కైవల్యం

జీవితంలో కొన్ని మలుపులు మన ఆలోచనా ధోరణిని పూర్తిగా మార్చేస్తాయి. ప్రాపంచిక విషయాలలోని లోటునీ, అసంపూర్ణతనీ గుర్తించడం వల్ల ఏర్పడే మలుపులు కొన్నయితే,   ఓ సంఘటనో, సద్గురువో మనకి ఎదురవడం వల్ల కలిగిన క్రొత్త  అవగాహనతో ఏర్పడేవి మరికొన్ని. బహుశా మొదటివి వైరాగ్యానికీ, రెండోవి జ్ఞానానికీ బీజాలు వేస్తాయేమో!

అలాంటి ఒక మలుపులో వ్రాసిన కవిత “కైవల్యం”. వ్యక్తిగతంగా నా జీవితాన్ని గురించీ, మనసుని గురించీ,  అలాగే ప్రపంచాన్ని గురించీ అంతకు ముందు కలిగిన భావాలు వేరు. ఆ తర్వాత కలుగుతున్న భావాలు వేరు. ఆ వ్యత్యాసాన్ని ఈ పుస్తకంలో పట్టి ఉంచుదామన్న  ఉద్దేశంతోనే బాగా పాతవైనప్పటికీ, ‘కైవల్యం‘ కి ముందు వ్రాసిన నాలుగు  కవితల్ని కూడా యిందులో చేర్చడం జరిగింది. అవికాక మరొక పాతిక కవితలు.

***

పై వాక్యాలు “కైవల్యం” కవితా సంపుటి మొదటి పేజీలలో ఈ సంపుటి యొక్క నేపథ్యాన్ని వివరిస్తూ నేను వ్రాసినవి.

నా మొదటి కవితా సంపుటి ‘రేవు చూడని నావ’ 1996 లో ప్రచురించబడింది. మళ్ళీ ఇప్పుడు పదిహేనేళ్ళ తర్వాత రెండో కవితా సంపుటి వెలువడింది. ఈ పదిహేనేళ్ళలో వ్రాసిన అన్ని కవితలూ ఈ సంపుటి లో చేర్చలేదు.

ఈ రెండు సంపుటాలలోని కవితలనీ గమనిస్తే నాకొక విషయం అర్థమయింది. 

‘రేవు చూడని నావ’ లోని కవితలు ఒక స్పందననో, భావాన్నో, ఊహనో అందరితో పంచుకుని ఆనందించిన సందర్భాలు.

‘కైవల్యం’ లోని కవితలు… ‘స్పందన’ని కాదు “ఆనందాన్నే” పంచుకునే ప్రయత్నం. భావాన్ని కాదు అనుభవాన్ని వివరించడం. ఊహని కాదు వాస్తవాన్ని చెప్పాలనుకోవడం.

ఇక్కడ కవిత రాయకముందే ఆనందం ఉంది. అది గుండెలో పట్టక పొంగి పొర్లినపుడు  అక్షరాలుగా ఒలికిపోయింది.

‘కైవల్యం’ సంపుటి విడుదలయ్యాక అట్టమీద బొమ్మ చూసీ, పుస్తకం పేరు చూసీ కొందరు… భక్తిని కవిత్వంగా తాము అంగీకరించమనీ, భక్తి కవితలు వ్రాయడంలో సృజనాత్మకత లేదనీ, అది ‘ఆధునిక కవిత్వం’ నిర్వచనంలో ఇమడదనీ అన్నారు. ‘ఇలా వ్రాస్తే నిన్ను భక్తురాలు అంటాం కానీ కవయిత్రి అనము ‘ అన్నారు. ‘అంతకంటే భాగ్యమా!’  అనుకున్నాను నేను.

“నిజమైన భక్తులూ, దేవుడూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీళ్ళందరూ బలవంతంగానైనా నన్ను భక్తుల జాబితాలో చేర్చేసేలా ఉన్నారు కదా!, ఇదేదో బానే ఉంది” అని ఆనందపడ్డాను.

అయితే ఆ ఆనందంలో నేను స్థిరపడే లోపల… మరి కొందరు ముఖచిత్రం తోనూ, శీర్షిక తోనూ సరిపెట్టుకోక.. పుస్తకం తెరిచి లోపల ఏముందో చదివారు.  చదివి… "కవితలు బావున్నా"యన్నారు.

నేను ఆలోచనలో పడ్డాను. దీనిని భక్తులు “కవిత్వం” గానూ, కవులు “భక్తి” గానూ భావిస్తున్నారా! అని సందేహం వచ్చింది. భక్తులు భక్తిగానూ, కవులు  కవిత్వంగానూ గుర్తిస్తే  బాగుండుననే  కోరికా పుట్టింది.

పున్నమి రోజునా సగం చంద్రుడే కనిపిస్తూన్నపుడూ/యుగళగీతాలలోనూ ఒక్క స్వరమే వినిపిస్తూన్నపుడు/ – వంటి వ్యక్తీకరణలనీ

రాశీభూత జ్ఞానమనుకునేవారూ తమని తాము ప్రకటించుకునేందుకు రూపనామాలనే ఆశ్రయిస్తారు/ – వంటి పరిశీలనలనీ

ప్రపంచాధిపత్యాన్ని కోరుకోమని ప్రాధేయపడతాను/నామనసు ఒప్పుకోదు/ఓ పురుషోత్తముడి పాదాలు ఒత్తాలని ఉందని దీనంగా అడుగుతుంది/ – వంటి భావనలనీ

అలంకారప్రియుడివంటూ నిన్నూ/అమాయకురాలినంటూ నన్నూ ఆడిపోసుకుంటారు – వంటి చమత్కారాలనీ

నామనసే భ్రమరమై వెళ్ళి వాటిపై వాలిందో/అవే చిలిపిగా రసగంగను నాపైకి చిమ్మాయో/ – వంటి అనుభూతులనీ

నా చుట్టూ వెలుతురున్నంత సేపూ నాతో ఇలాగే ఆడుకుంటుంది/అది నిస్సహాయంగా చేతులెత్తినపుడే నాలోని వెలుగు నాకర్ధమవుతుంది/ – వంటి తాత్విక చింతనలనీ

ఇంకా.. ‘రెండు మార్గాలు’ వంటి కవితలలోని నిగూఢాంశాలనీ, ‘సాధన’ వంటి కవితలలోని  సందేశాన్నీ, ‘నాకు కావలసిందే’ వంటి కవితలలో శీర్షిక నుండీ ముగింపు వరకూ అంతర్లీనంగా సాగిన ధ్వనినీ,  కవులూ భక్తులూ కూడా గమనించి ఆనందించాలన్న ఒక చిన్న ఆశా కలిగింది. 

******
(వాకిలి అంతర్జాల పత్రికలో  "ఇంకో పూవు" శీర్షికలో ప్రచురితం - ఫిబ్రవరి 2013) 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సతీసుమతి

తారకము

సంక్లిష్టమైన కథలు