రెండు మార్గాలు

నాలుగువైపులా
చూడగల సమర్ధులమంటారు
కొందరు..
తమ సృజనశక్తిముందు
తమని సృష్టించినవారూ తక్కువేనంటారు
విజయానికి కీలకమైన వాక్శక్తి
తమదగ్గరే వుందంటారు
విజ్ఞానసర్వస్వాన్నిచ్చిన
ఘనకీర్తీ తమదేనంటారు

ఎంత పైపైకైనా ఎగిరి
వెళ్ళిపోగలమనుకుంటారు
జ్ఞానపు అంచులని అనాయాసంగా
అందుకోగలమనుకుంటారు
అవసరమైతే ఎవరినైనా
తమకి అనుకూలంగా తిప్పేసుకోవాలనుకుంటారు
ఏం చేసైనా సరే
తామే గెలిచామని ఒప్పించుకోవాలనుకుంటారు

మొగలిపూవుల్లాంటి మోటుమనుషులనే కాదు
కామధేనువుల్లాంటి కరుణామూర్తులనీ
తమవెంట రమ్మని ప్రలోభపెడతారు
తమకు సాక్ష్యమిమ్మని ప్రాధేయపడతారు

బహిర్ముఖులై చరించినంతకాలం
వేల తప్పులు చేస్తారు
చివరికి తాము తోడు తెచ్చుకున్నవారే
తమని మౌనంగా ఖండించడంతో ఖంగుతింటారు
మరికొందరు…
అందుకు
పూర్తిగా విరుద్ధమైన మార్గాన్ని
ఎంచుకుంటారు
అంతర్ముఖులై తమ మనసును తామే
త్రవ్వుకుంటారు

ప్రగల్భాలూ ప్రతినిందలూ లేకుండానే
పరమసత్యాన్ని పట్టుకుంటారు
పరమానంద జలధులలో
ప్రశాంతంగా పవ్వళిస్తారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సతీసుమతి

తారకము

సంక్లిష్టమైన కథలు