సచ్చిదానందస్వరూపము (తత్త్వబోధ -5)
పంచకోశముల గురించి తెలుసుకున్నాక ఆ పంచకోశములకు అతీతంగా ఉండేదాన్ని గురించి ఆలోచించాలి. అంటే ఆత్మ యొక్క తత్త్వాన్ని గురించి ఆలోచించాలి. తత్త్వబోధ గ్రంథంలో శంకరాచార్యులు దానిని ఎలా వివరించారో స్వామి తేజోమయానందగారి వ్యాఖ్యానం ఆధారంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము.
మనం ధరించే నగలూ మనం నివసించే ఇల్లూ మొదలైన వాటన్నిటినీ “నావి” అని చెప్పుకున్నట్లే పంచకోశాలను కూడా నాశరీరము, నా ప్రాణము, నా బుద్ధి, నా జ్ఞానము అంటూ ఉంటాము. కనుక ఇవేవీ కూడా “నేను” అయ్యే అవకాశం లేదు.
ఎందుకంటే నాకు సంబంధించిన వస్తువులు “నావి” అవుతాయికానీ అవే “నేను” కాను. “నేను” ఎప్పుడూ నావి అని చెప్పుకునే ఆ వస్తువులకంటే భిన్నంగానే ఉంటాను. అంతేకాదు, నావి అని చెప్పుకునే ఆ వస్తువులన్నీ నాకు తెలుసు. ఎప్పుడైనా తెలుసుకునే వ్యక్తి తెలియబడే విషయం కంటే వేరుగానే ఉంటాడు, కాబట్టి నేను నావి అని చెప్పుకుంటున్న పంచకోశాలు అయిదూ నేను కాదు.
ఈ విషయం వినడానికి చాలా సులభంగానూ తర్కబద్ధంగానూ కనిపిస్తుంది. కానీ అత్యంత సులభంగా కనిపిస్తున్న ఈ నిజాన్ని గ్రహించడం మాత్రం చాలా కష్టం.
మన మనసు పాత కర్మల వాసనలతో కప్పివేయబడి ఉండడం వలన ఇంత స్పష్టంగా కనిపిస్తున్న నిజాన్ని కూడా మనం ఒప్పుకోలేము. అది నిజమేనని అర్థం చేసుకున్నప్పటికీ కూడా ఒప్పుకోలేము. ఒకవేళ ఒప్పుకున్నా దానిని పూర్తిగా జీర్ణించుకోలేము.
తర్కానికి విరుద్ధంగా కనిపించినా పంచకోశాలనే నేను అనుకునే పొరపాటు మనం చేస్తూనే ఉంటాము. ఎందుకంటే ఆత్మ మనకి నేరుగా కనబడదు, అందదు. అది పంచకోశాలతో కప్పివేయబడి ఉంటుంది. వాటి వెనుక ఉంటుంది. పంచకోశాలు ఎప్పుడూ ఆత్మ ని చుట్టేసి ఉంటాయి కనుక వాటినే ఆత్మగా భ్రమపడడం జరుగుతుంటుంది.
నిరంతర విచారణతో, ధృడనిశ్చయంతో మాత్రమే ఆత్మని వాటినుండి విడదీసి చూడగల వివేకాన్ని మనం అలవర్చుకోగలుగుతాము. పంచకోశాల యొక్క బంధనాల నుంచి విముక్తులం కాగలుగుతాము.
ఆత్మతత్త్వము:
ఆత్మ అంటే ఏమిటి? ఈ ప్రశ్నకి సమాధానం చెప్తూ సచ్చిదానంద స్వరూపమే ఆత్మ అన్నారు శంకరాచార్యులు. ఇప్పటివరకు అనాత్మ గురించి చర్చించుకున్నాము. అది ఆత్మ ఎందుకు కాదో చెప్పుకున్నాము. శరీరత్రయమూ పంచకోశాలూ అవస్థాత్రయమూ ఇవేవీ ఆత్మ కాదని తెలుసుకున్నాము. మరి ఇక ఆత్మ అంటే ఏమిటి?
ఆత్మ యొక్క తత్త్వాన్ని రెండు విధాలుగా చెప్పుకోవచ్చు.
1. తటస్థ లక్షణం:
ప్రపంచం దృష్టితో చెప్పేటపుడు ప్రపంచానికి కారణభూతమైనదీ ఆలోచనలు మొదలైన వాటన్నిటికీ సాక్షీభూతమైనదీ ఆత్మ అని చెప్పవచ్చు.
2. స్వరూప లక్షణం:
ఆత్మ స్వరూపాన్ని అనంతమూ శాశ్వతమూ అని నేరుగానూ నిర్వచించవచ్చు. స్వరూపలక్షణంగా చెప్పేటపుడు ఆత్మని సచ్చిదానంద స్వరూపంగా చెప్పవచ్చు.
సచ్చిదానంద స్వరూపము - సత్ చిత్ ఆనంద స్వరూపము - అనే మాటని గురించి వివరంగా తెలుసుకుందాము.
సత్ అంటే ఏమిటి?భూత భవిష్యత్ వర్తమానాలు మూడింటిలోనూ ఏది మారకుండా ఉంటుందో అది సత్. ఆత్మ ఒకప్పుడు లేనిది కాదు. ఇక ముందెపుడో ఉండకుండా పోయేదీ కాదు.రూపమూ నామమూ ఉన్నపుడే జననమూ మరణమూ ఉంటాయి. మార్పు చెందటం ఉంటుంది. ఆత్మకి రూపమూ నామమూ లేవు. కనుకనే దానికి జననమూ మరణమూ కూడా లేవు. అది నిత్యము. ఆత్మకి ఏ విధమైన గుణములూ కూడా ఉండవు. అది నిర్గుణ. ఏ విధమైన మార్పులు వికారాలు ఉండవు. అది నిర్వికార. ఆత్మ అనాది, అనంతము కనుక అది “సత్”.
చిత్ అంటే ఏమిటి? ప్రపంచాన్ని గురించిన జ్ఞానం ఆలోచనల ద్వారానే కలుగుతుంది. ఆలోచనలు లేకుండా ఏ విషయాన్నీ తెలుసుకోవడం కుదరదు. ‘ఇదొక పుస్తకం’, ‘నాకు ఆకలిగా ఉంది’, ‘నాకర్థం కావడం లేదు’ - ఇలాంటివన్నీ ఆలోచనలే. అయితే ఈ ఆలోచనలన్నిటికీ ఆధారం “నేను”. ఆలోచనలు చేసేదీ చేయకుండా ఉండేదీ కూడా ఆలోచనల వెనుకనున్న “నేను” అనే చైతన్యమే.
ఆలోచనల కంటే భిన్నంగా ఉంటూ వాటిని వెలిగిస్తున్న చైతన్యాన్ని వెలిగించేందుకు మరేదీ లేదు. అది స్వయంప్రకాశం. అన్నిటినీ తెలుసుకునేది అదే. దానిని తెలుసుకునేది మరిక వేరే లేదు. సూర్యుడిని తెలుసుకునేందుకు మరొక వెలుగు అవసర పడనట్లుగా “నేను” ను తెలుసుకునేందుకు మరేదీ అవసరం లేదు. జాగ్రత్ స్వప్నావస్థలలోనే కాదు సుషుప్త్యావస్థలో కూడా ఆ నేను ఉందని మనకు తెలుసు. అందుకే గాఢనిద్ర పోయి లేచాక మనం “నేను బాగా నిద్రపోయాను” అని చెప్పగలుగుతాము.
నిత్యమైనదీ స్వయంప్రకాశకమైనదీ అయిన ఈ జ్ఞానానికే చిత్ అని పేరు. అదే “నేను” యొక్క తత్త్వం.
సత్ చిత్ ల గురించి చెప్పుకున్నాము. మరి ఆనందం అంటే ఏమిటి? సుఖస్వరూపమే ఆనందం.
మనకి ఆనందాన్నిచ్చేవన్నీ మనకి ప్రియంగా ఉంటాయి. మన వస్తువులనీ స్నేహితులనీ బంధువులనీ మనం ప్రేమిస్తాం కానీ అంతకంటే ఎక్కువగా మనల్ని మనం ప్రేమించుకుంటాము. ఒక వస్తువు నాకు ప్రియమైనదవడానికి కారణం ఏమిటి? అది నాకు ఆనందాన్ని యివ్వడం. కానీ “నేను” నాకు ప్రియమవడానికి కారణం అవసరం లేదు. ఆ ప్రేమ అవ్యాజం అనంతం పరిపూర్ణం. అంటే “నేను” అనేది ఆనందానికి మూలమన్నమాట.
ఎవరైనా తమ నిజతత్త్వాన్ని చేరేందుకే ప్రయత్నిస్తూ ఉంటారు. ఆనందం “నేను” యొక్క నిజమైన తత్త్వం కనుకనే నేను చేసే ప్రయత్నాలన్నీ నిరంతరంఆనందాన్ని పొందడం కోసమే జరుగుతుంటాయి.
బాధ “నేను” యొక్క నిజమైన లక్షణం కాదు. అది తెచ్చిపెట్టుకున్నది. బాధని వదుల్చుకునేందుకు ఆనందాన్ని పొందేందుకు “నేను” సదా ప్రయత్నించడం అందుకే.
సారాంశమేమంటే “సత్ చిత్ ఆనందము” నేను యొక్క నిజమైన లక్షణం. ఆత్మ సచ్చిదానందస్వరూపము. అయితే ఈ సత్ చిత్ ఆనందములు మూడూమూడు వేరు వేరు లక్షణాలు కాదు. “నేను” లో భాగాలు లేవు. అది అఖండం. కనుక దాని లక్షణాలైన సత్ చిత్ ఆనందములు కూడా వేరు వేరు కాదు. అవి ఒకే లక్షణం యొక్క మూడు గుర్తులు.
ఆత్మ యొక్క ఈ స్వరూపాన్ని తెలుసుకోవడమే ముక్తి. శ్రవణ మనన నిధిధ్యాసములను అవలంబించడం ద్వారా మనం ఆ విషయం తెలుసుకునే ప్రయత్నం చేయాలి.అయితే శ్రవణ మనన నిధిధ్యాసముల ద్వారా ఆత్మతత్త్వాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించినా అది పరోక్షజ్ఞానానికే పరిమితం కావచ్చు. అయినప్పటికీ కర్మయోగ భక్తియోగములతో చిత్త సంస్కారాన్ని పెంచుకుంటూ అపరోక్షానుభూతిని పొందే స్థాయికి ఎదిగే ప్రయత్నం చేస్తూనే ఉండాలి.
*****
కామెంట్‌లు