స్వాతంత్ర్య దినోత్సవం


 
సంకల్పం
(ఆగస్ట్ నెల "చిత్ర" మాసపత్రిక లో ప్రచురించబడిన కవిత )



ఉత్తేజభరితం స్వాతంత్ర్యోద్యమ నేపథ్యం
ఊహాతీతం నాటి నాయకుల నేతృత్వం
తరతమ భేదాలెరుగని తత్వం
తలవొగ్గని స్వేచ్చాప్రియత్వం
తాము కరిగిపోయి తరువాతితరాలకు వెలుగునిచ్చిన నిస్వార్ధం
నిజమైన నాయకత్వమని  నిఖిలలోకమూ మెచ్చిన  సందర్భం

షష్టిపూర్తి నాటికి తారుమారయింది చిత్రం
మననం చేసుకుంటూనే ఉన్నా మారిపోయింది సమస్తం
అవినీతీ ఆశ్రితపక్షపాతం
దౌర్జన్యం ధనదాహం
భావితరాల పట్ల బాధ్యతారాహిత్యం
కనీసకర్తవ్యాలలోనూ నిబద్ధతాలోపం

నడిపించేవారిదే తప్పనుకోవడం కష్టం
నలువైపులా పరచుకుందీ జాడ్యం
బానిసలా బ్రతకడమే యిపుడెందరికో ప్రియం
పంజరాన్ని వదిలి పైకెగరాలంటే భయం

పొరుగింటి రుచులకి ఘనప్రచారం
మన సంస్కృతిపై మనకే నిరసన భావం 
సహస్రకెరటాలతో విరుచుకుపడుతోంది స్వార్ధం
సన్నగిల్లుతోంది అదే స్థాయిలో ఆత్మగౌరవం 

ఇంకెన్నాళ్ళు సాగనిద్దామీ అనర్ధం? 
కలసి చూపాలి  ఎదురీదే సాహసం
కాలుష్యాలకందనంత ఎత్తులో త్రివర్ణం
తల్చుకుంటే ఠీవిగా నిలపలేమా మనం?


_________________________________

కామెంట్‌లు

గీతిక బి చెప్పారు…
మీకు హృదయపూర్వక అభినందనలు శ్రీవల్లీ రాధిక గారూ,

మీ కథ "మనోహరుడు" స్వాతిసపరివారపత్రిక కథలపోటీలో బహుమతి గెలుచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది శ్రీవల్లిగారూ.

మీ కథల్లో నాకు బాగా నచ్చినకథ "లోభం". దానికి బహుమతి రాకపోవడం నాక్కొంచెం (కొంచెం కాదు ఇప్పటికీ అయ్యో అనుకుంటూ ఉంటాను...) నిరాశని కలిగించింది. ఎంతో సునిశితమైన గమనింపుతో గ్రహించిన విషయాన్ని స్పష్టంగా చెప్పగలగడం కనిపించిందా కథలో నాకు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సతీసుమతి

తారకము

సంక్లిష్టమైన కథలు