కోమలి కంటినీరు

ఆ.వె.     వావి వరుస గనని వదరుబోతులు వేలు
              విబుధజనుల లెక్క  వేళ్ళమీద
              మహిళ తోడ మెలగు మర్యాద తెలిసిన
              పురుషులుండు స్థలములరుదు నేడు

తే.గీ. :   ఎన్ని ఘనతలు కలిగిన యింతికైన
             తగిన గౌరవ మిచ్చెడి తలపు రాదు
             తనను మించిన ప్రజ్ఞలు తరుణికున్న
             మదిని మంటలు రేగని మగడు లేడు

ఆ.వె. :  ధనముయొక్క బలము ఘనమని యందురు
             స్త్రీల బాధనదియు దీర్చదేమి!
             యబ్బురంపు జీత మార్జించు నారికిన్
             వరము గాను ప్రేమ దొరక దేమి!

 ఆ.వె :   అర్ధరాత్రి గూర్చి యాక్రోశమదియేల
              భద్రమేమి గాదు పట్ట పగలు
              రాజ్యమేలునట్టి రంగుల కలలేల
              గృహము నందు హింస ధృడముగాగ

 ఉ.మా. : నీమము లేక నిగ్రహము నేర్వక నా దశకంఠు వారసుల్
                భౌమసుఖాభిలాషులును బాధలు పెట్టగ స్త్రీజనాళినిన్
                తామస కోటికే పగిది దారిని జూపుట శక్యమౌనికన్
                కామము ధ్యేయమైనడచు కాలమునందున  లేవు ధర్మముల్

 ఉ.మా. : కోమలి కంటనీరొలుక గూలును రాజ్యము లెంతవారికిన్
                భూమిని స్థానముండదని పూర్వపు గాథలు  దెల్పుచున్ననో
                రామయ నేర్వరీ శఠులు  రక్షణ లేదుర స్త్రీలకెచ్చటన్
                క్షేమము గూర్చరా తడవు జేయక నీస్థితి జక్కదిద్దరా

*****

(2017 లో ప్రజ-పద్యం వారు నిర్వహించిన పోటీ కోసం వ్రాసినవి) 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సతీసుమతి

తారకము

సంక్లిష్టమైన కథలు