విశ్వనాథ నవలలు – లౌకిక జ్ఞానము
‘సనాతన ధర్మ పరిరక్షణ’ విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలలోని ప్రధాన వస్తువుగా ఎక్కువమంది భావిస్తూ ఉంటారు. జీవుని వేదనలు, ఆధ్యాత్మిక విషయాలు వాటిలో అధికంగా ఉంటాయని ఇంకొందరు అనుకుంటూ వుంటారు. విస్తృతమైన వైవిధ్య భరితమైన పాత్రల సృజన, మనస్తత్వ చిత్రణ అయన రచనలలోని ప్రత్యేకతలుగా మరికొందరు చెప్తూ వుంటారు. వీటిలో మొదటిది చాలామందిచే తిరోగమన లక్షణంగా తిరస్కరించ దగిన విషయంగా పరిగణించబడే విషయం. రెండవది సాహిత్యాభిమానులలో కొందరికే ఆసక్తి కలిగించే అంశం. మూడవది మాత్రం బహుశా పలువురు విమర్శకులు ప్రశంసా పూర్వకంగా అంగీకరించే ఒక విశేషం.
నిజమే. ఆయన నవలలలో ఈ
విషయాలన్నీ వుంటాయి. అయితే వాటితో పాటుగా లౌకిక జీవనానికి సంబంధించిన వ్యాఖ్యలూ,
పరిశీలనలూ, పాఠాలూ కూడా కొల్లలుగా దొరుకుతాయి. వాటిలో కొన్నిటిని గమనించే
ప్రయత్నమే ఈ వ్యాసం.
విశ్వనాథ ఎక్కువగా
శాస్త్రం ఏమి చెప్పింది అన్న విషయాన్ని గూర్చి మాట్లాడతారనీ లౌకిక విషయాలకు అంతగా
ప్రాధాన్యమివ్వరనీ ఒక భావన ఉన్నది కనుక అసలు శాస్త్రజ్ఞానానికీ లౌకిక జ్ఞానానికీ
తేడా ఏమిటి అన్న విషయాన్ని గురించి మొదట చెప్పుకోవాలి. ఈ విషయాన్ని ఎక్కడెక్కడో
వెతకవలసిన అవసరం లేకుండా విశ్వనాథ సత్యనారాయణగారే స్పష్టంగా ‘అశ్వమేథము’ అనే నవలలో
చెప్తారు. “శాస్త్రమనగా విశేష
పరిజ్ఞానముతో గూడిన లౌకికమే. లౌకిక మన్నచో నేమియో తెలియని మూఢులు శాస్త్రజ్ఞానమును
నిందింతురు. శాస్త్రము లెచట నుండి వచ్చినవి? ప్రధానముగా లోకమునుండి వచ్చినవి. అలౌకిక పరిజ్ఞానము లౌకిక జ్ఞానముతో సంబంధింప
జేయుటయే శాస్త్రము.... ఆలోచన గాఢముగ నయిన
కొలది శాస్త్ర మగుచున్నది. స్థూలముగా నయినకొలది లోకమగు చున్నది. లోకము స్థూల
సూక్ష్మాంశల చేత విభక్తమయి యున్నది. సూక్ష్మమయినది లోకము కాకపోలేదు. జడులు (ఆలోచన
లేని వారు) స్థూల విషయ నిమగ్న బద్ధులగుట చేత శాస్త్రము వారియందవహేళనము
నందుచున్నది.”
ఇలా శాస్త్రానికీ లౌకికానికీ
వున్న సంబంధమేమిటో వివరించిన విశ్వనాథ ఈ అంశానికి సంబంధించి ఎప్పటికీ
గుర్తుపెట్టుకోదగిన ఒక చక్కటి వ్యాఖ్యను కూడా ఈ నవలలో అందించారు. – “శాస్త్రజ్ఞానము లోకమునకు బాహిరమైనది కాదు.
లోకజ్ఞానములోని మేలిమియే శాస్త్ర జ్ఞానము.”
ఇది అర్థమయ్యాక
శాస్త్రం గురించి మాట్లాడటమంటే లౌకికం లోని మేలిమిని గురించి మాట్లాడటమేనని మనకి
అర్థమవుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవడం జీవితంలో చాలా తికమకల నుంచి మనల్ని
కాపాడుతుంది.
ఇక ముఖ్యాంశం లోకి
వస్తే, లౌకికం గురించి మాట్లాడటం అంటే ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాల గురించి
మాట్లాడటమే. ఆయా రంగాలలో విజయాన్నీ ప్రగతినీ
సాధించడానికి కావలసిన నైపుణ్యాన్ని గురించి చెప్పుకోవడమే. ఆ నైపుణ్యాలు పలువిధాలు.
మూడింటిని గురించి కొంచెం వివరంగా ఈ వ్యాసంలో పరిశీలించడం జరుగుతోంది. వ్యక్తిగతమైన
బలహీనతలను బలాలను సంబాళించుకోవడం మొదటిది. తోటి మనుషులతో సహోద్యోగులతో వుండే సంబంధాలను ఆరోగ్యకరంగా మలచుకోవడం
రెండవది. ఒక వ్యవస్థలో ఎలా ఇమడాలి అధికారులతో ఎలా మెలగాలి అన్నది మూడవది. ఈ
మూడింటినీ మెరుగుపర్చుకోవాలంటే మొదట ఆ
విషయాలకు సంబంధించిన అవగాహనను పెంచుకోవాలి. అందుకు విశ్వనాథ రచనలు ఎలా
సహాయపడతాయో చూద్దాము.
నేరుగా ఉద్యోగ
వ్యాపారాలలోకి వెళ్ళిపోతున్నాం కానీ నిజానికి విద్యార్థి దశలో ఉపయోగపడే విషయాలూ
విశ్వనాథ నవలలలో చాలా దొరుకుతాయి. ఈ వ్యాసంలో అవన్నీ వివరించడం లేదు. పెదవులపైకి
చిరునవ్వును తెచ్చే ఒక్క ఉదాహరణ మాత్రం
ఇస్తాను.
‘పునర్జన్మ’ అనే నవలలో పరీక్షకు
కావలసిన విషయాల కన్నా ఎక్కువ తెలిసిన
కొడుకు పరీక్షకు వెళ్తున్నపుడు తల్లి చెప్పేమాటలు ఇలా వుంటాయి. “ఒరే నాయనా! పరీక్షా పత్రం మూడు గంటలు! ఏ పది
ప్రశ్నలో వుంటై. ఒక్కొక్కటీ పావుగంట కన్నా
ఎక్కువ వ్రాయకూడదు. ఇది జ్ఞాపక
ముంచుకో. ఆ ప్రశ్నల్లో కొన్ని తప్పులుంటై! నీవు విమర్శించకూడదు. అపసిద్దాంతాలు
వుంటై! వాటితో నీ కవసరం లేదు. వాళ్ళడిగిన సమాధానాలు వ్రాయటం, వచ్చేసేయటం.”
ఇక ఉద్యోగ వ్యాపారాలకు
సంబంధించిన అంశాలను మూడు కోణాల నుంచి
పరిశీలిద్దాము. నిజానికి ఈ మూడు కోణముల మధ్య కచ్చితమైన విభజన రేఖ గీయలేము. ఒక
విభాగంలో చెప్పే విషయాలు కొంతవరకూ మరొక విభాగానికి కూడా వర్తించే అవకాశం వుంది.
అయితే మూడు భాగాలుగా చెప్పడం వలన స్పష్టత పెరుగుతుంది కనుక అలా చెప్పడం
జరుగుతోంది.
వ్యక్తిగతం :
ఒక వ్యక్తి
తల్లిదండ్రుల సంరక్షణ నుంచి బయటపడి తనకాళ్ళ మీద తాను నిలబడేందుకు ప్రయత్నిస్తున్న
తరుణంలో ఎన్నో సందేహాలు చుట్టుముడతాయి. నిజానికి పారలౌకికమైన విషయాలలో అంత తికమక
వుండదు. అక్కడ నమ్మడం నమ్మకపోవడం మాత్రమే వుంటుంది కానీ ఒకసారి నమ్మాక ఆచరణకు
సంబంధించిన సందేహాలుండవు. ఒక పని చేస్తే
ఉత్తమగతులు ఉంటాయి అని నమ్మి చేసేవాడికి ఇక అనుక్షణమూ కొత్తగా వచ్చే సందేహాలు ఏమీ
వుండవు.
లౌకికం అలా కాదు. మనం
సబబు అనుకున్నది లోకంలో అంగీకరించబడదు. చాలా ఉపయుక్తమనుకున్నది ఇక్కడ పనిచేయదు. అసలు దోషమే లేదని స్పష్టంగా కనిపిస్తున్న విషయం
గౌరవించబడదు. ఎందుకు? సమాధానం చాలా సందర్భాలలో తెలియదు. అందుకే ఇటువంటి ఎన్నో
విషయాలు గమనించీ గమనించీ నడివయసు వచ్చాక అన్నిటికీ కలిపి ‘లోకంతీరు అంతే’ అన్న ఒక్క సమాధానం చెప్పుకోవడం జరుగుతుంది. కానీ మంచి
సాహిత్యం చదివితే ఆ “లోకం తీరు”ని పాతికేళ్ళ నుంచే ఆనందంగా గమనించడం సాధ్యమవుతుంది.
అందులోని సూక్ష్మభేదాల్ని సైతం క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం ద్వారా ఆ లోకంతీరు
మనల్ని ఏమీ చేయలేని స్థితిని పొందడానికీ అవకాశం వుంటుంది.
ఉదాహరణకి తెలివి అన్న
చిన్న పదం మనల్ని లౌకిక జీవితంలో బోలెడంత తికమక పెట్టగలదు. విస్తృతంగా చదువుకునేవారూ, గొప్ప గొప్ప విషయాలని అవలీలగా
ఆవిష్కరించగలవారూ కూడా లోకం తన తెలివిని
గౌరవించని పరిస్థితి ఎదురయినపుడు హతాశులవడం జరుగుతుంటుంది. అందుకు ఒక కారణం తెలివి అనే మాట యొక్క అర్థాన్ని సరిగ్గా తెలుసుకోకపోవడం అయితే మరొక
కారణం తెలివిని లోకం ఎలా స్వీకరిస్తుందో తెలియకపోవడం. ఈ విషయాలని విశ్వనాథ రచనల
నుంచి మనం నేర్చుకోగలము.
అసలు తెలివి అంటే ఏమిటి? అన్న
విషయానికి “నీల పెండ్లి” నవలలో నిర్వచనం వుంటుంది.
“తెలియు ధాతువు మీద కృదంతములు
పుట్టును. ఒక కృదంతము తెలివి. రెండవ కృదంతము తెలియుట. తెలియుట అనగా ఒక విషయమెవ్వడో
చెప్పగా, మన మనస్సున కది తెలియును. దాని పేరు తెలియుట. తెలివికి దీనికి మించిన
అర్థము కలదు. మనకు తెలిసిన మనము వినిన విషయము నందలి మంచి చెడ్డలు అవుగాములు
విచారించ గలుగుట పేరు తెలివి.”
అలాగే తెలివిలో ఉండే రకాల గురించి “మాబాబు” నవలలో వివరణ
వుంటుంది. “లోకంలో రెండు రకాల తెలువులుంటాయి. ఒకటి ప్రతివాడికీ తన జీవితానికి
ఉపయోగపడే తెలివి, తన స్వార్థం తాను బాగా చూచుకునే తెలివి వుంటుంది. రెండవరకపుది
ఎవడిది వాడి స్వార్థానికి ఉపయోగపడదు. అది లోకానికి సంతోషమో, కోపమో కలిగిస్తుంది.
నలుగురూ వాణ్ణి తెలివిగలవాడంటారు. కాని అది వాడి స్వలాభానికేమీ ఉపయోగించదు. నిజంగా
తెలివి అంటే అదే అయినా, ఆ తెలివి వల్ల లోకం ఆనందిస్తున్నా లోకం ఆ స్వార్థపరుడి
తెలివినే ఎక్కువ గౌరవిస్తుంది. ఎందుకు గౌరవిస్తుంది? లోకానికి కూడా స్వార్థం వుంది
కనుక. ఈ రెండవరకపు తెలివి గాలికి పోతుంది. ఆది
ఆత్మజ్ఞానం వంటిది. ఆత్మజ్ఞానం ఎవరికి
కావాలి? సుఖదుఃఖాలు లెక్క చేయకుండా ఒకానొకడు ఎప్పుడూ సంతోషంతో ఉత్సాహంతో
నిండి తొణుకాడుతూ వుంటాడు. వాణ్ణి చూస్తే లోకానికి గిట్టదు.”
అలాగే బ్రతుకుతెరువుకు
సంబంధించిన ఒక చక్కటి పరిశీలన మనకి “వేయిపడగలు” నవలలో కనిపిస్తుంది. “అన్నిమతములకు
అదొకరీతిగా ముడిపెట్టుట, అన్ని మతములందును యాదార్ధ్యమున్నదనుట,
ఎచ్చట మంచి యున్నదో అచ్చట గ్రహించవలయుననుట , దేనియందును
నిశ్చయ జ్ఞానములేక “ఇతో భ్రష్ట స్తతో భ్రష్ట:” యగుట – బ్రతుకుతెరువునకు ముఖ్యధర్మము.
ఇదేదో కొంచెం తేడాగా
వుంది కదా – దీనినుంచి ఏం నేర్చుకోవాలి? అంటే వున్న విషయం అది. దానిని రచయిత
అరటిపండు వలిచి చేతిలో పెట్టినంత చక్కగా వివరించారు. ఇక దానిని అర్థంచేసుకోవడం మన
కర్తవ్యం. అర్థం చేసుకున్నాక భ్రష్టులమయ్యి బ్రతుకుతెరువును నిలబెట్టుకుంటామా లేక భ్రష్టత్వాన్ని పొందకుండా ఉండేందుకు
బ్రతుకుతెరువుకు అవసరమైన ముఖ్యధర్మాన్ని వదులుకుంటామా
అన్నది మనం తీసుకోవలసిన నిర్ణయం.
వ్యక్తులతో సాహచర్యం :
తోటి కళాకారులనీ
సహోద్యోగులనీ ప్రత్యర్థులనీ అర్థం చేసుకోగలగడం వారితో సత్సంబంధాలు కలిగి ఉండడం లౌకికమైన అభివృద్ధికి
కీలకమైన అంశం.
మానవసంబంధాలని మెరుగు
పర్చుకునేందుకు సాఫ్ట్ వేర్ సంస్థలలోని మేనేజర్లకి ఇచ్చే శిక్షణలలో భాగంగా MBTI
అనే ఒక
విశ్లేషణ వుంటుంది. దాని ప్రకారం మనుషులని వారి మానసికమైన ప్రాధాన్యాల
ఆధారంగా 16 రకాలుగా విభజించవచ్చు. ఉదాహరణకి అంతర్ముఖత్వం, బహిర్ముఖత్వం అనే రెండు లక్షణాలు
తీసుకుంటే, మనుషులందరూ కొన్ని సమయాలలో
అంతర్ముఖంగా, మరి కొన్ని సమయాలలో బహిర్ముఖంగా ఉన్నప్పటికీ (అలా ఉండగలిగే
సామర్ధ్యమూ, ఉండవలసిన అవసరమూ
అందరికీ ఉన్నప్పటికీ) ప్రతి
ఒక్కరిలోనూ ఏదో ఒక లక్షణం మరొక దానికంటే ఎక్కువగా వుంటుంది. అంటే ఒకరకంగా వుండడం
మరొక రకంగా వుండడం కంటే వారికి ఎక్కువ సౌకర్యంగా అనిపిస్తుంది. కొందరిలో ఆ తేడా మరీ స్పష్టంగా కనిపిస్తుంది.
ఒక కొత్త విషయాన్ని
అర్ధం చేసుకోవడం, నేర్చుకోవడం, తోటి మనుషులతో దానిని పంచుకోవడం మొదలైన పనులని
ఈ రెండు రకాల వారూ చేసే పద్ధతులలో చాలా వ్యత్యాసం వుంటుంది. అ తేడాలను తెలుసుకోవడం ఆసక్తికరమూ ఉపయుక్తమూ కూడా. ఆ
వ్యత్యాసాలు తెలిసినపుడు ఒక్కొక్కసారి
మనకి విడ్డూరంగా అనిపించే అవతలి వారి ప్రవర్తనని అసహనం లేకుండా అర్ధం
చేసుకోగలుగుతాము.
ఉదాహరణకి ఎవరైనా ఏదయినా
కొత్త విషయం చెప్తున్నపుడు కొందరు ఒక్క ప్రశ్న కూడా వేయకుండా మౌనంగా వింటూ
వుంటారు. అపుడు చెప్పేవాళ్ళకి వీళ్ళు అసలు మనం చెప్పేది వినడం లేదేమో! అర్థం
చేసుకోవడం లేదేమోనన్న అనుమానం వస్తుంది. మరికొందరు ఒక వాక్యం చెప్పడం కూడా పూర్తి
కాక ముందే యాభై నాలుగు ఎదురు ప్రశ్నలు వేస్తారు. అప్పుడు కూడా చెప్పేవాళ్ళకి
విసుగొస్తుంది. చెప్పేది వినిపించుకోకుండా ఊరికే ప్రశ్నలు వేస్తే ఎలా
అర్థమవుతుంది! అనిపిస్తుంది. కానీ నిజానికి అది వారి వారి అర్థం చేసుకొనే
పద్ధతులలోని తేడాయే తప్ప వారి శ్రద్ధలో లోపమో, తెలివిలో లోపమో కాకపోవచ్చు. కొందరు
తాము విన్న విషయాన్ని తమలో తాము తర్కించుకోవడం ద్వారా అర్థం చేసుకుంటే మరికొందరు
పైకి మాట్లాడటం ద్వారా అర్థం చేసుకుంటారు. ఈ విషయాన్ని తెలుసుకోవడం మనుషుల్ని అర్థం చేసుకోవడంలో చాలా
ఉపకరిస్తుంది.
ఇంతకీ ఇదంతా ఈ వ్యాసంలో
చెప్పడం ఎందుకు జరుగుతోందంటే నేటి సంస్థలలో మేనేజర్లకు ఇచ్చే శిక్షణలో భాగమైన ఈ
విషయాలని విశ్వనాథ సత్యనారాయణ గారు తన ‘నాగసేనుడు’ నవలలో ఒక పాత్రని వివరించే
సందర్భంలో చెప్పారు కనుక.
“కొందరు సర్వమైన భావనయు
సర్వమైన యూహయు తమలోనే చేసికొందురు. కొందరి యూహ విషయములు పరులతో చెప్పుచున్నపుడు
సాగుచుండును. వారు మాటాడుటయే తర్కము చేసినట్లుండును. ఆ తర్క సోపాన పరంపర మీద కొత్త
యూహలు స్పురించుచుండును.”
మానవసంబంధాలకి
సంబంధించిన మరొక సమస్య అవతలి వారు ఉద్వేగప్రకృతులు అయినపుడు వారితో ఎలా
వ్యవహరించాలి అన్నది! ‘ధర్మచక్రము’ నవలలో దీనికి సంబంధించిన ఒక రహస్యం చెప్తారు విశ్వనాథ. “ఉద్వేగప్రకృతులు మనో వీధులయందొక దారి నడతురు. ఆ మార్గమున వారు నిశిత వ్యగ్రులై వుందురు. వారిని మరియొక
మార్గమున నెదుర్కొన్నచో, వారు వెంటనే నిస్సహాయులగుదురు. వారు మనసా సిద్ధపడి వచ్చిన
వాదమార్గాభిముఖ్యము, బ్రహ్మ దేవునకును జిగీషా తాత్పర్యము కాదు. వేఱుమార్గమునందు
వారినెదుర్కొన్నచో, వారు మరల దానికాయత్త పడుటకు కాలము పట్టును. శత్రువు వేగరి
అయినచో తత్కాలమున వారిపై విజయము సాధింపవచ్చును.”
పై ఉదాహరణలు తోటి
ఉద్యోగులతో ప్రత్యర్థులతో వుండే సంబంధాలలోని అంశాలను మెరుగుపరచుకునేందుకు ఉపయోగపడే
విశ్లేషణలు అయితే ‘భగవంతుని మీద పగ’ అనే
నవలలో విద్యని ప్రదర్శించే వాడికీ ఆవిద్యని ఆస్వాదించే వాడికీ మధ్యన వుండే సంబంధాన్ని విశ్లేషిస్తారు విశ్వనాథ.
“విద్యలు ప్రదర్శించే వాడున్నపుడు దానినాస్వాదించే
వాడు కూడా వుంటాడు. ఆస్వాదించే వాడికి విద్యా ప్రదర్శనము చేసే వాడి శక్తిలో కాస్త
కూడా వుండదు. అయినా ఆస్వాదించే వాడు ప్రదర్శించే వాడికి పరమ బంధువుగా, గురు తుల్యుడిగా అనిపిస్తాడు. గురువునయినా
దిక్కరిస్తాడు కానీ ఈ ఆస్వాదించే వాడిని ధిక్కరించ లేడు.”
ఈ విషయాన్ని చెప్పాక, ఈ నవలలోని పాత్రల గురించి వ్యాఖ్యానిస్తూ ఈ కారణం చేతనే ‘విద్యని ప్రదర్శించే వారు విద్యని ఆస్వాదించే వారికి తమ
ఆత్మలో దాసులు అయిపోయారని’ వర్ణిస్తారు.
ఇక వివిధ వర్గాలకు చెందిన
ఎన్నోరకాల పాత్రలను సృష్టించడంలోను తద్వారా విభిన్నమైన మానవమనస్తత్వాలను,
స్థితిగతులను మనకి పరిచయం చేయడంలోను విశ్వనాథ వారి ప్రతిభ తెలిసినదే. పాత్రచిత్రణ
ద్వారా పరోక్షంగా ఎన్నో విషయాలను తెలియచేయడంతో పాటు కొన్ని చోట్ల వ్యాఖ్యల రూపంలో
కూడా మనుషుల మధ్య వుండే తేడాలను వివరిస్తారు విశ్వనాథ.
ఉదాహరణకి ‘పులిమ్రుగ్గు’ నవలలో నాగరికులు, జానపదులు,
ఆటవికులు – వీళ్ళ ముగ్గురి మధ్యన వుండే
తేడాలను వివరించే రెండు వ్యాఖ్యలు ఉంటాయి.
1) రాజకులములో నున్నవారికి నచ్చెరువు తక్కువ. జానపదుల కంతకంటె తక్కువ. ఆటవికులకు
మరియు తక్కువ. 2) కొందరి ప్రకృతిలో ఒకపని చేయవలయునని అనుకున్నచో అది ఆరు నూరయినను,
యిట్లుదయించెడి సూర్యుడట్లుదయించినను వారు మానివేయుట యుండదు. ఇట్టి ప్రకృతి
నాగరకుల యందు తక్కువగా, జానపదులయందు కొంత యెక్కువగా, ఆటవికులయందు సమృద్ధిగా
ఉండును.
ఇక్కడ
గమనించవలసిన మరొక విశేషం ఏమిటంటే, నవల
మధ్యలో కనబడే ఇటువంటి వాక్యాలు ఊరికే కథకి సంబంధం లేకుండా చేసే వ్యాఖ్యలు కావు.
కథలో ఒకడు ఒక విధంగా ప్రవర్తించడం వుంటుంది. వాడు అలాగే ప్రవర్తించడం కథా గమనానికి
అవసరమయి వుంటుంది. అటువంటి సందర్భంలో ఆ
ప్రవర్తనకి సమర్ధనగా వచ్చే ఇలాంటి పరిశీలనలు పాఠకుడికి కథనీ, సమాజాన్నీ కూడా
సందేహాలు లేకుండా అర్ధం చేసుకోవడానికి ఉపయోగిస్తాయి.
వ్యవస్థలూ - అధికారులు
ఈ విషయానికి సంబంధించి
అయితే విశ్వనాథ సత్యనారాయణగారి నవలలలో ఎన్నో
చక్కటి పరిశీలనలు సూచనలు ఉంటాయి.
“.... ఒక కచేరీలో ఒక
గుమాస్తా ఒక తప్పు చేసెననుకొందము. ఆపైని గల అధికారి యా తప్పులను సర్ది “నాయనా! ఇట్లు
చేయరాదు!” అని దిద్దినచో ఆ దోషమంతటితోనే యంతరించును.” - వేయిపడగలు
నవలలోనివాక్యాలు ఇవి. ఈ వాక్యంలో చెప్పినది నిజానికి చాలా గొప్ప సూత్రం. ఒక
క్రింది ఉద్యోగి ఒక తప్పు చేసినపుడు అతని పైఅధికారి దానిని సరిదిద్ది సరయిన పధ్ధతి వివరిస్తే ఇక ఆ తప్పు
మళ్ళీ జరగదు. కానీ చాలా సందర్భాలలో అధికారులు అలా చేయరు. ఎందుకంటే వారికి కావలసింది
ఆ తప్పును సరిదిద్దడం కాదు. దాన్ని ఆధారం చేసుకుని ఆ క్రింది ఉద్యోగిని సాధించడం. భవిష్యత్తులో
అతనికి ఇవ్వవలసిన ప్రయోజనాలలో కోత
పెట్టవలసి వస్తే అందుకు దానిని వాడుకోవడం. ఈ విషయాన్ని చక్కగా విప్పి చెప్పారు
విశ్వనాథ.
ఇక పోతే మనకన్నా తక్కువ
ప్రతిభ ఉన్నవాడికి మనకన్నా ఎక్కువ విలువా
అధికారమూ వుండడం, మన అభివృద్ధి
అతగాడి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి వుండడం కూడా ఉద్యోగాలలో సాధారణంగా ఎదురయే ఒక
సందర్భం. అందుకు దేశ కాల పరిస్థితులకి సంబంధించిన వివిధ కారణాలు ఉండవచ్చు. కారణాలు ఏమైనా అవి మన
పరిధికి మించినపుడు ఆ పరిస్థితికి
బాధపడకుండా దానినొక సహజమైన వ్యవహారంలా తీసుకోక తప్పదు. ఉదాహరణకి కళాశాలలో సంస్కృతం చెప్పే ఆయనకి
మిగిలిన ఉపాధ్యాయులకి ఉన్నంత విలువ వుండదు. ఒకవేళ ఆయన కన్నా విలువగా చూడబడే మరొక ఉపాధ్యాయుడికి సంస్కృతంలో ఏదన్నా సందేహం
వచ్చిందనుకోండి. అపుడు ఏమవుతుంది? ‘దమయంతీ స్వయంవరం’ నవలలోని ఈ క్రింది వాక్యాలు అటువంటి పరిస్థితిని మనకి కొంచెం హాస్యంగా
వివరిస్తాయి. - “ఆయన వచ్చి ‘శాస్త్రులు గారూ దీని అర్థం ఏమిటండీ’ అని
అడుగుతాడు. ఈ శాస్త్రులు గారు అంతవాడు అడిగాడే అని చెప్తాడు. (అంతవాడంటే ముందు
నాటికి ఆ కళాశాలలో ఈ పండితుడు ఉండాలంటే
ఆయన సిఫారసు చేస్తేనే ఉంటాడు. మరిన్నీ ముందు నాటికి ఆయన కింకొక రెండు రూపాయలు జీతం
అభివృద్ధి చేయాలంటే ఆయన చెబితేనే అవుతుంది.) అంతవాడడిగాడని ఈయన చెపుతాడు. ఆ
చెప్పటంలో ఎంత వినయంగా చెపుతాడు. ఆయన ఎంతో అధికారంతో వింటాడు. తక్కిన
ఉపాధ్యాయులందరికీ ఆయన అడగటంలో గొప్ప ఉంది కాని, ఈయన చెప్పటంలో ఏమున్నది?
అన్నట్టుగా జరుగుతుంది కథ.”
మరొక విషయం చూద్దాము. “సమస్యలతో
కాదు పరిష్కారాలతో రండి” అనేది ఆధునిక సంస్థలలో ఉద్యోగులకు అధికారులు చెప్పే మాట. ఈమాటని అర్థం చేసుకోవడానికీ
జీర్ణం చేసుకోవడానికీ చాలా మంది యిబ్బంది పడతారు. ఉద్యోగంలో చేరాక ఆ
యిబ్బందిని అధిగమించడానికి చాలా కాలం పడుతుంది. అప్పటికి కూడా ఇది నా ఒక్కడి
విషయంలోనే జరుగుతోందేమో నేను అధికారులతో నా సమస్యని సరిగా చెప్పలేకపోతున్నానేమో
అన్న సందేహం వుంటుంది. అయితే అది అరుదుగా జరిగే విషయమో తన ఒక్కడికే జరుగుతున్న
అన్యాయమో కాదనీ అన్నిచోట్లా వుండే సహజమైన విషయమమేననీ అర్థం చేసుకోగలిగితే అటువంటి
సందేహాలూ వాటివలన ఏర్పడే మనోవేదనలూ వుండవు. ‘నీలపెండ్లి’ నవలలో ఈ విషయాన్ని
స్పష్టంగా చెప్తారు విశ్వనాథ. - “ఈ యాధునిక నాగరకతా పథకములో పరుల యన్యాయములు
నీవు పై యధికారితో మాటిమాటికి చెప్పినచో, ఆ పైయధికారి నీవు నలుగురితో కలిసి
మనజాలవనియు, నీ ప్రకృతిలోననే యేదో దోసమున్నదనియు నీవసమర్థుడవనియు, లోకములో
బ్రదికెడి తీరు నీకు తెలియదనియు ననును.
అనగా అర్థ మేమనగా, లోకమునందు దైనందినముగా జరుగు అసంఖ్యాకములైన అల్పాల్పములైన
యన్యాయములకు నీవు నోరు మూసికొని యుండవలయునని యర్థము. అట్లు నోరు మూసికొని మనగలుగుట బ్రదుకుతెరువు!
బ్రదుకుట యందలి నేర్పు! నాగరకతా లక్షణము! పెద్దమనిషి తరహా!”
అధికారులతో వుండే ఇబ్బందులని
చాలా సందర్భాలలో హాస్యంగా కూడా వివరించారు
విశ్వనాథ. ఉదాహరణకి ‘బాణావతి’ నవలలో “మనకే
బాధలు ఉంటాయో మన అధికారులకు గూడా భగవంతుడు ఆ బాధలు తెచ్చిపెడితే మనము ఉద్యోగాలు
చేయడం కొంత సులువుగా వుంటుంది.” అంటారు.
అంటే ఉద్యోగి ఇంట్లో ఒక దెయ్యం
పట్టిన మనిషి ఉన్నాడనుకోండి. అధికారి ఇంట్లో కూడా అలాంటివాడు ఒకడుంటే అప్పుడు
అధికారికి ఉద్యోగి కష్టాలు బాగా అర్థమవుతాయన్నమాట. దెయ్యాలను భూతాలను నమ్మనివాళ్ళు ఇక్కడ మరొక
సమస్యేదన్నా చెప్పుకోవచ్చు.
ఇందులో హాస్యం వుంది సరే కానీ
జ్ఞానం ఏముంది అంటారా! మనమున్నటువంటి
పరిస్థితులలో మన అధికారి లేనట్లయితే మన
బాధలు అతనికి అర్థం కావు అన్నది జ్ఞానమే కదా! ఆ విషయం స్పష్టంగా తెలిసినపుడు మనం
అనవసరపు ఆశలు పెట్టుకోకుండా అధికారితో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తాం. అలాంటి
పరిస్థితిని- అంటే మనకీ మన అధికారికీ ఒకేలాంటి ఇబ్బందులు ఉండడం అనే
పరిస్థితిని- మనం సృష్టించలేము నిజమే కానీ
ఒకవేళ యాదృచ్చికంగా అలాంటి పరిస్థితి ఎదురయితే గుర్తించి ఉపయోగించుకోగలుగుతాము.
మరి కాస్త లౌక్యం ఎక్కువగా ఉన్నవాళ్ళయితే
ఈ సూచనని అందిపుచ్చుకుని అలాంటి పరిస్థితిని “సృష్టించి” తద్వారా వచ్చే సౌలభ్యాలను
చేజిక్కించుకుంటారు కూడా.
ఇలా వివిధములైన లౌకిక విషయాలను
స్థూలమైన వాటినీ చాలా సూక్ష్మమైన వాటినీ
కూడా విశ్వనాథ సత్యనారాయణగారి రచనలలో గమనించగలము. చివరిగా ఒక్క అంశాన్ని
చెప్పుకోవాలి. ఈనాటి జీవితంలో బాగా
చదువుకున్నారనుకునే వారిలోనూ, తెలివైనవారిగా సమర్థులుగా పేరుతెచ్చుకున్న వారిలోనూ
కూడా ఒక అసంతృప్తినీ అశాంతినీ చూస్తున్నాం. దానిని ఈకాలపు విద్యల వలన ఉద్యోగాల
వలన జీవనశైలి వలన కలిగే ‘వత్తిడి’గా
భావిస్తున్నాం. అయితే ‘శార్వరి నుండి శార్వరి దాక’ నవలలో చెప్పిన ఈ క్రింది మాటలు
బహుశా ఆ అశాంతికి అసలు కారణాన్ని
తెలియచేస్తాయి. పరిష్కారాన్నీ స్ఫురింప చేస్తాయి.
“వేదములు చదివినచో శాస్త్రములు
చదివినచో యజ్ఞయాగాది క్రతువులు చేసినచో అది ఆత్మను వృద్ధి పరచికొనుట. ఎందుకనగా ఆ
విద్యల వలన యెవ్వరికి నష్టము లేదు. అవి
ఒకరి కపకారము చేయుట కొరకేర్పడిన విద్యలు కావు. పరమేశ్వరుడు నిర్మించిన
విద్యలు. వానిని నిలబెట్టుట బ్రాహ్మణ ధర్మము.అవి చదువుకొనినందువలన ఆత్మ ఔన్నత్యము
సమకూడును. ఒకని కపకారము చేసెడి విద్య ఏమి చేయును? ఆత్మౌన్నత్యమును భంగించును.
లౌకికములైన సర్వ విద్యలు పరులకపకారము చేయుట కొరకు కాకపోయినను, స్వార్థమును వృద్ధి
చేసుకొనుటకగును. అందుచేత ఆ విద్యలు నీ ఆత్మకౌన్నత్యమును తేవు. నీ ఆత్మౌన్నత్యమునకు
భంగకరములును కావు. అ విద్యలను ప్రదర్శించుటలో నీవు కైతవమును, స్వార్థమును
వెలయించినచో అవి నీ ఆత్మౌన్నత్యమునకు భంజకములు కావచ్చును. నీవు ఉదాత్తమైన
ప్రకృతితో ప్రవర్తించిన నీ ఆత్మౌన్నత్యమునకు హేతువులు కావచ్చును. అనగా లౌకికములైన
విద్యలు నిర్గుణములు. జన్మ యెత్తిన వాడు బ్రతుకవలయును కనుక, శరీర ధారణము సర్వజంతు
మర్యాద కనుక, వాని యందు దోషము లేదు. గుణమును
లేదు. నీ ప్రవర్తన చేత వానియందు గుణారోపణము దోషారోపణము చేయుదువు.”
ఈ మాటలలోని లోతును
గ్రహించినపుడు, ఉపయోగించుకున్నపుడు లౌకికమైన విజయాలు సాధిస్తూనే ఆత్మౌన్నత్యమునకూ
బాటలు వేసుకోవడం సాధ్యమవుతుంది.
*******
కామెంట్‌లు
well articulated and You have done so much hard work - keep posting!
ఈ మాటల significance/ఉదాత్తత ఏమిటి? కొంచెం వివరించగలరా? ఇతర మతములలో యథార్థం గ్రహించటం భ్రష్టత్వం ఎలా అవుతుంది? “ఆనో భద్రాః క్రతవో యన్తు విశ్వతః" - కు ఇది విరుద్ధం కదా?