22 August 2019 fb post

చెన్నయ్ బెంగుళూరులలో వారం పైగా గడిపి ఇవాళ హైదరాబాద్ చేరాను.
అత్తి వరదర్ దర్శనం గురించి చెప్పేశాను కదా, ఇక మిగతా విశేషాలు చెప్పుకోవాలి.
ప్రయాణంలో వచ్చిన చిన్న చిన్న మార్పుల వలన కలవాలనుకున్న స్నేహితులందరినీ కలవ లేక పోయాను. ఇద్దరిని మాత్రమే కలిసి మాట్లాడ గలిగాను.
15 సాయంత్రం చెన్నయ్ లో ఆముక్తమాల్యద గారితోను వారి అబ్బాయితోను రెండుగంటలు మాట్లాడటం..
18 న బెంగుళూరు లో Nagajyothi గారి ఇంట్లో భోజనం చేసి ఆవిడ కబుర్లు వినడం..
చాలా ఆనందాన్నిచ్చిన ఆ రెండు సమావేశాలూ కూడా నా కున్న అలసత్వం తో ముడిపడేవి కాదేమో కానీ వాళ్ళు ఇద్దరూ పూనుకుని ఆ సమావేశాలు జరిగేలా చూశారు.
నేను ఇంకా ట్రైన్ దిగక ముందే ఫోన్ చేసి "ఎన్ని గంటలకి వస్తారు? ఎలా వస్తారు?" అంటూ ప్రశ్నలు వేసి నాచేత సమాధానాలు చెప్పించారు ఆముక్తమాల్యద గారు. అలా ఎవరైనా నయానో భయానో "సరేనండి, చేస్తాను" అనేమాట నా నోట్లోంచి తెప్పిస్తే తప్ప ఏ కొత్త పనీ చేయడం లేదు నేను ఈ మధ్య.
ఇక నాగజ్యోతి గారయితే, ఫోన్ లో సందేశాల మీద సందేశాలు పంపి, నేను వెళ్ళే సరికి బోలెడన్ని వంటలు చేసి పెట్టి కళ్ళల్లో నీళ్ళు తిరిగేంత ఆప్యాయత చూపించారు.
నాకిష్టమయినవన్నీ వండి పెట్టి, పెరట్లోని తమలపాకులతో తాంబూలం చుట్టి ఇచ్చి, వాళ్ళ చెట్టు జామ పళ్ళు అపురూపంగా కోసుకొచ్చి, కాళ్ళకి శ్రద్దగా పసుపు రాసి చక్కటి చీర పెట్టి ఇంకా ఏదో చేయలేక పోయానని దిగులు మొహం పెట్టి పంపించారు.
నేను బెంగుళూరు లో వుండగానే ఆవిడ పెట్టిన పోస్ట్ చూశాను. ఎలా స్పందించాలో అర్థం కాక ఊరుకున్నాను.
అవును, ఆవిడ నా గురించి వ్రాసిన " శ్రీరామ భక్తి సంపన్నురాలు" అన్న మాట కలిగించిన ఆనందాన్ని చెప్పడానికి మాటలు లేవు మరి నా దగ్గర.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సతీసుమతి

తారకము

సంక్లిష్టమైన కథలు