పంచకోశములు (తత్త్వబోధ - 4)
అన్నమయకోశము, ప్రాణమయకోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ
కోశము, ఆనందమయ
కోశము అనే అయిదింటినీ పంచకోశములు అంటారు.
కోశము అంటే తొడుగు. ఆత్మ ఈ అయిదుకోశములతోను కప్పబడి ఉంటుంది.
పంచకోశములఉనికీ వాటి కార్యకలాపాలూవాటివెనుక ఆత్మ ఉందన్న వాస్తవాన్ని నిరూపిస్తూ
ఉంటాయి కానీ అవి ఆత్మ యొక్క స్వస్వరూపాన్ని కప్పిపెడుతూనూ ఉంటాయి.
ఈ పంచకోశములు తాను తయారు చేసుకున్నవేననీ తాను
ధరించిన తొడుగులు మాత్రమేననీ మరచిన “నేను” ఆ పంచకోశములకే తనని పరిమితం చేసుకోవడమూ
వాటిలోనే బంధింపబడి ఉండడమూ - అదే దుఃఖానికి
కారణం.
నిజమైన “నేను” ఏ బంధములూ లేనిదీ సర్వస్వతంత్రమైనదీ.
పంచకోశములకి అతీతమైన ఆ “నేను”ని
తెలుసుకోవడమే ఆనందం.
అన్నమయకోశము:
అన్నము వలన పుట్టి అన్నముతో పెరిగి చివరికి మట్టిలో
కలిసిపోయే స్థూలదేహమే అన్నమయకోశము. అన్నము వలన మార్పునకు లోనవుతుంది కనుక ఇది
అన్నమయ కోశము అనబడుతుంది. స్త్రీపురుషులు భుజించిన అన్నమే సంతానోత్పత్తికి కారణమైన
వీర్యాదులుగా పరిణామం చెందుతుంది. వాటి నుండి ఏర్పడిన పిండము తల్లిగర్భంలో ఆమె
భుజించిన అన్నం వలననే పెరుగుతుంది. తల్లి గర్భం నుంచి వెలువడిన బిడ్డ మళ్ళీ తాను
భుజించే అన్నం వలననే ఎదుగుతుంది. మరణించాక మళ్ళీ అన్నం(మట్టి)లోనే కలిసిపోతుంది.
మనం భుజించే అన్నం మట్టి నుండే వస్తుంది కనుక మట్టే అన్నం.మట్టి నుంచి వచ్చిన
స్థూలదేహం మరలా మట్టిలోనే కలిసిపోతుంది.
స్థూలదేహమే నేను అన్న భావన ఉన్నందువలనే మనము “నేను
పొడుగ్గా ఉంటాను, పొట్టిగా ఉంటాను, తెల్లగా ఉంటాను, నల్లగా ఉంటాను” వంటి
మాటలు మాట్లాడుతూ ఉంటాము.
ప్రాణమయకోశము:
ప్రాణమయకోశం మనం పీల్చే గాలి ఆధారంగా ఏర్పడుతుంది.
ఇది అన్నమయకోశంతో కప్పబడి ఉంటుంది. ప్రాణమయకోశం
అన్నమయకోశంకన్నా సూక్ష్మమైనది.
ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన
అనే అయిదు వాయువులూ వాక్కు మొదలైన అయిదు కర్మేంద్రియాలూ కలిసి ప్రాణమయకోశము.
ప్రాణమయ కోశం లోని అయిదు రకాల వాయువులు అయిదు
రకములైన పనులని చేస్తుంటాయి. ప్రాణ వాయువు శ్వాసను నియంత్రిస్తుంది.అపానవాయువు
శరీరంలోని వ్యర్థపదార్థాలను విసర్జించడానికి సహాయపడుతుంది. వ్యానము రక్తప్రసరణను
నియంత్రిస్తుంది. ఉదాన వాయువు వాంతులు, త్రేన్పులు, తుమ్మడం, కన్నీరు
కార్చడం వంటి ప్రతిస్పందనలన్నిటికీ
తోడ్పడుతుంది. మరణించిన తర్వాత సూక్ష్మశరీరం స్థూలశరీరాన్ని వదిలిపెట్టడానికి కావలసిన
శక్తిని కూడా ఈ ఉదానవాయువే ఇస్తుంది. ఇక చివరిదైన సమాన వాయువు జీర్ణక్రియకు తోడ్పడుతుంది.
ఈ అయిదువాయువులు చాలా ముఖ్యమైనవి. ఇవి చక్కగా పనిచేసినపుడేమనశారీరిక మానసిక
ఆరోగ్యాలు బాగుంటాయి.జననం నుంచి మరణం దాకా ఇవి నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటాయి.
వీటిలో ఏ ఒక్కటి పని చేయకపోయినా మనిషి మరణానికి చేరువవుతాడు. ఇవి
సూక్ష్మదేహాన్ని స్థూలదేహంతో కలుపుతాయి. ఆ
రెండింటికీ శక్తినిస్తాయి.
“నాకు ఆకలిగా
ఉంది”, “నాకు దప్పికగా ఉంది”
అంటున్నపుడు, ఆకలి దప్పిక వంటి స్థితులని ‘నేను’కు
ఆపాదిస్తున్నపుడు మనం ‘నేను’ను
ప్రాణమయకోశానికి పరిమితం చేస్తున్నామని అర్థం.
మనోమయకోశము:
మనస్సు, పంచ జ్ఞానేంద్రియాలు ఈ ఆరింటితో
కూడినది మనోమయకోశము. కామ క్రోధాది ఉద్వేగాలకు నిలయమైనది మనస్సు. సంకల్ప వికల్పాలకు కారణమైనదీ మనస్సే. అంటే ఈ
పని చేయాలా వద్దా అనే ఊగిసలాటకు మనస్సే కారణం.
ప్రపంచంలోని విషయాలను ఇంద్రియాల ద్వారా గ్రహించేది మనస్సే. మనస్సు
పూనుకోకపోతే ఇంద్రియాల ద్వారా మనము గ్రహించగలిగేది ఏమీ ఉండదు. మనసు మరెక్కడో
ఉన్నపుడు కళ్ళ ఎదురుగా ఉన్న విషయాలు కూడా కనబడవు కదా!“నేను
సంతోషంగా ఉన్నాను నేను బాధగా ఉన్నాను” అంటూ మనం
చేసే వ్యాఖ్యలు ‘నేను’ను
మనోమయకోశానికి పరిమితం చేసినపుడు వెలువడతాయి. ఎందుకంటే నిజమైన “నేను”కు ఈ రెండు
స్థితులూ ఉండవు.
విజ్ఞానమయకోశము:
బుద్ది, పంచ జ్ఞానేంద్రియాలు కలిస్తే ఏర్పడేది
విజ్ఞానమయకోశము.పైన చెప్పుకున్న మూడు కోశములతోను కప్పబడి ఉండే ఈ విజ్ఞానమయకోశం ఆ
మూడింటికన్నా సూక్ష్మమయినది. ఇదిమిగిలిన మూడు కోశములనీ నియంత్రిస్తుంది.
జ్ఞానేంద్రియాలు మనోమయకోశంలోను విజ్ఞానమయకోశంలోను
కూడా ఉంటాయి ఎందుకంటే గ్రహణశక్తి మనసూ బుద్ధీ రెండింటిమీదా ఆధారపడుతుంది కాబట్టి.
మనసు సంకల్ప వికల్పాలకు కారణమని చెప్పుకున్నాం. ఆ
సంకల్ప వికల్పాలను గూర్చి తీసుకునే
నిర్ణయానికి బుద్ధి కారణం.
ఆత్మ యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోలేని అజ్ఞానం
వలన మొదట బుద్ధి “నేను కర్తను” నేను పరిమితుడను” వంటి నిర్ణయాలకు వస్తుంది. ఆ
నిర్ణయాలే తర్వాత “నేను పొట్టిగా ఉన్నాను”“నేను ఆకలితో ఉన్నాను”“నేను సంతోషంగా ఉన్నాను” వంటి భావనలుగా
రూపొందుతాయి.అయితే నేను అపరిమితుడను, ఆనందస్వరూపుడను అనే జ్ఞానంకూడా బుద్ధి
వలననే ఏర్పడుతుంది.
జీవితంలో మనం దేనికి విలువ ఇస్తాము అనే విషయాన్ని
నిర్ణయించేది బుద్ధే. మనం దేనికి విలువ ఇస్తామో దానినే సాధించాలని అనుకుంటాము.
దానికోసమే పరుగులు పెడతాము. డబ్బే సర్వస్వమనీ అదే కావాలనీ అనుకుంటే అందుకు
తగ్గట్లుగానే వ్యవహరిస్తాము. ఏది మంచి ఏది చెడు ఏది సత్యం ఏది కాదు అన్న విచక్షణ
బుద్ధి వలననే కలుగుతుంది.
కొత్త విషయాలను ఆవిష్కరించడము, సృజించడము, దర్శించడము, పరిశీలించడము, గ్రహించడము, ఊహించడము, గుర్తించడము
వంటి నేర్పులన్నీ బుద్ధికి సంబందించినవే. ఇంద్రియాల ద్వారా గ్రహించిన అనుభవం మనసు
ద్వారా బుద్ధిని చేరుతుంది. పూర్వానుభవాలను ఆధారం చేసుకుని బుద్ధి కర్తవ్యాన్ని
నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయం మనసు ద్వారా మళ్ళీ ఇంద్రియాలను చేరి వాటిని
నడిపిస్తుంది. అందుకే బుద్ధిని శరీరానికి సారథిగాచెప్తుంటారు.
ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ
కోశములు మూడింటినీ కలిపి సూక్ష్మశరీరం అంటారు.
ఆనందమయకోశము:
అన్నికోశములకన్నా సూక్ష్మమైనది ఆనందమయకోశము.ఇదే
కారణశరీరం అనబడుతుంది. ఇది అవిద్యా స్వరూపమే అయినా ఆత్మానందంతో సంపన్నమై ఉంటుంది.
రజోగుణ తమోగుణములతో కలిసి ఉన్న సత్త్వాన్ని మలిన
సత్త్వం అంటారు.ఈ మలినసత్త్వం కారణశరీరంలో భాగం.
ప్రియముమోదము ప్రమోదము అనేవి దాని వృత్తులు.
రాత్రివేళ లోకమంతా చీకటితో నిండినపుడు అన్ని
వస్తువులూ వాటి లక్షణాలూ ఆ చీకటిలో కలిసిపోతాయి.ఏ వైరుధ్యాలూ కనిపించవు. అవేవీ
నాశనమవడం లేదు,
కనిపించకుండా పోతున్నాయంతే. మళ్ళీ
తెల్లవారగానే అన్నీ కనిపిస్తాయి. అలాగే గాఢనిద్రలో ఉన్నపుడు కారణశరీరం మాత్రమే
పనిచేస్తున్నపుడు ద్వంద్వాలన్నీ సమసిపోతాయి. అహము, ఉద్వేగము, ఆరాటము,ఆందోళన,ప్రపంచము, స్థూల సూక్ష్మ
శరీరాలూ - ఇవన్నీ కూడా అవిద్యలో (అచ్చపు చీకటిలో)
కలిసిపోతాయి.
కొలనులోని నీరు ఎంత తేటగా ఉంటే సూర్యుని
ప్రతిబింబం అంత బాగా కనబడుతుంది.నీటిలో
పూర్తి స్వచ్చత నిశ్చలత ఉన్నపుడు సూర్యుడు స్పష్టంగా కనబడతాడు. అలాగే మనసు
ఎంత తేటగా నిశ్చలంగా ఉంటే ఆత్మానందం అంత బాగా గోచరిస్తుంది. గాఢనిద్రలో ఆలోచనలూ
ఆందోళనలూ ఉండవు కనుక ఆత్మానందం సంపూర్ణంగా గోచరిస్తుంది.అయితే ఇక్కడ ఈ ఆనందం అవిద్యతో
ఏర్పడుతున్నది.మలినసత్త్వంతో కూడినది.
సుషుప్త్యావస్థలో (గాఢనిద్రలో) పొందే ఆనందంలో స్థాయీ భేదాలేమీ ఉండవు. అది అఖండం, పరిపూర్ణం.
జాగ్రత్ స్వప్నావస్థలలో మాత్రం మనం రకరకాల ఆనందాలని పొందుతూ ఉంటాము. ప్రకృతిని
చూసి పొందే సాత్త్విక ఆనందం, ఏదైనా
సాధించినపుడు పొందే రాజసిక ఆనందం, ఎవరినైనా బాధపెట్టి పొందే తామసిక ఆనందం - ఇలా
రకరకాల ఆనందాలుంటాయి.రాజసిక తామసిక అనుభవాల కన్నా సాత్త్వికమైన అనుభవాలు ఎక్కువ
ఆనందాన్ని ఇస్తాయి.
అలాగే ఇష్టమైన వ్యక్తినో వస్తువునో తల్చుకుంటే
కలిగే ఆనందం ప్రియము. ఆ వస్తువును/వ్యక్తినిచూసినపుడు
కలిసినపుడు కలిగే ఆనందం మోదం.అది ప్రియముకన్నాఎక్కువ. ఇక ఆ
వస్తువుని అనుభవిస్తే అదే మనమై పోతే కలిగే ఆనందం ప్రమోదం. అదిమోదం కన్నాఎక్కువ. ఈ
మూడు వృత్తులూ కలిగినది ఆనందమయ కోశము.
కామెంట్‌లు