“కృష్ణ” నవల - ధారా రామనాథశాస్త్రి

ధారా రామనాథశాస్త్రిగారి “కృష్ణ” నవల చదివాను.ఇది కూడా “మోహనవంశి” కలిగించినటువంటి బాధనే కలిగించింది.
రచయిత ముందు మాటలో “పాత్రచిత్రణలో ఒక ప్రత్యేక దృక్పథం పాటించాను. అది స్వామి మొదలు సామాన్య పాత్ర వరకు వర్తిస్తుంది. భాషలో భావ ప్రతిబింబమైన ప్రసన్నతతో పాటు నుడికారంలోని ఒడుపునకు ప్రాధాన్యమిచ్చినాను. దానివల్ల పాత్రకీ పాఠకునికీ ఒక సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మానుషత్వము దివ్యత్వము రెండు అంచులుగా రమ్యరసస్ఫురణం కోసం ప్రయత్నించాను.” అన్నారు.
కానీ ఇందులోని భాషా, ఆయన అన్న నుడికారమూ నాకేమీ ఆనందాన్ని కలిగించలేదు.కృతకమైన సంభాషణలు పాత్రలతో ఏ కొద్ది సాన్నిహిత్యాన్నీ కలిగించకపోగా పాత్రలన్నిటి పట్లా (కృష్ణుడితో సహా) ఒక విధమైన చిరాకుని నింపాయి మనసులో.
ఈ నవల రెండు భాగాలుగా నడిచింది.రెండింటిలోనూ కూడారచయిత చేసినకల్పనలు అసలేమీ ఆకట్టుకోలేదు.కొన్నింటి గురించి ప్రస్తావిస్తాను.

మొదటి భాగం

కృష్ణుడిని వసుదేవుడు నందుడి ఇంట విడవడానికి రావడంతో నవల మొదలవుతుంది. అలా వచ్చిన వసుదేవుడు బిడ్డని మార్చి వెంటనే మధుర వెళ్ళిపోతాడన్నది మామూలుగా ప్రాచుర్యంలో ఉన్న విషయం. ఈ నవలలో రచయిత దానిని కొంచెం మార్చి వసుదేవుడు రోహిణితో కబుర్లు చెప్తూ ఆ రాత్రంతా గడిపినట్లు వ్రాస్తారు. ఆ కల్పన లో నాకు అందమూ కనబడ లేదు ఔచిత్యమూ కనబడలేదు.
ఆయన బయల్దేరతానన్నపుడు రోహిణి అంటుంది “ వెళ్ళుదురుస్వామీ, ఇంకా తూర్పు తెలవారలేదు. పక్షుల సవ్వడీ చల్లగాలుల సందడి చెలరేగేసరికి మధుర చేరుదురుగాని. ఇప్పుడు కాలం ఆగిపోయి మీరు ఎల్లకాలమూ నాదగ్గరే వుంటే- ప్చ్! ఈ దీనురాలికి అంత అదృష్టమా.. మీకు జ్ఞాపకమున్నదా స్వామీ? తొలినాటి రేయి మీరే అన్నారు. ఎన్నిజన్మలుగా అనుభవిస్తే నీ అందం తరుగుతుందే ఎర్రపిల్లా అని.”
ఈ రకమైన సంభాషణలు కూడా నాకు నచ్చలేదు.
యశోదతో గోపికలు ఫిర్యాదు చేసే ఘట్టంలో సంభాషణలు ఇలా ఉన్నాయి:
ఫిర్యాదుమొదలుపెట్టడమే “అవునులే నీవు రాణివి, నీ మొగుడు మహారాజు, మీ బిడ్డలు యువరాజులు.. మిమ్మల్ని నెత్తిన పెట్టుకున్న మేమంతా అలగాజనాలము. అంతేగా నీ అభిప్రాయము.” అంటూ మొదలుపెడతారుగోపికలు.
ఆ తర్వాత ఆ గోపికలని వర్ణించడానికి  రచయిత వాడిన భాషా ఆ గోపికల చేత పలికించిన  భాషా – రెండూ  నచ్చలేదు నాకు.
ఒక మూడుకాళ్ళ ముదుసలి కర్రపోటు వేసుకుంటూ ముందుకు వచ్చింది. ఆమె పేరు లచ్చమ్మ. శరీరమూ తలా ముడుచుకు పోయి శరత్కాలపు  వెన్నెలలాగా ఉన్నది. కళ్ళు మాత్రము కలువరేకుల లాగా వెలుగుచున్నవి. తెల్లని చీర మీద తామరల అద్దకము. “ఒసే అమ్మి నీవు ఎన్ని చెప్పినా సరిపోదే పెద్దదాన్ని నన్ను మాత్రము వదిలాడా మీ పిల్లోడు! మామ్మా నీ వయసెంత అన్నాడు. డెబ్భై దాటిందిరా అబ్బీ అన్నాను.
మన్మధుడు కాపురము చేసిపోయిన మేడ లాగా ఉన్నావు. డెబ్బై ఏళ్ళకు ముందు నేను పుట్టి వుంటే తాతయ్య నోట గడ్డ కొట్టి నేను నిన్ను పెళ్ళి చెసుకొనే వాణ్ణి అన్నాడు.
ఇదీ ఆ ముసలమ్మ ఫిర్యాదు.
ఆతర్వాత కమల అనే పిల్ల వచ్చి పొరుగూరి నుండి వచ్చిన పళ్ళమ్ముకునే అవ్వ దగ్గర తాను పళ్ళు బేరం చేస్తుంటే కృష్ణుడు వచ్చి అల్లరి పెట్టాడనీ, తన చేతి పసిడి కంకణం లాగి ఆ అవ్వకు ఇచ్చి హాయిగా జీవించమని చెప్పి పంపాడనీ చెప్తుంది.
“ఎవడబ్బ సొమ్మని నా కంకణము నీవు దానము చేశావు?”అని అడిగితే “కంకణమే కాదు పిచ్చివేషాలేస్తే నిన్నే లంకింకుంటాను. నీ అబ్బతో చెప్పుకోవాలి” అన్నాడని చెప్పి బొటబొటా కన్నీరు కారుస్తుంది.
ఈ సంభాషణలే కాదు తర్వాత నవలలో ఉద్ధవుడి ఆలోచనలూ ఊహలూ, అగ్నిద్యోతనుడి నోట పలికించిన మాటలు అన్నీ ఔచిత్యానికి దూరంగానే అనిపించాయి.
వారే కాదు రుక్మిణీ కృష్ణుల వంటి ప్రధాన పాత్రల మాటలూ అంతే.
రుక్మిణి తన పెళ్ళి ముచ్చట్లని యశోదతోచెప్పే సంఘటన ఒకటి ఉంటుంది. అప్పుడు కృష్ణుని తొలిసారి చూసిన సందర్భంలో తన భావాలను ఇలా వివరిస్తుంది రుక్మిణి. 
“కన్నెత్తి చూస్తే కమనీయ రథం రమణీయంగా అధివసించిన నా స్వామి. ఒక్కసారి గుండె ఝల్లుమన్నది. జన్మజన్మాంతరసంస్కారాలు పెల్లుబికి ఆనంద వీచికలుగా అమరత్వ వాహికలుగా ఉప్పొంగినవి...”
ఇలా సాగుతాయి ఆమాటలు. ఇక్కడ జన్మజన్మాంతరసంస్కారాలు అనేమాట రుక్మిణికి పొసగలేదనిపించింది. అలాగే
“ధన్యుణ్ణి కృష్ణా” అంటూ ఒక్కసారి చేతులు మోడ్చిన అమ్మని అపవారిస్తూ “ఏమిటమ్మా యీ చాదస్తం” అంటూ దగ్గరకు తీసుకొని గ్రుచ్చి ఎత్తిన కృష్ణుని స్పర్శలో యశోద బ్రహ్మకోశంముట్టింది.
వంటి వాక్యాలలో ఆజాగ్రత్తా అనౌచిత్యమూ - రెండూ కనిపించాయి.చాదస్తం అనే మాట కృష్ణుని నోట రావడం బాగా అనిపించలేదు.

యశోద వచ్చి చాలారోజులు మధురలో ఉండడం, ఆవిడ ఎప్పుడు బృందావనానికి వెళ్దామని బయల్దేరినా కృష్ణుడు ఆపేస్తూ ఉండడం,“నా పెళ్ళి వేడుకలు చూడాలని నీకు ముచ్చట గదా.. ఇంకా ముందు ముందు ఎన్ని పెళ్ళిళ్ళవుతాయో! ఏమో! నాకే తెలీదు. పెద్దదానివి తడవ తడవకీ రాకపోకలేం చేస్తావు? ఇక్కడే ఉండిపోకూడదూ!” అంటూ పరిహాసాలాడటం వంటి కల్పనలున్నాయి. 

భాగవతం లో లేని విషయాల కల్పనే కాదు ఉన్న విషయాలకు భిన్నంగా సాగిన కల్పనలూ కొన్ని ఉన్నాయి. వాటికి ప్రమాణము ప్రయోజనము తెలియలేదు.
ఉదాహరణకి రాచనగరులో కుబ్జ కనబడినపుడు కృష్ణుడు ఆమె శారీరక లోపాన్ని పోగొట్టగానే ఆమె సంతోషపడుతుంది. అతన్ని తన ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే భాగవతం ప్రకారం కృష్ణుడు వెంటనే ఆమె ఇంటికి వెళ్ళడు. కంసుడిని సంహరించడం, సాందీపుని దగ్గర విద్యాభ్యాసం మొదలైనవన్నీ అయ్యాక తర్వాతెప్పుడో ఆమె దగ్గరికి వెళ్తాడు. కానీ ఇందులో రచయిత కృష్ణుడు కుబ్జ పిలవగానే ఆమెని అనుసరించి ఆమె ఇంటికి వెళ్ళినట్లుగా వ్రాశారు.
అలాగే లాక్షాగృహ దహనం తర్వాత పాండవులు అరణ్యంలోకి వెళ్ళినపుడు కృష్ణుడు పాండవులనీ కుంతినీ కలిసినట్లు మాట్లాడినట్లు భారతంలో ఉండదు. పాండవుల మరణ వార్త తెలిసి కృష్ణుడు పరామర్శ కోసం హస్తినాపురికి  వెళ్తాడు. అదే  సమయంలో సత్రాజిత్తు హత్య చేయబడతాడు. అప్పుడు సత్య తన తండ్రి శరీరాన్ని తైలద్రోణిలో భద్రపరచి కృష్ణుడి కోసం హస్తినాపురికి వెళ్తుంది.
కానీ ఈ పుస్తకంలో రచయిత కృష్ణుడు అడవికి వెళ్ళి పాండవులతో మాట్లాడినట్లు,  ఆ తర్వాత సత్య కూడా అక్కడికే వెళ్లి కృష్ణుడికి తండ్రి మరణవార్త చెప్పినట్లు వ్రాశారు. ఈ మార్పులో ఔచిత్యం కనబడలేదు. ఒక చిరునామా లేకుండా తిరుగుతున్న పాండవుల దగ్గరికి  కృష్ణుడే  కాక సత్య కూడా నేరుగా వెళ్ళిపోయిందని వ్రాయడం పొసగలేదనిపించింది.
ఈ ఘట్టంలో వ్రాసిన ఒక వాక్యం-  “స్వామిని చూసి కుంతి భళ్ళుమని దుఃఖించింది.”  వింతగా అనిపించింది. భళ్ళుమనిఅనే విశేషణం దుఃఖానికి పొసగలేదనీ ఆ మొత్తం వాక్యం కుంతి పాత్రకి పొసగలేదనీ అనిపించింది.

భారతం ప్రకారం ఒక్క కృతవర్మకు మాత్రమే సత్యభామను పెళ్ళాడాలన్న ఆలోచనా, అది నెరవేరనందువలన  కోపమూ ఉంటాయి. దానిని కూడా రామనాథశాస్త్రి గారు వేరే విధంగా వ్రాశారు.

శ్యమంతక మణిని తీసుకుని ద్వారక నుండి వెళ్ళిపోయిన అక్రూరుడు మళ్ళీ ద్వారకకి తిరిగి వస్తున్న సందర్భంలో అతని మనసులో మెదిలిన ఆలోచనలని చెప్తారు  రచయిత. ఆ సమయంలో అక్రూరుని మనసులో మూడు దృశ్యాలు మెదుల్తాయి. 
ఇ. ఇప్పటికీ ఆ ఉద్యానవనం కన్నులకట్టినట్టే ఉన్నది. లోకాద్భుత సౌందర్యవతి అయిన సత్య సఖీ పరివృతయై విహరిస్తున్న వేళ తాను ఠీవిగా ప్రేమగా ఆమె చెంతకు వెళ్ళి శృంగారం ఒలకబోసి ఆమెను లాలించి ఎలా అయినా సరే తన్ను వివాహమాడమని కోరిన దృశ్యం. ఆమె పితృదేవులతో సంప్రదించండి అంటూ వినయంగా విశాల హాసం చేస్తూ చెప్పిన దృశ్యం..
ఈ. తన మిత్రులైన శతధన్వ కృతవర్మలుఒకనాడు చతురంగ కేళీ విలాసంలో మునిగిపోయి ఉన్నపుడు యాదృచ్చికంగా తాము కూడా సత్యా సౌందర్యం చేత ఆకృష్టులై వలపులో తలమునుకలై అదను చూసి ఆ కన్యామణిని అర్ధించినట్టూ ఆమె పితృదేవులతో సంప్రదించండి అని సమాధానం చెప్పినట్టు అనటం మరొక దృశ్యం..
ఈఇ. అంగరంగ వైభవంగా ఆకాశమంత పందిరీ భూమి అంత  వేదికా వేసి సత్యాకృష్ణుల వివాహం జరగడం అందుల తాము ఆహుతులై అపార ధనరాసుల చేత చీనీచీనాంబరాల చేత సత్కృతులు కావడం మిత్రత్రయం (అక్రూర కృతవర్మ శతధన్వులు) పెళ్ళి పందిట్లోనే విసపు నవ్వుల విసవిసలతో గుసగుసలుగా ఇదంతా ఆయన తెలివితేటలు కాదు. అంతా శమంతకం దయ సొమ్ము దానిది సోకు వీడిది - అనుకోవడం మరొక దృశ్యం...
ఈ మూడు దృశ్యాలు అక్రూరుని మనసులో మెదిలినట్లుగా వ్రాశారు. ఇక్కడితో మొదటిభాగం లోని విషయాలని ముగిస్తున్నాను.

రెండవభాగం

రెండవభాగంలోని కల్పనల గురించి కూడా క్లుప్తంగా చెప్పుకుందాం.ఇంతకు మునుపు చెప్పినట్లు లతమోహనవంశీ నవలలో లాంటి అర్థం పర్థం లేని వాక్యాలు ఇందులోనూ చాలా ఉన్నాయి. ఉదాహరణకి కృష్ణుడు రాధ గురించి దారుకుడితో చెప్పే మాటలు - వాళ్ల సంభాషణ ఇలా ఉంటుంది.

“నంద వ్రజానికి దగ్గరగా ఉన్న మరో వ్రేపల్లెలో వృషభానుడు అనే ఓ ఆసామి ఆయన మా నందయ్య గారికి దూరపు చుట్టం. వరస కలిసింది కదా అని పెళ్ళి చేద్దామనుకున్నారు పెద్దలు. కాని మా ఇద్దరి వయస్సులో చాలా తేడా ఉంది. పైగా వరసకేమో మేనత్త. ఎలా చెప్పు”  
“చిత్తం”
“అంచేత పెళ్ళి వద్దనేశాను. కాని నన్ను వదలి రాధ ఆమెను వదలి నేను ఉండలేము. అదీ సంగతి”

మళ్ళీ వెనక్కి వెళ్ళి రెండు సార్లు చదివాను. ఏమిటీ సంభాషణ! ఒకపక్క పెద్దవాళ్ళు వరస కుదిరిందని పెళ్ళి చేద్దామనుకున్నారని చెప్తూనే మళ్ళీ వరస కాదు కాబట్టి నేను చేసుకోనన్నానంటాడు. అక్కడితో ఆగకుండా పెళ్ళి వద్దనేశాను కానీ ఆమెని వదలి వుండలేనంటూమూడో వైరుధ్యం చెప్తాడు అక్కడికి వరస చూడవలసింది పెళ్ళికి మాత్రమే అయినట్లు!
ప్రయోజనమేమిటో అర్థం కాని కల్పనలూ వికారాలూ నవల రెండవ భాగంలో కూడా చాలా  వున్నాయి. ఉదాహరణగా ఒక్కటి చెప్తాను.
రేవతీ బలరాములు పెళ్ళయిన తర్వాత చాలాకాలానికి వాళ్ళిద్దరూ రోహిణిని చూడటానికి వస్తారు. ఆవిడ ఒక్కతీ ఆశ్రమ జీవితం లాంటిది గడుపుతూ నందుడి ఇంటి దగ్గరగా వుంటూ ఉంటుంది.
కంసుడి మరణం తర్వాత ఆవిడ మధురకి వచ్చి రాణివాసంలో ఉందో లేదో నాకు తెలియదు. అక్కడే నందయశోదలతో పాటు ఉండిపోయిందనడానుకోవడానికి, రేవతీ బలరాముల వివాహం ఆమె చూడలేదని అనుకోవడానికి ఆధారం ఏమైనా ఉందా లేక అది కేవలం రచయిత కల్పనా అన్న విషయం తెలియదు. ఎందుకంటే యశోదా నందులే మథురకి వచ్చి కృష్ణుడితో ఉన్నారని వ్రాసిన రచయిత రోహిణి వంటరిగా గోకులంలోనే ఉండిపోయిందని వ్రాయడం నప్పలేదనిపించింది. ఆ విషయం  అలావుంచినా... ఆ సన్నివేశంలో రోహిణి రేవతుల మధ్య సంభాషణ కూడా  బాగాలేదనిపించింది.
మొదట రోహిణి రేవతిని “అవునమ్మా అసలు మీ పెళ్ళికత ఎలా జరిగిందో నాచెవిని పడెయ్యరాదూ!” అంటుంది.
“అంతకంటేనా అత్తా, మీరు వినాలిగాని” అంటూ మొదలుపెట్టి రేవతి వివరంగా కథంతా (తన తండ్రి తనకి సంబంధం వెతకడం కోసంబ్రహ్మలోకానికి వెళ్ళడం వంటి విశేషాలు) చెప్తుంది.ఆ తరువాతి రచన, సంభాషణ ఈ క్రింది విధంగా  సాగుతాయి.
అదంతా వీలైనంత వరకు రెప్పలార్పకుండా ఏవో భూమికలలో విహరిస్తూ ఓ వంక శివధ్యానం చేస్తూ విన్న రోహిణి హఠాత్తుగా భూలోకానికి అవతరించినట్లు “చాలా బాగా చెప్పేవే నాతల్లీ”అన్నది.
కొద్ది క్షణాలు విరామం తర్వాత మళ్ళీ అడగడం రోహిణి వంతే అయింది. “అవునే కోడలు పిల్లా గడుసుదానివే. పెళ్ళి ముచ్చట చెప్పావు గాని సంసారపు ముచ్చట చెప్పవేమమ్మ ముసలివాళ్ళకి మీ పడుచువాళ్ల పడకింటి రహస్యాలు వినాలనిపిస్తుంది. నేనక్కడ లేనుగానీ, అచ్చట ముచ్చట్లన్నీ కళ్ళార కని మురిసి పోనా యేమి?’అనగా రేవతి పకపకా నవ్వింది. నవ్విన రీతి నవ్వకుండా తెరలు తెరలుగా నవ్వుతుంటే కాస్సేపు వీణావాదనలు, కాస్సేపు మర్దళ ధ్వానాలు, మరోసారి మబ్బుటరుపులు, ఇంకోసారి గాలియీలల్లో పాము బుసలు ఇలా నవ్వుల రంగవల్లులు అయ్యాక రేవతి అన్నది. చీ పొండి అత్తయ్యా!
“పోతే ఎలాగమ్మా.. రససాగరాలు పోటెత్తవద్దా. పరువాలు పంటకి రావద్దా. కౌగిళ్ళు బిగిసిపోవద్దా. సెలయేళ్ళు కలిసి పారొద్దా. కడలికడుపున రత్నాలు కాయొద్దా  - వివరంగా చెప్పమ్మా” అన్నది రోహిణి. “నిజమా అత్తయ్యా మీరు వినాలా అయితే..” అంటూ రేవతి మధురమంద్ర స్వరంతో కన్నుల వెన్నెల తొణకగా చీరకొంగు పురివేస్తూ చెప్పడం ప్రారంభించింది.

ఇదీ ఆ సంభాషణ. నాకేమీ నచ్చలేదు ఇది.

అలాగే ద్రౌపది సత్యతో చెప్పే మాటలు:
“అదేనమ్మా, ఒక్క భర్తను సమాళించడానికే ఓపిక చాలక ఓసరిల్లుతుంటామే అయిదుగుర్ని ఎలాగమ్మా ఆదుకుంటున్నావు?” అన్న సత్య ప్రశ్నకి ద్రౌపది జవాబు ఇలా వుంటుంది.
“నేను మనస్సుని. బంధ మోక్ష కారణమైన రహస్సుని. ఎప్పుడు ఎలా ప్రవర్తించి లోకం తాలూకు మహస్సునీ తమస్సునీ ఎలా నడిపిస్తానో వెంట  నడుస్తానో  నాకే తెలీదు. నన్ను అదుపు చేసి ఆన పెట్టడానికి ఆ అయిదుగురూ చేతగాక నాతోపాటే ఎగురుతుంటారు. అంతే కదా అయిదు ఇంద్రియాలనీ మనసే కదా కట్టిపడేసి కథ నడిపిస్తుంది. అంచేత మా పెద్దాయన నియమనిష్ఠాగరిష్ఠమైన ధర్మ సంస్కారంలోను, రెండోవారి కండ బలంలోను గుందెబలంలోను, మూడవ వారి అనర్ఘ లాఘవ భుజ వీర్య విన్యాసంలోను, నాలుగోవారి అందంలోను, అయిదో వారి అనంత వైదుష్యంలోను నేనున్నాను. మరి ఆ అందరూ వచ్చి నాలో విశ్రాంతి తీసుకుంటారు. ఇలాగ ఈ నిరంతర ప్రస్థానం సాగుతుంటే మనుషుల కథలూ దేశాల కథలూ ఓ కొలిక్కి రావు. కంచికి చేరవు. అంచేత అన్నయ్య బుద్ధి స్థానంలో పగ్గాలు పట్టి మా జీవిత రథాలని తోలుతున్నాడు. ఎక్కడికి చేరుస్తాడో. ఎప్పుడు చేరుస్తాడో.” 

ఈ మాటలు వ్రాసిన తీరూ నాకు నచ్చలేదు. వాటిని ద్రౌపది ద్వారా చెప్పించడం అసలు నచ్చలేదు.
కృష్ణుడి దివ్యత్వాన్ని చెప్పాలనుకున్న చోట్లలో దానిని నాటకీయమైన మాటలతోను  ఆకట్టుకోని చమత్కారాలతోను  చెప్పారు. అవి కృష్ణుడి దివ్యత్వాన్ని అర్థం చేయకపోగా చిరాకు కలిగించాయి. ఇక మిగిలిన చోట్లంతా చాలా సాధారణంగా మామూలు మనిషిలా వ్రాశారు. అవీ కృష్ణుడి పట్ల మనకి ఉన్న భావనతో పొసగడం లేదు.
ఉదాహరణకి శమంతక పంచకంలో అందరూ కలుసుకునే సన్నివేశాన్ని చెప్పేటపుడు - నందయశోదలు అంతదూరం నుండి బయలుదేరి అందునా ఇంత వృద్ధాప్యంలో బయలుదేరి వస్తారని కన్నయ్య అనుకోలేదు. - అంటారు రచయిత. అలాగే మరొక చోట -  అష్టమహిషులలో సత్యభామ అంటే స్వామికి వల్లమాలిన వలపు తనివితీరని సంబరము అన్న సంగతి లోకానికి తెలిసినా యిప్పుడు మళ్ళీ ఆమె యొక్క మధురానుభవ ప్రదములైన అందాలు విడివిడిగా ఎందుకు జ్ఞాపకం వస్తున్నవో, రుక్మిణీ దేవి అంతఃపురంలో పట్టుమని పదినాళ్ళయినా సన్నిధి చేయకుందానే స్వామి కాలిచక్రాలు ఎందుకు సత్యభవనం కేసి కదులుతున్నాయో ఆయనకే తెలీదు. - అని వ్రాస్తారు.

రాజసూయయాగం తర్వాత కృష్ణుడు ద్రౌపదికీ ధర్మరాజుకీ ఇచ్చే కానుకల గురించిన కల్పన ఒకటి ఉంది.
ద్రౌపదికి ఒక చీర ఇచ్చి “ఇది మా సీమ నేతగాండ్ర పనివాడితనానికి చిహ్నం. చూడ్డానికి సాదాగా ఉన్నా జరీ చీర కన్నా చీనాంబరం కన్నా మిన్న. ఒక్క చీరెలో వెయ్యి చీరలున్నట్లు అన్ని రంగులు అన్ని మెరుపులు. పండగ పబ్బాలలో కట్టుకో”అంటాడు.
అలాగే ధర్మరాజుకి పాచికలు ఇచ్చి “క్షత్రియులకు అక్షక్రీడ ఆరవప్రాణం. ఎవరు ఆహ్వానించినా ఎన్నిసార్లు ఆహ్వానించినా కాదనకు.నిన్ను విజయశ్రీ వరిస్తుంది. నీవల్ల ఆర్యావర్తం తరిస్తుంది.” అంటాడు.
ఈ కల్పనలు కొత్తగా ఉన్నాయి కానీ ఈ కల్పనల  ద్వారా రచయిత చెప్పదల్చుకున్న భావం ఏమిటో సాధించదలచిన ప్రయోజనం ఏమిటో నాకు స్పష్టం కాలేదు. ఈ కానుకల విషయం నవలలో తర్వాత ఎక్కడా మళ్ళీ ప్రస్తావనకు రాలేదు. 

                                                                      ******




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సతీసుమతి

తారకము

సంక్లిష్టమైన కథలు