వినిమయం


“కొంచెం అన్నం తిని వెళ్ళు” సరళ ఆమాట ఎంత సరళంగా చెప్పిందో అంతే తీవ్రంగా వచ్చించి భావన దగ్గర నుంచి “వద్దు” అనే జవాబు.
“ఎందుకని?” అని రెట్టించ లేదు సరళ. నెమ్మదిగా లేచి వెళ్ళి ఒక బాక్సులో కాస్త అన్నం కలిపి తీసుకువచ్చి భావన బ్యాగ్ పక్కన పెట్టింది.
కొంచెం గుర్రుగా చూసి ఆ బాక్సు సంచీలో పెట్టుకుని బయల్దేరింది భావన.
ఆమె  వీధి మలుపు తిరిగేదాకా చూసి ఒక నిట్టూర్పు విడిచి లోపలికి వచ్చింది సరళ. తల్లీ కూతుళ్ళ మధ్య ఈ రకమైన వాతావరణం ఇప్పుడు సాధారణమైపోయింది.
తను చెప్పే మాటలు కూతురికి నచ్చడం మానేశాయని అర్థమయాక సరళ కొంచెం మౌనంగాఉండాలని ప్రయత్నిస్తోంది కానీ ఆ ప్రయత్నాలు సఫలీకృతమవడం లేదు. కొన్ని కొన్ని విషయాలు చెప్పకుండా ఉండలేకపోవడం, అది చిన్న చిన్న వాదనలకి దారి తీయడం జరుగుతూనే ఉంది.
ఆరోజు పొద్దున్నే వాకిట్లో ముగ్గు వేయడానికి చీపురు పట్టుకుని వెళ్తూ “కాస్త ఆ బకెట్ తో నీళ్ళు తెచ్చి పెట్టవే” అంది సరళ.
భావన బకెట్టు  తెస్తూ  ఉండగా దారిలో రెండు చోట్ల నీళ్ళు ఒలికి పోయాయి. సరళ చిరాకు పడింది. “ఏమిటా పని తీరు? పొందిక లేకపోతే ఎలా?” అన్నమాటలు  అప్రయత్నంగా వచ్చేశాయి నోట్లోనుంచి.
“ఏమయిందమ్మా ఇపుడు? తుడిచేస్తాలే” అంది భావన.
“పారబోసుకోవడం ఎందుకు? తుడుచుకోవడం ఎందుకు? ఇలా చేస్తే ఎప్పటికి తెములుతాయిపనులు?...” సరళ మాటలు పూర్తి కానేలేదు, భావన అక్కడినుంచి వెళ్ళిపోయింది.
దాని అర్థం “చాల్లే నీ  ఉపన్యాసం” అని.  ఆమాట నోటితో అనలేదు, అంతవరకూ నయమేనని సంతోషించవలసినట్లుగా ఉంది ప్రస్తుతం  పరిస్థితి. కానీ అలా సంతోషించే అలవాటు సరళకి లేదు.
ముగ్గు వేసి లోపలికి వచ్చాక కాఫీ పెడుతూ తన మాటలు కొనసాగించింది. పెద్దవాళ్ళు  మాట్లాడుతూ మాట్లాడుతూ  ఉండగానే పిల్లలు అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఎంత అమర్యాదో కాఫీ త్రాగుతున్నంతసేపూ వివరిస్తూనే ఉంది.  ఆమాటలలో ఎన్నిటిని భావన చెవిన వేసుకుందో ఎన్నిటిని వదిలేసిందో మాత్రం అర్థం కాలేదు.
నేనేమీ కోపంగా చెప్పడం లేదుకదా నచ్చచెపుతున్నట్లుగా మెల్లగానే మాట్లాడుతున్నాను కదా ఇది కూడా చేయకూడదా అనుకుంది  సరళ నిస్సహాయంగా. అలా మెల్లగా చెప్పడం కూడా భావనకి నచ్చడం లేదనీ నసగా భావిస్తోందనీ  సరళకి తెలుసు.  ఆవిషయం ఆమెని ఇంకొంచెం బాధిస్తోంది.
తన బాధకి కారణమేమిటన్న ఆత్మవిమర్శ చేసుకోకపోలేదు సరళ. తనని బాధపెడుతున్నది కూతురు తనమాట విని తీరాలన్న  పంతమా కూతురికి పొందిక నేర్పాలన్న తాపత్రయమా అని విశ్లేషించుకుంది. రెండూ అయితే మాత్రం తప్పేమిటనిపించింది. అదే ఆమె చేత అంతసేపు మాట్లాడించింది.
ఈరోజు దానికి ఇంటర్వ్యూ ఉంది కాబోలు. ఇవాళెందుకులే దాన్ని చిరాకు పెట్టడం! అన్నమాట చివరికెప్పటికో తోచి సరళ తన ఉపన్యాసం చాలించింది కానీ అప్పటికే జరగవలసిన అనర్థం జరిగిపోయింది. భావనకి చిరాకు రానే వచ్చింది. ధుమధుమలాడుతూనే  పనులు పూర్తి చేసుకుని బయటకి వెళ్ళింది.
భావన వెళ్ళిన తర్వాత “పొద్దున నేను అన్ని మాటలు మాట్లాడవలసింది కాదేమో!” అన్న ఆలోచనలో పడింది సరళ.  మళ్ళీ వెంటనే కానీ ఎలా? తల్లినయ్యుండి  ఏమీ చెప్పకపోతే ఎలా?’ అనుకుంది.
తన చిన్నతనంలో తరచుగా వింటూ ఉండిన మాటలు గుర్తొచ్చి నవ్వుకుంది. “రేపు నువు అత్తగారింటికి వెళ్తే నిన్ననరు. నీకు పని సరిగా నేర్పలేదని నన్నంటారు” అనే మాటలు  తల్లులందరి నోటా  నిత్యం వినిపిస్తూ ఉండేవి అప్పుడు.
ఇప్పుడా పరిస్థితి లేదు. అత్తగారిళ్ళలో కోడలిని చిన్నా చితకా పనులకి సాధించే ధోరణి తగ్గిపోయింది. ఒకవేళ ఎక్కడైనా ఆ ధోరణి ఉన్నా “నిన్ను కాదు, మీ అమ్మననాలి” అనే మాట రావడం లేదు. ఒకవేళ పొరపాటున ఆమాట కూడా వచ్చినా “ఏం చేయనండీ  వదినగారు? అది నామాట అసలు వినదు” అని తల్లులు ధైర్యంగా చెప్పేయగలుగుతున్నారు.
కాబట్టి ఇపుడు భావనకి మంచీ చెడూ నేర్పకపోతే రేపెవరో వచ్చి తనని తిడతారని కానీ అత్తగారింట్లో గొడవలు పడి పుట్టింటికి వస్తే  తమకి బరువవుతుందేమోనని కానీ  భయం లేదు.
రేపో మాపో ఏదో ఒక ఉద్యోగంలో చేరుతుంది భావన. అపుడిక దాని సంపాదన దానిది. దాని స్వాతంత్ర్యం దానిది. అదంతా సరళకి తెలుసు.  అయినా “నువ్వు స్థిరపడ్డాక నీ ఇష్టం వచ్చినట్టే ఉందుగానివిలే. నా దగ్గర ఉన్నన్నాళ్ళు నామాట విను”అన్నమాట అంటూనే  ఉంటుంది.
ఎప్పుడైనా మరీ విరక్తి వచ్చినపుడు “నేను చెప్పాల్సిన మంచి విషయాలన్నీ ఇప్పటికే చెప్పేశాను. ఇంక నేను కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు,నువ్వు  గుర్తుపెట్టుకుని ఆచరించవలసినదే ఉంది.”అని కూడా అంటుంది.
“పో, నీకంత అక్కర్లేకపోతే ఇంక నేను నీకేమీ చెప్పనులే” అని నిష్టూరమాడుతూనూ  ఉంటుంది.
కానీ ఆ మాట మీద పూర్తిగా నిలబడదు. మళ్ళీ కాసేపటికే ఏదో ఒకటి చెప్పడం.. అది భావనకి నచ్చకపోవడం.. వాదన మొదలవడం..
ఈ తతంగం అంతా తనకొక్క దానికే సంబంధించినది కాదనీ తన స్నేహితులు అక్కచెల్లెళ్ళు – వాళ్ళందరి విషయంలోనూ కూడా ఇదే నడుస్తోందనీ  సరళకి తెలుసు.
భావనని పంపించి సరళ లోపలికి వచ్చేసరికి చెల్లెలు వనజ  దగ్గరనుంచి ఫోను. “సరితక్క వస్తోందా ఇవాళ?” అంటూ.
“వస్తోంది, నువ్వు వస్తున్నావుగా!” అంది సరళ. 
సరిత ఆమె చిన్ననాటి స్నేహితురాలు. పదోతరగతి దాకా కలిసి చదువుకున్నారు. ఆతర్వాత సరిత డాక్టర్ అయింది. పెళ్ళి చేసుకుని మరో ఊరు వెళ్ళిపోయింది. అటు  వృత్తిపరంగాను ఇటు ఒక రచయిత్రిగాను కూడా  మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది.
నాలుగురోజుల క్రితం హైదరాబాద్ లో ఉన్న తల్లిదండ్రుల దగ్గరకి వచ్చింది. ఇవాళ సరళ దగ్గరికి వచ్చే పని పెట్టుకుంది.
 సరితా వనజా వచ్చేసరికి పనంతా పూర్తి చేసుకోవాలి కాబట్టి తన ఆలోచనలని పక్కన పెట్టి పనిలోకి జొరబడింది  సరళ.
వాళ్ళు రావడం భోజనాలు చేయడం పూర్తయ్యాక ముగ్గురూ తీరిగ్గా కూర్చుని కబుర్లు మొదలు పెట్టారు.
“నిన్న సంస్కృతి గురించి ఇక్కడ ఒక పెద్ద సభ జరిగితే వెళ్ళాను.” అంది సరిత.
“సంస్కృతి గురించా?” అంటూ మిగిలిన ఇద్దరూ ఆసక్తి కనబరచగానే సరిత అక్కడ  వక్తలు ఏం మాట్లాడారో శ్రోతలు ఏమేమి ప్రశ్నలు వేశారో చెప్పడం మొదలుపెట్టింది.
“మంచి విషయాలే చెప్పారు. శ్రోతలు కూడా మంచి ప్రశ్నలే అడిగారు. ఇప్పటి పిల్లలకి ఇలాంటి మంచి  విషయాలపై  ఆసక్తి ఉందిఅయితే ఇవన్నీ ఏవో వాట్సప్ సందేశాలుగానో మరొకరకంగానో కాకుండా పెద్దవాళ్ళ ద్వారా వాళ్ళని చేరితే బాగుంటుందిఅన్నారు వక్తలుఅంది సరిత.
“నిజమే, కానీ అసలు ఏమైనా మాట్లాడటానికి పిల్లలు దొరికితే కదా!ఎంతసేపు ఫోన్లు పట్టుకుని కూర్చోవడమే సరిపోతోంది వాళ్ళకి.” అని నిట్టూర్చింది వనజ.
“కథలుగా కబుర్లుగా చెప్తే కొంచెం వింటారేమో కానీ  ఏ విషయమైనా బోధిస్తున్నట్లుగాను  ఈ పని ఇలా చేసుకోండర్రా అని సలహా చెప్తునట్లుగాను  చెప్పామా ఇక అంతేచిరాకు పడిపోతారు” అంది సరళ.
“సరేలేకథలూ కబుర్లూ చెప్తే  భావన వింటుందేమో, మావాడు అవీ  వినడు” అంది వనజ విసుగ్గా.
“నిజమే, మగపిల్లల్ని కూర్చోపెట్టి ఏమైనా చెప్పడం మరీ కష్టం”అని సరిత అనగానే   ముగ్గురూ నవ్వుకున్నారు.
“అది కాదక్కా! ప్రతీవాళ్ళు తల్లులదే బాధ్యత అన్నట్లుగా మాట్లాడతారు. పిల్లలకి అది చెప్పాలి ఇది చెప్పాలి అని తల్లికి చెప్తారు కానీ అమ్మ చెప్పింది వినాలి అని వాడికి చెప్పేవాళ్ళు ఎవరున్నారు?” నిట్టూరుస్తున్నట్లుగా అంది వనజ.
“నిజమేమనగురించి మరొకరెవరైనా చెప్పాలి కానీ నామాట విను, నేను చెప్తున్నది సరైనదిఅని మనకి మనమే చెప్పుకుంటే విలువ ఉండదు కదా! ఇంకా చులకన అయిపోవడం తప్ప” అంది సరిత. “మొన్నొకరోజు నేనిలాగే  ఏదో చెప్పబోతుంటే మా అమ్మాయి నీ తెలివి నీ దగ్గరే ఉంచుకో నాకక్కరలేదు అంది.  దాని పనులు ఎలా చేసుకోవాలో దానికి తెలుసట”నవ్వుతూనే చెప్పినా సరిత మోహంలో బాధ స్పష్టంగా కనబడింది.
“నిజమా!” ఆశ్చర్యంతో అరిచినట్లుగా అడిగింది వనజ. “ఇంక నేను బాధ పడడం అనవసరం సరితక్కా. నేనేదో ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో ఉంటున్నాను కాబట్టి మావాడికి నేనంటే విలువ లేదేమోననుకునేదాన్ని ఇన్నాళ్ళూ. ఇంత ప్రతిభ ఉన్న నిన్నే మీ అమ్మాయి అలా అందంటే ఇక నేను ఈ విషయం గురించి ఆలోచించడం కూడా వృధా అన్నమాట” అంది.
అదంతా వింటూ తనుకూడా దిగులుగా నిట్టూర్చింది సరళ. “ఇందాక మీరొచ్చే ముందు పనయిపోగానే కాసేపు ఫేస్బుక్ తెరిచాను. మన కమలక్కయ్య వాళ్ళమ్మాయి పెట్టిన పోస్టు కనబడింది. ఇవాళ కమలక్కయ్య  పుట్టినరోజట. అందుకని వాళ్ళ అమ్మకి శుభాకాంక్షలు చెప్తూ వాళ్ళ అమ్మ చాలా గొప్పదనీ అలాంటి అమ్మకి  కూతురిగా పుట్టడం తన అదృష్టమనీ వ్రాసింది. చెప్పొద్దూ అది చూడగానే నాకు ఒక్కసారి గుండెల్లో మంటలా అనిపించింది. అక్కయ్య తన పిల్లలకి చేసిందేమిటి? నేను చేయనిదేమిటి? అనిపించింది”
సరళ మాటలు పూర్తికాక ముందే వనజ తల పంకిస్తూ చెప్పింది.  “ఆగాగు నేను చెప్తాను. కమలక్కయ్య పిల్లలకి తనంటే ఎందుకంత యిష్టమో నాకు తెలుసు. అక్కయ్య తన పిల్లలు ఏం చేసినా అడ్డు చెప్పదు, వంక పెట్టదు సరికదా వాళ్ళేం చేస్తే అదే గొప్ప అంటుంది. మొన్నటిదాకా మాయింటి పక్కనే ఉండే వాళ్ళు కదా, నాకు తెలుసు. పిల్లలు తానా అంటే తను తందానా అంటుంది.”
“శుభం. అలా ఉంటే ఇక వాదనలే రావు కదా!” అంది సరిత నవ్వుతూ.
“నువ్వు చెప్పింది నిజమే, ఒకసారి కమలక్కయ్య వాళ్ళు మాయింటికి వచ్చారు. ఆరోజు  వాళ్ళు వచ్చేసరికి నేను పూలు కడుతున్నాను. సన్నజాజుల మాల రెండు భాగాలు చేసి అక్కయ్యకీ వాళ్ళ అమ్మాయికీ ఇస్తే అది మొహం చిట్లించి నేను పూలు పెట్టుకోను పిన్నీ అంది. అక్కయ్య పిన్ని ప్రేమగా ఇస్తోంది కదా తీసుకో’ అంటుందేమోనని చూశాను. అబ్బేఅలాంటిదేమీ అనకపోగా అది పూలు పెట్టుకోదులే సరళా, దానికి ఇష్టం ఉండదు అంటూ ఆమాల తీస్కెళ్ళి పక్కన పెట్టేసి వచ్చింది. ఇంక గొడవెందుకు వస్తుంది వాళ్ళ మధ్య?” అంటూ తన అనుభవం చెప్పింది సరళ.
“అవును, అలాగే చేస్తుంది కమలక్కయ్య”  వనజ అంగీకరిస్తున్నట్లుగా తల ఊపింది. “ఇంట్లో వాళ్ళిద్దరే ఉన్నప్పుడు  ఏమైనా చెప్తుందో లేదో తెలియదు కానీ మనముందు మాత్రం కూతురికి ఏమైనా చెప్పడం అంటే దాని గౌరవానికి భంగం కలిగించడమేనన్నట్లుగా ప్రవర్తిస్తుంది. తనే  అలా ఉన్నపుడు ఇక మనం బయటివాళ్ళం అసలేమీ చెప్పలేము కదా!”
“మనం బయటి వాళ్ళమా వనజా!” అంది సరళ “మన చిన్నప్పుడయితే పెద్దమ్మా, పిన్నీ, అత్తయ్యలు, అమ్మమ్మా అందరూ చెప్పేవారు కదా మనకి! పిల్లలు పనులు చేస్తున్నపుడు అక్కడ పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళు ఏదో ఒక వ్యాఖ్య చేస్తూనే  ఉండేవారు. పెళ్ళిళ్ళలోను ఇతర కార్యక్రమాలలోను పెద్దమ్మో అత్తయ్యో ఎవరో ఒకరు పెత్తనం తీసుకుంటే వాళ్ళు ఎలా చెప్తే అలా తుచ తప్పకుండా చేసేవాళ్ళం కదా మనం పనులు! వీళ్ళెవరు మనకి చెప్పడానికి అనుకునేవాళ్ళమా!”
సరళ ఆవేశం చూసి సరిత నవ్వింది. “ఇపుడసలు  బంధువుల ఇళ్ళల్లో కార్యక్రమాలపుడు పిల్లలు పనులు చేసిపెట్టాల్సిన పరిస్థితే లేదుగా! అసలు వాళ్ళు మనతో పెళ్ళిళ్ళకీ పేరంటాలకీ రావడమే అపురూపం” అంది.
“నిజమే, సమయం దొరికినపుడల్లా ఇలాంటి విషయాలన్నీ చెప్తూనే ఉంటాను నేను భావనతో, అది విన్నా వినకపోయినా. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా” సరళ నిట్టూర్చింది.
“ఇప్పటి పిల్లలకి పెద్దవాళ్ళిచ్చే ఆస్తిపాస్తులని ఉపయోగించుకోవడం తెలుస్తోంది కానీ అంతకన్నా విలువైన మాటలని ఉపయోగించుకోవడం తెలియడం లేదు” నవ్వుతూ వ్యాఖ్యానించిన సరిత గడియారం వైపు చూసి “అబ్బో, అప్పుడే నాలుగయిపోయిందే!’ అంది ఆశ్చర్యంగా.
అవునా! అంటూ మిగిలిన ఇద్దరూ కూడా గడియారం వైపు చూశారు.
“చూడు, ఇది పొద్దుననగా ఇంటర్వ్యూకని వెళ్ళింది. ఇంతవరకు ఒక  ఫోనన్నా  చేయలేదు!” అంటూ కుర్చీలోనుంచి లేచింది సరళ. “కొంచెం కాఫీ త్రాగుదాం” అంటూ వంటగది లోకి నడిచింది.
కాఫీల కార్యక్రమం అయ్యాక మరొక అరగంట కబుర్లు చెప్పి అయిదవుతూ  ఉండగా సరితా వనజా బయల్దేరారు.
వాళ్ళు వెళ్ళిన తర్వాత మరొక గంటకి భావన ఇల్లు చేరింది.
తలుపు తీస్తూ ఉండగానే  చిరునవ్వుతో  మెరుస్తున్న  మొహంతో “సెలక్ట్ అయ్యాను” అంది.
ఆ శుభవార్తకి సంతోషిస్తూ కూతుర్ని దగ్గరకి తీసుకుంది సరళ.  కాళ్ళు కడుక్కుని, సరళ తెచ్చిచ్చిన మంచినీళ్ళు తాగుతూ వివరాలు చెప్పింది భావన.“చాలా మంది వచ్చారు. పొద్దున పదింటి నుంచి పదకొండున్నర దాకా వ్రాత పరీక్ష పెట్టారు. అందులో సెలక్ట్ అయినవాళ్ళని  మధ్యాహ్నం   ఇంటర్వ్యూకి రమ్మన్నారు.”
“నీ ఫ్రెండ్సెవరన్నా వచ్చారా!” అంది సరళ.
“శ్రావ్య వచ్చింది. ఇంకా మా కాలేజ్ వాళ్ళు కొంతమంది వచ్చారు కానీ వాళ్ళతో నాకంత పరిచయం లేదు” అంది భావన. ఒక్క క్షణం ఆగి  “శ్రావ్య గూడా మొదటి రౌండు లో  సెలక్ట్ అయ్యి రెండో రౌండుకు వచ్చింది  కానీ  ఇంటర్వ్యూ తర్వాత దానికి నాకు చెప్పినట్లుగా సెలక్ట్ అయ్యావు అని చెప్పలేదట. తర్వాత తెలియచేస్తాం అన్నారట” అంది.
“ఏమడిగారు ఇంటర్వ్యూలో? కష్టంగా అనిపించిందా?” కుతూహలంగా ప్రశ్నించింది సరళ.
“కష్టమేమీ లేదు. వ్రాత పరీక్ష ముందే అయిపోయిందిగా. ఇంటర్వ్యూలో మా సబ్జక్టుకి సంబంధించిన ప్రశ్నలేవీ అడగలేదు. మామూలు విషయాలే అడిగారు.”
“మామూలు విషయాలంటే?
“చదువు కాకుండా ఇంకేం చేస్తావుసంగీతం సాహిత్యం లాంటి ఆసక్తులేమైనా ఉన్నాయా?- ఈ రకమైన  ప్రశ్నలడిగారు. చివర్లో ఇప్పటి యువతరానికి ఉన్న  సమస్య ఏమిటో చెప్పమన్నారు.”
“ఏం చెప్పావు?” ఆసక్తిగా అడిగింది సరళ.
“నువ్వెప్పుడూ చెప్తూ ఉంటావుగా, అదే చెప్పాను” అంది భావన.
“నేను ఎప్పుడూ చెప్పేదా?  ఏమిటది?” సరళకి అర్థం కాలేదు.
“ఇదివరలో పెద్దవాళ్ళు ఏమైనా చెప్తే పిల్లలు ఆ సలహాలని సూచనలని తీసుకునేవారు. వీళ్ళు మాకు చెప్పడమేమిటని కోపం తెచ్చుకునేవాళ్ళు కాదు, కానీ ఇప్పటి పిల్లలకి అలా ఎవరైనా తమకి సలహాలు యిస్తే నచ్చడం లేదు అని చెప్పాను.”
భావన మాటలకి నోటమాట రానంతగా విస్తుపోయింది సరళ. అది గమనించకుండా భావన తన మాటలు కొనసాగించింది. “నేను చెప్పినది ఆ ఇంటర్వ్యూ చేసినావిడకి బాగా నచ్చినట్లుంది. ఇప్పటి పిల్లలకి ఉన్న  సమస్య అంటే - నేను బయటి సమస్యలు చెప్పకుండా వాళ్ళలోనే ఉన్న సమస్య చెప్పాను కదా! అందుకని  కాబోలు!” సాలోచనగా అంది.
అప్పటికి ఆశ్చర్యంలో నుంచి తేరుకున్న సరళ చిరునవ్వుతో భావన వైపు చూస్తూ“ఇంతకీ ఏమన్నా తిన్నావాలేదా పొద్దున్నుంచీ!” అంది.
“ఆఁ నువ్వు బాక్స్ ఇచ్చావుగా! అదే తిన్నాం శ్రావ్యా నేనూ ఇద్దరమూ.”
“ఇద్దరూనాఆ కొంచెం అన్నం ఇద్దరికీ ఏం  సరిపోయిందిబయట ఏమైనా తినకపోయారా?
సరళ ఆదుర్దాగా అడిగితే “అక్కడ దగ్గర్లో ఏమీ లేవు. పైగా ఎండ. అందుకని అదే చెరిసగం తిన్నాం. సరిపోయిందిలే” అని భావన తేలికగా కొట్టిపారేసింది.
“సరే అయితే రెండు దోసెలు వేసి పెడతానుండు” అంటూ కుర్చీలోనుంచి లేచింది సరళ.
“నేను కూడా  బాక్స్ తెచ్చుకోవలసింది అనుకుంది శ్రావ్య. వాళ్ళ అమ్మ మీద కోపం వచ్చి బాక్స్ ఇస్తానంటే తీసుకోకుండా వచ్చిందట అది” భావన యథాలాపంగా చెప్పిన మాటలకి సరళ చివ్వున వెనుతిరిగి చూసింది. కానీ అటుతిరిగి ఉన్న భావన మొహంలోని భావమేమిటో కనబడలేదు.
తనలో తనే నవ్వుకుంటూ వంటగదిలోకి నడిచింది సరళ. మధ్యాహ్నం సరిత అన్నమాటలు గుర్తు చేసుకుని,“ఉపయోగించుకోవడం తెలియకపోవడం కాదేమో! అసలిపుడు ఉపయోగం అనేమాటకి అర్థమే మారిపోయిందేమో! అని ఆలోచనలో పడింది.
“ఇప్పటి వాళ్ళకి  అచరణతో పనిలేదు, అప్పగించగలిగితే చాలు.   అప్పగించగలిగిన వాటిని ఎప్పటికైనా ఆచరించే అవకాశముంటుందన్న ఆశాభావం.. అదొక్కటే మనకి పదివేలు.” అనుకుంటూ భావనకి వేడి వేడి దోసెలు అందించింది.

*****
                                                                         (ఆకాశవాణి జూన్ 2018)

కామెంట్‌లు

నిజంగా ఇది అందరి ఇళ్లలో ఉన్న సమస్యే అండీ, తల్లి చెప్పినప్పుడో , ఆ చెప్పింది చెయ్యాల్సి వచ్చినప్పుడో పిల్లలు భేఫరువా గా ఉన్నారనే అనిపిస్తుంది. వాళ్ళు అవసరం అయినప్పుడు మాత్రం ఆ ఉపన్యాసాలను చక్కగానే వినియోగించుకుంటారు. కథ ఆలోచనాత్మకం
సుభగ చెప్పారు…
ప్రతీ తల్లీ రిలేట్ చేసుకునే కథ..చాలా చాలా సహజంగా ఉంది..
మన ముందు పట్టించుకోకపోయినా మనం చెప్పేది తలకెక్కించుకుంటున్నారు అన్న భావన కాస్త హాయినిస్తోంది..ఇది నిఝంగా నిజం ఐతే బాగుండు
ఇంటింటి రామాయణాన్ని బాగా పసిగట్టారు. మా ఇంట్లో మా ఆవిడ ఈ కథలో సరళ. మరి నేనా? కొంచెం ఉత్కంఠగా ఉంది కదూ. నేను పురుషరూపం ధరించిన కమల. నవ్వుకోకండి. ఇప్పుడెలాగూ తీరికే కాబట్టి ఈ రోజు టిఫెన్లయ్యాక మా ఆవిడ(కవిత)ని, మా అమ్మాయి (డి.పి.సాహితీరాణి I B.Tec. IIT Tirupati)ని, మా అబ్బాయి (డి.జె.శివానిరాజ్ 9వ తరగతి)ని కూచోబెట్టుకుని ఈ కథ వినిపిస్తా. సరళ్ళా బలప్రయోగం చేసైనా సరే. ఎందుకంటే అందరూ ఈ పాత్రల్లో దేనితోనో ఒకదాన్తో తమని పోల్చుకునేందుకు, తద్వారా తమని తాము దిద్దుకునేందుకూ అవకాశం పుష్కలంగా ఉంది కాబట్టి
ఇక ఈ కథ నాకు చాలా నచ్చిందని చెప్పనవసరం లేదనుకుంటా - కవితశ్రీ(డా.డి.శ్రీనివాసులు)

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సతీసుమతి

తారకము

సంక్లిష్టమైన కథలు