పురాణపాత్రలు – గాలిలోమేడలు

పురాణపాత్రలని తీసుకుని మనోవిశ్లేషణ చేస్తూ కథలు వ్రాయడం ఇప్పుడు చాలామంది  రచయితలని ఆకర్షిస్తున్న అంశం. అయితే ఈ రకమైన ప్రయత్నాన్ని చేస్తున్న వారందరికీ తాము ఇటువంటి  కల్పనని ఎందుకు చేస్తున్నాము అన్న విషయంలో ఒకేరకమైన అభిప్రాయాలు లేవు. ఈ విషయంలో అందరి లక్ష్యాలు, ఉద్దేశ్యాలు, అవగాహనలు ఒకే విధంగా లేవు.
చాలా కొద్దిమందికి మాత్రమే తాము ఈ రకమైన రచనలని ఏ ప్రయోజనాన్ని ఆశించి చేస్తున్నాము  అన్న విషయంలో స్పష్టత ఉంది. వారు ఆశిస్తున్న ప్రయోజనం కొందరు పాఠకులకీ  విమర్శకులకీ  ఆమోదయోగ్యం కాకపోవచ్చు. అది వేరే విషయం.  
ఇందుకు భిన్నంగా ఈ రకమైన రచనలు చేస్తున్న చాలామందికి అసలు తాము ఈ పని ఎందుకు చేస్తున్నాము అన్న విషయంలో స్పష్టతే లేదు. అది వారు రచన చేస్తున్న విధానంలోనూ, తమ రచనల గురించి యిస్తున్న వివరణలలోను, పాఠకుల సందేహాలకు సమాధానంగా వెలువరిస్తున్న వ్యాఖ్యలలోను అవగతమవుతూనే ఉంది. ఎందుకంటే అటువంటి రచనలపై విమర్శకులు సంధించే ప్రశ్నలకు ప్రతిగా వారు యిస్తున్నది సమాధానాలు కాదు  అమాయకమైన ఎదురు  ప్రశ్నలు.
అటువంటి రెండు ప్రశ్నల గురించి ఈ వ్యాసంలో ప్రస్తావించాలనుకుంటున్నాను.

ఆధారం అవసరమా?
కేవలం పురాణపాత్రల పేర్లు మాత్రం తీసుకుని మూలకథతో ఏమాత్రమూ సంబంధం లేకుండా యదేచ్ఛగా కల్పనలు చేసిన సందర్భాలలో విమర్శకులు “ఈ కల్పనకి ఆధారమేమిటి?” అని అడుగుతుంటారు. అపుడు ఆయా రచయితల  దగ్గరనుంచి వచ్చే సమాధానం ఈ క్రింది ప్రశ్నల రూపంలో ఉంటోంది.
“ఆధారం ఎందుకుండాలి? ఇది కూడా అన్ని కల్పనల వంటిదే కదా! పురాణపాత్రలని తీసుకుని కథ వ్రాసినపుడు దానికి  పురాణంలో ఆధారం ఉండి తీరాలనే  నియమం ఎక్కడ ఉంది? ఎవరు పెట్టారు?”
ఈ ప్రశ్నలు అడిగే రచయితలు గ్రహించవలసినది ఏమిటంటే ఆధారం ఉండాలి అన్న నియమాన్ని మరొకరు పెట్టడం లేదు. పురాణపాత్రలని తీసుకుని కల్పన చేయడం ద్వారా ఆ నియమాన్ని ఆ రచయితలు తమకు తాముగా  పెట్టుకుంటున్నారు. ఎపుడైతే వారు పురాణాల నుంచీ  చరిత్ర నుంచీ   మరొక రచయిత సృష్టించిన సాహిత్యం నుంచీ పాత్రలని స్వీకరిస్తున్నారో అప్పుడే  వారు కొన్ని నియమాలకు లోబడి తమ  సృజనాత్మకతని చూపుతామని అంగీకరిస్తున్నారు.  అదే ఆ రచన యొక్క ప్రత్యేకత అనీ తాము చేస్తున్న ప్రయోగమనీ పరోక్షంగా ప్రకటిస్తున్నారు.
ఏ అవరోధాలూ లేని మైదానంలో పరుగెత్తడం ఒక రకమైన ప్రతిభ. మధ్య మధ్య అవరోధాలు ఏర్పర్చబడిన మైదానంలో  వాటిని దాటుకుంటూ పరిగెత్తడం మరొక రకమైన ప్రతిభ. రెండవరకమైన మైదానంలో పరుగెత్తుతానని వచ్చిన ఆటగాడికి ఇక్కడ కేవలం పరిగెత్తడమే ప్రధానం కాదనీ  అవరోధాలని ఎంత నేర్పుతో అతిక్రమిస్తామనేది కూడా ముఖ్యమనీ  తెలిసి ఉండాలి. ఆవిషయం తనకు తెలియదన్నా, తెలిసీ తెలియనట్లు ప్రవర్తించినా లేదా ఆ అవరోధాలను  తాను లక్ష్యపెట్టనని అన్నా అది ఆ పరుగుపందెం చూద్దామని వచ్చిన ప్రేక్షకులని అవమానించడమే అవుతుంది. బాధపెట్టడమే అవుతుంది.
ఉదాహరణలో నుంచి విషయానికి వస్తే, రచనలో ఈ రకమైన కల్పనలు చేసే  రచయితలు పాఠకులకి ఇదేవిధమైన బాధని కలిగిస్తున్నారు.   
ఇక్కడ పురాణపాత్రల మీద అభిమానమూ   అవగాహనా  ఉన్న పాఠకుల గురించీ, రచయితలు ఆ పాత్రలని వక్రీకరించడం వలన అటువంటి పాఠకులకు  కలిగే బాధని గురించీ  మాత్రమే ప్రస్తావించడం  లేదని గమనించాలి. వారిని ఇటువంటి రచనలు ఎలాగూ  ఆనందపరచవు అన్నది స్పష్టమే. అయితే  పురాణాలకి  ఏ విధమైన పవిత్రతనీ ఆపాదించని వారినీ, వాటిని  కూడా కేవలం సాహిత్యంగా మాత్రమే చూసేవారినీ   కూడా ఈ రకమైన రచనలు ఆకర్షించవు. ఎందుకంటే ఇందులో ప్రతిభ లేకపోగా వంచన ఉంది. విజ్ఞతతో సాహిత్యాన్ని అధ్యయనం చేసేవారందరినీ అది అసంతృప్తికీ ఆశాభంగానికీ  గురిచేస్తుంది.
ఇది ఆధారం ఎందుకు ఉండాలి అని ప్రశ్నించే రచయితలు అర్థం చేసుకోవలసిన విషయం.

అల్ల వారు చేయలేదా?
ఇక రెండవ ప్రశ్నకి వస్తే -  అసలు మీరు పురాణాలు తీసుకుని వాటిలో కల్పనలు చొప్పించడం ఎందుకు? మీరు వ్రాయాలనుకున్నది స్వంతగానే వ్రాయవచ్చు కదా! అని  ఎవరయినా అడిగిన  సందర్భాలలో  కూడా ఆయారచయితలు స్పష్టమైన సమాధానం యివ్వకుండా తిరిగి కొన్ని ప్రశ్నలనే సంధించడం కనబడుతూ ఉంది.
“పురాణాలలో స్వంత కల్పనలు ఎందుకు చేయకూడదు? అందులో తప్పేమిటి? పోతనగారు  చేయలేదా?  తులసీదాసు చేయలేదా? వాటినెందుకు గౌరవిస్తున్నారు? వాటికీ మా రచనలకి తేడా ఏమిటి?” – ఇటువంటి ప్రశ్నలు వినబడుతూ ఉంటాయి. నిజానికి వీటికి సమాధానాలు చాలా స్పష్టం.
వారు ప్రస్తావిస్తున్న రచనలకీ వారు చేస్తున్న  రచనలకీ తేడా ఏమిటంటే  మొదటివి “ధ్యానించి” చేసిన రచనలు. రెండవవి “ఊహించి” చేసిన రచనలు. ఆ విషయం ఎలా చెప్పగలం? అందుకు ప్రమాణమేమిటి? అంటే ప్రమాణం ఆయా రచయితల మాటలే. మొదటి వాళ్ళందరు “మేము ధ్యానించి వ్రాశాము” అని చెప్పారు. వీళ్ళందరూ “మేము ఊహించి వ్రాస్తున్నాము” అని చెప్తున్నారు. 
ధ్యానానికి ఊహకీ తేడా ఏమిటి? - ఉన్నదాన్ని భావించడం ధ్యానం అయితే లేనిదాన్ని భావించడం ఊహ అని చెప్తూ ఉంటారు పెద్దలు.
మరొక రకంగా చెప్పాలంటే  పిల్లల దగ్గర కొన్ని రకాల ఆటవస్తువులు ఉంటాయి. ఆ ఆటలో భాగంగా వారు  రకరకాల ఆకారాలలో ఉన్న  చిన్న చిన్న విడిభాగాలని  జతచేసి కొంగొత్త   ఆకారాలను నిర్మిస్తూ ఉంటారు. ఊహ అటువంటిది. మరి ధ్యానం!   మట్టిలో ఒక  విత్తనాన్ని నాటి  నీరు పోసి పోషణ చేసి మొక్క వచ్చేలా చెట్టు ఎదిగేలా చేయడం వంటిది ధ్యానం.
మొక్క ఎదగడంలో కూడా మన శ్రమ ఉంది, సాధన ఉంది. ప్రజ్ఞ ఉంది. కానీ అంతకు మించినది కూడా ఏదో ఉంది. అలా ఉందన్న భావం ఆయా రచయితలకి ఉంది.  అందుకే వారు “పలికెడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండట” వంటి మాటలు చెప్పారు.
సాహిత్యానికి సంబంధించినంత వరకూ వారు చెప్పిన  ఆ మాటలనీ   ధ్యానం లాంటి పదాలనీ   మనం యథాతథంగా స్వీకరించనవసరం లేదు. నిజంగా రాముడనే వాడు ఒకడున్నాడనీ   భాగవతాన్ని వాడే పలికించాడనీ అనుకోనవసరం లేదు. అయితే  కవి అలా భావించాడు అన్న విషయాన్ని మాత్రం మనం పరిగణన లోకి తీసుకోవాలి. కవికి ఉన్న ఆ రకమైన భావన వలనా నమ్మకం వలనా రచనకి ఒనగూడిన ప్రయోజనం ఏమన్నా ఉందా అని పరిశీలించాలి.
అలా పరిశీలించినపుడు ఆ భావన, ఆ నమ్మకం, తమ రచనలోని పాత్రల పట్ల వారికి ఉన్న గట్టి  విశ్వాసం వారి రచనకి ఒక  శక్తినీ నిబద్ధతనీ ఔచిత్యాన్నీ ఇస్తున్నాయని అర్థమవుతుంది.  అదే బహుశా పాఠకులలో గొప్ప రసానుభూతికి కారణమవుతోందనీ అనిపిస్తుంది. ఆ నమ్మకం లేకుండా గౌరవం లేకుండా చేసే రచనలలో ఎంతో కొంత  అనౌచిత్యం చొరబడుతోందనీ అందువలననే   ఆ రచనలు  నిస్సారంగా మారుతున్నాయనీ  అథవా కొన్నిచోట్ల ఒక క్రూరమైన ఉద్వేగానికి  మాత్రమే కారణమవుతున్నాయనీ శాంతిని ప్రసాదించగల సమర్థతనయితే సాధించడం లేదనీ స్పష్టమవుతుంది.
ఈ విషయాన్ని  అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఇది పురాణపాత్రలకే పరిమితమయిన విషయం కాదు. సమాజంలో నుంచి తీసుకున్న పాత్రలకీ ఇది వర్తిస్తుంది. సమాజంలో నుంచి ఒక పాత్రని తీసుకుని కల్పన చేసినపుడు కూడా రచయిత అటువంటి వ్యక్తులు  నిజంగా సమాజంలో  ఉన్నారని  “విశ్వసించి”  ఆ నమూనాని “శ్రద్ధగా గమనించి”, “గౌరవించి” కల్పన చేసినపుడు  సాహిత్యంలో దానికి అధిక విలువ ఉంటుంది. సమాజంలో అటువంటి వ్యక్తులు  ఉండవలసిన అవసరం లేదనీ, ఉన్నా వారిని అవగాహన చేసుకునేందుకు సమయం వెచ్చించనవసరం లేదనీ గాల్లోనుంచి పాత్రలని సృష్టించవచ్చుననీ భావించి చేసే రచనలకి సాహిత్యగౌరవం కొంత తక్కువగానే ఉంటుంది.
ఒక రైతు పాత్రని సమాజంలో నుంచి తీసుకున్నపుడు రచయిత ఆ రైతు అనేవాడిని సమాజంలో మొదట చూడాలి.  అతన్ని శ్రద్ధగా గమనించాలి. అతడే తానైపోయేంతగా అతని గురించి ఆలోచించాలి. అతని స్థితిగతులనీ తత్త్వాన్నీ  వ్యక్తిత్వాన్నీ  అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ రైతు పాత్రని కల్పించాలి. – ఇది ఒక పధ్ధతి. అలాకాక ‘రైతు’ అనే ఒక మాటని మాత్రం సమాజంలో నుంచి తీసుకుని ఇక ఆ పాత్ర యొక్క  వ్యక్తిత్వమంతా రచయిత స్వంతగా కల్పించడం. తన ఆలోచనలనీ వ్యక్తిత్వాన్నీ స్థితిగతులనీ  ఆ పాత్రకి ఆపాదించడం మరొక పధ్ధతి. విజ్ఞులైన పాఠకులకి మొదటిరకం  సాహిత్యం కలిగించిన సంతృప్తిని  రెండవరకం సాహిత్యం కలిగించదు. కనుకనే మొదటి సాహిత్యానికి దక్కినంత గౌరవం రెండవదానికి దక్కదు. ఇక్కడ చెప్పిన రెండు పద్ధతులలో మొదటిది ధ్యానం, రెండవది ఊహ.
పురాణపాత్రలకు సంబంధించిన రచనలకి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఊహించి చేసిన రచనలకి రాని విలువ ధ్యానించి చేసిన రచనలకి వస్తుంది.
కనుక పురాణపాత్రలని ఆధారం చేసుకుని రచనలు చేసేవారు గ్రహించవలసినది ఏమిటంటే   ఒకరు ఒక పునాది ఆధారంగా మొదటి అంతస్తు నిర్మించాక దానిపై మరొకరు రెండవ అంతస్తు నిర్మించాలని అనుకున్నపుడు కొన్ని పరిమితులు ఉంటాయి. వాటికి లోబడే  రెండవ అంతస్తు నిర్మాణంలో సృజనాత్మకత చూపించవలసి ఉంటుంది. మొదటి అంతస్తును ధ్వంసం చేసి  రెండవ అంతస్తును నిర్మించలేము. నిర్మించినా నిలబెట్టలేము.
                                                           *****

కామెంట్‌లు

ఓరుగంటి సుధాకర్ చెప్పారు…
జగధభి రామ శ్లోకములు చాలా బాగున్నాయి మేడం. అవి పుస్తక రూపములో వున్నాయా
ఓరుగంటి సుధాకర్ చెప్పారు…
పురాణ పాత్రలు గాలిలొ మేడలు ..వ్యాసం చాలా బాగుంది. ముఖ్యముగా వ్యక్తిత్వమంతా రచయిత స్వంతగా కల్పించడం. తన ఆలోచనలనీ వ్యక్తిత్వాన్నీ స్థితిగతులనీ ఆ పాత్రకి ఆపాదించడం మరొక పధ్ధతి.
బాగా చెప్పారు మేడం.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సతీసుమతి

తారకము

సంక్లిష్టమైన కథలు