‘ఆత్మ’ దృష్టికోణం


కథని ఎవరి చేత చెప్పించాలి అన్న విషయాన్ని ప్రతి కథారచయితా చాలా ఆలోచించి ఎంచుకుంటాడు.  ఒక్కొక్కసారి ప్రయోగాలూ చేస్తాడు. 
అటువంటపుడు, మామూలుగా అయితే మనతో మాట్లాడని వృక్షాలూ జంతువులూ వచ్చి మనకి 'కథ చెప్పడం' జరుగుతూ వుంటుంది. అందుకు ఒక ప్రయోజనమూ ఉంటుంది.
కథకుడు నిర్వికారంగా, రాగద్వేషాలకు అతీతంగా సత్యాన్ని చెప్తున్నాడన్న నమ్మకాన్ని పాఠకుడికి కలిగించేందుకో, లేక పాఠకుడు కథలోని పాత్రలతో తాదాత్మ్యం చెందకుండా వాటికి కొంత దూరంగా వుండి కథలోని సత్యాన్ని మాత్రమే గ్రహించే అవకాశాన్ని కల్పించేందుకో బహుశా రచయిత చెట్టునీ, పిట్టనీ కథకుడిని చేస్తాడు.
సరే, అది అలా ఉంచితే ఒక్కొక్కసారి “ఆత్మలు” చెప్తున్నట్లుగా కూడా కొన్ని కథలు వస్తూ వుంటాయి. వాటి ప్రయోజనం ఏమిటి? అంటే “ఆత్మ” ద్వారా కథ చెప్పించినందువల్ల “కథకి” ఒనగూడే అధిక విలువ ఏమిటి? ఆ విషయాన్ని పరిశీలించే ప్రయత్నం జరుగుతోంది ఈ వ్యాసంలో.
ఈ వ్యాసం వ్రాసేముందు నేనొక చిన్న ప్రయోగం చేశాను. విస్తృతంగా కథలు చదివే కొందరు మిత్రులని “మీరు చదివిన ‘ఆత్మ చెప్పిన కథలు’ ఏమైనా వున్నాయా?” అని అడిగాను. ఆశ్చర్యకరంగా వారిలో చాలా మంది ఒక్క కథ పేరు కూడా చెప్పలేకపోయారు. నిజానికి అటువంటి కొన్ని కథలని వారు చదివి వున్నప్పటికీ అవి ఆత్మ ద్వారా చెప్పించబడిన కథలుగా వారు గుర్తు పెట్టుకోలేదు.
ఈ విషయం నాకు ఆసక్తిని కలిగించింది. “ఆత్మ” చెప్పడం వలన కథకి కలిగే ప్రయోజనం గురించీ, అందుకోసం రచయితలు తీసుకుంటున్న జాగ్రత్తల గురించీ నాకు ఉన్న ప్రశ్నలనీ పరిశీలనలనీ మరింతగా విశ్లేషించుకునేందుకు ప్రోద్బలాన్ని ఇచ్చింది.
నా పరిశీలనకు నాలుగు కథలని తీసుకున్నాను. గొరుసు జగదీశ్వర రెడ్డి వ్రాసిన ‘బతుకుగోస’, సామాన్య వ్రాసిన ‘మహిత’, అరిపిరాల సత్యప్రసాద్ వ్రాసిన “ఊహాచిత్రం”, మండువ రాధ వ్రాసిన “చివరిచూపు”. ఈ కథలకి సంబంధించిన మిగిలిన అంశాలనీ, గుణదోషాలనీ నేనిక్కడ ప్రస్తావించడం లేదు. పోల్చడం లేదు. “ఆత్మ కథ చెప్పడం” అన్న విషయాన్ని ఈ నాలుగు కథలూ ఎలా ఉపయోగించుకున్నాయి అన్న అంశాన్ని మాత్రమే ఈ వ్యాసంలో పోల్చి చూస్తున్నాను.
ఈ కథల గురించి చర్చించే ముందు రెండు విషయాలు చెప్పాలి. ఒకటి ఈ నాలుగు కథలు మాత్రమే చర్చకు తీసుకోవడానికి కారణం ఇవి ప్రస్తుతం నాకు అందుబాటులో వుండడం, నేను చెప్పదలచుకున్న విషయాలను చెప్పేందుకు ఈ నాలుగు కథలూ సరిపోవడం. 
అంతే తప్ప నేను ఈ వ్యాసంలో చర్చిస్తున్న విషయాలు (గుణాలు, దోషాలు కూడా) ఈ నాలుగు కథలలో మాత్రమే ఉన్నాయని కానీ ఈ దృక్కోణంతో వ్రాసిన ఇతర కథలలో లేవని కానీ కాదు. ఇక రెండవ విషయం ఏమిటంటే నేను ఈ వ్యాసంలో ఎత్తి చూపిన కొన్ని అంశాలు ఆయా కథా రచయితలకి తెలియక పోలేదు. అయితే ప్రధానంగా వారి దృష్టి కథలోని ఇతర విషయాల మీద వుండడం వలన ఈ అంశాల పట్ల నిర్లక్ష్యం వహించారు. అది నాకు తెలుసు. కనుక ఈ వ్యాసం వ్రాయడంలో నా ఉద్దేశ్యం ఈ కథా రచయితలకు ఈ విషయాలను వివరించడం కాదు. కథలను ఆసక్తిగా చదివే నావంటి పాఠకులు ఇటువంటి కథలలో ఏమి చూస్తారో, రచయిత ఒక ప్రయోగం చేసినపుడు దాని నుంచి ఏమి ఆశిస్తారో చెప్పడం మాత్రమే.
ఇక కథల గురించి మాట్లాడుకుందాం. ఈ నాలుగు కథలలోనూ కథ మొత్తాన్ని లేదా కథలో కొంత భాగాన్ని ‘ఆత్మ’ చెప్తుంది. 'బతుకుగోస'లో ఒక కంపెనీ మూసేసినందుకు నిరసనగా ధర్నా చేస్తూ కాల్పులలో చనిపోయిన కార్మికుడి ఆత్మ, 'మహిత'లో అత్తగారింటిలో భర్త చేతిలో హత్య చేయబడిన పదహారేళ్ళ మహిత ఆత్మ, 'ఊహాచిత్రం'లో ప్రస్తుతం వేస్తూ వున్న చిత్రం గురించిన ఆలోచనలతో పరధ్యానంగా స్కూటర్ నడిపి యాక్సిడెంట్లో చనిపోయిన చిత్రకారుడి ఆత్మ, 'చివరిచూపు' కథలో కరెంటు షాక్‌తో మరణించిన సూరి అనే త్రాగుబోతు ఆత్మా మనకి కథ చెప్తాయి.
వ్యవహారంలో ఆత్మ అనేమాటని మనం చాలారకాలుగా వాడుతూ వుంటాం. ఒక్కొక్కసారి మనసునే ఆత్మ అంటాం. ఇంకొకసారి మనసుకన్నా వెనుకనున్న “మరేదో” అన్న అర్ధంలో ‘ఆత్మ’ అన్న పదాన్ని వాడతాం.
మనిషికి మూడు శరీరాలు ఉంటాయని చెప్పుకుంటాం. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. వీటన్నిటికీ వెనుక వుండే చైతన్యమే ఈ మూడింటికీ ఆధారం అనుకుంటాం. ఇందులో స్థూల శరీరానికి తప్ప మిగిలిన మూడింటికీ “ఆత్మ” అనే మాటని మనం సంభాషణలలో కొంత అస్పష్టంగా వాడుతూ వుంటాం. సందర్భాన్ని బట్టి తగిన అర్థం తీసుకుంటూ వుంటాం.
మనుషులు కథ చెప్తున్నపుడు, మనుషుల సంభాషణలలో ఆత్మ అనే పదాన్ని వాడినపుడు, ఈ అస్పష్టతలన్నీ కథలో ఉండవచ్చు. ఎందుకంటే మనం అలా అస్పష్టంగానే మాట్లాడుకుంటాం కాబట్టి.
అయితే ఆత్మే కథ చెప్తున్నపుడు ఆ అస్పష్టతలు ఉండవచ్చునా? రచయిత దేనిని “ఆత్మ” అంటున్నాడో, కథకుడిగా వ్యవహరిస్తున్న ‘ఆత్మ’ స్వరూప స్వభావాలు ఏమిటో మనకి స్పష్టంగా తెలియాలి కదా!
ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో ఒక్కొక్కదానికీ ఒక్కొక్క రకమైన లక్షణాలు, స్వభావాలు వున్నాయి. దేని పరిమితి దానిది, దేని శక్తి దానిది. స్థూల శరీరానికి వుండే పరిమితులూ శక్తులూ వేరు. సూక్ష్మ శరీరానికి వుండే పరిమితులూ శక్తులూ వేరు. దేనిని “ఆత్మ” అంటున్నాము అన్న విషయంలో స్పష్టత లేనపుడు ఈ శక్తులూ పరిమితులూ కలగాపులగం అయిపోతాయి.
అయితే నష్టమేమిటండీ? అసలు ఆత్మ అంటే ఏమిటో మనకి స్పష్టంగా తెలియనపుడు దానిని రచయిత తన యిష్టమొచ్చినట్లు తాను వాడితే నష్టమేమిటి? ఆ కథలో ఆ రచయిత “ఆత్మ” అనే మాటకి ఏయే లక్షణాలు ఆపాదించాడో ఆయా లక్షణాలన్నిటి సమాహారమే   (ఆ కథకి సంబంధించినంతవరకూ) ఆత్మ  అనుకుంటే సరిపోతుంది కదా! అంటే... సరిపోదు.
ఎందుకంటే రచయిత “ఆత్మ”ని కథలో ఒక జడవస్తువుగా కాక ఒక చలనశీలమైన పాత్రగా మలిచాడు కాబట్టి. ఎపుడైతే అది పాత్ర అయిందో అపుడు పాత్రౌచిత్యమూ పాత్రోన్మీలనమూ వంటి విషయాలకు, ఆ పాత్ర చిత్రణలోని వైరుధ్యాలకు ప్రాధాన్యం వస్తుంది కాబట్టి.
పైగా రచయిత ఒక ప్రయోజనాన్ని ఆశించి, లేదా ఒక సౌలభ్యం కోసం “ఆత్మ”తో కథ చెప్పించాడు. సర్వసాక్షి కథనంగా వ్రాయడంలో కొన్ని సౌలభ్యాలు, ప్రయోజనాలు ఉంటాయి. ఉత్తమపురుష దృక్కోణంలో వ్రాయడంలో కొన్ని సౌలభ్యాలు, ప్రయోజనాలు వుంటాయి. మరి ఆత్మ దృక్కోణంలో వ్రాయడంలో రచయిత ఆశిస్తున్న ప్రయోజనం ఏమిటి? “ఆత్మ” చెప్తే మాత్రమే నెరవేరే ఆ లక్ష్యం ఏమిటి? అది తెలియాలంటే అసలు రచయిత దేనిని ‘ఆత్మ’ అంటున్నాడో ఆ ఆత్మ లక్షణాలేమిటో మనకి తెలియాలి.
అయితే సాహిత్యానికి సంబంధించినంతవరకు మరీ కచ్చితమైన శాస్త్ర నిర్వచనాలు ప్రమాణాలు పాటించి తీరవలసిన అవసరం ఉంటుందని కూడా భావించలేము. ఇవి శాస్త్రచర్చలు కావు కనుక ఇక్కడ సత్యావిష్కరణ కన్నా రసావిష్కరణకి ప్రాముఖ్యాన్ని ఇస్తూ వుంటారు కనుక సమాజంలో చలామణీలో వున్నవీ, అటు పాఠకులూ ఇటు రచయితలూ కూడా ఇబ్బంది పడకుండా అంగీకరించగలవీ అయిన కొన్ని సామాన్య లక్షణాలకు కట్టుబడి వాటినుంచి ప్రక్కకి వెళ్ళకుండా కథని నడిపిస్తే చాలని అనిపిస్తుంది.
ఇలాంటి కొన్ని కథలు చదివిన మీదట కొందరు రచయితలతోను పాఠకులతోను ఈ విషయంపై మాట్లాడిన మీదట అలా అందరూ ఏకీభవిస్తున్న భావిస్తున్న సామాన్య లక్షణాలు కొన్ని కనిపించాయి. అవి ఏమిటంటే, ఈ రకమైన కథలలో బ్రతికున్నపుడు ఉత్తమపురుష కథకుడిలో ఉన్న “మనసే” అతను చనిపోయాక “ఆత్మ” అవుతుంది. శరీరంతో బంధింపబడి లేదు కాబట్టి అది ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళిపోగలదు. అది కథలోని మిగతా పాత్రలకి కనబడదు. వినబడదు. దానికి మాత్రం అందరూ కనబడతారు, వినబడతారు.
ఇవి ఇలాంటి అన్ని కథలలోనూ కనబడే ‘ఆత్మ’ లక్షణాలు. పాఠకులూ రచయితలూ కూడా అంగీకరించే సామాన్య లక్షణాలు. వీటిని చదివినపుడు “ఆత్మ” తో కథ చెప్పించడం వల్ల సమకూరే ముఖ్య సౌలభ్యం ఏమిటో మనకి అర్థమవుతుంది - ఉత్తమపురుష దృక్కోణంలో కథ చెప్తూనే ఆ కథకుడికి ఎక్కడికైనా ఏ వేళలో అయినా వెళ్ళగలిగే అవకాశాన్నీ,  అతను ఉన్నాడన్న స్పృహ లేనపుడు మిగతా వారు ఏం మాట్లాడుకుంటారో వినగలిగే అవకాశాన్నీ  ఇవ్వడం.
నేను పైన చెప్పినట్లు శాస్త్రాల పురాణాల నిర్వచనాల ప్రకారం ఆత్మకి నిజంగా ఈ సౌలభ్యం ఉందా లేదా అన్న విషయాన్ని నేను ఇక్కడ చర్చించడం లేదు. ఉంది అన్న అనుకోలుతో ఈ కథలని పరిశీలిస్తున్నాను.
అప్పుడు మూడు విషయాలను గమనించవలసిన అవసరమూ అవకాశమూ ఏర్పడుతుంది.
1. ఈ సౌలభ్యాన్ని రచయిత ఎంతవరకు ఉపయోగించుకున్నాడు?
2. ఎంత విచక్షణతో ఉపయోగించుకున్నాడు?
3. దానివలన కథకి ఏ ప్రయోజనాన్ని సాధించాడు?

పైన చెప్పిన నాలుగు కథలనీ ఉదాహరణలుగా తీసుకుని ఈ మూడు విషయాలు పరిశీలిద్దాం.

కథలో “ఆత్మ” తప్ప చెప్పలేని విషయమెంత?:
ఆత్మ చెప్తున్న కథలు అయినప్పటికీ నిజానికి ఇవి ఉత్తమపురుష దృక్కోణంతో నడిచే కథలే. కథకుడు తాను బ్రతికున్నపుడు జరిగిన విషయాలని, మరణించాక జరిగిన విషయాలని కలగలిపి చెప్పడం మనం వీటిలో చూస్తాం.
కథనం మనసు నుండి ఆత్మకు మారడం (కథకుడు మనిషి నుండి శవంగా మారడం) అనేది కథ మొదట్లో జరగవచ్చు, మధ్యలో జరగవచ్చు చివర్లో జరగవచ్చు. ఎప్పుడు జరిగినప్పటికీ కథలో మామూలుగా ఒక మనిషి ఉత్తమపురుష దృక్కోణంలో కథ చెప్తే  ఏయే విషయాలు చెప్పే అవకాశముందో అవి మాత్రమే చెప్పినపుడు లేదా అవే ఎక్కువగా చెప్పినపుడు కథ ఈ సౌలభ్యాన్ని సరిగా వాడుకోనట్లే.
ఆ కోణంలో చూసినపుడు, ఈ నాలుగు కథలలో బతుకుగోస, మహిత కథలు ఈ అవకాశాన్ని బాగా వాడుకున్నాయని అనిపిస్తుంది. కథ చెప్తున్నది ఆత్మ అన్న విషయాన్ని బతుకుగోసలో కథ చివర్లోనూ మహితలో కథ మధ్యలోనూ చెప్తారు. ఊహాచిత్రంలో కథ మొదట్లోనే చెప్తారు. అయినా ఊహాచిత్రంలో కన్నా మిగిలిన రెండు కథల్లోనే రచయితలు ‘ఆత్మ’ ని సరిగా వాడుకున్నారు. ఎందుకంటే ఊహాచిత్రం కథలో ఎక్కువభాగం ‘మనసు’ కూడా చెప్పగలిగిన కథే. ఊహాచిత్రం కథలో ‘కథకి అవసరమైన భాగం’ ఆత్మ మాత్రమే చెప్పగలది కాదు. ‘ఆత్మ చెప్పిన భాగం’ కథకి నిజంగా అవసరమైనది కాదు. ఇక చివరిచూపు కథలో అయితే ‘ఆత్మ’ ప్రాధాన్యం అసలే లేదు. ఈ రెండు కథలూ ఒక చిన్న అంశాన్ని చెప్పేందుకు మాత్రమే ఆత్మని వాడుకుంటాయి.
ఎక్కువ శాతం కథ ఆత్మకి ఉన్న (ఉందనుకుంటున్న) సౌలభ్యాన్ని ఉపయోగించుకోనపుడు, ఎక్కువ భాగం కథ ఆ వ్యక్తి బ్రతికున్నప్పటి విషయాలను అప్పటి పరిస్థితులను, భావాలనే చెప్తూ పోయినపుడు, ఒక చిన్న అంశాన్ని చెప్పేందుకు మాత్రమే ఆత్మని ప్రవేశపెట్టినపుడు, మరీ ముఖ్యంగా ఆ చిన్న అంశం కూడా నిజంగా కథకి అంత కీలకమైనది కానపుడు అసలు ‘ఆత్మ’ తో కథ చెప్పించవలసిన అవసరమేమిటి అన్న ప్రశ్న వస్తుంది. ప్రయోగం కోసమే చేసిన ప్రయోగం అసంతృప్తిని కలిగిస్తుంది.

‘ఆత్మ’ ని ఉపయోగించుకోవడంలో అస్పష్టతలు, వైరుధ్యాలు:

ఆత్మ నిర్వచనం గురించి, స్వభావం గురించి రచయిత పూర్తి స్పష్టత ఇవ్వనప్పటికీ, ఆత్మని వివరించే శాస్త్రాలనో పురాణాలనో ప్రమాణంగా ఒప్పుకోకపోయినప్పటికీ ఆత్మ యొక్క కనీసపు లక్షణాలుగా రచయిత తీసుకునే (తీసుకుంటాడని పాఠకులు అనుకునే) కొన్ని విషయాలను పైన చెప్పుకున్నాం. రచయిత కనీసం వాటికి కట్టుబడి ఉండవలసిన అవసరం ఉందనీ అనుకున్నాం.
వాటిలో ఒకటి బ్రతికి ఉన్నప్పటి మనసునే చనిపోయాక ఆత్మ అంటున్నామన్న విషయం. రెండవది ఆత్మ శరీరంలో నుంచి బయటకి వచ్చింది కనుక ఇక దానికి శరీరం లేదన్న విషయం.
ఈ అనుకోలుతో కథ చదివితే కథ చెప్తున్నది ఆత్మ అయినపుడు కొన్ని రకాల వాక్యప్రయోగాలు, వ్యక్తీకరణలు చేసే అవకాశం వుండదు.
కానీ ఒక్క మహిత కథలో తప్ప మిగిలిన మూడు కథలలోనూ వాటిని రచయితలు విరివిగా చేశారు.

బతుకుగోస కథలోని వాక్యాలు కొన్ని చూద్దాము.
"లోపలికి అడుగేస్తుంటే... శరీరం కంపించింది"
“లేత్‌మిషన్ చేతికి తగిలింది.”
“తుళ్ళిపడ్డట్టు వెనక్కి తిరిగాను.”
“ఒళ్ళంతా చెమటలు కారిపోతున్నాయి. గుండె వేగంగా కొట్టుకుం టోంది.”
ఇవి బతుకుగోస కథలోని వ్యక్తీకరణలు. ఇంకా ‘భయం భయంగా క్రిందికి వంగడం.. అదిరిపడి అరవబోవడం’ - వంటి వ్యక్తీకరణలు కూడా ఈ కథలో చూస్తాము.
చివరి చూపు కథలో ‘ఆత్మ’ ప్రవేశించేదే కథ చివర్లో. ఒక రెండు మూడు పేరాలు మాత్రమే ఆత్మ చెప్పే కథ వుంటుంది. ఆ చిన్న భాగంలో వ్యక్తీకరణలు ఇలా ఉంటాయి.
“నా ఆత్మ ఏడుస్తోంది. నా గురించి ఒక్క మంచి మాట వినాలని తపన పడతా అక్కడక్కడే తిరుగుతోంది.”
“దిగులుతో నా మనశ్శరీరాలు రెండూ కుంచించుకు పోసాగాయి.”
"నన్ను క్షమించండి" అని ముందుగా నేనే అందరితోనూ అనాలనుకున్నాను. ముఖ్యంగా నా పెళ్ళాంతో అనబోయేంతలో నా ఆత్మ ప్రకృతిలో కలిసిపోయింది.

సాహిత్యానికి సంబంధించినంతవరకు ఆత్మ కథకుడైనపుడు ఆత్మ=మనసు=నేను అనుకున్నాము కనుక మళ్ళీ ఆ కథకుడు(ఆత్మ) “నా ఆత్మ” అనడం, “నా మనశ్శరీరాలు” అనడం సరి అయిన వ్యక్తీకరణ కాదనిపిస్తుంది.

ఇక ఊహాచిత్రం కథలోనయితే ఈ వైరుధ్యాలు, అస్పష్టతలు మరీ ఎక్కువగా కనిపిస్తాయి.

కథ మొదలవడమే “నేను లేచాను. ఇంకా మత్తుగా వుంది. లేచిన చోట అలాగే కూర్చుని గట్టిగా కళ్లు నులుపుకొని కిందకి చూశాను. కాళ్లకింద ఆ బొమ్మ...” అంటూ మొదలవుతుంది.
తాను అప్పుడే శరీరంలో నుంచి బయటకి వచ్చిన ‘కొత్త ఆత్మ’ కాబట్టి ఆత్మ లక్షణాలేమిటో, ఆత్మలకి ఈ ప్రపంచ దృశ్యాలు ఎలా కనిపిస్తాయో తనకింకా తెలియడం లేదన్నట్లుగా మాట్లాడతాడు కథకుడు.
“నేనొక పిచ్చోణ్ణి. నా ముందు మసక మసకగా వున్న చిత్రాన్ని చూసి సర్రియలిజమో ఇంకేదో అనుకున్నా … ఆత్మలకి అలాగే కనిపిస్తాయేమో! పైగా టీ ఇవ్వలేదని కోపమొకటి! అలా ఎంతసేపు పెయింటింగ్‌కి పోజిచ్చినవాడిలా కూర్చోవాలో మరి. ఆత్మ అంటే ఎగురుకుంటూ పైకి వెళ్లి ఆకాశంలో కలిసిపోవాలి కదా!”
“ఆత్మలకి అలాగే కనిపిస్తాయేమో!, .... ఆత్మ అంటే ఎగురుకుంటూ పైకి వెళ్లి ఆకాశంలో కలిసిపోవాలి కదా!” వంటి మనిషికి కలిగే భావాలనే ఆత్మలకి కూడా కలిగినట్లుగా వ్రాయడంలో ఔచిత్యం లేదు. ఇటువంటి వాక్యాలు ఈ కథలో చాలా ఉంటాయి.
అలా కాదు. మనం తికమకలో ఉన్నట్లే ఆత్మలూ తికమకలో ఉంటాయి, పైగా అప్పుడప్పుడే ఆత్మగా మారినపుడు ఆ తికమక కొంచెం ఎక్కువగా వుంటుంది అని సమర్ధించుకోవచ్చు. లేక ఆత్మ అలాంటి వ్యక్తీకరణ చేసే అవకాశమూ నిజంగానే ఉండవచ్చు. కానీ అపుడు మళ్ళీ మొదటి ప్రశ్నే వస్తుంది. అటువంటపుడు... ఉత్తమపురుష కథనానికీ ఆత్మ కథనానికీ అసలే భేదమూ లేనపుడు... భావ వ్యక్తీకరణలో, పదప్రయోగంలో కించిత్తయినా వ్యత్యాసం చూపనపుడు ఆత్మతో కథ చెప్పించడం ఎందుకన్న ప్రశ్న. ప్రయోగం కోసమే ప్రయోగమా అన్న ప్రశ్న.
కథలని సునిశితంగా శ్రద్ధగా చదివే పాఠకులు కూడా తాము చదివిన ‘ఆత్మ’ కథలని అవి ఆత్మ ద్వారా చెప్పించబడిన కథలుగా గుర్తు పెట్టుకోకపోవడానికి కారణం ఇదేనేమో అనిపిస్తుంది. అయితే ఆత్మ కథ చెప్పడం అనే విషయంలో ఉండే సౌలభ్యాన్ని విస్తారంగా ఉపయోగించుకోకపోయినా, ఔచిత్యమూ చూపకపోయినా దానివలన కథకి ఏదో ఒక ప్రయోజనాన్ని సాధించదలచి రచయిత ఈ దృక్కోణాన్ని ఎంచుకుని ఉంటే మన ఈ అసంతృప్తులు కొంత తగ్గుతాయి.

ఆత్మ దృక్కోణంతో కథ చెప్పడం వలన ప్రయోజనమేమిటి?
మనం ఇంతవరకూ చెప్పుకున్నట్లు ఆత్మ దృక్కోణంలో నడిచే కథకీ మామూలుగా ఉత్తమపురుష దృక్కోణంతో నడిచే కథకీ ‘వ్యక్తీకరణ’లో, కథనంలో పెద్ద తేడా చూపడం లేదు రచయితలు. మరి ఎందుకు ఆత్మతో కథ చెప్పిస్తున్నారు? తద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అని పరిశీలించి చూస్తే... ఈ కథలలో ఒక వ్యక్తి తను మరణించిన తర్వాత కూడా ఈ లోకంలో జరిగే కొన్ని విషయాలు గమనించడం, వాటి గురించి ఆలోచించడం, కొన్ని భావాలకు లోనవడం, కొన్ని విషయాలు వ్యాఖ్యానించడం వుంటుంది.
అయితే చనిపోయిన వ్యక్తి(ఆత్మ) యొక్క ఆలోచనలతోను, భావాలతోనూ నిజానికి మనకి పని లేదు. వాటిమీద మనకి ఆసక్తీ లేదు. ఆత్మని అర్ధం చేసుకోవడం మనకి సంతృప్తిని ఇవ్వదు. రచయిత ఉద్దేశ్యం కూడా మనకి ఆత్మని గురించిన జ్ఞానాన్ని కలిగించడం కాదు.
కథని ఆత్మతో చెప్పించినప్పటికీ వాస్తవానికి రచయితకీ మనకీ కూడా కావలసింది ఆత్మ యొక్క వ్యాఖ్యలనుంచి ఆత్మని అర్ధం చేసుకోవడం కాదు. ఆత్మ యొక్క వ్యాఖ్యల ఆధారంగా కథలోని బ్రతికున్న పాత్రలని, బ్రతికి ఉన్నప్పటి కథకుడి మనసుని ఇంకొంత బాగా అర్థం చేసుకోవడం. అలా అర్థం చేసుకునేందుకు మనకి ఆత్మ యొక్క వ్యాఖ్యలు, కథనం ఉపయోగపడాలి. ఆ దృష్టితో ఈ నాలుగు కథలనీ చూద్దాము.
చివరిచూపు కథలో ఏమవుతుంది? మనం చనిపోయాక కొందరు మనకోసం ఏడుస్తారని, బ్రతికుండగా మన ప్రవర్తన సరిగా లేకపోయుంటే చనిపోయాక మన గురించి ఎవరూ ఒక మంచి మాట మాట్లాడరని, అపుడు మనం ఎవరినైనా క్షమించమని అడుగుదామనుకున్నా ఇక ఆ అవకాశం ఉండదనీ సూరి ఆత్మ తెలుసుకుంటుంది. పాఠకులుగా మనమూ ఆవిషయాన్ని మరొకసారి అర్ధంచేసుకుంటాం. అంతే. ఇది నిజానికి ఆత్మ చెప్తే తప్ప తెలియని విషయం, మనం ఆత్మగా మారితే తప్ప అర్థం కాని విషయం కాదు. మనం బ్రతికి ఉన్నపుడే ఎవరి మరణం నుంచైనా నేర్చుకోగల పాఠమే. ఆత్మ చెప్పడం వలన ప్రత్యేకంగా ఏర్పడిన గాఢత కూడా ఏమీ లేదు.
ఇక ఊహాచిత్రం కథలో రచయిత ఆత్మ గురించి సమాజంలో మనకి వున్న మామూలు నమ్మకాలకన్నా (మనం ఈ వ్యాసం మొదట్లో చెప్పుకున్న సామాన్య లక్షణాలకన్నా) కొన్ని విషయాలు అధికంగా వ్రాస్తారు. ఆత్మ వెళ్ళిపోవాలనుకుంటున్నప్పటికీ వెళ్ళలేక పోతోందనీ, దానిని ఏదో శక్తి ఇక్కడ ఆపుతోందనీ ఒక వాక్యం ఉంటుంది. ఆ శక్తి ఏమిటి? ఏదైనా బాహ్య శక్తా? దానిలోనే ఉన్న కోరికా? దాని కోరికే అయితే ఆ కోరిక ఏమిటో దానికి కూడా తెలియదా? ఇలాంటి విషయాలన్నీ అస్పష్టంగా వుంటాయి. శాస్త్రం వీటి గురించి ఏం చెప్తోందో మనకి తెలియదు. ఆత్మ లక్షణాలేమిటి? అది ఎలా బయటికి వస్తుంది? ఎంతసేపు ఇక్కడ ఉంటుంది? తర్వాత ఎక్కడికి వెళ్తుంది? ఏమవుతుంది? చనిపోయాక జరిగే కర్మకాండకీ దానికీ ఏమైనా సంబంధం వుందా? లేదా? – ఇవన్నీ మనం పైన చెప్పుకున్నట్లు కథలో ప్రత్యేకించి వ్రాయకపోతే మనం పట్టించుకోనవసరం లేదు. ఆత్మ అంటే శరీరం నుంచి బయటకి వచ్చిన మనసు అన్న అర్థం వరకే కథలో తీసుకుంటే శాస్త్రచర్చలు చేయవలసిన అవసరం వుండదు. అయితే రచయిత అంతకు మించిన లక్షణాలని కథలో వ్రాస్తే మటుకు మళ్ళీ అవి వైరుథ్యాలు లేకుండానూ శాస్త్రసమ్మతంగానూ ఉన్నాయా లేదా అన్న ప్రశ్న వస్తుంది.
ఈ విషయం నిజానికి చివరిచూపు కథకి కూడా వర్తిస్తుంది. ఆ కథలో “నా ఆత్మ ప్రకృతిలో కలిసిపోయింది.” అన్న చివరి వాక్యం చాలా ప్రశ్నలకి దారితీస్తుంది.
మళ్ళీ ఊహాచిత్రం కథకి వస్తే అందులో ఈ క్రింది వాక్యాలు వుంటాయి.
“నాకు అక్కడ వుండబుద్ధి కావటం లేదు. కాని ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్దామంటే వెళ్లనివ్వకుండా ఏదో పట్టి లాగుతోంది. భూమ్మీదే ఏదో శక్తి ఆపుతోంది. పోలీసులు వచ్చారు. నా మొబైల్ తీసుకొని అందులో నెంబర్లకి ఫోన్‌లు చేస్తున్నారు. నాకు అర్థమయ్యింది. నా భార్యాపిల్లల్ని చూసుకోవాలనే అనుకుంటా నా ఆత్మ ఆరాటం.”
ఇక్కడ “నేను” ఎవరు? ‘అదే అనుకుంటా నా ఆత్మ ఆరాటం’ అని మనతో అంటున్నది ఎవరు? ఆత్మే కదా! ఆత్మ మళ్ళీ ‘నా ఆత్మ’ అనడం ఒక తికమక అయితే ఆ ‘ఆత్మ ఆరాటం’ ఏమిటో ఈ కథ చెప్తున్న ఆత్మకి స్పష్టంగా తెలియదనడం మరో తికమక. అది మొదట ‘నా భార్యాపిల్లల్ని చూసుకోవాలనే అనుకుంటా నా ఆత్మ ఆరాటం.’ అనుకుంటుంది. సరే ఆ తర్వాత భార్యా పిల్లలు ‘కథ చెప్పే ఆత్మ’కి కనిపిస్తారు. అయినా ‘తన ఆత్మ’ ఇంకా ఎందుకు కదలడం లేదో ‘కథ చెప్పే ఆత్మ’కి అర్థం కాదు. అప్పుడు ఒక ముసలాయన “ఏం బొమ్మ నీ కళ్లముందు కనపడతా వుండిందో నాయనా … నీ సావు నీకు కనపడలా…” అంటాడు.
అది విన్న ఆత్మ (కథ చెప్పే ఆత్మ) ఇలా అంటుంది.
“అదే నేను వినాలనుకుంది. నా చావుతో నా బొమ్మ మిగిలిపోయింది. నా వూహలో బొమ్మ అర్థాంతరంగా ఆగిపోయింది. కానీ, కనీసం ఒకరికైనా నా చావుకు కారణం తెలిసింది. అదే నేను వినాలనుకున్నది. నా ఆత్మ గాల్లోకి లేచింది.”
ఈ తికమక వాక్యం చదివితే బోలెడన్ని సందేహాలు కుప్పలుకుప్పలుగా వస్తాయి. తన చావుకు కారణం ఒకరికైనా తెలియాలన్నదే ఆ ఆత్మ కోరిక. అది ఎప్పుడు పుట్టిన కోరిక? బ్రతికున్నపుడు పుట్టినదా? ఆత్మగా మారాక పుట్టినదా? బ్రతికున్నపుడు అటువంటి కోరిక మనిషికి ఎందుకు పుడుతుంది? ఆత్మగా మారాక పుట్టిన కోరిక అయితే అంత కొద్ది సమయంలో ఏర్పడిన కోరిక అంత బలంగా (దానిని పైలోకాలకు వెళ్ళకుండా ఆపేంత బలంగా) వుంటుందా? తన కోరిక అదని ఆ కోరిక తీరేదాకా ఆత్మకి ఎందుకు అర్థం కాలేదు? ఆత్మ లక్షణాలే సరిగా తెలియని మనల్ని “ఆత్మలో వుండే ఆత్మకే తెలియని మరో ఆత్మ” గురించి చెప్పి ఈ రచయిత ఎందుకు పరీక్షిస్తున్నాడు? – ఇవి నాకు కలిగిన సందేహాలలో కొన్ని మాత్రమే.
ఈ వాక్యాన్ని కూడా రచయిత స్పష్టంగా వ్రాయకపోయినా నిజానికి ఈ వాక్యంలో రచయిత ఉద్దేశ్యం బహుశా ఇది కావచ్చు - ఒక చిత్రకారుడు నిరంతరమూ తను వేయబోయే/వేస్తున్న చిత్రం గురించి తదేకంగా, ఎదురుగా వచ్చే చావుని కూడా గుర్తించనంత తాదాత్మ్యంతో ఆలోచిస్తూ ఉంటాడనీ, ఆ విషయాన్ని మరొకరు గుర్తిస్తే సంతృప్తిచెందుతాడనీ బహుశా ఈ వాక్యం వ్రాయడంలో రచయిత ఉద్దేశ్యం కావచ్చు.
అయితే మళ్ళీ అది చెప్పేందుకు ఆత్మ అవసరమా అన్న ప్రశ్న వస్తుంది. ఆత్మ దృక్కోణంతో చూసినపుడు మాత్రమే తెలుసుకోగల విషయం కాదు ఇది. ఆత్మ ద్వారా తెలుసుకోవడం వలన వచ్చిన విశిష్టత కూడా ఏమీ కనిపించలేదు.
బతుకుగోస కథలో కథ చెప్తున్నది ‘ఆత్మ’ అన్న విషయాన్ని రచయిత చివరివరకూ బయటపెట్టరు. అందుకే పైన చెప్పుకున్నట్లుగా వ్యక్తీకరణలో అసలు భేదమే వుండదు. అయితే ఈ కథలో కథకుడు మాత్రమే కాక మిగిలిన పాత్రలన్నీ కూడా ఆత్మలే. ఫ్యాక్టరీ మూతబడ్డాక కార్మికులలో కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరికొందరు వివిధ కారణాలతో చనిపోయారు. ‘బ్రతకలేకపోయిన’ ఆ కార్మికులందరికీ ఈ లోకంలో మిగిలిన అన్నిటి మీద కన్నా అందరి మీద కన్నా ఫ్యాక్టరీ మీద వున్న మమకారం ఎక్కువ. ఆ మమకారం వాళ్ళని చనిపోయాక కూడా అక్కడే ఆ మెషీన్ల మధ్యనే తిప్పుతోంది అని చెప్పడం ద్వారా మమకారం యొక్క తీవ్రతని చూపడం అనే ప్రయోజనం కొంతవరకు నెరవేరింది.
ఇక చివరగా మహిత కథ. ఈ కథలో మాత్రమే కథకురాలు ఆత్మగా మారాక కొంత నిర్వికారంగా కథ చెప్పడం మనకు కన్పిస్తుంది. అయితే చిత్రంగా ఈ కథే మన మనసుని ఎక్కువగా కదిలిస్తుంది. పోస్టుమార్టం చేసిన డాక్టరు, తల్లి, తండ్రి, చనిపోయిన మహిత పొడుగాటి జడను తడుముతూ ఏడ్చిన మేనత్త - వీళ్ళందరి గురించీ మహిత “నిర్వికారంగా” చెప్తుంటే... పదహారేళ్ళ పిల్ల అన్ని బాధలకీ అతీతమైన స్థితికి బలవంతంగా నెట్టబడిందని అర్ధమయిన మన గుండెల్లోకి ఆ పిల్ల బాధంతా... ఇక మహితని అంటుకునే అవకాశం లేని ఆ బాధంతా గోడకి కొట్టిన బంతిలా వచ్చి చేరినట్లవుతుంది.
మనిషి చెప్తున్న కథ చదవడానికీ ఆత్మ చెప్తున్న కథ చదవడానికీ మధ్య మనలో ఒక కచ్చితమైన తేడా ఏదో జరగాలి. దృక్కోణంలో ఏదో ఒక మార్పు రావాలి. అలాంటి మార్పు ఈ నాలుగు కథలలోనూ ఒక్క మహిత లోనే కనిపిస్తుంది. ఈకథలో కూడా ఆత్మకి ప్రత్యేకించి కొత్త వ్యక్తీకరణలు ఏమీ వాడకపోయినప్పటికీ కొన్ని పొరపాట్లు చేయకపోవడం వలనా శరీరానికి సంబంధించిన వ్యక్తీకరణలు వాడకపోవడం వలనా దృక్కోణంలో ఒక మార్పుని రచయిత్రి సాధించగలిగారు.
మహిత కథ చెప్తున్నపుడు (లేదా మనం మహితగా కథ చదువుతున్నపుడు) శరీరం వుంది. దానికి సంబంధించిన బాధలు, భయాలు, బంధాలు, దిగుళ్ళు వున్నాయి. ఇంకో క్షణంలో భర్త వచ్చి ఏం చేస్తాడో అత్త వచ్చి ఏం చేస్తుందో అన్న భయం, వారినుండి తనని తాను కాచుకోవలసిన కర్తవ్యం – ఇవన్నీ ఉన్నాయి. ఇంతలో ప్రాణం పోయింది. ఒక్కసారిగా ‘దృక్కోణం’ మారిపోయింది. ఒకరకమైన నిశ్చింత, నిదానం వచ్చాయి. ‘మహితఆత్మ’గా కథ చదువుతున్నపుడు మనం చుట్టూ వున్న మనుషుల్ని (కథలోని పాత్రల్ని) మరో దృక్కోణంతో చూడడం జరుగుతుంది. కొంత స్థిమితంగా నిర్వికారంగా గమనించడం జరుగుతుంది. చాలా చిన్నదే కావచ్చు కానీ ఇందులో ఒక తేడా వుంటుంది.
ఇక్కడ నిర్వికారమంటే మళ్ళీ సర్వసాక్షి కథనంలో వుండే నిర్వికారం కాదు. ఒక ‘మమకారం’ కూడా వుంది, వుంది కాబట్టే ఆ ఆత్మ ఇంకా అక్కడ వుంది. కానీ శరీరంతో ఉన్నప్పటికంటే బంధాలు కొంత సడలాయి. ఈ భావాన్ని కథ కలిగించాలి. ఆవ్యక్తి యొక్క మరణానంతర వాతావరణం మనల్ని క్రమ్ముకోవాలి. అది జరగనపుడు ఆ కథకుడిని చంపడం అనవసరం. బ్రతికే ఉండనిస్తే సరిపోతుంది.
కథని ‘ఆత్మ’ చేత చెప్పించాలని రచయిత నిర్ణయించుకున్నపుడు వ్యక్తీకరణలో కూడా కొంత భేదాన్ని చూపగలిగితే, అందువలన కథకి ఒక ప్రయోజనాన్ని సాధించగలిగితే అపుడు ఆ కథ పాఠకులపై మరింత గాఢమైన ప్రభావాన్ని చూపే అవకాశం వుంటుంది. ఆ ప్రయోగానికి సార్ధకత వుంటుంది.

*****


(2015 మార్చి లో ఆంధ్రజ్యోతి వివిధ లో ప్రచురించబడిన వ్యాసం)

కామెంట్‌లు

మీ విమర్శనాత్మక దృష్టికోణం, సూక్ష్మ పరిశీలనా శక్తి, రచనా సమర్థత నన్నెప్పటిలాగే ఆకట్టుకున్నాయి. అభినందనలు.
అలవోకగా వ్రాసేస్తున్న కథకులు , కవులూ తాము చెప్తున్న విషయాలపై కనీస శ్రద్ధ చూపించడం చాలా అవసరం అనేది తెలుసుకోవలసి ఉంది.
సాహిత్యంలో నాణ్యత పెంపొందడానికి ఇటువంటి సహేతుకమైన విమర్శలు, నిరూపణలు చాలా ముఖ్యం.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సతీసుమతి

తారకము

సంక్లిష్టమైన కథలు