మార్పు మన చేతుల్లో..
మార్పు.
ఇది సహజమే. ప్రతి తరంలోనూ ప్రతి వ్యక్తీ నిరంతరం గమనించేదే. అయితే సాంకేతికత బాగా
పెరిగిన నేటి కాలంలో మార్పులు మరింత వేగంగా మన జీవితాలలోకి ప్రవేశించడం
కనిపిస్తోంది.
మార్పుని
త్వరగా అంగీకరించేవారు కొందరుంటారు. నిరాకరించేవారూ ఉంటారు. మార్పుని త్వరగా
అంగీకరించేవారు జీవితంలో పైకొస్తారనీ, మార్పుని అంగీకరించలేని వాళ్ళకి ఎదుగూబొదుగూ
ఉండదనీ నేటి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తాయి. అవి మొదటి రకం వారిని ప్రగతి
కారకులుగా గుర్తిస్తే రెండో రకం వారిని ప్రగతి నిరోధకులుగా జమకడతాయి.
“మార్పుకు సదా సిద్దంగా వుండాలి” అన్న విషయాన్ని
ఇప్పటి యువతకు చదువులలోను, ఉద్యోగాల లోనూ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి మరీ
చెప్తున్నారు. ఆ విషయం మీద వ్యక్తిత్వ వికాస పుస్తకాలూ వస్తున్నాయి. మార్పుని అంగీకరించకపోవడం
తెలివితక్కువ తనమనీ, అసమర్ధత అనీ అవి వివరిస్తాయి. మార్పు జరుగుతుందంటే భయపడేవారినీ, మార్పుని అనుమానంగా
చూసేవారినీ అపహాస్యం చేస్తాయి.
అయితే
కొన్ని ప్రశ్నలని మాత్రం
ఆ పుస్తకాలలో, తరగతులలో చర్చించరు.
ఎవరైనా ఆ ప్రశ్నలు అడిగినా సమాధానం దాటవేస్తారు. ఎందుకంటే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పడం ఎంత సులభమో అంత
కష్టం!
మార్పుని అంగీకరించక పోవడం అన్నివేళలా మూర్ఖత్వమేనా! మంచి మార్పుని అంగీకరించవచ్చు. మరి చెడు మార్పు అయితే! ప్రమాదకరమయినది అయితే! మార్పు అనివార్యం అనేది నిజమే అయినా దానికి అందరూ అన్నివేళలా ఒకేరకంగా స్పందించాలా, మార్పుకి సంసిద్ధంగా ఉండడము, దానిని తప్పనిసరిగా స్వీకరించడమే తప్ప మనం ఇంకేమీ చేయలేమా, చేయాల్సిన అవసరం లేదా! ఒక మార్పు మంచిదా కాదా, స్వీకరింప దగినదా కాదా అన్న విషయం ఎలా తెలుస్తుంది? ఆ విషయాన్ని పరీక్షించడానికీ, నిర్ణయం తీసుకోవడానికీ ఏమైనా సూత్రాలూ, మార్గాలూ ఉన్నాయా! – ఇలాంటి అనేక ప్రశ్నలకి అక్కడ సమాధానం వుండదు. అందువల్ల ఆ ప్రశ్నలు నిర్లక్ష్యం చేయబడతాయి. ఏ ప్రశ్నలూ లేకుండా మార్పును అంగీకరించే వారు తప్ప మిగిలినవారందరూ ప్రగతినిరోధకులుగానే తీర్మానించబడతారు.
ఎందుకంటే
పైన చెప్పుకున్నట్లుగా ఆ ప్రశ్నలు చాలా సంక్లిష్టమైనవి. అందరూ సమాధానం చెప్పగలవి
కావు. భారతీయమైన ఆలోచనలు వున్న వారికి మాత్రమే
ఈ ప్రశ్నలకి స్పష్టమైన సమాధానం స్పురిస్తుంది. ఏ మార్పుకి ఎప్పుడు ఎలా స్పందించాలో అస్పష్టత లేకుండా
అర్ధమవుతుంది.
అవును,
భారతీయమైన ఆలోచనలు ప్రతి విషయం లోనూ ఇహాన్నీ పరాన్నీ కూడా లెక్కిస్తాయి. ఇంద్రియ
నిగ్రహము, మనో నిగ్రహము, చిత్తశుద్ధి వంటి
లక్షణాలు సాధించడమే లక్ష్యంగా ప్రతి అంశాన్నీ బేరీజు వేస్తాయి. విద్య, కళలు, సంపద,
కీర్తి - ఏదైనా సరే ఆ లక్షణాలకి దగ్గర
చేసినపుడు స్వీకరించదగినవి అవుతాయి. దూరం చేసేట్లయితే అవే విషయాలు
త్యజించదగినవీ అవుతాయి.
ఆ
విషయాన్ని తెలియచేసే చిన్న చిన్న సూక్తులు,
సామెతలు మనకి వున్నాయి. మన సాహిత్యం లోనూ ఆ విషయాలు చర్చించబడినాయి.
కవిసామ్రాట్
విశ్వనాథ సత్యనారాయణ గారు తమ వేయిపడగలు నవలలో మంగమ్మ అనే పాత్ర ద్వారా చెప్పించిన
ఈ క్రింది వాక్యం అటువంటి ఒక సూత్రం.
“.. సంఘములో
కానీ,
మతములో కాని, మరొకదానిలో
కాని,
మీరెన్ని మార్పులైన తేవచ్చును. ఇంద్రియ నిగ్రహము, మనో
నిగ్రహము, తద్వారా భక్తియో, జ్ఞానమో
కలుగుటకు వీలుండెనేని మీరు తెచ్చిన మార్పు శిరోగ్రాహ్యము.”
ఈ వాక్యం మనజీవితంలో ఎదురయే మార్పులని
అర్ధం చేసుకోవడానికీ, అంగీకరించడానికీ కూడా ఉపయోగించుకోగల మంచి సాధనం.
అయితే
కొన్ని మార్పులు వాటిని స్వీకరించాలా వద్దా అన్న నిర్ణయాన్ని మనకి యివ్వవు. మనం స్వీకరించకుండా వుండలేని
పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఆ మార్పును స్వీకరించడం తప్ప మరో గత్యంతరం లేనపుడు
ఏం చేయాలి?
అపుడు
కూడా ఇదే సూత్రానికి లోబడి ఆ మార్పును ఉపయోగించుకోవాలి. ఇంద్రియ నిగ్రహాన్నీ, మనో నిగ్రహాన్నీ, భక్తినీ, జ్ఞానాన్నీ,
చిత్తశుద్ధినీ పెంచుకునేందుకు అనుగుణంగా మనం ఆ మార్పును వాడుకోవాలి.
ఇక్కడ
చమత్కారం ఏమిటంటే అసలు ఎపుడయితే ఇలాంటి ఆలోచనా ధోరణిని అలవరచుకుంటామో అపుడు ఈ
ప్రపంచంలోని ఏ విషయమైనా, అది ఎంత
గొప్పదయినా- అది మన చేతుల్లో వుంటుంది కానీ మనం దాని చేతుల్లోకి వెళ్ళము.
మార్పు
కూడా అంతే. కాలంతో పాటు, దేశంతో పాటు అనివార్యంగా కొన్ని మార్పులు మన జీవితంలోకి
వస్తాయి. నిజమే. అయితే వాటిని పరీక్షించే, ఉపయోగించుకునే కిటుకు మాత్రం ఎప్పుడూ
ఒకటే. పైన చెప్పుకున్న ఆ సూత్రాన్ని మాత్రం మనం మరిచిపోకుండా వుంటే చాలు.
వదిలిపెట్టకుండా వుంటే చాలు. అపుడు మార్పు మన చేతుల్లో వుంటుంది. మనం మార్పు
చేతుల్లోకి వెళ్ళము.
ఒకసారి
ఈ విషయం అర్ధం చేసుకున్నాక ఈ నేపథ్యంలో నుంచి మనం మన జీవనశైలిలో వచ్చిన మార్పులని
పరిశీలించుకుంటే కలిగే అవగాహన విభిన్నంగా వుంటుంది.
ఈరోజు
మనం గమనిస్తే పురుషుల కంటే కూడా మహిళల జీవనశైలిలో వచ్చిన మార్పు ఎక్కువ. మిగిలిన
దేశకాల పరిస్థితులతో వచ్చిన మార్పులే కాకుండా పెరిగిన సాంకేతికత విజ్ఞానం వారి జీవనశైలిని చాలా వరకూ మార్చింది.
ఈ
మార్పులు రెండు రకాలుగా కనిపిస్తాయి. ఒకటి ఇంట్లో మహిళలు చేసుకునే ప్రతి పనికీ ఎన్నో కొత్త కొత్త గృహోపకరణాలు
అందుబాటులోకి రావడం. రెండవది కంప్యూటర్, ఇంటర్నెట్ వంటి వాటి వాడకం పెరగడం.
మొదటి
దానివలన ప్రత్యక్షంగా కనబడే ప్రభావాలు - మహిళలకి
శారీరక శ్రమ తగ్గడం, సమయం బాగా మిగలడం.
ఇక
రెండవ మార్పు ద్వారా సాధారణ గృహిణులు
కూడా కొన్ని క్రొత్త వ్యాపకాలు
ఏర్పరచుకోవడం కనబడుతోంది. ఇ-మెయిల్ పంపడంతో మొదలుపెట్టి ఫేస్బుక్ ద్వారా తమ పరిచయాలను,
పరిధినీ విస్తరించుకోవడం, బ్లాగులు వంటి వాటి
ద్వారా వివిధ విషయాలపై తమ భావాలను వ్యక్తపరచడం చేస్తున్నారు. దీనివలన ప్రత్యక్షంగా
కనబడుతున్న ప్రభావాలు – మానసిక విశ్రాంతి
తగ్గడం, ఎంతెంత సమయమూ సరిపోకపోవడం!
ఇపుడు
ఈ మార్పులని పైన చెప్పుకున్న సూత్రం ఆధారంగా విశ్లేషించుకుంటే మనకి కొన్ని విషయాల
పట్ల స్పష్టత వస్తుంది. కొన్ని కొత్త ఆలోచనలూ, ప్రశ్నలు పుడతాయి. కర్తవ్యాలూ
బోధపడతాయి.
శారీరక శ్రమ తగ్గింది. సమయం మిగులుతోంది. స్థూలంగా చూస్తే ఈ మార్పు వలన మంచే జరిగిందనిపిస్తోంది. కానీ ఎవరి జీవితంలో వారికి మంచే జరిగిందా అన్నది ఎవరికి వారే విశ్లేషించుకోవాలి. వేసుకోవలసిన ప్రశ్న ఒకటే. ఈ తగ్గిన శ్రమా, మిగిలిన సమయమూ ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, చిత్తశుద్ధి మొదలైనవి కలిగిస్తున్నాయా, కనీసం వాటన్నిటినీ కలిగించే పనులని చేసుకునేందుకు పరోక్షంగా ఉపయోగపడుతున్నాయా! – అని. అలాగయితే అవి మనకు మంచి చేసినట్లే. లేదంటే కొంచెం ఆలోచించాలి. మార్పు గురించి కాదు. ఆ మార్పుని మనం సవ్యంగా వాడుకోవడం లేదేమోనన్న విషయం గురించి.
ఒకప్పుడు రోట్లో దంచుకుంటూ, తిరగలి విసురుకుంటూ పాటలు పాడుకున్నవాళ్ళు, ఇప్పుడు ఆ పనులు చేయాల్సిన అవసరం లేకుండా పోవడం వలన మిగిలిపోయిన సమయాన్ని మరింత చక్కగా సంగీతసాధన చేయడానికి వాడుకుంటే; లేదా ఆ సమయంలో ఇరుగుపొరుగుతో కబుర్లు చెప్పుకున్నవాళ్ళు, ఇపుడు అంతకు మించిన విజ్ఞానదాయకమైన పని ఏమైనా చేయగలిగితే అపుడు ఆ సమయం సద్వినియోగం అయినట్లు.
పనీ
పాటా చేసుకుంటూ యధాలాపంగా, యాంత్రికంగా చేసుకున్న భగవన్నామస్మరణ కూడా మనకి అచ్చంగా
సుఖంగా మిగిలిన తీరిక సమయంలో చేసుకోలేకపోతే ఆ మార్పు మనకి మంచి చేసిందని ఎలా
అనుకోవడం?
ఇక
రెండవ మార్పు నిజానికి పెనుమార్పే. ఇది చాలావరకూ
మనం పైన చెప్పుకున్న సూత్రానికి వ్యతిరేక దిశలో పని చేస్తున్నట్లే
కనబడుతోంది.
పిల్లలకే
కాదు పెద్దవాళ్ళకి కూడా ఇంటర్నెట్ వాడుతుంటే సమయం ఎలా గడుస్తుందో తెలియదు. బ్లాగుల ద్వారా తమకి నచ్చిన, నచ్చని విషయాల మీద తమ అభిప్రాయాలు ఎప్పటికప్పుడు
వెలిబుచ్చే అవకాశం కలగడం, దానికి చాలా మంది ప్రతిస్పందించడం, ప్రశంసించడం వంటివి
ఎవరికైనా ఆనందాన్ని కలిగిస్తాయి. జీవితంలో ఏదో సాధిస్తున్నామన్న భావాన్ని కలిగిస్తాయి.
అయితే
- మనసులో ఏమనిపిస్తే అది చెప్పేయగలగడమే, అలాంటి అవకాశము, స్వేచ్ఛ లభించడమే విజయం
అని అనుకోవడం ఎంతవరకూ సమంజసం! అసలు మన మనసులో ఏమనిపిస్తోంది? ఇది బయటికి చెప్పాలని
ఎందుకనిపిస్తోంది? ఈ అనిపించడము, చెప్పడము
ఎప్పటికి ఆగుతుంది? ఇదే స్వేచ్ఛని
అవతలివారు కూడా తీసుకున్నపుడు మన మనసు దానిని ఎంతవరకూ అంగీకరిస్తోంది? – ఈ
ప్రశ్నలు ఇంటర్నెట్ ముందు కూర్చుంటే రావు. అనుకున్న ప్రతివిషయమూ “చెప్పడమే”
లక్ష్యమైనపుడు ఆలోచన తగ్గిపోతుంది. ఆలోచన తగ్గిపోవడం అంటే మన సూత్రానికి వ్యతిరేక
దిశలో నడవడమే కదా!
పొద్దున్నే
ఇంకా పూర్తిగా తెల్లవారకముందే మనకి అనిపించినదేదో ఫేస్బుక్ లోనో మరొక చోటో పెట్టడం,
అప్పట్నుంచీ ప్రతి అయిదు నిమిషాలకీ దానిని ఎందరు యిష్టపడ్డారో ఏమని
ప్రతిస్పందించారో పరీక్షించుకోవడం, ఎవరైనా మన భావాన్ని ఖండిస్తే నొచ్చుకోవడం,
ఆవేశపడడం, రాత్రి పోద్దుపోయినా నిద్రపోకుండా దానిపై ఆలోచించడం, వాదించడం – మనకున్న
కాస్త తెలివితేటలూ ఇందుకే ఉపయోగపడడం – ఇదేనా జీవితం!
ఈ సౌకర్యాన్ని అంటే ఇంటర్నెట్ నీ, బ్లాగులనీ - చెప్పడానికి కాక వినడానికి వాడుకుందామనే ఆలోచన చేసేవారు కొందరు లేకపోలేదు. అయితే వినడమూ గొప్ప విచక్షణ తో చేయవలసిన విషయమే. “అబ్బ! ఎంత “ఇన్ఫర్మేషన్” తెలుస్తోంది దీనివలన!” అని ఆనందంగానే వుంటుంది. చాలా జ్ఞానం సంపాదించేసుకుంటున్నామనిపిస్తుంది. అప్పుడే, సరిగ్గా మళ్ళీ అప్పుడే మన సూత్రాన్ని దగ్గర పెట్టుకుని మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే అసలు తెలియకపోవడం కంటే అనవసరమైనవి తెలియడం చాలా ప్రమాదకరం!
“సాంగత్యం” అనేమాటకి వున్న ప్రాముఖ్యత అదృష్టవశాత్తూ మనకి తెలుసు.
“సత్సంగత్వే నిస్సంగత్వం! నిస్సంగత్వే నిర్మోహత్వం!” వంటి శ్లోకాలు కూడా అపుడపుడూ చెవిన పడుతూనే వుంటాయి. వాటిని మర్చిపోకపోతే, మననం చేసుకుంటూ వుంటే ప్రతి మార్పునీ మంచికే వాడుకోవచ్చు. అది మన గమ్యానికి మనల్ని దూరం చేయకుండా జాగ్రత్త పడనూ వచ్చు.
*****
కామెంట్‌లు