నేటి కథాసాహిత్యంలో మానవసంబంధాలు
“మానవసంబంధాలు” అనే అంశం ఎంత పాతదో అంత కొత్తది. ఎంత కొత్తదో
అంత పాతది. మనుషుల మధ్య అపార్థాల చుట్టూ
అల్లబడే కథలు, ఒకరి యిష్టాయిష్టాలనీ అవసరాలనీ మరొకరు అర్థంచేసుకోకపోవడంలోని ఆవేదనని వ్యక్తం
చేసే కథలు మనము చాలాకాలం నుండి చదువుతున్నాము. ఈనాడు కూడా ఎక్కువగానే గమనిస్తున్నాము. అయితే గతంలో
ఈకథావస్తువు నిర్వహించబడిన విధానానికీ ప్రస్తుతం ఇది నిర్వహించబడుతున్న విధానానికీ
ఒక స్పష్టమైన తేడాని మనం గమనించవచ్చు.
ఇదివరలో మనం గొప్పవిగా
చెప్పుకునే చాలా కథలలో పాత్రలు అవతలివారిని అర్థంచేసుకునేందుకు ప్రయత్నిస్తూ వుండేవి.
లేదా తమని తాము అర్థంచేసుకునే దారిలో ప్రయాణిస్తూ వుండేవి. వర్తమానసాహిత్యంలో
మాత్రం ఎక్కువ భాగం కథలలో పాత్రలు “మమ్మల్నెవరూ అర్థం చేసుకోవడంలేదు” అని ఆక్రోశిస్తూ వుంటున్నాయి.
పాత్రచిత్రణలో రచయిత దృక్కోణం
ప్రధానపాత్ర వహిస్తుంది. రచయిత సమాజంలో తాను చూస్తున్న వ్యక్తులలోని ఏ లక్షణాలని
ప్రముఖంగా గమనిస్తున్నాడు? వేటిని తనపాత్రలలో ప్రముఖంగా చిత్రించేందుకు
ప్రయత్నిస్తున్నాడు? అన్న విషయం కథకి చాలా ముఖ్యం.
అలాగే కథలో చర్చింపబడుతున్న సమస్య యొక్క మూలకారణాన్ని స్పష్టంగా అర్థంచేసుకోవడం, దానిని సమర్ధవంతంగా కథలో చొప్పించడం కూడా కథయొక్క విజయానికి కీలకం. సమస్యని విశ్లేషించడంలో రచయితల వైఫల్యం ఒక్కొక్కసారి రచయితల మంచి ఉద్దేశ్యాన్ని – ఉదాహరణకు మానవసంబంధాల మెరుగుదలకు తోడ్పడాలనే
ఉద్దేశ్యాన్ని - భగ్నం చేసి కథని వ్యతిరేకదిశలో నడిపిస్తుంది. ఇది వర్తమాన
సాహిత్యంలో చాలా కథలలో కనిపిస్తోంది.
ఈ మధ్య వచ్చిన ఒక పుస్తకంలో ఒకే
కథాంశాన్ని ఇద్దరు రచయితలు వేరువేరు కథలుగా వ్రాయడం జరిగింది.
ఆపుస్తకం చదివినపుడు రచయితల దృక్కోణంలోని
వ్యత్యాసం కథపై పాత్రచిత్రణపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో మనకి చాలా
స్పష్టంగా గోచరిస్తుంది.
ఉదాహరణకి ఒక కథలో ఉన్నతోద్యోగి అయిన కథకుడు తనదగ్గర పనిచేసే మల్లి అనే అమ్మాయిని
గురించి పాఠకులతో చెప్తూ ఉంటాడు. బాధ్యత
తెలియని భర్తతో ఆమె పడే కష్టాలకు సానుభూతి చూపుతూ, తనకు చేతనైన సహాయం చేస్తూ ఆ అమ్మాయి పట్ల ఒక
వాత్సల్యాన్ని కలిగి ఉంటాడు. అయితే అలాంటి భర్తని ఆమె ఎందుకు వదిలేయదో ఎందుకు
ప్రేమిస్తూనే ఉంటుందో మాత్రం అతనికి అర్థంకాదు. కొన్నాళ్ళకి అతను ఆ వూరు వదిలి వెళ్ళిపోతాడు. ఒకపక్క
కాయకష్టం చేసుకుని పిల్లల్ని పెంచుకుంటూ ఆర్ధికంగా కష్టాలు పడుతూ కూడా మాటిమాటికీ
తనని వదిలేసి వెళ్ళిపోతూ వుండే భర్తమీద ప్రేమే కానీ ద్వేషం చూపని మల్లి స్వభావం అతనికి అంతుబట్టదు. ఒకరోజు అతను తాను ప్రస్తుతం
వున్న ఊర్లో ఆమె భర్తని చూస్తాడు. భర్త కోసం బెంగ పడిన ఆమెకి భర్త ఆచూకీని ఉత్తరం ద్వారా తెలియచేద్దామనుకుంటాడు. కానీ
మళ్ళీ కొంత ఆలోచించి అందువలన ఆమెకి కష్టమే
కానీ సుఖం లేదనుకుని ఆ ఉత్తరాన్ని చింపేస్తాడు. అదే కథకి ముగింపు.
ఇక్కడ కథారచయిత ఉద్దేశ్యం గొప్ప
మానవసంబంధాలని నిలబెట్టడమే కావచ్చు. ఒక కష్టజీవి అయిన స్త్రీపట్ల కథకుడికి వున్న
సానుభూతినీ వాత్సల్యాన్నీ రచయిత బాగానే చూపి ఉండవచ్చు. అయితే ఆమె వ్యక్తిత్వాన్ని
మాత్రం ఆయన సరిగా పట్టుకోలేక
పోయారనిపిస్తుంది. ఈ కథలోని స్త్రీ పాత్రకి ఉన్నదీ కథకుడికి అర్థంకానిదీ నిజానికి ఒక విశిష్టత.
ఆరోగ్యకరమైన కుటుంబాలకీ మానవసంబంధాలకీ అవసరమైన యోగ్యత. ఒకప్పుడు సాహిత్యంలో
ఆదర్శంగా చెప్పబడిన ఆలక్షణం నేడు సమాజంలోనూ సాహిత్యంలోనూ కూడా అంతుబట్టని అవలక్షణం
అయింది. నేటి సాహిత్యంలో అది “సమర్థత”గా
కాక “బలహీనత”గా చూడబడుతోంది.
అయితే దీనికి అనుబంధంగా కథ
వ్రాసిన రెండవ రచయిత మాత్రం దీనిని మరొక దృక్కోణంలో నుంచి చూశారు. దానివలన కథ ముగింపు
మారింది. రెండవ కథలో కథకుడు ఇలా అనుకుంటాడు. – “....భార్యాభర్తల బంధం
తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారవుతున్న ఈరోజుల్లో మల్లీశ్వరి భర్త బాధ్యతారాహిత్యం
ఆమెకంటే నన్నెందుకు కలవరపెట్టాలి?.. బాగా ఆలోచిస్తే ఆమెది కేవలం ఓర్పు మాత్రమే
కాదనిపిస్తున్నది. ... అది ప్రేమ కూడా కాదు. ... అంతకంటే గొప్పదేదో అనవచ్చు. దానికి
అడ్డు తగలడానికి నేనెవరిని?...” ఈరకంగా ఆలోచించి ఆయన మల్లీశ్వరికి భర్త ఆచూకీ తెలియచేస్తూ ఉత్తరం వ్రాయడంతో కథ ముగుస్తుంది.
మంచి మానవసంబంధాలు
పెంపొందించుకోవడానికి కావలసిన లక్షణాలు కొన్ని వున్నాయి. వివేకం, సహనం, విలువలూ నియమాలతో కూడిన ప్రవర్తన, మనోనిగ్రహం,
స్వార్థరాహిత్యం, త్యాగశీలత మొదలైనవి. ఇవన్నీ కూడా మంచి మానవసంబంధాలకు అవసరమైనవి.
అయితే ఈలక్షణాలన్నిటినీ కూడా నిరుపయోగమైనవిగా, చేతకానివారి లక్షణాలుగా భావించే
భావజాలమూ దృక్కోణమూ వున్నపుడు,
“పతివ్రతలు” “మునీశ్వరుడు” వంటి పదాలను వ్యంగ్యంగా మాత్రమే పలికే అలవాటు
వున్నపుడు సమస్య యొక్క అసలు స్వరూపమూ అర్థంకాదు. పరిష్కారమూ అందదు. ఆకోవలో వచ్చే
కథలే వర్తమాన సాహిత్యంలో అధికశాతాన్ని ఆక్రమిస్తున్నాయి.
అంతేకాదు. ఏ సమస్య అయినా పైపైన చూసినపుడు ఒకరకంగా
కనిపిస్తుంది. చాలా సందర్భాలలో మానవసంబంధాలు దెబ్బతినడానికి భావోద్వేగాలతో కూడిన ఈ
పైపై చూపే కారణమవుతుంది. అనేకములైన అపార్థాలకు అది దారి తీస్తుంది. కొంచెం లోతుగా
విశ్లేషించి చూసినపుడు మాత్రమే ఆఅపార్థాలు
తొలగిపోయే అవకాశం వుంటుంది. సాహిత్యం
చేయవలసిన పని అదే.
అయితే వర్తమాన సాహిత్యంలోని చాలా కథలలో అటువంటి
సమగ్రమైన విశ్లేషణ కూడా లోపిస్తోంది.
ఈమధ్యనే ప్రచురించబడిన విముక్త అనే ఒక కథలో
కథకురాలు పక్కింట్లోని మామ్మగారిని గమనిస్తూ
వుంటుంది. మామ్మగారికి ఎనభై ఏళ్ళు. ఆమె
కొడుక్కే అరవై ఏళ్ళు. ఆయన చాలాపేరున్న
సమర్థుడైన సర్జన్. ఆయన గురించి చెప్తూ “ఆయన తల్లిని చూసుకోవడం తన
బాధ్యతగా స్వీకరించినా, అది విధి నిర్వహణ లాగే చేస్తారు గాని అందులో ప్రేమా, ఆప్యాయత కనపడనివ్వరు.” అంటుంది కథకురాలు. ఆయన తల్లిని “ఎనభై
ఏళ్ళొచ్చి చిన్నపిల్లలా ఈ మెట్లు ఎక్కుతూ, దిగుతూ
తిరగద్దని లక్ష సార్లు చెప్పాను... వింటుందా?” అంటూ
కసురుకోవడం వంటి సంఘటనలు ఉంటాయి కథలో.
కొడుకు మనసుకు అనుగుణంగా
నడుచుకోలేకపోవడం వల్లనే తనకు కూడా
మనసుండటం వల్లనే ఇబ్బంది వస్తోందని అంటారు
మామ్మగారు ఒకసారి “నిష్టూరంగా”. తనకి తిండికీ బట్టకీ లోటు చెయ్యరనీ వేళకింత
తిని కృష్ణా రామా అనుకుంటూ పడి ఉంటే వాళ్లకి బావుంటుందనీ చెప్పి “కానీ అలా మాటా మంతీ లేకుండా బొమ్మలా ఎంత సేపని ఉండను? ఏ విషయంలోనూ
ఆసక్తీ , కుతూహలం
లేకుండా ఎలా బతకడం?”అంటారు
“అక్కసుగా.”
కథ చివర్లో మామ్మగారు మరణిస్తారు. ఆవిడ ఇచ్ఛామరణాన్ని స్వీకరించారన్నట్లూ ఆరోజు తాను చనిపోతానని ఆవిడకి
ముందే తెలుసునన్నట్లూ కథలో సూచన వుంటుంది.
చనిపోవడానికి ముందు ఒక పుస్తకంలో ఆమె వ్రాసుకున్న వాక్యాలిలా
వుంటాయి. “వాడేమి పసివాడా, అమ్మ కనపడక పొతే బెంగ పడడానికి?
వాడి గురించి నాకింత వ్యాకులత అవసరమా? బంగా
వయసులో అయితే వదిలి వెళ్ళరాదు. ఎప్పుడైతే తల్లి కోసం పిల్లవాడు బెంగపడడని ఖరారుగా
తెలుస్తుందో అప్పుడు ఆతల్లి తన బిడ్డని, తన పాశం నుంచి
విముక్తుడిని చెయ్యాలి. అతడినే పట్టుకు వేళ్ళాడుతూ వెనక్కి లాగరాదు. నేను పోతే
ఇతడెట్లా బతుకుతాడు అనేంతగా ఒక ఎదిగిన బిడ్డ, తల్లి పట్ల ప్రేమ కలిగి ఉంటే, అది ఆ తల్లి
ఇహ పరాలకి మంచిది గాదు. సంతానం, తల్లి పట్ల అమితమైన ప్రేమ కలిగి ఉంటే, ఆ తల్లి
ముక్తిని పొందడమెలా?”
మరణానికి ముందరి మామ్మగారి
రూపాన్ని గురించి చెప్తూ కథకురాలు “ఆఖరి రోజే కాదు అంతకు నాలుగు రోజుల ముందు
నించీ,
కారణం ఏమిటో గాని ఆవిడ చాలా స్థిమితంగా, తేటనీటి కొలనులా అనిపించారు. నీరెండలో కమలంలా వెలుగుతూ
కనిపించారు.” అంటారు.
ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే ఎనభైఏళ్ళు వచ్చాయి కనుక కృష్ణా రామా అంటూ
కూర్చోవలసి రావడం అలా తను కూర్చోవాలని
కొడుకు భావించడం అసంతృప్తి చెందవలసిన విషయం కాదు. అన్యాయమని భావించవలసిన విషయం
కాదు. హుందాగా స్వీకరించవలసిన విషయం.
కథలో మామ్మగారు చివరి
నాలుగురోజులలో చూపిన పరిణతి, స్థిమితం, మాట్లాడటం తగ్గించి మౌనంలో వుండడం వంటి
లక్షణాలు నిజానికి మొదటినుండీ అలవరచుకోదగిన
విషయాలు. అది గ్రహించేటంత పరిణతి ఆపాత్రలో
వస్తే చాలు. ఆమెకి ప్రశాంతత చిక్కుతుంది. అందుకోసం ఆమె ఇచ్ఛామరణాన్ని
ఆశ్రయించవలసిన అవసరం లేదు. ఇచ్ఛామరణం అనేది తార్కికమూ కాదు తాత్వికమూ కాదు. మరీ ముఖ్యంగా అది అందరికీ
ఆచరణసాధ్యమూ కాదు.
నిజానికి కథ చివర్లో మామ్మగారు ప్రశాంతంగా
వున్నారని చెప్పినా కేవలం నాలుగురోజులలో ఆమె
అలా మారేందుకు కారణమైన ఆలోచననికానీ అవకాశాన్నీ కానీ కథ తెలియచేయదు. కథకి విముక్త అన్న
శీర్షిక ఉన్నప్పటికీ కథ ఆస్థితిని సాధించే
సూచనలేమీ ఇవ్వదు. మరణానికి ముందు మామ్మగారు వ్రాసుకున్న మాటలు కూడా నిష్టూరంగాను నిస్సహాయంగాను ధ్వనిస్తాయి తప్ప ఒక స్థిరచిత్తాన్ని
సాధించిన వారి మాటల్లా వుండవు. పాశవిముక్తి అంటే ‘వదిలి వెళ్ళిపోవడం’ అన్న అర్థాన్ని
ఇచ్చేలా వుంటాయి.
లౌకికమైన మానవసంబంధాలపరంగా చూసినా
తాత్వికంగా చూసినా మామ్మగారి బాధ సమర్థించవలసిన లక్షణం కాదు. సర్దిచెప్పవలసిన
లక్షణం. కథ ఆపని చేయకపోగా ఆవిషయాన్ని ఒక హృదయవిదారకమైన విషయంగా వర్ణించి చివరికి మరణాన్ని కోరుకోవడాన్ని ఆసమస్యకి
పరిష్కారంగా చూపుతుంది. ఇది ఇహానికీ పరానికీ
కూడా పనికిరాని పరిష్కారం.
ఈ విశ్లేషణ అన్న అంశం క్రిందే మరొక
కోణం కూడా చెప్పుకోవాలి. మానవసంబంధాలలోని వికృతాలను ప్రచారసాధనాలు ఒకేపనిగా
ఊదరగొట్టి చెప్తూనే వున్నాయి. ప్రియుడితో
కలిసి ఉండేందుకు కన్నబిడ్డలను చంపేసే తల్లులూ ఆస్తుల కోసం తల్లిదండ్రులని చంపేసే పిల్లలూ ఇలాంటి కథలన్నీ అనునిత్యం వింటూనే వుంటాం. అయితే
వాటిని ప్రతి ఒక్కరూ వారి వారి జీవితాలకు అన్వయించేసుకోకూడదు. ఎక్కడో ఎవరో ఒక భార్య భర్తని గొడ్డలితో నరికిందని తెలియగానే మనింటి
ఇల్లాలిని మనం అనుమానిస్తూ కూర్చోవడం ఆమెని చూసి భయపడడం వివేకం కాదు. అది
మానవసంబంధాలకి విఘాతం.
అయితే రచయితలు ఈ సూక్ష్మాన్ని
కూడా అర్థం చేసుకోకపోవడం తాము వార్తలలో విన్న
విషయాలన్నిటినీ కథలలో చొప్పించాలనే ఆరాటంతోనో తాజా అంశాలపై కథలు వ్రాయాలన్న
తపనతోనో ఇలాంటి భయాలను తమ కథలలోని పాత్రలకు ఆపాదించడం అదిగో పులి అంటే ఇదిగో తోక
అన్నట్లుగా కథలు వ్రాయడం వర్తమాన
సాహిత్యంలో గమనిస్తున్నాం.
ఈమధ్యనే వచ్చిన ఒక కథలో ఉన్నత
మధ్యతరగతి వర్గానికి చెందిన కుటుంబంలోని తండ్రి ఒక షాపింగ్ మాల్ దగ్గర చదువుకున్నవాళ్ళలా
కనిపించే కొందరు ఆడపిల్లలు వ్యభిచారానికి పాల్పడుతున్నారని గమనిస్తాడు. దానికి
ప్రస్తుతం సమాజంలో వున్న వస్తువ్యామోహమూ ప్రలోభాలే కారణమని విశ్లేషించుకుని అలాంటి
పరిస్థితుల్లోకి తనపిల్లలు కూడా
వెళ్తారేమోనని భయపడి భయపడతాడు.వాళ్ళని అలా కాకుండా ఆపేందుకు తాను కొంత సమయాన్ని
వాళ్ళతో గడపడం అవసరమని భావించి అందుకు అవకాశమివ్వదేమోననిపించే మంచి ఉద్యోగాన్ని
ఒదులుకుంటాడు. డబ్బులు తక్కువ వచ్చినా సమయం మిగిలే ఉద్యోగంలోనే కొనసాగాలని నిర్ణయించుకుంటాడు.
స్థూలంగా చూస్తే పిల్లలతో సమయం గడపాలనుకోవడం అందుకోసం సమయం మిగుల్చుకోవాలనుకోవడం
వంటి విషయాలు చెప్పిన ఈ కథ మంచి మానవసంబంధాలకు దోహదం చేసే కథగా కనిపిస్తుంది.
అయితే కాస్త సూక్ష్మంగా
ఆలోచిస్తే - ఎక్కడో ఏదో చూసి తన ఇంట్లో తన
కడుపున పుట్టిన పిల్లలు.. విజ్ఞులైన
తల్లీ, నాయనమ్మల సంరక్షణలో పెరుగుతున్న పిల్లలు అంతదూరం వెళ్ళిపోతారనీ అంత దారుణంగా
చెడిపోతారనీ భయపడడం కంగారుపడడం మానవసంబంధాలకు మేలు చేసే లక్షణాలు కావన్న విషయం అర్థమవుతుంది.
విశ్లేషణకి సంబంధించి మరొక అంశం
ఏమిటంటే... కొన్ని సందర్భాలలో రచయితలు సమస్యని
చూస్తున్నారు. కొంత లోతుగా విశ్లేషించే ప్రయత్నమూ చేస్తున్నారు. అయితే సమస్యకి
మూలకారణాన్ని పట్టుకోలేనపుడూ పట్టుకున్నా ఒప్పుకోలేనపుడూ ఆసమస్యని సమాజానికో వ్యవస్థకో ముడిపెట్టేస్తున్నారు. ఒక సమస్యకి ఒక వ్యవస్థ కారణం అని
చెప్పాలంటే ఆవ్యవస్థ గురించి మనకి పూర్తి
అవగాహన వుండాలి. దురదృష్టవశాత్తూ రచయితలు అలాంటి అవగాహన లేని సందర్భాలలో కూడా
అలాంటి పరిష్కారాలు చూపుతున్నారు. ఒక
సమస్య తమకి అంతుబట్టనపుడూ లేదా మనుషులు తమ
వ్యక్తిత్వాన్ని సరిదిద్దుకోవడం ద్వారా దానిని ఎదుర్కోవచ్చు అని చెప్పే
ధైర్యమూ ఉద్దేశ్యమూ లేనపుడూ ఆసమస్యని వ్యవస్థకి ముడిపెట్టి చేతులు దులుపుకుంటున్నారు.
ప్రస్తుతం అటువంటి పాపాల
భైరవుడు సాఫ్ట్వేర్ రంగం. సాఫ్ట్వేర్
ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని
కనకూడదనుకునే ఆడవాళ్ళూ, కన్నా పట్టించుకునే అవకాశం లేనివాళ్ళూ, పాలుత్రాగే
పసిపిల్లల్ని సైతం తమ అభ్యున్నతి కోసం దూరంగా పెట్టి వాళ్ళని అనారోగ్యానికి
గురిచేసే తల్లులూ... ఈరకమైన కథలు ఎన్నో వస్తున్నాయి. అవన్నీ కూడా సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి
పూర్తిగా అసంబద్ధమైన విషయాలనీ అసత్యాలనే వ్రాస్తున్నాయి.
దెబ్బతిన్న మానవసంబంధాలకి కారణం
వ్యక్తిత్వంలోని లోపాలు కాదనీ సాఫ్ట్వేర్ రంగమో ప్రపంచీకరణో మరొకటో మరొకటో అనీ చెప్పే కథలు – ఎంత కృతకమైన హాస్యాస్పదమైన
కల్పనలు చేస్తున్నాయంటే సమస్యకు మూలకారణాన్ని పట్టుకోవడంలో కథ విఫలమైందన్న
విషయాన్ని ఆకల్పనలలోని వైరుధ్యాలే స్పష్టంగా తెలియచేస్తున్నాయి.
నిజానికి ఇటువంటి కథలు మానవసంబంధాలకు
సంబంధించిన కథలుగా పేరుతెచ్చుకున్నప్పటికీ ఇవి మానవసంబంధాలకు ఒనగూర్చేదేమీ వుండదు.
మానవసంబంధాల పట్ల సమగ్రమైన
అవగాహన వున్న రచయితలు మంచి మానవసంబంధాలకి
అవసరమైనవిగా పైన చెప్పుకున్న విలువలని తమ
కథలలో తెలియచెప్తారు. అవి చేతకానితనానికి నిదర్శనాలు కావనీ బలహీనతలూ లోపాలూ కావనీ అవి
ఎంతో సాధనతో తప్ప అందుకోలేని అలవరచుకోలేని గొప్ప శక్తులు అనీ మనకి తెలియచేస్తారు.
వాటిని సాధించినపుడు మానవసంబంధాలలో వచ్చే అద్భుతమైన మార్పుని మన కళ్ళకి కడతారు. అదృష్టవశాత్తూ అటువంటి కథలు అరుదుగానే అయినా వస్తున్నాయి.
అనామకంగానే వుండవచ్చు కానీ అసలు కనిపిస్తున్నాయి.
*****
కామెంట్‌లు