ముగ్ధ

నిజాయితీగా
ప్రేమించడం ఒక్కటే
తెలుసు నాకు
లక్షల నియమాలూ
నియంత్రణలూ తెలీవు
నిక్కచ్చిగా ప్రేమించడం
మాత్రమే తెలుసు

అతను దూరంగా వున్నపుడు
మేఘాలతో సందేశాలు పంపడమూ
హంసలతో రాయబారాలు చేయడమూ
నాకు తెలియదు

నా ఉనికైనా నాకు తెలియని
నిర్లిప్తతలో అపుడు నేనుంటానని
అందరూ నాతో చెప్పడం మాత్రమే
నాకు తెలుసు

అతను వస్తున్నాడన్న కబురందినపుడు..
ముంగిట్లో రంగవల్లులు తీర్చడమూ
దారుల్లో పూలహారాలూ పేర్చడమూ
నాకుతెలియదు

ఏవో దివ్యలోకాలనుంచి
ఒక్కసారిగా నాలో
జీవం ప్రవేశించడం మాత్రమే
నాకు తెలుసు

అతని పదముల సవ్వడి
లయగా వినబడినప్పుడు
కుచ్చిళ్ళు కాళ్ళకి అడ్డం పడేలా
పరుగులెత్తడమూ
వరదగోదారి సిగ్గుపడే వేగంతో
ఎదురు వెళ్ళడమూ
నాకు తెలియదు
కనురెప్పా, కాలిగోరూ
ఉద్వేగంతో మూగగా వణకడమే
నాకు తెలుసు

అతను వచ్చి
నా ఎదుట నిలబడినపుడు
కళ్ళలో మెరుపులు చిందించడమూ
కాళ్ళకు నీరందించడమూ
నాకు తెలియదు
నాకన్నీటి పొర
అతని రూపాన్ని కప్పేసి
నను చూసి వెక్కిరింతగా
నవ్వడమే నాకు తెలుసు

అతని చూపుడు వేలు నాచుబుకాన్ని
సుతారంగా స్పృశించినపుడు
కళ్ళు అరమోడ్పులవడమూ
పెదవులు పల్లవాలవడమూ
నాకు తెలియదు
అంతకు ఒక్క క్షణం ముందు
ఆనందాతిశయంతో నాగుండె
ఆగిపోవడం మాత్రమే నాకు తెలుసు

*****
(1996 లో విడుదలయిన "రేవు చూడని నావ" కవితాసంపుటి లోని కవిత) 

కామెంట్‌లు

చైతన్య.ఎస్ చెప్పారు…
శ్రీవల్లీ రాధిక, చాలా బాగుంది. చివరి పంక్తులు ఎందుకో నాకు తెగ నచ్చేసాయి.
Purnima చెప్పారు…
ఈ కవిత చదువుతున్నప్పుడు
గుండె తడి కావటం
మనసు మాటలవ్వడం నాకు తెలీవు

కళ్ళతో ఏరుకున్న అక్షరాలను
మెదడు మళ్ళా చదువుకున్నప్పుడు
అప్రయత్నంగా "వావ్" అన్నానని నాకు తెలుసు.

మీకి అది తెలియజేయటానికి నా దగ్గర ఏ సాధనా లేదు. :-(
Bolloju Baba చెప్పారు…
తెలియదు తెలియదు అంటే కొత్త ఇమేజెస్ చెప్తారనుకొన్నాను.

బొల్లోజు బాబా
అజ్ఞాత చెప్పారు…
బాగుంది.
kRsNa చెప్పారు…
chaala baaga chepaaru srivalli gaaru. abhinandanalu. :)
అంతటి తన్మయాన్ని అనుభవించి రాశారు. చాలా బావుంది.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సతీసుమతి

తారకము

సంక్లిష్టమైన కథలు