సింహావలోకనం



ఒక వార్త వినగానే ఇన్ని జ్ఞాపకాలు రివ్వున తిరగడం... ఈమధ్యకాలంలో జరగలేదు.
ఆయన వ్యంగ్యాలు.. విసుగులు.. వివరణలు.. అన్నీ ఒకదానివెంట ఒకటి గుర్తొస్తున్నాయి.
“మిమ్మల్ని కొంచెం విసిగిద్దామని ఫోన్ చేశానండి” అంటూ శర్మగారి నెంబర్ నుండి నాకిక ఫోన్లు రావు.
పెద్దా చిన్నా లేకుండా నేను ఆయన అభిప్రాయాలన్నిటినీ ఖండించినా వాదించినా నవ్వేసి “మిమ్మల్ని ఒప్పించడం కష్టం” అనే శర్మగారి గొంతు ఇక వినబడదు.
***
శర్మగారి మరణవార్త విన్న వెంటనే ఫేస్బుక్ లో నేను వ్రాసిన వాక్యాలు అవి. అసంకల్పితంగా అనాలోచితంగా వ్రాసేసిన మాటలు. 
ఇపుడు ఏమన్నా వ్రాయాలని సంకల్పించుకుని ఆలోచిస్తుంటే ఆ రెండు మాటల్లోనే దాదాపుగా అంతా చెప్పేశానని అనిపిస్తోంది.
అవును, వ్యంగ్యాలు, విసుగులు, వివరణలు - అదే వరుస.
ఏ విషయం గురించయినా అడిగినపుడు ఆయన మొదట వ్యంగ్యంగా స్పందిస్తారు. దానిమీద మరికొన్ని ప్రశ్నలు వేస్తే విసుక్కుంటారు. 
సూటిగా చెప్పే ఉద్దేశం లేకనే కదా మరి వ్యంగ్యంగా చెప్పినది!  కాదు కాదు సూటిగా చెప్పాల్సిందేనని నాలాటి వాళ్ళు పట్టుపడితే విసుక్కోక ఏం చేస్తారు!
కానీ ఆ విసుగుకి మనం తట్టుకుని ఆ ప్రశ్నలని వాదన కోసం అడగడం లేదనీ జిజ్ఞాసతోనే అడుగుతున్నామనీ అర్థం చేస్తే అప్పుడు వివరంగా మాట్లాడతారు. “మీకు తెలుసు కదా! మీకు తెలుసు కదా!” అంటూ నేను ఎప్పుడూ విని ఉండని విషయాలూ విశేషాలు చెప్పేవారు.
అవును పరిచయం అయిన మొదటిరోజు నుండి చివరి  వరకూ కూడా  “ఏవండీ, మీరు” అనే అనేవారు.
నిజానికి ఆయన మొదట పరిచయం అయినపుడు ఆయన వయస్సులో  సగం కూడా లేదు నాకు. ఆ విషయం తెలిసినా, వారి చిన్నమ్మాయి కన్నా నేను చిన్నదాన్ననే విషయం మధ్య మధ్యలో అనుకుంటూనే ఉన్నా, ఒక సందర్భంలో రెండ్రోజులు వాళ్ళింట్లో ఉన్నపుడు “నువ్వు మా మూడో అమ్మాయివి” అని విజయలక్ష్మిగారు ప్రకటించేసినా ఆయన చివరివరకూ “ఏవండీ” అనే పిల్చేవారు నన్ను.
ఈమాట చెప్తుంటే నాకు మొట్టమొదటిసారి ఆయన్ని చూసిన రోజు గుర్తొస్తోంది.
కవనశర్మగారితో మొదటి పరిచయం జరిగి ఇరవై ఏళ్ళు దాటిపోయినా మొట్టమొదటిసారి చూసినప్పటి ఆయన రూపమూ అప్పుడు జరిగిన సంభాషణా స్పష్టంగా గుర్తున్నాయి నాకు.
అవి నేను ఈవెనింగ్  కాలేజిలో ఎం.టెక్. చదివేందుకు  సీట్ సంపాదించుకున్న కొత్త రోజులు. ఆ ఆనందంలో ఉన్నాను.   మరొక పక్కన కథలూ పరమ ఉత్సాహంగా వ్రాస్తున్నాను. మొట్టమొదటి కవితా సంకలనం ప్రచురించాను. జంకూ గొంకూ లేకుండా హడావుడిగా మాట్లాడుతుండేదాన్ని.
1997 లో సాహిత్య అకాడమీ వాళ్ళ సమావేశం హిమాయత్ నగర్ లోని తెలుగు అకాడమీ భవనంలో జరిగింది. దాదాపుగా రాష్ట్రంలోని తెలుగు కథా రచయితలందరూ హాజరయిన సమావేశం అది. ఆరోజు మొదటి సభ తర్వాత  టీ త్రాగుతున్నపుడు వాకాటి పాండురంగ రావు గారు పరిచయం చేశారు కవనశర్మగారికి నన్ను. పంచె కట్టుతో ఉన్నారు ఆరోజున శర్మగారు.  “వీరు సివిల్ ఇంజినీర్”అంటూ శర్మగారిగురించి చెప్పగానే నేను టకీమని “నేను ఎలక్ట్రానిక్స్ అండీ” అన్నాను ఏదో  కాలేజీ ఆవరణలో మరొక బ్రాంచ్ విద్యార్థిని కలుసుకున్నపుడు అన్నట్లుగా.  ఆయన నోరంతా తెరిచి నవ్వారు. పక్కన ఉన్న పాండురంగరావుగారూ నవ్వారు.
ఆ తర్వాత మళ్ళీ మూడేళ్ళకి బెంగుళూరులో ఉద్యోగంలో చేరాక  నిడమర్తి ఉమారాజేశ్వరరావుగారింట్లో సమావేశానికి వెళ్ళాను. మేమందరం కుర్చీలలో కూర్చుని వున్నాం. శర్మగారు కొంచెం ఆలస్యంగా వచ్చి కుర్చీలలో వాళ్ళు లేచేలోపూ బాసిపట్టు వేసుకుని నేలమీద కూర్చుండిపోయారు. రెండు చేతులూ టీపాయ్ మీద పెట్టుకుని ఆయన కూర్చోవడం.. ఉమారాజేశ్వరరావుగారు  అక్కడ నేను కొత్తదాన్ని కాబట్టి నా గురించి ఆయనకి చెప్పబోతే “అబ్బో ఆవిడ చాలా పెద్ద రచయిత్రి అండీ” అనడం,  ఇదేమిటిలా అంటున్నారీయన!’ అని నేను బిత్తర పోవడం - అదంతా కూడా స్పష్టంగా గుర్తుంది నాకు.
ఆ తర్వాత చర్చ సమావేశాలు. మూడు నాలుగేళ్ళ పాటు సాగిన ఆ సమావేశాలలో ప్రతి నెలా కలుసుకునేవాళ్ళం, పుస్తకాల గురించి చర్చించుకునేవాళ్ళం. అప్పుడు ఆయన ఆలోచనలూ అభిప్రాయాలూ ఇంకొంత స్పష్టంగా అర్థమయ్యాయి.
నేను హైదరాబాద్ వచ్చేశాక కూడా తరచుగా ఫోన్ చేస్తూ ఉండేవారు. పొద్దునపూట నా పనులన్నీ అయిపోయి ఉంటాయనుకున్న సమయంలో పదకొండు దాటాక ఫోన్ చేసి ఆయనకి భోజనానికి పిలుపొచ్చేదాకా మాట్లాడేవారు.
సాహిత్యం గురించీ అందులోనూ ఎక్కువగా కథల గురించీ మాట్లాడుకునేవాళ్ళం.  ఒక రచనలో నన్ను ఎక్కువగా ఆకర్షించేది సత్త్వౌచిత్యం.  అది ఉన్న రచన ఆకర్షించడమే కాదు అది లోపించిన రచనని నేను మెచ్చుకోలేనుకూడా. కవనశర్మగారికి ఆ పట్టింపు లేదు.
ఇంకొక రకంగా చెప్పాలంటే  ఒక వ్యక్తి యొక్క (కథ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక పాత్ర యొక్క) నియమబద్ధమైన ప్రవర్తన, జ్ఞానము, కష్టసుఖాలు - ఈ మూడిటిలో ఉత్తరోత్తరమైనవి ఆయనని ఎక్కువగా స్పందింప చేస్తాయి. (నేనిక్కడ స్పందన గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఆ మూడిటిలో ఏది గొప్పది ఏది కాదు అన్న విషయాన్ని చర్చిండం లేదు)
చదవగానే ఆహా అనో అబ్బో అనో అయ్యో అనో అనిపింప చేయడంలో ఒక ఉద్వేగాన్ని కలిగించడంలో కవనశర్మగారి విషయంలో మొదటి దాని కన్నా రెండోదీ రెండవ దానికన్నా మూడవదీ ఎక్కువ  సఫలీకృతం  అవుతాయి. నా విషయం అందుకు సరిగ్గా వ్యతిరేకం. నన్ను మూడవ దానికన్నా రెండవదీ రెండవదాని కన్నా మొదటిదీ ఎక్కువ అబ్బురపరుస్తాయి. పాత్రల యొక్క కష్టాలకు నేను చలించనని కాదు. కానీ ఆ కష్టసుఖాలకు అతీతంగా వుండే జ్ఞానాన్ని కలిగిన పాత్రలూ  ఆ జ్ఞానం ఇచ్చిన బలంతో స్థిరంగా ధర్మంలో నిలబడే పాత్రలూ నన్నెక్కువ ఆకర్షిస్తాయి.
కాబట్టి మాకు ఏ కథ మీదా సాధారణంగా ఏకాభిప్రాయం కుదిరేది కాదు. కానీ ఒకరి  ధోరణి మరొకరికి అర్థమయిపోయాక వాదించుకోవడం మానేశాము.  “మాకు కథలో  ఏదో ఒక కోణం బాగున్నా నచ్చుతుందండీ. మీకు సర్వాంగసుందరంగా ఉంటే కానీ నచ్చదు.” అని ఆయన ఒకరోజు తీర్మానించి చెప్పేశారు నాకు. ఇక ఆ తర్వాత వాదనలు చర్చలు లేవు.
ఇది చెప్తున్నపుడు నాకొక సంఘటన గుర్తొస్తోంది. దీనితో నేరుగా సంబంధం ఉందని కాదు కానీ ఆయన వ్యక్తిత్వంలోని ఒక విలక్షణతను అది తెలియచేస్తుంది కనుక చెప్పాలనుకుంటున్నాను.
ఒకసారి ఆయన కారు నడుపుతున్నారు. నేనూ, విబి సౌమ్యా కార్లో ఉన్నాము. ఒక రద్దీగా వున్న రోడ్డులో నుంచి వెళ్తున్నాం. ముందర ఒకతను తన ద్విచక్రవాహనం రోడ్డుమధ్యలో ఆపేశాడు. షాపింగ్ చేసి వచ్చిన అతని భార్య చంకలో పిల్లాడితోను చేతిలో సంచులతోను ఆ వాహనం ఎక్కే ప్రయత్నం చేస్తోంది. అతను వెళ్తే ముందుకు సాగేందుకు శర్మగారు నిరీక్షిస్తున్నారు. వెనుకనున్న వాహనాల వాళ్ళు  ఆపకుండా హారన్ మోగించడం మొదలుపెట్టారు. అంతే. శర్మగారు  ఒకసారి వెనక్కి తిరిగి చూసి ఆ తర్వాత తను కూడా రోడ్డు మధ్యలో కారు పూర్తిగా ఆపేసి “హారన్ కొట్టి తొందర చేస్తే ఎక్కడికి పోతాడు వాడిప్పుడు? పెళ్ళాం పిల్లల్ని రోడ్డు మీద వదిలేసి!” అన్నారు.
నాకు నవ్వొచ్చింది. ఇటువంటి సంఘటనలో సాధారణంగా కనబడే స్పందనకి భిన్నంగా వుంది కదా ఆయన స్పందన!
అదే నేను ప్రస్తావించాలనుకున్న ప్రత్యేకత. ఒక అంశానికి సంబంధించి ఆయన ఎటువైపు నిలబడతారన్న విషయం, దేని పట్ల సహనం చూపుతారు దేని వలన అసహనానికి గురవుతారు అన్న విషయం చాలా నిశితంగా గమనిస్తే తప్ప అర్థం కాదు.
ఇటువంటి వ్యక్తిత్వం అపార్థమన్నా అవుతుంది, అంతుబట్టకపోవడమన్నా ఉంటుంది కానీ  స్పష్టంగా అర్థమవడం అరుదు.
వ్యక్తిత్వంలో ఉన్న ఈ సంక్లిష్టతకి తోడు ఆయన వ్యంగ్య శైలి!
మొదటిది మార్చుకోవలసినదీ మార్చుకోదగినదీ కాదు, కానీ రెండోదాన్ని కొంచెం పక్కన పెట్టవచ్చు కదా అనిపించేది నాకు.
చివరిగా ఆయనతో నేను చేసిన ఫిర్యాదు అదే.
మరణానికి కొన్ని రోజుల ముందు ఒక రచన గురించి ఆయన ఫేస్బుక్ లో వ్రాశారు. దానిని ప్రశంసిస్తున్న ధోరణిలో వ్రాసినా నిజానికి  ఆ రచన ఆయనకి నచ్చలేదనీ అదంతా వ్యంగ్యమనీ ఒకరిద్దరికి మాత్రమే అర్థమయింది. మిగిలినవారందరూ - ఆ రచన చేసిన రచయితతో సహా - దానిని ప్రశంసగానే భావించారు.
అదంతా గమనించిన నాకు ఇలా వ్రాసినందువలన  ఏమి ప్రయోజనం! అనిపించింది. ఎనభై ఏళ్ళ వయసులో కూడా దర్జాగా అభిప్రాయం చెప్పకుండా గుంభనగా మాట్లాడటం ఎందుకనిపించింది.
అందుకే ఆ తర్వాత ఫోన్ లో మాట్లాడినపుడు “సూటిగా చెప్పాల్సిన విషయాలు కూడా వ్యంగ్యంగా చెప్తే ఎలాగండీ మీరు!” అన్నాను.
దానికాయన పోనివ్వండీ మీకు అర్థమయింది కదా! అర్థమయిన వాళ్ళకి అవుతుంది. కాని వాళ్ళకు కాదు. దానికి నేనేం చేస్తాను! అన్నారు. ఆరోజు ఆయన స్వరంలో  వినిపించిన నీరసమూ ఒకరకమైన నిస్సహాయతా నన్ను సంభాషణ పెంచనివ్వలేదు.
ఇక ఆతర్వాత మరొకసారి మాట్లాడటానికి ఆయన లేరు.
అదే చివరి సంభాషణ.

                                                             ******

(కవనశర్మగారి స్మృతులతో ప్రచురించబడిన "కవనస్మృతులు" పుస్తకం కోసం వ్రాసిన నాలుగు మాటలు )

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సతీసుమతి

తారకము

సంక్లిష్టమైన కథలు