"దేవతల యుద్ధము"నవల - విశ్వనాథ సత్యనారాయణ

ఇది ఒక చిన్న, డెబ్బై అయిదు పేజీల నవల. 
దీని గురించి విశ్వనాథ పావనిశాస్త్రి గారు వ్రాసిన ముందు మాటలో ఇలా చెప్పారు. ఇది ఒక జమీందారీ రాజకుటుంబములో జరిగిన కథ. క్రొత్త దేవతలు, ప్రాత దేవతలు మనుష్యుల విశ్వాసాల వలన పరిస్థితులు ఎట్లా మారి, సంఘంలో కొందరు బలి అవుతారో ఆ కథ 
సరే, కథ విషయానికి వస్తే పెద్దగా కథ ఏమీ లేదు. ఒక వూరు, ఆ వూరి జమీందారుగారు. ఆయన పూర్వీకులలో ఒకడు గోలుకొండ వెళ్ళి, నవాబు గారి దయ సంపాదిస్తాడు. అప్పటికి ఆయన వట్టి సరదారు. జమీందారీ లేదు. ఆయనకున్న సంపత్తి అంతా గుఱ్ఱమూ, కత్తీ. అంతే. తర్వాత నవాబు గారు ఒక పరగణా అంతా ఆయనకిస్తాడు. అల్లా వచ్చిన జమీందారీ.
నీలకంఠశాస్త్రి ప్రస్తుత జమీందారు దగ్గర దీవాను. ఆయన తండ్రిగారు అమ్మవారి ఉపాసకులు. కానీ నీలకంఠశాస్త్రి అవన్నీ వదిలేస్తాడు. తండ్రి చనిపోయాక ఆయన పుజామందిరాన్నీ, బాలయంత్రాన్నీ కూడా ఎవరికో యిచ్చేస్తాడు.
ఒక ఉత్తరదేశపు గురువుగారిని ఆశ్రయించి, ఆయన బోధనల ప్రకారం నడుస్తూ వుంటాడు.
ఇక జమీందారుగారి మతం దీవాను గారి మతానికి భిన్నం. అది మరొక రకం. దాన్ని గురించి పరిచయమే చాలా చమత్కారంగా చేస్తారు విశ్వనాథ.
దొరగారి మతము ఉపనిషన్మతము. వాళ్ళు ఉపనిషత్తులలో జ్ఞానభాగం అంతా ఒప్పుకుంటారు. అందులో చాలా మందికి ఉపనిషత్తులలో రెండు భాగాలుంటాయని అందులో ఒక భాగం ఉపాసనా భాగం అనీ, రెండోది జ్ఞాన భాగం అనీ తెలియనే తెలియదు. ఉపాసనా భాగం ఒప్పుకుంటే వాళ్ళ మతమే చెడిపోతుంది. ఉపాసనా భాగంలో కేవలం బ్రహ్మ కాదు కదా!
ఇది వట్టి కేవల బ్రహ్మమతం. అందులో కూడా సహస్రారచక్రం, ఆజ్ఞాచక్రం, అనాహతం మొదలైన పద్ధతులు లేవు. వట్టి బ్రహ్మ. పృధివ్యాద్యావరణలున్నై. అవి అవిగానే ఉంటై. ప్రార్ధన చేస్తే బ్రహ్మ వచ్చేస్తాడు. 
కామాక్రోధాలకేమీ లోపం లేదు. వీళ్ళు మన మతానికి చెందినవాళ్ళు. వీళ్ళు మన మతం వాళ్ళు కాదు. అనే భేదబుద్ది అక్కడ చూసి ఇంకొక చోట చూడాలి. ఆ మతంలో కొన్ని భేదాలు. ఇప్పుడందరూ వాళ్ళ మతస్తులే. పూర్వం వీడు బ్రాహ్మడు. వాడు తక్కువ. వాడు బ్రాహ్మణేతరుడు. అది ఎక్కువ.
ఒక్కొక్కప్పుడు ఇంకో చమత్కారం వుంది. వాడు మన మతం కాకపోయినా సరే, వాడు బ్రాహ్మణుడు కాకపోతే సరి. ఈ రీతిగా వుంటుంది పక్షపాతం! సృష్టి అంతా బ్రహ్మమయం.
వాళ్లకి పురాణాలు, శాస్త్రాలు, వేదాలు ఇవి ఏవీ పనికి రావు. కాదయ్యా యితర మతాలు పనికి వస్తాయా అంటే, ఒక్క సనాతనమతం తప్ప తక్కినవన్నీ పనికి వస్తాయి. అంత గౌరవించరు గాని, మహమ్మదు ప్రవక్త గురించి గొప్పగా చెప్పుకుంటారు”.
ఇలా సాగుతుంది వర్ణన జమీందారుగారి మతం గురించి. ఊర్లో జమీందారు గారి ఉద్యోగస్థులు చాలా మంది జమీందారుగారి మతమే. మిగిలినవారు మతం ఉచ్చులో లేకపోయినా విశ్వాసాలు, ఆచారాలు రాజుగారి మతం ప్రకారమే ఉంటుంటాయి.

ప్రస్తుత జమీందారుగారి తండ్రిగారి హయాంలో కొంత వారసత్వపు చిక్కులు వస్తాయి. అప్పుడు జమీందారుగారికి పురోహితుడు, దివాను కూడా అయిన రామశాస్త్రి తన దగ్గర వున్న కొన్ని విలువైన కాగితాలు ప్రత్యర్ధుల పరం చేస్తే నలభైవేలు ఇస్తామని ప్రలోభ పెట్టినప్పటికీ లొంగక, రాజుగారికి విశ్వాసపాత్రంగా మిగిలి ఆయన జమీందారి నిలబెట్టుకోవడానికి కారణమవుతాడు.
అందువలన రామశాస్త్రికి కోటలో, ఊర్లో మంచి పలుకుబడి, గౌరవం వుంటాయి. ఆయన కొడుకు సోమేశ్వరం. 
ప్రస్తుత జమీందారుగారి హయాం వచ్చాక, ఆయన తన దగ్గర పాతిక రూపాయల ఉద్యోగస్తుడయిన సోమేశ్వరాన్ని సంఘసంస్కారాభిలాషతో ఒక హరిజన బాలికని వివాహం చేసుకోమంటాడు. లేదా కనీసం విధవా వివాహం చేసుకోమంటాడు.
 
సోమేశ్వరం ఆ రెండిటికీ తలవొగ్గక పోవడం, చివరికి రజస్వలానంతర వివాహమైనా చేసుకోకపోవడం జమీందారుగారికి కోపం తెప్పిస్తాయి. ఆయనకీ, సోమేశ్వరానికీ చెడిపోతుంది. సోమేశ్వరం సంసారం చిక్కుల్లో పడుతుంది. ఆ చిక్కులతోనే చెల్లెలు నిరంజనాన్ని ఒక రెండో పెళ్ళి వాడికి యిస్తాడు.
నిరంజనానికి అపుడపుడూ వెంకటేశ్వర స్వామి పూనుతూ ఉంటాడు. దాన్ని కూడా చాలా చమత్కారంగా వ్రాస్తారు రచయిత.
 
అలాగే నీలకంఠ శాస్త్రి కొడుకు పదేళ్ళ పిల్లవాడు స్వామి కూడా కొంత పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటాడు. తండ్రి కొత్త గురువుగారి మాటలు విని బాలయంత్రాన్ని ఎవరికో ఇచ్చేద్దామని బయల్దేరినపుడు చాలా గొడవ చేస్తాడు. గురువుగారిని లాగి చెంపకాయ కొడతాడు కూడా.
ఈ గురువుగారి బోధనల గురించీ, ఆయన మతం లోని పద్ధతుల గురించీ కూడా చమత్కారాలు వుంటాయి. ఒకనాడు ఆయన సమాధిలోకి వెళ్తాడు. ఆరోజు ఇంటికప్పు లేచి పోయేట్లుగా భజనలు జరుగుతాయి. కొబ్బరికాయలు కొట్టడం వాళ్ళ మతంలో అలవాటు లేదు. మన దేశంలో అనాదిగా వుండే మతం ఒకటి ఉందిగా. ఆ మతంలో నుంచి అప్పు తెచ్చుకుని, పది కొబ్బరికాయలు కొట్టారు. గురువుకి స్మృతి వచ్చింది. ఆ రోజున గురువు ఏది చెప్పితే ఎవళ్ళు చెయ్యరు!” – ఇలా వుంటుంది వర్ణన.
నిరంజనానికి ఒక కూతురు పుట్టడం, భర్త ఏదో అనారోగ్యంతో చనిపోగా ఆమె మళ్ళీ పుట్టిల్లు చేరడం. నిరంజనం కూతురు వినీల కోటలోకి వచ్చి పెద్ద రాణి గారితోనూ, చిన్నరాణి గారితోనూ అంటే రాజావారి తల్లి, భార్యలతో కబుర్లు చెప్పి పోతూ వుండడం. విదేశీ పద్ధతులతో పెరిగే రాజావారి కూతురు భూదేవి వినీలని చూసి చిరాకు పడుతూ వుండడం. అలాగే శిలారు అనే మహమ్మదీయుడు రాజాగారి కోటలో పని చేసే ఒక మూగవాడు, అతడికీ ఈ చిన్నపిల్ల వినీలకీ మధ్య స్నేహం, వాళ్ళ కబుర్లు, కథలు.. ఇలాంటివి కొన్ని అయ్యాక రెండు సంఘటనలు.
ఒకటి, రాజాగారు కోటలో బావి తవ్విస్తే, విపరీతంగా జల వూరి కోటని ముంచేసే ప్రమాదం రావడం, అప్పుడు వైదిక మతాన్ని అందులోని విషయాలనీ ఒప్పుకోని రాజాగారు గత్యంతరం లేని పరిస్థితులలో జపాలు చేయించడానికి ఒప్పుకోవడం, అ సందర్భంలో సోమేశ్వరం మంత్రశక్తి ని గురించి చేసే కొన్ని వివరణలూ, అలాగే తల్లి, భార్యల బలవంతం మీద రాజాగారు వేంకటేశ్వర స్వామికి మొక్కుకోవడం, ఆ తర్వాత జల కట్టడం ఇదంతా ఒక అధ్యాయం.
ఇంకొకటి రాజాగారి కూతురు భూదేవి పెళ్ళి.. దానిని పల్లెలో కాక పట్నంలో చేయడం.. పల్లెలో ఆనవాయితీగా ప్రతి యింటికీ యివ్వవలసిన మామూళ్ళన్నిటినీ దండగ ఖర్చు గా భావించి మానేయడం.. అయితే అంతకు మించిన డబ్బుని పెళ్ళిలో కొత్త పద్ధతులలో ఖర్చుపెట్టడం.. వాటి గురించి కొంత విమర్శ చేస్తారు విశ్వనాథ. పల్లెలో వున్నవాళ్ళు రాజావారి నుంచి అలా ఆశించడం ఇప్పుడు లేకితనంగా కనిపించవచ్చు. అయితే ఇప్పుడు లేకితనం అనిపించుకుంటున్న ఆ గుణం పూర్వకాలంలో గొప్పగుణం అనీ, ప్రభుభక్తి అనీ అంటారు. అది అదిగా లేకపోతే
 యిది యిదిగా వుండదు.అని చెప్తారు. ఇంకొక సత్యం కూడా చెప్తారు జమీందారుగారు కుడా వాళ్ళ మామూలు ఆచారాలు గడిపేటప్పుడు వాళ్ళ వల్ల డబ్బు ఖర్చయ్యేటట్లు, యివన్నీ దురాచారాలనుకుంటాడు గానీ, వాళ్ళ వల్ల తనకు దమ్మిడీ ఖర్చు కాకుండా వాళ్ళు తన యందు ప్రభుభక్తి చూపించాలనే అనుకుంటాడు.మొత్తం మీద పెళ్ళి ఘనంగా జరుగుతుంది కానీ పల్లె వారందరినీ బాధపెడుతుంది. కొంతమందికి అవమానమూ జరుగుతుంది.
అలాగే మరొక ప్రక్కన నీలకంఠశాస్త్రి కూడా కొడుకు ఆరోగ్యం బాగుపడేందుకు సోమేశ్వరాన్ని సలహా అడిగి జపాలు చేయించడం.. అతడి అరోగ్యం కుదుటపడడం జరుగుతాయి. 
ముందే చెప్పినట్లు యిలాంటి కొన్ని సంఘటనలు, చర్చలు తప్ప పెద్ద కథేమీ వుండదు ఈ నవలలో. 
ఈ సంఘటనలూ, చర్చలూ మనం శ్రద్ధగా చదువుతుంటే ఉన్నట్లుండి కొత్త అధ్యాయం మొదలు పెట్టి కథ గురించీ శిల్పం గురించీ గంభీరంగా ఒక ఉపన్యాసం చెప్తారు విశ్వనాథ. ఆ తర్వాత ఒక ఉదాహరణ చెప్తారు. ఆడవాళ్ళు ఏదైనా నగ కొంచెం విరిగిపోతే, అదే సమయంలో ఏ పెళ్ళికో వెళ్ళాల్సి వస్తే దానికో దారం కట్టి పని కానిచ్చేస్తారట. అలా అతుకు పెట్టినా చూసేవాళ్ళకి అది నగలాగే కనిపిస్తుందట. ఈ రెండిటి గురించీ ఒక పేజీన్నర వివరించి ఆ తర్వాత యిలా అంటారు విశ్వనాథ. ఒక పుస్తకం అతుకులుగా వుంటుంది. ఛీ! యిల్లా వుందేమిటి అంటే అది అంతేనని మనవి.
తాడు పెట్టి అతికిన నగను గురించి చెప్పాం గదూ!
మనం ఆ చమత్కారానికి చిన్నగా నవ్వుకుంటూ వుంటే ఆ తర్వాతి వాక్యాలు యిలా వుంటాయి.
ఇంతకూ యిదంతా ఎందుకంటే, ఇది చివరి అధ్యాయం. వెనక అధ్యాయంలోనే ఎన్ని ఎడాలున్నయ్యో, ఏమి పొసగింపులున్నయ్యో కవికే తెలియకుండా వుంది. అయినా ఇందులో ఒక సామరస్యం వుంది. కవి అప్పుడప్పుడు వ్రాస్తున్నాడు. పాఠకుడు అప్పుడప్పుడు చదువుతున్నాడు. అంతా వేసి ఒక పుస్తకంగా వేసినప్పుడు మరి కొంత బాధ వుంటుంది గదా అనవచ్చు. అప్పుడైనా ఒక్కసారే చదవకుండా వుంటే సరి. ఇది ఒక ఉపాయం అనుకోండి.
అదీ ఆయన మనకిచ్చే సలహా.
 
అయినా మనం కొంచెం అసంతృప్తిగా మొహం పెడతాం కదా! కథ అయిపోయినట్లుగా లేదండీ అంటాం కదా అందుకని నీలకంఠశాస్త్రి కొడుక్కీ, వినీలకీ పెళ్ళయ్యింది అని చెప్పి అదే ముగింపు అంటారు. 
నవలలో ఆసక్తికరంగా అనిపించిన కొన్ని విషయాలు, ఆలోచింప జేసే కొన్ని వాక్యాలు:
తమ యింటికి వచ్చి పోతుండే చిన్న పిల్ల నిరంజనానికి సోమేశ్వరం రెండోపెళ్ళి సంబంధం చేస్తున్నాడన్న విషయం విని రాజావారు ఆ వివరాల గురించి ఆరా తీస్తే. వాళ్ళు పెళ్ళికొడుకు వయసు ముప్పై పైన అనీ, చదువు సంధ్యలు లేవనీ, మొదటి సంబంధనికొక కొడుకున్నాడనీ యిలాంటి వివరాలు చెప్తూ అతని కున్న ఆస్తిపాస్తుల గురించి కూడా చెప్తారు. ఆ జాబితా యిలా వుంటుంది. “.. ఒక ఇల్లుంది. ఎనిమిదెకరాల మాగాణి వుంది. మొదటి భార్య నగలున్నై ఏడెనిమిది వందల రూపాయలవి. ఓ పట్టుచీర, రెండు దాపుడు చీరలు వున్నవి.
ఈ సందర్భంగా మనుషులలో కనబడే ఆర్ద్రత గురించి కొన్ని పరిశీలనాత్మకమైన వ్యాఖ్యలు చేస్తారు విశ్వనాథ.

మనిషన్న తర్వాత ఎప్పుడో ఒకప్పుడు మనస్సు మెత్తబడకుండా ఉండదనీ, మరీ రాక్షసుడైతే శృంగార విషయం లోనైనా మెత్తబడుతుందనీ అంటారు. అయితే మనుష్యులెంత మంది వున్నారో, ఈ సృష్టి లో పరిస్థితులెన్ని వున్నాయో ఆ ఆర్ద్రతలలో అన్ని భేదాలున్నాయంటారు.
రాజాగారి మనసు ఒక్క క్షణం కొంత కరిగినట్లే కరిగి మళ్ళీ ఆ ఆర్ద్రత వాక్కు రూపం లోకి, క్రియారూపం లోకి రాకుండా మాయమయిపోవడం గురించి చక్కటి పోలికలతో చెప్తారు.
·       రాజాగారి దగ్గర వుండే రంగారాజయ్య అనే గుమాస్తాని మనకి ఇలా పరిచయం చేస్తారు విశ్వనాథ.
రాజాగారికి రాణిగారంటే ఎక్కువ యిష్టమా! రంగరాజయ్య అంటే ఎక్కువ యిష్టమా అని ప్రశ్న వేస్తే రాణిగారంటే యిష్టము, గౌరవం. రంగరాజయ్య అంటే ప్రేమ. రంగారాజయ్య బ్రాహ్మణులలో ఒకడు.... అతనొక వేటకుక్క. ... జాగిలం కూడా అట్లా వేటాడ లేదు. పులి అయినా సరే పిక్క పట్టుకున్నాడంటే ఎంత విదిలించుకున్నా వీడి పట్టు వదలడు. రాజాగారు రావాలి. వేటను వెయ్యాలి.
... రాజాగారికి వడ్డీ వర్తకం, తాకట్టు పెట్టుకోవడం వుంది. ఆ కాగితాలన్నీ వ్రాసేది రంగారాజయ్య. అతనొక తాకట్టు కాగితం వ్రాస్తే దానిలో పెట్టే షరతులకి ఆ కుటుంబం కుటుంబం ఆర్చుక పోవలసిందే!...
ఈ రకంగా వివరిస్తారు. సరే, అందులో పెద్ద విశేషం లేదు. కానీ ఇదంతా యిలా చాలా చెప్పి, ఆ తర్వాత చివరికి మళ్ళీ మనల్ని అడుగుతారు. ఇక చెప్పండి! రాణీ గారంటే యిష్టమా! రంగారాజయ్య అంటే యిష్టమా!అని.

·        సోమేశ్వరం పాత్ర ద్వారా కొన్ని ఆలోచింప చేసే మాటలు చెప్పిస్తారు. 
కర్మకాండ పెరిగిందంటారు. ఎందుకు పెరగదు? పెరగటం అనేది మనుష్య సహజం. ఒక చిన్న ఉపన్యాసం ఏర్పాటు చేశారనుకోటానికి కార్యదర్శి లేచి నేను ఫలానా వారిని అధ్యక్షుడిగా ఎన్నుకొనుచున్నానుఅని చెప్పటం, అధ్యక్షుడు కూర్చోటం, ప్రార్థనా, అయన తొలిపలుకు, తర్వాత ఉపన్యాసకుడు మాట్లాడటం, అధ్యక్షుని తుది పలుకు, తర్వాత కార్యదర్శి వందనములు ఇదంతా ఏమైంది? ఒక కార్యక్రమంగా నడవలేదా ? స్థూలంగా చూస్తే కర్మ కాండా యిలాంటిదే”.

మంత్ర శక్తి గురించి : సామాన్యపు మాటలకు ఈ శక్తి వుండగా, మంత్రాలకు ఎందుకు వుండదు? అవి మహర్షులు చెప్పిన మాటలు. అవి గొప్పా? అని ప్రశ్న వేస్తారు. గొప్పే. ఒకడు చెప్పిన మాటకన్న యింకొకడు చెప్పిన మాట గొప్ప కాదా? సేవకుడు తానే చెప్పిన మాట కన్న దొరగారు యిలా చెప్పారు అన్న మాటకు విలువ ఎక్కువ. అసత్పురుషుడు చెప్పిన మాట కన్నా, సత్పురుషుడు చెప్పిన మాటకు విలువ ఎక్కువ. అల్లాగా ఆ సత్పురుషులందరిలో సత్పురుషులయిన మహర్షులు చెప్పిన మాటలకెక్కువ శక్తి వుంటుంది. వారి వట్టి మాటలకన్నా వారి మంత్రాలకు ఎక్కువ శక్తి వుండాలి. ఇది సామాన్య తర్కం
దానికది నమ్మి తక్కినవాటి జోలికి పోకుండా వుండటం మధ్యముడు చేస్తాడు. ఉత్తముడు దీనిని బట్టి యితరములైనవి కూడా ఆలోచిస్తాడు.... మార్కోని రేడియో ఎలా కనిపెట్టాడు? స్వరశబ్దము వాయువీధులలో ప్రసరిస్తూ ఉంటుందనే కదా!.... అలాగే మంత్రాక్షరాలు గాలిలో ప్రసరిస్తాయి. వాని పని అవి చేస్తాయి. చేయవు అనడానికి మనుష్యుడికి ఊహాశక్తి లేకుండా వుండాలి. ఆ ఊహాశక్తి లేకపోవటమే నాస్తికత్వం అంటారు. నాస్తికత్వం అంటే ఊహాశక్తి లేకపోవడం. సరియైన పద్దతిగా విచారణ చేయకపోవడం

·       నాటకం వాడికి రూపాయి ఇచ్చి టికెట్టు కొంటే వాడు సంతోషిస్తాడా? దానం అనుకుంటాడా? ఇవన్నీ నీ సంతోషం కోసం చేసే పనులు. నీ వనుభవించే ఆ సంతోషం ఒక దర్జా కోసం, ఒక ఠీవి కోసం, ఒక బడాయి కోసం కలిగే సంతోషం. ఈ డబ్బు పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళ మనసు ఎలా ఉంటుంది? వాళ్ళ మనసంతా ద్రవీభూతం అవుతుంది. వాని సంసార పరిస్థితి ఎట్లంటిది అంటే వాడికి నీవిచ్చిన నాలుగు రూపాయలకు వాడి వళ్ళు కోసి ఇచ్చినా నీ యందలి కృతజ్ఞత తీర్చుకోలేనేమో అనిపించేది. అప్పుడు వాడి మనసులో కలిగే ఆర్ద్రత లౌకికమైనది కాదు. నీకు ప్రత్యుపకారం చేద్దాం అనేది కాదు. ఇది ఐహికమైనది కాదు. ఆధ్యాత్మికమైనది. నీవు ఉద్యోగస్తులకి డబ్బిస్తే వాళ్ళు నీకు ఐహికంగా యెట్లా ఉపయోగపడతారో ఆ ఉపయోగాన్ని ఎలా వాంఛిస్తావో అల్లా అధ్యాత్మికమైనది ఒకటి ఉంది అని నీవు విశ్వసించి దాన్ని వాంఛిస్తే ఈ పేదవాళ్ళకు ఆ డబ్బు ఇస్తావు
·       వాంఛ అనేది రెండు రకాలుగా వుంటుంది. ఒకటి మనోదఘ్నమై వుంటుంది. అంటే ఆ వాంఛ మనస్సుకు తెలుస్తుంది. రెండవది హృదయం లోనే వుంటుంది. ఏ భావమైనా మనస్సు దాకా వస్తే కాని మనుష్యుడు తెలుసుకోలేడు. హృదయం లో నెత్తురులో సంస్కార రూపంగా మనుష్యుడికి అనేక భావాలు ఉంటవి. ఆ సంస్కారాలకు బలం తక్కువైతే ఆ వారడిబలం మనస్సుకు వుంటే మనస్సు వాటిని చంపేస్తుంది. ఆ వారడిబలం మనస్సుకు వుండటం అంటే మనం ఒక చదువు చదివి, చుట్టూ వున్న పరిస్థితుల చేత కొన్ని భావాలకు ప్రాబల్యం మనస్సుకు పట్టించుకోవడం. యిల్లా జీవితం తప్పు త్రోవల పోతుంది. 
·       ఇదిగో చూడండి ఒకటి ఐహికం; రెండు ఆముష్మికం. ఈ రెండు చెరి సగంగా మానవుడిలో ఉంటుంది. పూర్వ సంఘ వ్యవస్థ ఐహికానికి జీవయాత్రకు కావలసిన వెల కట్టి ఆముష్మికానికి ఎక్కువ వెల కట్టింది. ఇప్పటి సంఘం ఆముష్మికం లేనే లేదంటోంది. ఆముష్మికం అనేది ఎక్కడో ఉందనుకోటంలో ఉంది. పైన చెప్పిన ఉద్యోగస్తుల యొక్కయు పేదవాళ్ళ యొక్కయు తృప్తి లక్షణం విచారిస్తే ఆముష్మికం ఈ సృష్టిలోనే, ఈ మానవులలోనే ఉంది అని తెలుస్తుంది. ఆ అముష్మికానికి గంత బొంత తొడిగి పసుపు పెట్టి, కుంకుమ పెట్టి, దానిని దేవుడని, క్షేత్రాలని, వ్రతాలని, చేసారు. అట్టా చేయకపోతే నీవు దాని వంక చూడవని. ఈ ఐహికం కన్నా ఆ ఆముష్మికం ఎంతో బలమైనది. ఐహికం యొక్క బలం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. నీవు ఉద్యోగస్తుడికి నిజంగా ఇచ్చేది లంచం. ఆ లంచానికి మర్యాదా చొక్కా వేసి ఇస్తావు. పేదవాడికి ఇచ్చేది దానం. దానికి మర్యాదా చొక్కా లేదు. దయ అనేది నీ గుండెలో పుట్టాలి. పుడితే ఏది దైవం అని అంటున్నామో ఆ ఆముష్మికానికి సంబంధించిన బతుకు బతుకుతావు. ఉద్యోగస్తుడికి లంచం ఇవ్వవు. ప్రత్యక్షంగా నీ పని పాడవుతుంది. వాడికి నువ్విచ్చే లంచం; వాడు నీకు చేసే ఉపకారం, దాని వల్ల నీ ఆస్తిపాస్తులు సురక్షితంగా ఉండటం ఇది ఒక లోకం. పేద వాడికి నీవిచ్చే దానం వాడు పొందే తృప్తి. ఆ తృప్తి వల్ల వాడు నీకు మేలు కలుగవలెనని కోరటం, దాని వల్ల ఈ దయాలోకాలలో కలిగే సంచలనం. ఆ సంచలనం నీకు ఈ దానానికి ప్రతి ఫలంగా ఏదో చెప్పరాని ఒక సుఖ హేతువుగా ప్రకాశించటం. ఇదంతా ఒక లోకం. ఉద్యోగస్తుడికి డబ్బు ఇవ్వవు. వాడు నీకు అపకారం చేస్తాడు. పేదవాళ్ళయందు దయ చూపించవు. దానికి నీకపకారం జరుగుతుంది. నీకప్పుడూ అపకారం, ఇప్పుడూఅపకారం జరుగుతుంది. ఆ అపకారం ఎవడో చేసినట్టు కనిపిస్తుంది, తెలుస్తుంది. ఈ అపకారం చేసినవాడు కనిపించడు. ఇది దాని ఫలితమని తెలియదు
·       నవల చివర్లో నీలకంఠశాస్త్రి గురించి చెప్తూ రచయిత ఇలా అంటారు.
నీలకంఠశాస్త్రి గారికి దివాన్గిరీ పోయింది. పాపం ఆర్ధికంగా అతను యిబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ కొత్త మతాలన్నీ డబ్బున్నంత వరకూ సాగే మతాలు అని తోచింది. అవి ఏవో ఈనాటి కాలేజీ చదువులు. ఈనాటి సంఘ మర్యాదలు వంటివి.
వాటికి జీవితంలో ఒక ఫాయా కావాలి. ఆ ఫాయా నిలబెట్టేందుకు తగిన డబ్బుండాలి. అవి అతని దగ్గరే లేకపోయినయి. దానితో రామా కృష్ణా అనుకోటం తప్పింది కాదు. 
నీవెంతైనా భగవంతుడు లేడూ అను. వాడు లేడు అనటానికి కారణం ఇంకేదో ఉన్న బలం. ఆ ఏదో వీటిలో ఏదైనా కావచ్చు. ఒకటి ధనం రెండు సంఘ బలం. ఇవి రెండు చాలా ప్రధానం. ఈ రెంటిలో ఏదీ లేకపోతే అప్పుడు దేవుడున్నాడు



*****

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సతీసుమతి

తారకము

సంక్లిష్టమైన కథలు