"తక్కువేమి మనకూ..!" - కథ
"శివధనుర్భంగం జరుగుతున్నపుడు వరమాల పట్టుకుని నిల్చున్న జానకిలా అనిపించింది"
"ఇంతకీ మీకెలా అనిపించింది ఆ అమ్మాయి" అన్న పార్వతి ప్రశ్నకి సమాధానం చెప్పాను.
పార్వతి చిన్నగా నవ్వింది. ‘చాల్లెండి అతిశయోక్తులు!’ అని కొట్టిపారేయలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి అలాగే వుంది మరి!
ఏకైక పుత్రుడు శ్రీవత్సకి ఏడాదినుండి సంబంధాలు చూస్తున్నాం. నాల్రోజుల క్రితం చూసిన అమ్మాయి.. నిత్య.. తనగురించే ఇపుడు చర్చ.
నిజానికి ఆ అమ్మాయికి ఏ వంకా లేదు. పెళ్ళిచూపులనాడు వద్దికైన చీరకట్టుతో ఆ అమ్మాయి మా ముందుకి రాగానే శ్రీవత్స కళ్ళల్లో చిన్న మెరుపు స్పష్టంగా చూశాను నేను. 'ఈ సంబంధం కుదిరినట్లే' అనుకున్నాను.
పెళ్ళికూతురి తండ్రికి పెద్ద హోదా లేదు. అదొక్కటే లోపం. ఇంతకుముందు వచ్చిన సంబంధాలన్నీ హంగూ, ఆర్భాటం వున్నవి. వీళ్ళ ఇల్లూ, తీరూ చాలా సాధారణంగా వున్నాయి. అయినా కాదనుకోవాలనిపించలేదీ సంబంధం.
కానీ పెళ్ళిచూపులయిన మర్నాడు శ్రీవత్స క్లోజ్ ఫ్రెండ్ కిషోర్ వచ్చాడు. నిత్య పనిచేసే అఫీసులొనే అతనూ చేస్తాడు. శ్రీవత్స నిత్య ఫొటో చూపించగానే "మా సెక్షన్ కాదు కానీ తెలుసు. ఆ అమ్మాయి గురించి అందరూ కొంచెం వింతగా చెప్పుకుంటారు" అన్నాడు.
"అంటే!" అన్నాను.
"అంటే చాలా అతిశయంగా ఎవర్నీ లెక్కపెట్టనట్లుగా వుంటుందిట. వూరంతా ఒక దారైతే వులిపికట్టెదొకదారి అన్న పద్ధతిట."
నేను ఆశ్చర్యంగా చూశాను. అతిశయమా! ఏం చూసుకుని అతిశయం చూపిస్తుంది ఆ అమ్మాయి! వాళ్ళ నాన్నదా చిన్న ఉద్యోగం. తనకా ఒంటి మీద నిండుగా బంగారమన్నా లేదు. మంచి చదువూ మంచి కంపెనీలో ఉద్యోగం ఉన్నాయి … నిజమే. కానీ అవి సహోద్యోగుల ముందు అతిశయం చూపడానికి పనికి రావు కదా!
కిషోర్ వివరించాడు. "ఒకసారి నేను వెళ్ళిన ఒక ట్రైనింగ్ కి ఈ అమ్మాయి కూడా వచ్చింది. అక్కడ 'మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని మీరు జీవితాన్ని ఎలా గడపాలనుకుంటున్నారో.. జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో చెప్పండి’ అన్నారు. దానికి ఈ అమ్మాయి ‘జీవించినంతకాలం నా చుట్టూ వున్నవారికి స్పూర్తినివ్వాలి. నేను మరణించినపుడు నా సన్నిహితులంతా ఓ కొత్త నక్షత్రం కోసం అప్రయత్నంగా ఆకాశం వైపు చూడాలి’ అని చెప్పింది."
శ్రీవత్స నవ్వాడు. “వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో చదువుకోడానికి బానే వుంటాయి కానీ ఇలాంటి వాక్యాలు…. మామూలుగా చెప్తే అతిశయమనే అనిపిస్తుంది” అన్నాడు.
"ఆ ట్రైనింగ్ లోనే 'మీరు ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు ?' అని మరో ప్రశ్న అడిగారు. అంటే “వుద్యోగం నుంచి మీరు ముఖ్యంగా ఆశించేది ఏమిటి?” అని. అందరూ "చాలెంజింగ్ వర్క్" లాంటి పాజిటివ్ ఆన్సర్స్ సెలెక్ట్ చెస్తే ఈ అమ్మాయి ఒక్కతే " డబ్బు" అని టిక్ చేసింది.”
ఆ మాటలు చెప్పి కిషోర్ వెళ్ళిపోయాడు. నేను ఆలోచనలో పడ్డాను.
ఎందుకో ఆ అమ్మాయి ‘డబ్బు’ అని వ్రాయడం నాకు వంటబట్టడం లేదు. నక్షత్రమై మెరవాలనుకోవడానికీ, డబ్బు వ్యామోహంలో పడడానికీ పొంతన కుదరనట్లుగా వుంది.
పొంతన లేదా! ఏమో! వుందేమో! రెండింటిలోనూ అందరికన్నా అధికంగా వుండాలన్న కోరిక కనబడుతోంది కదా!
వాళ్ళిద్దరూ అన్నట్లు అది అతిశయమేనా!
రెండ్రోజుల క్రితం రాత్రి భోజనాల దగ్గర మళ్ళీ కదిపి చూశాను శ్రీవత్సని. ఏమీ నిర్ణయించుకోలేనివాడిలా చూసి “మీయిష్టం నాన్నా! మీకేమనిపిస్తే అది చేయండి” అన్నాడు.
“నాకూ అర్ధం కావడం లేదురా! కిషోర్ చెప్పింది వింటే ఆ అమ్మాయికి కొంచెం ఆశలూ, అతిశయమూ ఎక్కువేమో అనిపిస్తోంది. కానీ చూసినపుడు అలా అనిపించలేదురా! చాలా సాధారణంగా ఒద్దికగా కనిపించింది” అన్నాను.
శ్రీవత్స కూడా అంగీకారంగా తల వూపాడు. "అవును నాన్నా! ఆ అమ్మాయిని చూస్తే నాకూ అలా అనిపించలేదు" అన్నాడు.
"డబ్బులకి ఇబ్బంది పడుతున్న సంసారం లాగా వుంది కదురా! అందుకని డబ్బు మీద కొంచెం కోరిక వుండడం సహజమేనేమో!" అన్నాను.
శ్రీవత్స నవ్వాడు. " కోరిక ఉండడం వేరు నాన్నా! ఉన్నా అలా చెప్పకూడదు కదా ట్రైనింగ్ లో. డబ్బక్కర్లేనిదెవరికి! కానీ ఆమాట ఎవరూ చెప్పరు. కొంచెం పెడసరంగా వుండేవాళ్ళే ఇలాంటి సమాధానాలు చెప్తారు” అన్నాడు.
భోజనం పూర్తవుతూండగా “ఒక రెండ్రోజులు ఆగి చెప్పచ్చా వాళ్ళకి ఏ సంగతీ!” అన్నాడు మళ్ళీ వాడే.
"చెప్పచ్చు. ఇంకో రెండ్రోజులు ఆలోచించుకుంటావా!” అన్నాను.
"కాదు నాన్నా! రేపూ ఎల్లుండీ కిషోర్ కి ఏదో వర్క్ షాప్ వుందట. ఆంగన్ రిసార్ట్ లో. నిత్య కూడా వస్తుందట అక్కడికి. ఈ రెండ్రోజులూ అందరూ కలిసే వుంటారు కదా! ఇంకొంచెం బాగా అబ్జర్వ్ చేయమని చెప్దాం అనుకున్నాను.” అన్నాడు.
“ఇదేదో బాగుందిరా!” అన్నాను నేను నవ్వుతూ. “సరే ఆపని చేద్దాం”. అని అప్పటికి నిర్ణయాన్ని వాయిదా వేశాను.
నిన్న సాయంత్రం కిషోర్ వర్క్ షాప్ నుంచి నేరుగా ఇక్కడికే వచ్చాడు.
"చెప్పు. ఏంటి నీ అబ్జర్వేషన్!?" అన్నాను నేను.
“ఏమో అంకుల్! ఆ అమ్మాయినీ ఆ అమ్మాయితో మిగతా వాళ్ళ సంబంధాల్నీ కూడా గమనించడానికి ప్రయత్నించాను. నాకేమనిపించిందంటే.. ఆ అమ్మాయిని చూస్తే అందరికీ ఒక ప్రక్కన ఆకర్షణా.. మరోప్రక్కన ఏదో తెలియని యిబ్బందీ కలుగుతాయనిపిస్తోంది” అన్నాడు.
“వీడు చెప్పింది వింటే నాకేమర్ధమయిందంటే ఆ అమ్మాయి మాటలూ, ప్రవర్తనా అందరికీ భిన్నంగా … ఒకరకంగా చూస్తే కొంచెం అసహజంగా అనిపిస్తాయి. అలాగని ఆ అమ్మాయి మాట్లడేది తప్పు అనేటట్లూ వుండదు” అన్నాడు శ్రీవత్స.
"అంటే ఆ అమ్మాయే కరెక్టూ మిగతా వాళ్ళందరూ తప్పు అంటావా!" అన్నాడు కిషోర్.
ఆ మాట అంటూనే ఒక్కక్షణం ఆలోచనలో పడి, మళ్ళీ తనే " నువు చెప్పింది నిజమేరా శ్రీ! ఆ అమ్మాయి సమక్షంలో అందరికీ అలాంటి అనుమానమే ఏదో కలుగుతుందనుకుంటా. అందుకే తనంటే ఆసక్తీ, అసహనమూ రెండూ వుంటాయి అందరిలో" అన్నాడు కిషోర్.
ఆ తర్వాత అంతకు ముందు రొజు జరిగిన సంఘటనని వివరించడం మొదలు పెట్టాడు.
"నిన్న వర్క్ షాప్ మొదలుపెట్టినపుడు ఐస్ బ్రేకింగ్ సెషన్ లో.. అందరూ ఎవరి పరిచయం వాళ్ళు చేసుకున్నాక .. ఫ్లిప్ చార్ట్ మీద వ్రాసి వుంచిన మూడు ప్రశ్నలకి సమాధానాలు చెప్పమన్నారు.
మొదటి రెండూ ఏవో మామూలు ప్రశ్నలనుకో. మూడో ప్రశ్న మాత్రం ఎవరైనా ధనవంతుడు మీకు వన్ మిలియన్ డాలర్లు యిస్తే మీరేం చేస్తారు!" అని.
అందరూ రకరకాల సమాధానాలు చెప్పారు. అనాధలకోసం ఏమైనా చేస్తామనీ.. సిటీలో రోడ్లు బాగు చేయిస్తామనీ.. ప్రపంచాన్ని చుట్టి వస్తామనీ.. .."
"నిత్య ఏం చెప్పింది!" అన్నాను నేను వాడి మాటల్ని మధ్యలో కట్ చేస్తూ.
కిషోర్ నవ్వాడు “నేనసలు ఆ డబ్బు తీసుకోను” అంది.
అరక్షణం నిశ్శబ్దం తర్వాత “అదేమిటి!” అన్నాను నేను.
"అందరూ యిలాగే అడిగారు అంకుల్! ఆ అమ్మాయి అలా చెప్పగానే అందరూ ఒక్క క్షణం నివ్వెరపోయారు. సూది క్రిందపడితే వినిపించేంత నిశ్శబ్దం అంటారే! అలాగయింది. ఆ తర్వాత అందరూ మీలాగానే ‘అదేమిటి!’ అన్నారు.”
ట్రైనింగ్ ఇచ్చే అతను కూడా ఎందుకు తీసుకోవు, కారణం ఏమిటో చెప్పమన్నాడు. ‘అంత డబ్బు నాకవసరం లేదు. నాకవసరమయినంత నేను సంపాదించుకుంటున్నాను’ అని చెప్పింది ఆ అమ్మాయి.
ఇంక చూడండి. ఒక్క సారిగా గందరగోళం. డబ్బు అవసరం లేకపోవడమేమిటని కొందరు…. ఊరికే వస్తుంటే అది తీసుకోకుండా మనం సంపాదించుకోవడమెందుకని కొందరు….
ట్రైనర్ కూడ ఆమెని వదిలి పెట్టలేదు. “తీసుకోను కాదు. ఒకవేళ తీసుకుంటే ఎలా ఖర్చు పెడతావు! అది చెప్పు” అన్నాడు.
"ఏమో తెలీదు. అంత డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో నాకు తెలీదు” అంది ఆ అమ్మాయి తటపటాయిస్తూ.
"ఆ!” అన్నారు అందరూ దీర్ఘం తీస్తూ 'మరీ విడ్డూరంగా మాట్లాడకు ' అన్న ధోరణిలో.
“అంత తెలీకపోతే నాకివ్వచ్చుగా! నేను ఖర్చుపెట్టుకుంటాను” అన్నాడొకతను.
అవుననవును... మాకివ్వచ్చుగా అంటే మాకివ్వచ్చుగా అని అందరూ కోలాహలంగా అరిచారు.
‘నాక్కూడా ఇవ్వచ్చు’ అని చెప్పుకోకపోతే ఆ అమ్మాయి తమని దృష్టిలో పెట్టుకోకుండా కావాలన్న వాళ్ళకి మాత్రం పంచేస్తుందేమోనన్నంత కంగారుగా అరిచారు.
అదంతా గమనిస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అంకుల్. నిజంగా వున్న డబ్బు కాదు. … కేవలం వూహించుకుంటున్న డబ్బు… అదయినా సరే! చేజారిపోవడం అన్న ఆలోచనని భరించలేనట్లు వాళ్ళు గోల చేస్తుంటే.. తమాషాగా అనిపించింది. అందరి కళ్ళల్లోను ధనదాహం అంటారే అది స్పష్టంగా కనిపించింది నాకు. ఆ అమ్మాయి కళ్ళల్లో.. మొహంలో... కూర్చోవడంలో…మాత్రం అదే అతిశయం. ఒకరిచ్చే డబ్బు తీసుకునే ఖర్మ నాకేంటి! అన్న ధోరణి.”
కిషోర్ చెప్పడం పూర్తయినా కాసేపు అందరం మౌనంగా కూర్చుండిపోయాం.
ఆతర్వాత మెల్లగా శ్రీవత్స గొంతు వినిపించింది. “నాకు డబ్బు ముఖ్యం. అందుకోసమే ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పింది కూడా ఈ అమ్మాయే కదా! ఆశ్చర్యంగా వుంది నాన్నా! ఆ అమ్మాయిది తెలివితక్కువతనమా! అతితెలివా! అయోమయమా! అతిశయమా! అర్ధం కావడం లేదు.” అన్నాడు.
నేను సమాధానం చెప్పలేదు. భోజనం చేసి కిషోర్ వెళ్ళిపోయాడు.
నిన్న రాత్రి నుంచీ ఇక ఆ విషయం మాట్లాడుకోలేదు. ఇప్పుడే మళ్ళీ పార్వతీ వచ్చి ‘అసలు మీకేమనిపించింది చెప్పండి’ అంటూ కదిలించింది.
ఆ ప్రశ్నకి సమాధానం చెప్పి నేను మళ్ళీ ఆలోచనల్లో కూరుకుపోయాను. శ్రీవత్స ఆఫీస్ నుంచి వచ్చే టైం కూడా అయింది.
అంతా సమన్వయం చేసుకుంటే నాకు ఆ అమ్మాయి ప్రవర్తనలో వైరుధ్యమేమీ కనిపించలేదు.
ఆ అమ్మాయికి డబ్బు మీద పెద్ద వ్యామోహమేమీ లేదు. అతితెలివీ లేదు. కనీసావసరాలకి డబ్బు కావాలి కనుక ఉద్యోగం చేస్తోంది. డబ్బు కోసమే చేస్తోంది. అది నిజం. కాబట్టి ఎవరయినా అడిగితే అ 'నిజమే' చెప్తుంది కానీ... అలా చెప్పడం లౌక్యం కాదేమో…, అలా చెప్పడం వల్ల నేను గౌరవం కోల్పోతానేమో అని ఆలోచించి అబద్ధం చెప్పదు. అదే సమయంలో పరద్రవ్యాన్ని ఆశించడం అనేది వూహించుకోడానికి కూడా ఇబ్బంది పడుతుంది.
అయితే ఇంతటి అతిశయం ఆ అమ్మాయికి ఎలా వచ్చింది! పెద్దగా కలిమి లేకపోయినా నాకు అయాచితమయిన డబ్బు అక్కర్లేదనుకునే ధీమా ఆమెలో ఎలా ఏర్పడింది!
తెలుసుకోవాలి. నిత్యని గురించిన నావిశ్లేషణ కరెక్టో కాదో వెరిఫై చేసుకోవాలి. ఈ ప్రశ్నకి సమాధానమూ తెలుసుకోవాలి.
ఉన్నట్లుండి లేచి చెప్పులేసుకుంటుంటే పార్వతి కంగారుగా వచ్చి “ఏంటండీ!” అంది.
“ఏం లేదు, ఇప్పుడే వస్తాను” అంటూ రోడ్డెక్కాను. నే వెళ్ళేసరికి నిత్య ఇంట్లోనే వుంది.
"నిత్యని ఒక్కసారి బయటికి పంపుతారా! తనతో కొంచెం మాట్లాడాలి “ అన్నాను. వాళ్ళ నాన్నగారితో.
ఆయన మొహంలో ఆశ్చర్యం కదలాడింది. అయినా ప్రశ్నలేమీ వేయకుండానే తల వూపారు.
నిత్య నావెనకే బయటికి వచ్చింది. ఆ తర్వాత ఒక అడుగు ముందుకి వేసి “గుడిలో కూర్చుని మాట్లాడుకుందామా!” అంటూ రామాలయం వైపు దారి తీసింది.
ఆమె చొరవకి ఆశ్చర్యపోతూ నేను అనుసరించాను. దర్శనం చేసుకుని మండపంలో కూర్చున్నాం.
ఎలా అడగాలా అని ప్రశ్నని ఫ్రేం చేసుకుంటున్నాను నేను.
మాకు కొంచెం దూరంలో నలుగురు అమ్మాయిలు కూర్చుని పరిసరాల స్పృహ లేకుండా పెద్ద గొంతులతో మాట్లాడుకుంటున్నారు.
"ఏయ్ నీకు తెలుసా! డిసెంబర్ థర్టీఫస్ట్ సెలబ్రేషన్స్ లో టెన్ మినిట్స్ డాన్స్ చేస్తే రెండులక్షలు ఇస్తారంట ఆమెకి!” అంది ఒక అమ్మాయి.
“అవునంట నేనూ చూశా పేపర్లో” అంది మరో పిల్ల.
సినిమాల్లో ఐటం డాన్స్ లు చేసే అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారని అర్ధమయింది నాకు.. నేనూ చదివానావార్త పొద్దున న్యూస్ పేపర్లో.
" రెండు లక్షలా! అందులో సగమిస్తే నేను చేస్తా గదా!” కొబ్బరి నములుతూ ఇంకో పిల్ల వాపోయింది.
"సగం ఏంటే యాభై వేలిచ్చినా చేయచ్చు" నాలుగో అమ్మాయి వ్యాఖ్యానించింది.
"యాభై వేలు గాదు, పది నిమిషాలకి పాతికవేలొచ్చినా ఎక్కువే గదే!” అంది మొదట వార్త చెప్పిన అమ్మాయి.
మరో మెట్టు దిగి… “పదివేలయినా పర్లేదే పది నిమిషాలకి” అంది మొదట నేనూ చదివానంటూ వంత పాడిన పిల్ల.
"ఏంటే! నేను మీకంత చీప్ గా కనిపిస్తున్నానా! ఆమెకి రెండు లక్షలూ.. నాకు పదివేలా! నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు మీరు” సగం యిస్తే చాలన్న అమ్మాయి కోపం తెచ్చుకుంది.
ఆమె లేచి మెట్లు దిగుతుంటే ‘ఆయ్యో లేదే!’ అని సంజాయిషీ యిచ్చుకుంటూ మిగతా వాళ్ళు అనుసరించారు.
నేను నిత్య వైపు చూశాను. “అది నిజంగా అవమానించడమేనంటావా!” అన్నాను.
“ఏంటండీ!” నిత్య అర్ధం కాలేదన్నట్లుగా అడిగింది.
“అదే… ఆ పిల్లలు మాట్లాడుకున్నారు కదా యిపుడు. పదివేలిచ్చినా చాలు అనడం అవమానించడమేనంటావా .. పది వేలు కూడా తక్కువ ఎమౌంట్ ఏమీ కాదు కదా!” అన్నాను.
"అదా!” నిత్య నవ్వింది. “ఇంకొకరు అవమానించేది ఏముందండీ! సగమిచ్చినా చాలంటూ మొదట తనని తనే అవమానించుకుంది కదా ఆ అమ్మాయి” అంది.
“అయితే ఏమనాలంటావు? ‘నేనయితే అంతకు రెట్టింపు డిమాండ్ చేస్తాను అనాలంటావా!”
నిత్య నా కళ్ళల్లోకి నిబ్బరంగా చూసింది. ‘నన్ను పరీక్షిస్తున్నారా’ అన్నట్లు మందహాసం చేసింది.
నేను కూడా తన కళ్ళల్లోకి సూటిగా చూసి. “చెప్పు. ఎంత తీసుకుంటే అవమానం కాదు గౌరవం అనిపించుకుంటుంది!” అన్నాను.
తను సమాధానం చెప్పబోతూంటే “నువ్వైతే ఏమంటావ్!” అని మరో ప్రశ్న వేశాను.
“నేనా!” నిత్య నవ్వింది. “నేనయితే రెండు లక్షలు కాదు కోట్లు గుమ్మరించినా అలా డాన్స్ చేయను అంటాను” అంది.
ఆ సమాధానానికి నేను ఉలిక్కిపడ్డాను.
ఒక్కసారిగా నాకు "విలువ" అనే మాట యొక్క మూలాలన్నీ అర్ధమయినట్లనిపించింది. ఒక వస్తువుకైనా.. సేవకైనా.. మనిషికయినా విలువ ఎలా నిర్ణయించబడుతుందో.. ఖరీదు ఎలా కట్టబడ్తుందో అర్ధమయింది. ఈ విషయం మీద నాకున్న పుస్తక పరిజ్ఞానమంతా ఒక్క క్షణంలో అనుభవానికొచ్చింది. ఇంక జీవితంలో మరెప్పుడూ ఈ విషయంలో సందేహమనేది కలగనంతగా విషయం అర్ధమయిపోయిందనిపించింది.
నాకర్ధమయింది. నిత్య గురించి నావిశ్లేషణ కరెక్టే. ఆమె ఆణిముత్యం.
“ఎలా వచ్చిందమ్మా నీకింతటి ధీమా! ఇంత నిర్భయత్వం! ఈ విషయం ఇంత సూక్ష్మంగా నీకెలా అర్ధమయింది!” నా మనస్సులో మిగిలిపోయిన ఆఖరి ప్రశ్న మాటల రూపంలో బయటికి వచ్చింది. నా గొతులో తొంగి చూసిన ఆర్ద్రత నిత్య కళ్ళల్లోనూ ప్రతిఫలించింది.
గర్భగుడిలోనుంచి కనిపిస్తున్న శ్రీరామచంద్రుడి నగుమోము మీద ఒక్క క్షణం చూపు నిలిపి.. ఆ తర్వాత ఆయన పాదాల వైపు దృష్టి సారించింది నిత్య.
"పట్టుకోవలసిన దాన్ని పట్టుకుంటే భయమూ, దైన్యమూ, అజ్ఞానమూ ఏదీ వుండదు కదండీ!” అంది.
గంభీరమైన ఆ సమాధానం నా మీద అమృతాన్ని వర్షించింది. ఉద్వేగంతో లేచి నిలబడి “వెళ్దాం పదమ్మా” ఆన్నాను.
నిత్య నాకళ్ళకి జానకీ దేవిలా ఎందుకు కనబడిందో నాకిపుడు అర్ధమయింది. ఓ మంచి నిర్ణయంతో ఆనందంగా యింటి వైపు నడుస్తుంటే "తక్కువేమి మనకూ..!" అన్న కీర్తన నా పెదవులపై నాట్యమాడింది.
___________

కామెంట్‌లు
Nice narration
బుధజన విధేయుడు
సీతారామం
మీ కధలు అప్పుడప్పుడు గా చదివాను. చదివిన ప్రతీసారీ చాలా బావున్నాయి అనుకుంటూ ఉంటాను. నాకు ముఖ్యము గా నచ్చినది, అశ్లీలత (ఏ విధము గా నూ) లేక పోవడము. మండుటెండలో కొబ్బరి నీరు తాగినంత హాయిగా ఉన్నాయి. మీరు ఇలాగే కథలు చాలా వ్రాయాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.
బుధజన విధేయుడు
సీతారామం