలవలేకపోతున్న నాకు ఒకవేళ…. ఒకవేళ…. నిజంగానే దేవుడు మంచి ఫ్రెండ్ అవుతాడేమో!
"తథాస్తు" అన్నట్లుగా గుడిగంటలు వినపడ్డాయి.
తలెత్తి చూశాను నేను. శివాలయం అప్పుడే మేలుకుంటోంది.
కళ్ళాపి చల్లిన నేలపై నుండి తేలివస్తున్న మట్టివాసన... గుడి చుట్టూ వున్న నందివర్ధనం చెట్లు... గోపురం పైన ఎగురుతున్న గువ్వలగుంపులు..
మెల్లగా కారు ఆపుతూంటే సంధ్య ప్రశ్నార్ధకంగా చూసింది. "గుడికి వెళ్ళి వెళ్దాం" అన్నాను.
ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసింది సంధ్య. ఆ మరుక్షణం కళ్ళల్లోకి చక్ మంటూ మెరుపు వచ్చింది.
గబుక్కున కారు దిగి, రెండు చేతుల్తో పరికిణీ కుచ్చిళ్ళు పట్టుకుని, రెండేసి మెట్లు ఒక్కసారే ఎక్కుతూ ముందు నడిచింది.
తనని అనుసరిస్తూ.. కొత్తఫ్రెండ్ ని చూసేందుకు ఉత్సాహపడుతూ ... నేను మొదటి మెట్టు మీద కాలు పెట్టాను.
*******
కామెంట్‌లు
వాదనకి ఆస్కారం ఉన్నా, సంధ్యని మీరెంత మురిపెంగా తీర్చిదిద్దారంటే, ముద్దులొలికే ఆ చిన్నారితో వాదులాడ బుద్ధి కావటం లేదు :-)
నాస్తికులు మరీ అంత కఠిన హృదయులు కాదేమోనండీ!
సంధ్య తన అంకుల్కి దేవుడిపై నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేసినట్టుగా చిత్రించాలంటే (ఇట్నుంచి అటన్నమాట) మీరు కథని ఎలా నడిపించేవారూ అన్న కుతూహలం కలిగింది.
Yet another piece of art :)
మీ కథలు చదువుతుంటే.. మనసుకెంతో హాయిగా అనిపిస్తుంది.
మొత్తం కథ ఒకేసారి చదివేయ్యలనిపిస్తుంది ఒకసారి మొదలు పెడితే..!
పాత్రలని మలచడంలోనూ, వాళ్ళ ఆలోచనల్లోనూ, ఎంత అందం కనిపిస్తుందో..!
మీ అభిరుచి కూడా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది.
ఇంకా మీరు బోలెడన్ని కథలు రాస్తారని ఎదురు చూస్తాను.
thank you.
1994 లో వ్రాసిన కథ.
పాతచింతకాయ పచ్చడిలా వుంటుందేమో నని సందేహపడ్డాను పోస్ట్ చేసే ముందు.
మీ అందరికీ నచ్చినందుకు సంతోషంగా వుంది.
నాక్కూడా నిన్నమొన్నటి వరకూ దేవుడు లేడనే అనిపించేది. ఈ మధ్యే ఉన్నాడేమోనని, లేని పక్షంలో ఉంటే బాగుండుననీ అనిపించడం మొదలయ్యింది. ఉండేవుంటాడు. లేకపోతే కొన్ని అలా ఎలా జరుతుతాయి. సీతాకోకచిలక రెక్కలపై రంగుల అల్లిక అంత సిమ్మెట్రికల్‌గా ఎలా వుంటుంది. లేతమామిడాకుకి ఎంత పీల్చినా తనివి తీరని/ మొహంమొత్తని ఆ మార్మికమైన తావి ఎక్కణ్ణుంచి అబ్బుతుంది. వాయిద్యాలని పిలవబడే కొన్ని వస్తువులు చేసే శబ్దాల్ని స్వరతంత్రులు కదపగా వచ్చే మరికొన్ని శబ్దాల్తో కలిపితే, సంగీతం అనేదేదో పుట్టి, మనల్ని జీవిత పరిధులు దాటి ఉప్పొంగింపచేసేంతటి ఆనందాన్ని ఎలా ఇవ్వగలుగుతుంది (నేనిప్పుడే జానకి "సన్నజాజి పడకా" అని పాడుతూంటే వింటున్నాను). సంవత్సరాల ఎదురుచూపుకి సమాధానమైన వాళ్ళు అకస్మాత్తుగా, అంత సులభంగా ఎలా ఎదురొచ్చేస్తారు; అంత సులభంగానే ఎలా వెళిపోతారు. అందాకా ఎందుకు, నిన్న సాక్షాత్తూ ఓ ఆటోవాడు—ఓ హైదరాబాద్ ఆటో వాడు—నేను మర్చిపోయిన చిల్లరని వెనక్కి పిలిచి మరీ ఎందుకిస్తాడు :-) కాబట్టి ఇంత పద్ధతైన, ఇన్ని లెక్కలున్న ప్రకృతి వెనుక దేవుడు ఉండే వుంటాడు. ఉండకపోయినా, ఉంటే బాగుంటాడు బుజ్జిగాడు.
నేనుకోవడమేంటంటే: ఓ రచయిత కథ రాయడంలో ఉండే ఆనందాన్ని పొందడం కోసం పాత్రల్ని సృష్టించి తర్వాతిక ఎలా వాటి మానాన వాటిని వదిలేస్తాడో, అలాగే దేవుడు కూడా సృష్టి రచనలో ఉండే ఆనందంకోసం మనల్నిలా సృష్టించేసి తర్వాతిక మన జోలికి రాడేమో. We are not the end for his creation; we are just means for his creative pleasure. Once created, he probably doesn't give a damn about all our babbles and squabbles here. Sometimes it feels good to be abandoned like that though. Free falling in to the abyss. Morbid pleasure.
దేవుడు ధీటైన స్నేహితుడేగానీ, ప్చ్! బొత్తిగా డిటాచ్డ్ స్నేహితుడు. అతని స్నేహంలో మనం ఎక్కువ ఆశించకూడదు. చుప్‌చాప్ ఇచ్చింది తీసుకోవాలంతే.
And by now, I don't know what the hell I am talking about :-) Just wanna say that I feel His presence everywhere these days—a warm but aloof presence.