విఘ్నరాజ శతకము (25-48 పద్యములు)


25.   సర్వసిద్ధికరము సంకట హరమైన
        బహుళచవితి వ్రతము ఫలము ఘనము
        కీర్తినొందె సలిపి కృష్ణుడు సైతము
        వేడుకొందు నిన్ను విఘ్నరాజ

     26.   సంకటహర వ్రతము సలిపిన ఫలమున
             కలిగినట్టి వాడు కార్తవీర్యు
        డమిత బలుడు వేయి హస్తముల్ కలవాడు
        వేడుకొందు నిన్ను విఘ్నరాజ

     27.   కనికరమ్ము విడచి కామధేనువునకై
             కార్తవీర్యుడొక్క కాని రోజు
        శరములఁ గురిపించె జమదగ్ని జంటపై
        వేడుకొందు నిన్ను విఘ్నరాజ

 28.  కన్నవారి మరణ కారణమ్మగు వాని
        సంహరించ దలచి జామదగ్ని
        కఠిన తపము జేసె గణపతి నినుగూర్చి
        వేడుకొందు నిన్ను విఘ్నరాజ

  29. తపము మెచ్చి నీవు దర్శనము నొసగి
        వరముగా నతనికి పరశువిడగ
        నిరువదొక్క మార్లు నరికె క్షత్రియులను
             వేడుకొందు నిన్ను విఘ్నరాజ 

       30. శివుని యాగ్రహమున చితికిపోవ శిరము
             చిలువరాయ డార్తిఁ కొలిచె నిన్ను
             కరుణ ధనము నీదు ధరణీధర ఘనము
             వేడుకొందు నిన్ను విఘ్నరాజ

       31.  పూవు వలెను భువిని మోయగల్గు బలము
         నీదు నాభి యందు నిలచు వరము 
         కఠిన తపము జేసి కైకొనె ఫణిరాజు
         వేడుకొందు నిన్ను విఘ్నరాజ

       32.  దీక్ష తోడఁ  గొలిచి లక్ష వినాయకున్
         తారకాసురుని మదమడగించె
         స్కందుడు వహనముగఁ బొందె మయూరమున్
         వేడుకొందు నిన్ను విఘ్నరాజ

  33.  చేసి పరమ తపము నాసికాపురి లోన
              మరల దేహమందె మనసిజుండు
         నిలిపెను గణనాథు నల మహోత్కటునిగ
         వేడుకొందు నిన్ను విఘ్నరాజ

   34. పరమ పుణ్యదమ్ము వరదగణేశుని
         వ్రతము నలుడు నిందుమతియు కర్ద
         మాదులు సలిపిరి సమాదరణమ్ముగన్
         వేడుకొందు నిన్ను విఘ్నరాజ

   35. శ్రావణంపు శుద్ధచవితి మొదలు భాద్ర
         పదము వరకు కొలువ వలయు విధిగ
         ప్రతిదినమున నొక్క పార్ధివమూర్తిని
         వేడుకొందు నిన్ను విఘ్నరాజ

    36. అక్షయ ఫలదాత్రి అంగారకచతుర్ధి
          భౌమవారమున్ను బహుళచవితి
          కలసి వచ్చెనేని కడువిశిష్టమ్మండ్రు
          వేడుకొందు నిన్ను విఘ్నరాజ

     37. మాఘ బహుళ చవితి మంగళవారము
           గొప్ప తపము చేసి కుజుడు కాంచె
           కామదాతృ తీర్థ కమనీయ మూర్తిని
           వేడుకొందు నిన్ను విఘ్నరాజ

     38. కాలరాక్షసు నవలీలగ మ్రింగగ
           కడుపు లోన జ్వాల లడరినపుడు
           గరిక తీర్చ గలిగె గణనాయకుని బాధ!
           వేడుకొందు నిన్ను విఘ్నరాజ

      39. గరిక యొకటి చాలు గణపతిన్మెప్పించ
            గణపతి కిడినట్టి గరిక విలువ
            నెంచ కుదరదు వివరించ నలవి గాదు
            వేడుకొందు నిన్ను విఘ్నరాజ

      40. సురల కలిమి యంత సరితూగ లేదట
            జనకరాజు ధనము చాలలేదు
            పూజ లోని గరిక పోచకు మారుగ
            వేడుకొందు నిన్ను విఘ్నరాజ

      41. గరిక లేని పూజ నిరుపయోగము గాన
            నిరువదొక్క గరిక నెంచి తెచ్చి
            ఈయవలెను భక్తి నిభవదను కొరకు
            వేడుకొందు నిన్ను విఘ్నరాజ

      42. కసరు కొనవు నీవు కఠినాత్మునైనను
            కరుణ కడలి వయ్య గిరిజ తనయ
            పరిహసించిన శశి వరము లందెను కద!
            వేడుకొందు నిన్ను విఘ్నరాజ

       43. శుద్ధ చవితి నాడు చూడరాదనుచునే
             విదియ దర్శనమ్ము విధిగ చేసి
             బహుళ చవితి శశికి ప్రాముఖ్య మిడితివి
             వేడుకొందు నిన్ను విఘ్నరాజ

            44. దర్శనమ్ము చాలు దహియించగ నఘము
                  ముద్గలముని స్మరణ పుణ్యతమము
             కనగ నతని మహిమ గణపతికి సమము
             వేడుకొందు నిన్ను విఘ్నరాజ

      45. గణపతిని తెగడిన గతజన్మ కర్మకు
                 తలరు దక్షునిగని దారిజూపి
            పొసగజేసె నెల్ల ముద్గలుని కరుణ
            వేడుకొందు నిన్ను విఘ్నరాజ

            46. కాని పనులు జేసి కైవర్తుడనువాడు
            కడకు ముద్గల ముని కడకు జేరి
            మంత్రజపము నేర్చి మహిమాన్వితుండాయె
            వేడుకొందు నిన్ను విఘ్నరాజ

           47.  ఋషిగ మారి యటుల కృషితో భృశుండుడై
            జపములు తపములను సలిపి తాను
            సమ్ముదమున పొందె సారూప్య మోక్షము
            వేడుకొందు నిన్ను విఘ్నరాజ

     48.  ముద్గలుని పురాణము విశదముగ జెప్పె
            గణపతి యవతార గాథలన్ని 
            యష్టమూర్తులఁ మది నర్చింతు నిత్యము
            వేడుకొందు నిన్ను విఘ్నరాజ




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సతీసుమతి

తారకము

సంక్లిష్టమైన కథలు