వివిక్తస్థ



                                                            
“ఒంటరి ఆడది.”
ఆ మాట చెప్పేసి మౌనంగా కూర్చున్నాడు  ప్రవీణ్.
కిరణ్, రాజా మొహాలు చూసుకున్నారు ఎవరు ముందు మొదలుపెట్టాలి అన్నట్లు.
ఈ మధ్య ప్రవీణ్  వ్రాసిన ఒక కథకి పాతిక వేల రూపాయల బహుమతి వచ్చింది. స్నేహితులు పార్టీ అన్నారు. సరే సాయంత్రం కలుసుకుందాం అనుకున్నారు. కలుసుకున్నారు. మందు సేవిస్తూ మాటల్లో పడ్డారు.
“తర్వాతి కథ ఏం వ్రాయబోతున్నావురా? అన్నాడు రాజా.
ప్రవీణ్ నవ్వాడు. హటాత్తుగా ఏదో స్ఫురించినట్లూ “నేనొక మాట చెప్తాను. అది వినగానే మీకేమనిపించిందో చెప్పాలి.” అన్నాడు.
“అంటే?” అన్నారు ఇద్దరూ అర్ధం కానట్లు చూస్తూ.
“తర్వాతి కథకు వస్తువు అదే.” అన్నాడు ప్రవీణ్ వాళ్ళ వైపు పరీక్షగా చూస్తూ. “ఆ మాట వింటే మీకు కళ్ళ ముందు ఎవరు కనిపించారు? మనసులో ఎవరు మెదిలారు? వాళ్ళ గురించి చెప్పండి.” అన్నాడు.
వాళ్ళకది అలవాటే. ఏదన్నా సమాచారం కావాలంటే ప్రవీణ్ ఆ ప్రశ్నని నేరుగా అడగడు. ఇంకేదో అడుగుతాడు. ఏదేదో మాట్లాడిస్తాడు. చర్చలు పెడతాడు. దానిలోనుంచి చివరికి తనకి కావలసిన సారం లాక్కుంటాడు.
ఇంకా నయం ఈసారి ఇది కథ కోసం అని ముందుగా ఒక మాటన్నా చెప్పాడు. మామూలుగా అయితే అదీ చెప్పడు.
ఒక విషయంపై అభిప్రాయం చెప్పండి అని అడిగితే  అవతలి వాళ్ళ నుంచి వచ్చే అభిప్రాయం ఎంత పేలవంగా వుంటుందో, అసంపూర్ణంగా ఉంటుందో ప్రవీణ్ కి తెలుసు. అలాంటి సమాచారం అంతర్జాలంలోనూ, పుస్తకాలలోనూ వెతికినా దొరుకుతుంది.
ఒక విషయం చుట్టూ మనుషుల మనసుల పొరల్లో వాళ్ళకే తెలియకుండా వున్న సమాచారాన్ని లాగాలంటే..  దానికి కొన్ని మెళకువలు కావాలి. అవి తనకు బాగా తెలుసునని ప్రవీణ్ నమ్మకం. కొంతవరకూ అది నిజం కూడా.
“నువ్వెవరిని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నావు?” ప్రశ్నించాడు కిరణ్.
“నా దృష్టిలో ఎవరూ  లేరు.” అని ప్రవీణ్ చెప్పబోతుండగా అతని  ఫోన్ మోగింది.
అరుణ!
“తర్వాత మాట్లాడతాను.” అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసేశాడు.
మనసును మళ్ళీ ప్రస్తుతం లోకి తీసుకువస్తుంటే కిరణ్ అంతకు ముందు ఏమడిగాడో గుర్తొచ్చి ప్రవీణ్ కి నవ్వొచ్చింది.  కిరణ్ ఆ ప్రశ్న అడిగిన క్షణంలోనే అరుణ ఫోన్ చేయడం! ఇది యాదృచ్చికమా! లేక ఇలాంటి వాటికి ఏదైనా కారణం ఉంటుందా! అవును, తను ఆ ప్రశ్న అడగడానికి కారణం అరుణే. అరుణతో తనకి పెళ్ళయ్యి ఇరవై ఏళ్ళు. ఎలాంటి మనిషినయినా నిమిషాలలో  అర్ధం చేసుకోగలను అనుకునే తనకి అరుణ యిప్పటికీ పూర్తిగా  అర్ధం కాలేదు. ఆమె తన జీవితంలోకి వచ్చినపుడు ఇరవై ఏళ్ళు. ఇప్పుడు నలభై ఏళ్ళు. ఆనాటి నుంచి ఈనాటి వరకూ అదే గాంభీర్యం.
అవతలివాళ్ళు  మాట్లాడితే చాలు వాళ్ళ రహస్యాలు సమస్తం కనిపెట్టేయగలడు ప్రవీణ్. కానీ అరుణ దగ్గర ఆ ప్రావీణ్యం పనిచేయదు.
ఎందుకంటే మౌనమూ. మందహాసమూ ఆమె నిరంతరమూ ధరించే ఆభరణాలు.  చాలా అరుదుగా కానీ వాటిని తీసి పక్కన పెట్టదామె.
పిల్లలు చిన్నవాళ్ళుగా వున్నప్పుడు కాస్తో కూస్తో మాట్లాడేది. ఇప్పుడు పిల్లలిద్దరూ చెరొక చోటా హాస్టళ్ళలో వుండి చదువుకుంటున్నారు. ఇంట్లో వుండేది  తామిద్దరే.
ఎప్పుడు నిద్ర లేస్తుందో, ఎప్పుడు పనులన్నీ చక్కబెట్టుకుంటుందో తెలీదు. తను లేచేసరికే ఏదో పుస్తకం చదువుకుంటూ వుంటుంది.
తనకి కావలసినవన్నీ అందించి తను ఇంట్లో నుంచి బయటపడగానే తలుపు వేసుకుంటుంది. వెంటనే.. తానింకా పూర్తిగా గేటన్నా  దాటకముందే.
ఇక అప్పట్నుంచీ సాయంత్రం దాకా  వంటరిగా ఏం చేస్తుందో తెలీదు.  ఇరుగు పొరుగుల ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళు వచ్చి అరుణతో మాట్లాడటం తనెపుడూ చూడలేదు.
తను గమనిస్తూనే ఉంటాడు కదా! ఇరుగు పొరుగు ఆడవాళ్ళందరూ ఏవో చీటీలనీ, పార్టీలనీ మాట్లాడుకోవడం వినిపిస్తూనే వుంటుంది. గోడల దగ్గర నిల్చుని కబుర్లు చెప్పుకోవడం, రోడ్డుకి అటుప్రక్క  యింట్లో నుంచి ఆవిడా ఇటుప్రక్క ఇంట్లో నుంచి ఈవిడా పెద్దగా అరుచుకుంటున్నట్లుగా మాట్లాడుకోవడం.. వాటికి తోడు సెల్ ఫోన్లు వచ్చాక ప్రక్కింట్లో వాళ్ళ సమస్త కార్యకలాపాలు, వ్యాపార వ్యవహారాలు మనకి స్పష్టంగా తెలుస్తున్నాయి.
వరండాలో నడుస్తూ వాళ్ళు ఫోన్ లో మాట్లాడేవి అన్నీ ప్రవీణ్ చెవిన పడుతూనే వుంటాయి. అవన్నీ  అతనికి కథావస్తువులు అవుతూనూ వుంటాయి.
అరుణ మీద కథ వ్రాద్దామంటే ఏదీ అంతు పడితేనా! “ఏం చేస్తావ్ పొద్దున్నుంచీ సాయంత్రం దాకా!” అన్న ప్రశ్నకి ఎప్పుడూ ఒకటే సమాధానం.  
“చదువుకుంటానండీ.”
ప్రవీణ్ రచయిత కాబట్టి సాహిత్యం బాగానే చదువుతాడు. తోటి రచయితల రచనలు, రకరకాల పత్రికలు ఎప్పుడూ ఏవో యింటి నిండా వుంటూనే వుంటాయి. అవన్నీ చదువుతుంది కాబోలు! ఇంకా ఏవేవో  స్త్రోత్రాలు ఆధ్యాత్మిక గ్రంథాలు వాటికి భాష్యాలు - అవీ చదువుతూ వుంటుంది. అదేంటది!  ఆ.. లలితాసహస్రనామ భాష్యం అదొకటి పట్టుకుని  కూర్చుంటుంది ఎపుడూ!
అదంతా సరే. కానీ  పొద్దున్నుంచీ సాయంత్రం దాకా మరో మనిషి పొడ అయినా లేకుండా వంటరిగా అరుణ ఎలా ఉండగలుగుతుంది! ఆ విషయం ప్రవీణ్ కి అర్ధం కాదు. ఇదేమైనా మానసిక వ్యాధేమో అన్న అనుమానమూ వస్తోంది ఈ మధ్య!
ఇంత వేగవంతమైన ప్రపంచంలో.. ఇంత సంక్లిష్టంగా మారిన లోకంలో.. మనసు విప్పి మరొకరితో మాట్లాడుకోవాలని మనిషి తపించి పోతున్న సందర్భాలలో అరుణ అలా రాయిలా ఎలా వుంటుంది! ఇది నిజంగా డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళాల్సిన పరిస్థితిగానే కనిపిస్తోంది ప్రవీణ్ కి.
ఈ విషయం మీదే ఒక కథ వ్రాద్దామని రకరకాల ఊహాగానాలు చేశాడు. ఒంటరి తనాన్ని భరించలేనపుడు మనుషులు ఏమేం చేస్తారు అనేదానికి సవాలక్ష ఊహలు దొరికాయి కానీ.. కోరి వంటరితనాన్ని ఆశ్రయించడం .. దానికి కారణాలు మాత్రం ప్రవీణ్ కి తోచలేదు.
కోరి ఏకాంతాన్ని ఎవరైనా ఎందుకు వరిస్తారు? అలాంటి వాళ్ళ లక్షణాలేమిటి? వాళ్ళ వ్యక్తిత్వంలో వుండే ఆ లోపాన్ని ఏమనాలి! ముఖ్యంగా ఆడవాళ్ళు.. ఆడవాళ్ళు అలా వున్నారంటే వాళ్ళు ఎలాంటివారై వుంటారు!
ఆ ప్రశ్నలలో నుంచి పుట్టిందే “ఒంటరి ఆడది” అన్న సమాసం. ఆ శీర్షిక తో కథ వ్రాయాలన్న ఉద్దేశ్యం.
ప్రవీణ్ ని ఆలోచనలలో నుంచి బయట పడేస్తూ “చెప్పనా!” అన్నాడు కిరణ్ గొంతు సవరించుకుని.
“ఊ.” అన్నారు మిగిలిన ఇద్దరూ.
“రేఖ అని ఒక అమ్మాయి. ఈ మధ్యనే పరిచయం అయింది. మా ఆఫీస్ వాళ్ళు ఒక వ్యక్తిత్వ వికాస శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేస్తే వెళ్ళాం. రకరకాల పనులు చేయించారక్కడ. ఏవేవో ఆటలూ, పోటీలు. మొత్తం ఇరవై మందిమి. అందరం మగవాళ్ళమే. ట్రైనింగ్ ఇచ్చిన ఆయన పేరు వేణు. సైన్యంలో పని చేసి రిటైర్ అయ్యాడట. ఆయనకి అసిస్టెంట్  ఈ అమ్మాయి. సాయంత్రం పూట బయల్దేరి వెళ్ళాం. ఆ రాత్రికి చేసినదేమీ లేదు. మేము బస చేసిన ప్రాంతం అంతా అడవి ప్రాంతం. అక్కడే చిన్న చిన్న గుడారాలు వేశారు. కూర్చోగలిగినంత ఎత్తు. అంతే. ఒక్కొక్క దాంట్లో ఇద్దరిద్దరం ఉండేట్లు. ఆ అమ్మాయికి ఒక్కదానికీ ఒక గుడారం.
రాత్రిపూట ఏమైనా చిన్న చిన్న అడవి జంతువులు వచ్చే అవకాశమూ వుందని చెప్పారు. దుప్పుల లాంటివి. అలాంటి చోట మాతోపాటు ధైర్యంగా ఒంటరిగా వున్న ఆ అమ్మాయిని చూస్తే నాకు  ఆశ్చర్యంగా అనిపించింది.”
“అందంగా వుందా!”
ప్రవీణ్ ప్రశ్న విని తల వూపాడు కిరణ్. “చాలా” అన్నాడు.
“నాజూగ్గా సన్నజాజి మొగ్గలా వుంది. సరే ఆ రాత్రి భోజనాలప్పుడు, మళ్ళీ  రెండోరోజు పొద్దున్నే ఫలహారాల సమయంలోను మాటలలో తెలిసింది. ఆ అమ్మాయికి చిన్నప్పటినుంచీ కొండలూ గుట్టలూ ఎక్కడం మీద ఆసక్తి అట. దానికి సంబంధించిన శిక్షణలేవో తీసుకుందట.
అంతకుముందు తాను  చేసిన సాహసాల వివరాలేవో చెప్పింది. ఆ తర్వాత చెప్పాగా మా అందరికీ ఏవో పోటీల లాంటివి పెట్టారు, రెండు జట్లుగా విడదీసి. ప్రతి పోటీకీ  ఆ సమయంలో మా ప్రవర్తన, మా మాటలు, అందులో గెలిచేందుకు మేము వేసుకున్న  పథకాలు, ప్రణాళికలు ఇవన్నీ గమనించి ఆ పోటీ అయిపోయాక విశ్లేషించేవారు. మధ్యాహ్నం రెండు గంటలపుడు అందర్నీ ఒకచోట సమావేశపరిచారు. అక్కడ రెండు ఎత్తైన చెట్లు వున్నాయి. రెండిటికీ మధ్యలో బాగా ఎత్తులో ఒక తాడు కట్టి వుంది.  ఇటు పక్క చెట్టు మీద నుంచి ఒకళ్ళు అటుపక్క చెట్టు మీద నుంచి ఒకళ్ళు పైకి ఎక్కి ఆ తాడు మీదకి రావాలి. ఆ తాడు మీదకి వచ్చే ముందు చెట్టు కొమ్మలలో కూర్చుని  నడుముకి ఒక బెల్టు కట్టు  కోవాలి. నిజానికి చెట్ల మధ్యలో ఒకటి కాదు రెండు త్రాళ్ళు వున్నాయి. మన భుజాల ఎత్తులో ఒక తాడు వుంటుంది. దాన్ని రెండు చేతులతో పట్టుకుని క్రింద వున్న తాడు మీద కాళ్ళు పెట్టి మనం నడవాలి. పైన వున్న తాడుకి రక్షణ వ్యవస్థ వుంటుంది. దాని నుంచి వేలాడే ఒక తాడుని మన నడుముకి వున్న బెల్టుకి  బిగించుకుని  అప్పుడు త్రాటి  మీద నడవడం మొదలు పెట్టాలి. అయితే ఆ పై  నుంచి వేలాడే తాడు సగం దూరం వరకే వస్తుంది. అటు నుంచి ఒకరు ఇటు నుంచి ఒకరు సగం దూరం నడిచాక  అప్పుడు యిద్దరం మధ్యలోకి వస్తాం కదా! అక్కడ నిలబడి పై నుంచి వేలాడే తాడులని  మార్చుకోవాలనమాట. సరిగ్గా సగం దూరంలో అంటే దారి  మధ్యలో మరొక చిన్న తాడు వేలాడుతూ వుంటుంది.  ఇద్దరం అక్కడికి చేరుకున్నాక ముందు ఒక వ్యక్తి తన నడుముకి ఆ చిన్న తాడు కట్టుకోవాలి.  అప్పుడు తన నడుముకి వున్న మొదటి  తాడు విప్పేసి  యిస్తే అది  రెండో వాళ్ళు పెట్టుకుంటారు. అప్పుడు రెండో వాళ్ళు తమ నడుముకి వున్నది విప్పి యిస్తే మొదటి వాళ్ళు పెట్టుకుంటారు.  అంటే ఈ తాళ్ళు మార్చుకుంటూ వున్న సందర్భంలో క్రిందికి పడిపోకుండా ఆ చిన్నతాడు ఆపుతుందన్న మాట. తాళ్ళు మార్చుకోవడం అయ్యాక ఆ చిన్నతాడు విప్పేసుకుని  యిద్దరూ జాగ్రత్తగా ఒకరినొకరు దాటుకుని చెరో వైపుకీ వెళ్లిపోవాలి. ఇదీ కార్యక్రమం.”
ప్రవీణ్, రాజా ఇద్దరూ ఆసక్తిగా వినసాగారు. “తాడు మీద ఎలా నడిచార్రా బాబూ. కాలు జారితే.” అన్నాడు రాజా.
“అందుకే కదా ఆ బెల్టు కట్టుకునేది! కాలు జారినా పూర్తిగా క్రింద పడం. ఆ త్రాడుకి వేలాడుతూ వుంటాం.”
“చేశారా మరి అందరూ!”
“చేయాలిగా మరి! ముందు ఆ అమ్మాయి మాలో కొంచెం శరీరం పద్దతిగా వున్న వాడిని ఎన్నుకుని అతనితో కలిసి చేసి చూపించింది. వాళ్ళు చేస్తుంటే చూడటానికి బానేవుంది. కానీ చేసేటపుడు కష్టం అర్ధమయింది. మా అందరికీ ఇంతింత పొట్టలు. అదుపు లేకుండా అడ్డంగా పెరిగిన శరీరాలు. అయినా ఆడపిల్ల చేశాక మేము ఎలా వెనకాడతాం! సిద్దపడ్డాము. వేణు గారు ముసిముసిగా నవ్వుతూ ఒక పక్కన నిల్చున్నారు. దీనితో తనకేం సంబంధం లేదన్నట్లుగా.
ఒకరిద్దరు అసలు చెట్టే ఎక్కలేకపోయారు. మరొకరిద్దరు చెట్టు ఎక్కాక కొమ్మమీద నుంచి తాడు మీద కాలు పెట్ట గానే అమ్మో, మావల్ల కాదు, కళ్ళు తిరుగుతున్నాయి అని నిరభ్యంతరంగా ఒప్పేసుకుని చెట్టు దిగిపోయారు. నా వంతు వచ్చింది. “
మిగిలిన ఇద్దరూ ఊపిరి బిగపట్టి వింటుండగా చెప్పాడు కిరణ్.  “కొంచెం దూరం బానే వెళ్ళాను. అటువైపు నుంచి వస్తూన్న అతను మధ్యలోకి వచ్చి నిలుచున్నాడు. నేను కూడా ఇంకో అడుగు  వేస్తే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. కానీ అక్కడ కాలు జారింది. ఒక్కసారిగా క్రిందికి జారిపోయి గాల్లో వేలాడసాగాను.”
ఆ అనుభవాన్ని గుర్తు చేసుకుంటుంటే కిరణ్ చేతుల మీది రోమాలు నిక్కపొడుచుకున్నాయి. “అబ్బా! ఆ పరిస్థితి చెప్పలేనురా! మావాళ్ళందరూ క్రింద నుంచి హాహాకారాలు చేస్తున్నారు. నాకు జతగా రెండోవైపు నుంచి వచ్చిన వ్యక్తి బిత్తరపోయి చూస్తున్నాడు. అతను చేయగలిగినదీ ఏమీ లేదు. నేను అతనున్న చోటికి వెళ్ళి బెల్టు మార్చుకునే అవకాశం అతనికి ఇచ్చేవరకు అతను ఇటు రాలేడు. కాకపొతే అతను మళ్ళీ వెనక్కి తెరిగి వెళ్ళిపోగలడు. అంతే. అంతకంటే అతను చేయగలిగినది ఏమీ లేదు. నాకు కళ్ళల్లోనుంచి నీళ్ళు కూడా వచ్చేశాయి. తల తిరుగుతున్నట్లుగా అనిపించింది.”
క్రింద నుంచి ఆ అమ్మాయి అరిచింది. “అతని చేయి పట్టుకుని పైకి ఎగరండి. ఎగిరి మళ్ళీ తాడు మీద కాలు పెట్టండి” అని.
“నా తల్లే, ఎంత బాగా చెప్పావు అనుకున్నాను. శరీరం అంత తేలిగ్గా వుంటే లేనిదేముంది! నాకు  జతగా వచ్చిన అతను ఒక చేత్తో తాడు పట్టుకుని కొంచెం వంగి తన కుడి చేయి నాకు అందిస్తూ ‘ఎగరండి ఎగరండి’ అంటున్నాడు. కానీ అలా ఎలా ఎగురుతాం! కొంతమంది ఎగరగలుగుతారట. నాకు మాత్రం అలా  పైకి ఎగరడం అసాధ్యం అనిపించింది. ఇలా ఒక అయిదు నిమిషాలు గడిచాయి. అంత ఎత్తునుంచి పూర్తిగా నేల మీద  పడను అని తెలిసినా క్రిందికి చూస్తే కళ్ళు  తిరిగాయి.  స్పృహ తప్పుతుందేమో అనుకున్నాను.  “నన్ను పైకి తీయండి. ప్లీజ్ నన్నెవరైనా  పైకి లాగండి.” అని దాదాపుగా ఏడుపు గొంతుతో అరిచేశాను. అప్పుడు...”
ఒక్కసారి ఆగి ఊపిరి తీసుకున్నాడు కిరణ్. “ఆ అమ్మాయి.. గబగబా ఉడుత పిల్లలా చెట్టెక్కింది. నడుముకి మరో తాడు ఏదో కట్టుకుని దానిని పైనున్న తాడుకి బిగించింది. అది రక్షణ కోసం అధికంగా చేసిన ఏర్పాటు కాబోలు! నాకు బాగా అర్ధం కాలేదు కానీ ఆ అమ్మాయి మొత్తానికి నేనున్న చోటికి వచ్చింది. తాడు మీద నిలుచుని తన ఎడమ చేయి అందించింది. ఇటునుంచి నాకు జతగా వచ్చిన అతను కుడిచేయి అందించాడు. ఇద్దరూ కలిసి నన్ను పైకి లేపారు.  ఒక్కసారిగా గాల్లోకి లేచాను. కాళ్ళు  మళ్ళీ తాడు మీద ఆనాయి. ఆ అమ్మాయి హాయిగా అదొక పెద్ద వెడల్పైన వేదిక అన్నట్లుగా ఆ సన్నటి తాడు మీద స్థిమితంగా నిల్చుని ఒక రుమాలు నా చేతికి యిచ్చింది. చెమట తుడుచుకున్నాను. మంచినీళ్ళ సీసా యిచ్చింది. తాగాను. నేను స్థిమిత పడ్డానని అర్ధమయాక ‘ఊ, ఇక అటు వైపు నడుస్తారా మరి!’ అంది. నేను తల వూపాను. ఎలా ఆ బెల్టు మార్చుకున్నానో ఎలా నడిచానో నాకే తెలీదు. ఒక మత్తులో ఉన్నట్లుగా జరిగిపోయింది. క్రిందికి వచ్చిన రెండు నిమిషాలకి గానీ పూర్తిగా మళ్ళీ నా స్థితి నాకు సరిగా అర్ధం కాలేదు.”
కిరణ్ ఆక్కడ ఆగగానే ముగ్గురూ ఒక్కసారి గాఢంగా  నిట్టుర్చారు.
“క్రిందికి వచ్చి కూర్చున్నాక ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. ఆ పిల్ల చేయి కళ్ళకి అద్దుకోవాలనిపించింది నాకు. ఇద్దరూ కలిసి పైకి లాగినా నిజానికి ఎక్కువ బలం ఆమె వైపు నుంచే వచ్చిందనీ రెండో అతను నామామాత్రంగానే చేయి అందించాడనీ నాకు అర్ధమయింది. పాపం అతనికి ఇందులో అనుభవం ఏమీ లేదు కదా! ఆ అమ్మాయి మీరొక చేయి పట్టుకోండి అంటే పట్టుకున్నాడు, అంతే. నేను పెదవుల మీదికి నవ్వుతెచ్చుకుని కాదండీ, అలా పైకి లాగడం కాకుండా క్రిందికి దించేసేందుకు మార్గం లేదా! అలాంటి ఏర్పాటు వుంటే బాగుండేది కదా! అది సులభం కదా!అన్నాను సలహా యిస్తున్నట్లుగా.
“ఎందుకు లేదు! అలాంటి ఏర్పాటూ వుంది.” అంది ఆ అమ్మాయి తాపీగా.
“మరి! మరెందుకు పైకి లాగారు!” అని నేను ఆశ్చర్యంగా అడిగితే,  “మరి మీరు ప్లీజ్ నన్నెవరైనా పైకి లాగండి. అన్నారు కానీ ప్లీజ్ నన్ను క్రిందికి దించండి. అనలేదుగా”  అంది కళ్ళు చికిలించి అల్లరిగా నవ్వుతూ.
అందరూ గొల్లున నవ్వారు. నాకూ నవ్వొచ్చింది. అదేదో సామెత చెప్తారు కదా! దేవుడ్ని కోరిక అడిగేటపుడు ఎలా అడగాలో కూడా తెలియాలిట.”
కిరణ్ మాటలకి ప్రవీణ్, రాజా కూడా నవ్వారు. “ఆ అమ్మాయి దేవత అంటావా అయితే!” అన్నాడు రాజా.
“అవున్రా, అప్పుడు నాకు అలాగే అనిపించింది.” అన్నాడు కిరణ్. “అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఆ సంఘటన తలచుకుంటే అలాగే అనిపిస్తుంది.” అన్నాడు.
నేను మిమ్మల్ని పైకి లాగకపోతే మీకు ఆ భయం అలాగే వుండి పోయేది. అందరూ చేసింది నేను  చేయలేకపోయానే అన్న అసంతృప్తి కూడా వుండి పోయేది. అది పోవాలంటే మిమ్మల్ని పైకి లాగి ఆ త్రాడు మీద మళ్ళీ నడిపించాలి అంది ఆరోజు ఆ అమ్మాయి.” ఆ సంఘటనని ఆనందంగా గుర్తు చేసుకుంటూ అన్నాడు కిరణ్.
ఒక్క నిమిషం అక్కడ నిశ్శబ్దం తాండవించింది. ఆ తర్వాత ప్రవీణ్ అడిగాడు “అంతా బానేవుంది కానీ ఇంతకీ ఒంటరి ఆడది అంటే ఆ అమ్మాయి ఎందుకు గుర్తొచ్చింది నీకు!”
“అంతమంది మగవాళ్ళలో ఆ అమ్మాయి ఒక్కతీ వుంది కదా! అందుకేమో!” అన్నాడు రాజా.
“ఏమో తెలీదు, నువ్వు ఆ మాట అనగానే నా కళ్ళముందు ఎవరు మెదిలారో చెప్పమన్నావు కదా! చెప్పాను.” అన్నాడు కిరణ్.
“సరే, ఒంటరి ఆడది అన్న మాట వినగానే ఆ అమ్మాయి గుర్తొచ్చింది. బానేవుంది. కానీ ఆ అమ్మాయిలో నిన్ను ఆకర్షించినది ఏమిటి? అందమా! తెగువా! సమర్ధతా! అలా ఏదన్నా ఒక లక్షణం చెప్పు. అది ముఖ్యం నాకు. ఆ లక్షణం ఏమిటన్నది ముఖ్యం.” అన్నాడు ప్రవీణ్.
కిరణ్ ఆలోచిస్తున్నట్లుగా మొహం పెట్టి “అలా చెప్పాలంటే ప్రత్యేకత అనాలేమో! అవును, అంతే. ప్రత్యేకత. అలాంటి అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు. ఇకముందు చూస్తానని అనుకోను” అన్నాడు.
మళ్ళీ కాసేపు మౌనంగా వుండి పోయారు ముగ్గురూ.  ఆ తర్వాత ప్రవీణ్ రాజా వైపు చూసి “నీ సంగతేమిటిరా!” అన్నాడు.
రాజా నిట్టూర్చాడు. “నాకు వాడు చెప్పినంత కథ ఏమీ లేదురా. నా చిన్నప్పుడు మా ఊర్లో  వుండేవారు ప్రభావతి గారని.  వాళ్ళ ఆయన గొప్ప దేవీ ఉపాసకులు. దేవీ నవరాత్రులు బాగా చేసేవారు. నవరాత్రులలో వచ్చే  శుక్రవారం నాడు ఆడవాళ్ళందరూ వచ్చి వాళ్ళింట్లో కుంకుమ పూజ చేసుకునేవారు. ప్రత్యేకించి పిలవడం ఏమీ వుండదు.  ఎవరైనా వెళ్ళచ్చు, వచ్చినవాళ్ళందరికీ ఆయన పూజ చేయించేవారు.  మా అమ్మా, పిన్నీ  వెళ్ళేవాళ్ళు. వాళ్ళతో పాటు నన్నూ తీసుకువెళ్ళేది అమ్మ. అయితే అలా ఎంత మంది వస్తే అంత మందికీ  భోజనం పెట్టి పంపించేవారు ప్రభావతిగారు. మొత్తం వంట అంతా ఆవిడ ఒక్కరే చేసేవారు. మడి  కదా! ఇంకెవరూ సహాయం చేయడానికి కూడా లేదు. పూజ అయ్యాక అందరం వరుసగా కూర్చుంటే ఇంత మందికీ ఆవిడ ఒక్కరే కొసరి కొసరి వడ్డించేవారు. అమ్మావాళ్ళు వింతగా చెప్పుకునేవాళ్ళు ఎంతమంది వస్తారో లెక్క అయినా తెలియకపోయినా ఆవిడ ఒక పక్కన ఉపవాసంతో వుండి మళ్ళీ  అంత మందికీ వండడం, ఓపికగా వడ్డించడం, మరొక ప్రక్కన ఆయన పూజకి సమస్తమూ అందించడం ఇవన్నీ ఎలా చేస్తుందో అని. నాకు కూడా ఇప్పటికీ అమృతతుల్యమైన భోజనం అన్న మాట విన్నా, తలచుకున్నా ఆవిడే గుర్తు వస్తారు. మేమందరం తింటూ వుంటే మడి  చీరతో అలా తానొక్కరూ ఒక ప్రక్కకి నిల్చుని తృప్తిగా చూసే ఆవిడ మొహమే  కళ్ళ ముందు మెదుల్తుంది.”
రాజా చెప్పడం పూర్తి చేయగానే మళ్ళీ నిట్టూర్చాడు ప్రవీణ్. “బానేవుంది. నువ్వూ సమర్ధతే చెప్తున్నావు అయితే. అంతేనా!” అన్నాడు.
“సమర్ధత కాదురా. పవిత్రత అనాలేమో. ఆవిడని తలచుకుంటే నాకు గుర్తొచ్చే లక్షణం పవిత్రత.” అన్నాడు రాజా.
అప్పటికే బాగా ఆలస్యం అవడంతో చర్చ ముగించక తప్పలేదు. ప్రవీణ్ ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు.
మెలకువ వచ్చేసరికి బాగా తెల్లవారిపోయింది. అరుణ ఎప్పటిలాగే ఏదో పుస్తకం చదువుకుంటూ దర్శనమిచ్చింది.
ఆఫీసుకి తయారవుతూనే ఆలోచించసాగాడు ప్రవీణ్. రాత్రి తను ఊహించినది వేరు. జరిగినది వేరు. ఏవో మానసిక రోగాలు, బలహీనతలు, లోపాలు  వున్న స్త్రీల గురించి చెప్తారనుకుంటే ఇద్దరికి ఇద్దరూ శక్తిస్వరూపిణులయిన స్త్రీమూర్తుల గురించి చెప్పారే!
ఆలోచిస్తూనే ఫలహారం పళ్ళెం ముందు కూర్చున్నాడు. ఎప్పుడూ దేవీ స్తోత్రాలలో మునిగి తేలే అరుణ లాంటి  వాళ్ళకి ఏదో దేవతలలాంటి ఆడవాళ్ళు గుర్తొచ్చారంటే అర్ధం వుంది. మందు తాగుతూ కబుర్లు చెప్పిన వాళ్ళిద్దరికీ కూడా అలాంటి వాళ్ళే గుర్తు రావడమా!
అవును, అసలు ఇంతకీ ఈ మాట అరుణనే అడిగితే ఏం చెప్తుందో! అరుణ వైపే తదేకంగా చూస్తూ అనుకున్నాడు ప్రవీణ్.
“అరుణా!” అని పిల్చాడు మెల్లగా. ఏమిటన్నట్లు చూసింది అరుణ.
అరుణని మరీ “ఒంటరి ఆడది” అని పచ్చిగా అడగడానికి కొంచెం జంకి “ఏకాంతంగా వుండే స్త్రీ అన్న మాట వింటే నీకు ఎవరు గుర్తొస్తారు?” అన్నాడు  ప్రవీణ్.
అరుణ చిరునవ్వు నవ్వుతూ క్షణం తడుముకోకుండా చెప్పింది “ఇంకెవరూ! అమ్మవారు”
“అదేమిటి?” బిత్తరపోయాడు ప్రవీణ్, దేవత లాంటి ఆడవాళ్ళ గురించి చెప్పడం  కాక  ఏకంగా “అమ్మవారు” అనేయడం.. అర్ధం కాలేదు ప్రవీణ్ కి.
“అంతే కదా మరి! అమ్మవారి నామాలలోనే ఒక నామం వుంది. వివిక్తస్థ అని.” అంది అరుణ ప్రశాంతంగా చూస్తూ.
చాలా ఏళ్ళ తర్వాత ఆమె కళ్ళల్లోకి పరవశంగా చూస్తూ అడిగాడు ప్రవీణ్. “వివిక్తం అంటే ఏమిటి అరుణా?” అని.
అరుణ నవ్వింది. అమాయకుడైన పిల్లవాడికి పాఠం నేర్పుతున్నట్లూ..  పట్ట పగ్గాలు లేకుండా వున్న తనలోని రచయితని పరిహసిస్తున్నట్లూ వున్న ఆ నవ్వుని ప్రవీణ్ మైమరచి చూస్తుండగా చెప్పింది.
“నిఘంటువు ప్రకారం ఆ మాటకి మూడు అర్ధాలు కనిపిస్తాయి.. ఏకాంతం, ప్రత్యేకం, పవిత్రం అని.”    


*****



 


 













కామెంట్‌లు

ఇల్లు చూసుకునే ప్రతి మహిళకి వర్తించే కథ. నేను కూడా నా భార్య కవిత గురించి "ఈమెకు ఎలా పొద్దు పోతుందా?" అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాను. అది అలవాటవ్వడమో, సహజంగా ఆడవాళ్ళకి ఆ శక్తి ఉంటుందో గాని నిజంగా అది వాళ్ళ బలం. ఇప్పడు కరోనా ఈ మూసివేతలో నాకు ఇంట్లో పొద్దు పోకుండా ఉండడం చూసి మా భార్య నవ్వుకుంటూ ఉంటుంది. సూక్ష్మమైన వస్తువు(జీవితాన్ని సూక్ష్మంగా పరిశీలించే వాళ్ళకే అందేది). చక్కని కథనం. బావుంది మేడం.
సుభగ చెప్పారు…
చాలా బాగుందండీ! ఈ కథలో ప్రవీణ్ లాగ, చాలా మంది ఈ రోజుల్లో ఒంటరిగా/ఏకాంతంగా ఉండటాన్ని/ఉండగలగటాన్ని దోషంగా భావిస్తున్నారు. నలుగురితో మాట్లాడి, కలుపుగోలుగా ఉండగలగడం ఎంత గొప్ప లక్షణమో ఒంటరిగా ఉండగలగడం కూడా అంతే గొప్ప లక్షణం అని నేను అనుకుంటాను.. అందుకని నాకీ కథ మరీ నచ్చింది..
ఈ కథ నాకు చాలా బాగా నచ్చ్చిన మీ కథల్లో ఒకటి, గృహిణి గా నేనెప్పుడూ తోచుబాటు లేకపోవటాన్ని ఫీల్ అవలేదు,అలా అని అమ్మవారి గురించి ఆలోచన వచ్చేలా భాష్యాలూ చదవలేదు...ఒంటరి తనం అంటే ఎదో పోగొట్టుకున్న అనే అనిపిస్తుంది...అదే ఏకాంతం అంటే మనకు మనం కోరి ఆస్వాదించేది అనిపిస్తుంది ,నలుగురిలో ఉన్నా ,మాట్లాడుతున్నా కూడా ఈ ఏకాంతాన్ని మనసు అనుభవిస్తూ ఉంటుందేమో అనిపిస్తుంది ఒక్కోసారి నాకు ...మీ కథలన్నీ జ్ఞాన గుళికలే నావరకూ నాకు ...థాంక్ యూ
సి.సుశీల చెప్పారు…
లక్ష్మీ! తక్షణమే చదవలేకపోయాను. ఇప్పుడే చదివాను. చాలా హాయి అనిపించింది చదివి. మనమందరము ఒక విధంగా ఇలాగే ఉంటున్నాము. మనకిష్టమైనవి చదువుతూ, వాటిగురించి రాస్తూ, వాటంతటితో మనముంటూ, మనమే వారందరమై ఏకాకింగా,ప్రత్యేకంగా, సమర్థవంతగా! చాలా బాగా రాశారు.ముగ్గురు స్త్రీలు ఒక్కరై నిలిచారు త్రిమూర్థుల్లా! అభినందనలు ఇంత మంచి అందించి మనసును ఉల్లాసపరిచినందుకు.
Thank you సుశీలగారు, మీకు ఈ కథను పంపించిన లక్ష్మిగారు ఎవరో అర్థం కాలేదండీ.
Prof Murty చెప్పారు…
చక్కటి ఊహ ముచ్చటగా ఉంది
Prof Murty
పద్మజ యలమంచిలి చెప్పారు…
చాలా నచ్చింది.ఏకాంతం,ఏకాగ్రత,పవిత్రత.మూడుముక్కల్లో ఇంటి ఇల్లాలి ముచ్ఛట్లు చెప్పుకోవొచ్చు.
Darbha Lakshmi Annapurna చెప్పారు…
ఏకాంతం యొక్క అవసరాన్ని అద్భుతంగా చెప్పారండీ.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సతీసుమతి

తారకము

సంక్లిష్టమైన కథలు