వ్యాసవైభవం
1. ఆ.వె. :
విశ్వములను గాచు విష్ణ్వంశతో నీవు
వేదరాశి లెస్స వేరు జేయ
నరుని వలెను భువికి నడచి వచ్చితి వయ్య
వ్యాసదేవ నీకు వందనములు
2. ఆ.వె. :
సప్త మోక్షపురులు శక్తిపీఠాదులు
ధర్మ సూక్ష్మములును కర్మగతులు
విశద పరచినట్టి విపులయశము నీది
వ్యాసదేవ నీకు వందనములు
3. ఆ.వె.
ఒక్క భారతమున చక్కగా నిమిడించి
ఎన్ని కథలు నీతు లెన్నివిధులు
సులభ రీతి మాకు తెలియజెప్పితి వయ్య
వ్యాసదేవ నీకు వందనములు
4. ఆ.వె. :
పండితాళియైన పామరజనులైన
బెరుకు లేక హాళి పరగ గలుగు
భాగవతపు ముక్తిబాట నిచ్చితివయ్య
వ్యాసదేవ నీకు వందనములు
5. ఆ.వె. :
మాతవాణి మూర్తి గౌతమీ తీరాన
నిండు కరుణతోడ నిలిపినావు
తెలుగు సీమకెంత కలిమినిచ్చితి వయ్య
వ్యాసదేవ నీకు వందనములు
*****
కామెంట్‌లు
మీ శైలిలో విశేషమేమిటంటే పద్యాలలో పదాలు అలవోకగా ఇమిడినట్టు ఉంటాయి కాని యతి ప్రాసల కోసం ఇరికించినట్లుగా ఉండవు