"అంతరాత్మ " నవల - విశ్వనాథ సత్యనారాయణ
ఇది విశ్వనాథ వారి మొదటి నవల. రచనాకాలం 1921.
భార్యాభర్తల మధ్య ఏర్పడిన చిన్న పంతం చుట్టూ చెప్పబడిన చిన్న నవల ఇది. సుగుణభూషణరావు, శ్యామల భార్యాభర్తలు. అతను సనాతనమైన సంప్రదాయాలపట్లా ఆచారాలపట్లా ఆసక్తి వున్నవాడు. ఆమె ఆకాలానికి కాస్త ఆధునికమైన ఆలోచనలున్న కుటుంబం నుంచి వచ్చిన పిల్ల. భార్యాభర్తల మధ్య ప్రేమకు లోటేమీ లేదు. ఒకసారి పుట్టింటికి వెళ్ళినపుడు అక్కడినుంచి భర్తకి ఉత్తరం రాస్తుంది ఆమె. అది అతనికి యిష్టం లేదు. ఆడవాళ్ళు ఉత్తరం రాయడం తనకి యిష్టం లేదన్న విషయం తెలిసి కూడా ఆమె ఆపని చేసినదని అతనికి కోపం. అందుకు సంజాయిషీ చెప్తూ ఆమె మరొక ఉత్తరం రాస్తుంది. అది చూశాక అతని కోపం తగ్గుతుంది. కానీ సర్దుబాటు జరగడానికి చిన్న చిన్న ఆటంకాలు. అతను చొరవ చూపినపుడు ఆమె బింకం చూపడం ఆమె చొరవ చూపినపుడు అతను బింకం చూపడం.. తర్వాత అయ్యో ఎందుకలా చేశామని ఎవరికివారే బాధపడడం – ఇలాంటి సన్నివేశాలు ఉంటాయి.
భార్యాభర్తల మధ్యన ఉండే పంతాలను, మనసుకు సంబంధించిన సున్నితమైన అంశాలను సూక్ష్మంగా చూసి వ్రాయగల రచయిత శక్తి ఈ మొదటి నవలలోనే సూచన ప్రాయంగా కనిపిస్తుంది మనకు.
ఇంకా సోదరీ సోదరుల మధ్యనా వదినా మరదళ్ళ మధ్యనా స్నేహితుల మధ్యనా వుండే బాంధవ్యాలలోని సున్నితమైన అంశాలు కూడా అక్కడక్కడా మెరుస్తూ కనిపిస్తాయి.
పల్లెటూర్లలోని అనుబంధాలు, సంప్రదాయలలోని సొగసులు, తలచెడి తమ్ముడింటికి చేరినా అభద్రతనీ, అసహాయతనీ కాక సమర్థతనీ, ఔదార్యాన్నీ కనబరిచే విధవాడపడుచులు – ఇలాంటి విశ్వనాథ వారి దృక్కోణంలో నుంచి చూసినపుడు మాత్రమే కనబడే మంచి విషయాలన్నీ ఈ నవలలోనూ కనిపిస్తాయి.
*****
కామెంట్‌లు