"పులుల సత్యాగ్రహం" నవల - విశ్వనాథ సత్యనారాయణ
వ్యంగ్య ధోరణిలో వ్రాసిన నవల. నిజానికి
వ్యంగ్యరచనలు నన్ను పెద్దగా ఆకర్షించవు. ఈ నవల కూడా అంతగా ఆకర్షించిందని చెప్పలేను. ఒక గ్రామం, దాని పొలిమేరలలో అడవి, ఆ ఆడవిలో పులులు, అవి గ్రామస్తుల మీద దాడి చేయడం, వాటికి వ్యతిరేకంగా ఆ
గ్రామస్తులు సత్యాగ్రహం చేయడం అనే కథ ఆధారంగా సత్యాగ్రహం గురించి వ్యంగ్యం.
***
ఆసక్తికరంగా
అనిపించిన కొన్ని వాక్యాలు :
నవల మొదటి పేజీలోనే
పశువులని అడ్డం పెట్టుకుని తెలివి గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు రచయిత.
గ్రామానికీ అడవికీ మధ్యలో వాగు వుంది. అది అపుడపుడూ ఉధృతంగా ప్రవహిస్తుంది. కానీ
అది ఎక్కువసేపు వుండదు. ఒక పది పదిహేను నిమిషాలలో ఆ ఉధృతం తగ్గుతుంది. అప్పుడు
వాగు దాటవచ్చు. ఆ విషయం పశువులకు కూడా తెలుస్తుందట. కానీ అసలు వాగు తగ్గేదాకా ఆగడం
ఆ తర్వాత దానిని దాటి అడవిలోకి వెళ్ళడం ఎందుకు? అక్కడ పులుల నోట పడే ప్రమాదాన్ని ఎదుర్కోవడం
ఎందుకు? వాగులకి ఇవతల మాత్రం అడవి లేదా అని అనుకునే తెలివి
లేదట. కాబట్టి దీన్ని తెలివి అనాలా లేదా అనేది ప్రశ్న. వాగు అవతల వున్న అడవిలో ఇక్కడి కంటే
గడ్డి మరో అంగుళం ఎక్కువ వుంటుంది. మెడ ఎక్కువ వంచనక్కర్లేదు అంటాయేమో పశువులు!
వాటి సౌలభ్యం సంగతి మనకేం తెలుసు అది తెలివి కాదని తీర్మానించడానికి - అని మరొక
చర్చ. వేసుకుపోయే పులి ఎలాగో వేసుకు పోతుంది. వాగు అవతలికి వెళ్తేనే పులి నోట పడతామా? అంటూ మరొక వ్యంగ్యం. ఇలా ఆసక్తికరంగా మొదలవుతుంది నవల.
***
“పులి మీద పుట్ర అని ఒక
శాస్త్రం వుంది. ఇల్లా లోకంలో వుండే లోకోక్తులను, నానుడులను
శాస్త్రాలంటారేమిటో! శాస్త్రాలల్లో వుండే మాటలు ఎంత నిజమో ఈ మాటలు అంత నిజమని
అర్థం కాబోలు. అట్టే చూస్తే శాస్త్రాల కన్నా ఇవే నిజమేమో! అంటే ఇవి ఎక్కువ నిజమని
కాదు. పరభాషా సంప్రదాయ మత విద్యా సంస్కారాలు ప్రబలితే శాస్త్రాల మీద అభిమానం గౌరవం
పోవచ్చు గాని ఈ లోకోక్తుల మీద గౌరవం పోదు. ఈ లోకోక్తుల మీద గౌరవం ఆ భాషకు
ప్రాధాన్యం పోతే పోతుంది.
***
మరొకచోట “సత్యాగ్రహమంటే గాంధీగారి లాంటి వాడు కావాలి.
మరీ నిజంగా చూస్తే గాంధీగారి కంటే గొప్పవాడు కావాలి మానసికంగా.” అంటారు. (ఎందుకంటే గాంధీగారిని పోలీసులు కఱ్ఱలతో కొట్టరు. వీధిలో పడవేసి లాగరు. చెరసాలలో నానా
బాధలు పెట్టరు. ఊరికే బంధించి తీసుకొని పోయి ఒక దివ్య సౌధములో ఉంచుతారు.
రాజోపభోగాలు జరుపుతుంటారు. కాబట్టి ఉత్తమోత్తములు సత్యాగ్రహం చేయడం వేరు నీవూ నేనూ
చేయడం వేరు)
సత్యాగ్రహ సిద్దాంతం
చూస్తే మానసికంగా అతడు యోగి కావాలి. నిర్లిప్తుడు కావాలి. ఎదుటివాని మీద కోపం కానీ
ఈర్ష్య కానీ ఉండరాదు. అంటారు. ఇది లౌకిక విషయాలలో కనిపించే
భేదం. ఈ భేదమే ఇంత వుంటే ఇక మానసిక విషయంలో భేదం మాట ఏమిటి? సత్యాగ్రం అంటే
కామక్రోధాలు లేకుండా వుండాలి. అయితే ఏదో ఒక కామం వుండడం వలనా దానిని సాధించాలనే
ఉద్దేశ్యము వుండడం వలనే కదా సత్యాగ్రహం చేస్తారు! ఈ వైరుధ్యానికి సమన్వయం ఎలా కుదురుతుంది అని ఒక
ప్రశ్న తీసుకు వస్తారు రచయిత.
***
మరొక చోట రెండు పక్షాలూ దోషభూయిష్టమైనవే
అని తెలిసి కూడా వాటిలో ఒకదాన్ని కొంచెం తక్కువ దోషాలు ఉన్నాయనుకున్న దానిని ఎంచుకునేందుకు ప్రయత్నించే మనుషుల తత్వాన్ని గురించి
చెప్పి ఆ తర్వాత ఆ విషయంపై ఇలా వ్యాఖ్యానిస్తారు. “మితిమీరకుండా వున్న
స్థితిలో లోకాన్ని ఉన్నపాటుగా అంగీకరించాలి. సామాన్యమైన దోషాలకు ఉరి తీయరు. హత్య
చేస్తే ఉరితీస్తారు. అంటే ఒక దోషం లోకోపద్రవకరమైతే ఆ దోషాన్ని నివారించాలి. దోషాలు
తక్కువగా ఉన్న పరిస్థితి చూసుకోవడమే గానీ సర్వదోషరహితంగా
ఎప్పుడూ చేయలేము. అలా సర్వదోష రహితమూ సర్వజ్ఞాన సహితమూ అయితే ఇది మానవలోకమే కాదు
వైకుంఠమో కైలసమో సత్యలోకమో అవుతుంది. ఇక్కడ మాత్రం అందరూ కామక్రోధాది దూషితబద్దులే
అయి ఉంటారు. అందుచేత లోకాన్నంతా పరమ సుఖమయం
చేద్దాము అనే రాజ్యాంగ పథకం కానీ సర్వజనులు జ్ఞానుల వలె ప్రవర్తించాలనే ఉద్యమం
కానీ ఎప్పుడూ సంపూర్ణంగా ఫలించదు. వాటి ఫలితం ఎప్పుడూ దృశ్యాదృశ్యంగా ఉంటుంది. సత్యాగ్రహం
అలాంటిది.”
***
మరొక చోట గంగినీడు అనే పాత్ర గురించి
చెప్తారు. అతను స్వర్గం, నరకం, పాపం, పుణ్యం – ఇవేవీ లేవంటాడు. యజ్ఞ యాగాదులను విమర్శిస్తాడు. కానీ సత్యాగ్రహ ఉద్యమం
గురించి ఉపన్యసించేటపుడు స్వాతంత్య రథాన్ని జగన్నాథ రథ చక్రాలతో పోలుస్తాడు,
పోరాటాన్ని యజ్ఞంతో పోలుస్తాడు అందులో మరణిస్తే స్వర్గం లభిస్తుందంటాడు.
అదేమిటంటే అలా చెప్పకపోతే ప్రజలకు అర్థం కాదంటాడు.
*****
కామెంట్‌లు