ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన

అన్ని పండగలవంటిది కాదు సుమా
ఆరు రుచుల ఉగాది
అర్ధం చేసుకోగలిగితే యిది
ఆనందసౌధానికి పునాది

పసితనంలోనే దాని వైశిష్ట్యాన్ని
నేను పసికట్టాను
పెరిగి పెద్దవుతూ మరెన్నో
కొత్తలోతుల్నీ కనిపెట్టాను

మామిడి చిగుళ్ళ మంగళ తోరణాలు
కోకిల గానాల వేదమంత్రాలు
ఒకవైపు వేపరెమ్మలు వీచే వింజామరలు
మరోవైపు మల్లెకొమ్మలు పట్టే కుసుమాంజలులు

వీటన్నింటి మధ్య నుండీ
రమావాణీ సంసేవితలా అది నడచివచ్చే తీరుకి
నేను ముచ్చటపడ్డాను
ప్రకృతి దానికిచ్చే ప్రత్యేక స్వాగతానికి
అచ్చెరువొందాను

ప్రతిసారీ ఓ కొత్త పేరుతో ప్రవేశిస్తుంది
వచ్చినపుడల్లా ఓ కొత్త పాఠాన్నీ ప్రసాదిస్తుంది
జీవితమనే పాఠశాలలో నను
నిత్య విద్యార్థినిని చేస్తుంది
నన్ను నిజమైన గమ్యం వైపు నడపడమే
దాని అసలు లక్ష్యంగా తోస్తుంది

పండగలన్నీ ఖర్చుల్ని మోపివెళ్తాయి
ఉగాది కవిత్వాన్ని మోసుకొస్తుంది
అన్య పర్వాల్లో తీపిదే పెత్తనం
ఇక్కడ మాత్రం అన్నిరుచులూ సమానం
ఇవీ మొదటి తరగతులలో నేను గమనించిన విషయాలు

ఉగాది కులమతాల చిచ్చులు పెట్టదు
ఖగోళ శాస్త్రాల గుట్టులు విప్పుతుంది
ఆస్తికత్వాన్ని మాత్రమే ప్రబోధించదు
అన్ని సిద్ధాంతాల వారినీ ఆకర్షిస్తుంది
ఇవి మరి కొన్నేళ్ళు గడిచాక
నాకు తోచిన భావాలు

నందన ఉగాది వరకూ నడిచాక
దాని విశ్వరూపం గోచరిస్తోంది
అంచెలంచెలుగా ఎదిగాక
అసలు తత్వం అర్ధమవుతోంది

ఒకకోణంలో నుంచి చూస్తే
అపుడే పుట్టిన పసిపాప లాంటి నూతనత్వం
మరోవైపు నుండి గమనిస్తే
యుగయుగాలనాటి జ్ఞానగాంభీర్యం

పైపైన చూస్తే ఇహలోక సౌఖ్యాలనీ
ఇంద్రియానందాలనీ యిచ్చే నేస్తం
పరిశీలించగలిగితే అసలైన సత్యాన్నీ
ఆనందతీరాన్నీ చూపగల గురుకటాక్షం

తవ్వుకోగలిగినంత తాత్పర్యం
పట్టుకోగలిగినంత పరిమాణం

ఆధిపత్యాల కోసమూ ఐశ్వర్యాలకోసమూ జరిగే
అసుర తపస్సులని
ఏడాదికోమారు భగ్నంచేసి వెళ్ళే అప్సరస అదే
జీవితపరమార్ధం కోసం సాగే అన్వేషణలకి
దిశానిర్దేశం చేయగల అపర్ణా అదే

సామాన్యులకి
ఉగాది కాముడు వదిలిన సుమబాణం
కాలాన్ని తెలిపే పంచాంగం

శోధకులకి
కష్టసుఖాలను కలగలిపే ప్రయత్నం
కాలుడ్ని గుర్తు చేసుకునే అవకాశం

సాధకులకి
కామేశ్వరిని ఉపాసించే శుభసమయం
కాలకాలుడ్ని అందించే సోపానం

*****
(నందన ఉగాది కవిసమ్మేళనం కవిత) 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సతీసుమతి

తారకము

సంక్లిష్టమైన కథలు