శరీర త్రయము (తత్త్వబోధ -2)
మనకి ఒక శరీరం ఉందన్న విషయం మనకి చిన్నతనంలోనే తెలుస్తుంది. అది మనకు కనబడుతూనే ఉంటుంది. అయితే ప్రతి మనిషికీ కూడా కనబడే శరీరమే కాక మరొక రెండు శరీరాలు ఉంటాయనీ, ఆ మూడు శరీరాలను స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అనే పేర్లతో పిలుస్తారనీ పెద్దల ద్వారా విన్నపుడు, వారు వ్రాసిన గ్రంథాలు చదివినపుడు తెలుస్తుంది. శరీర త్రయము గురించి,అంటేఒక మనిషికి ఉండే మూడుశరీరాల గురించీ వాటి లక్షణాల గురించీ శంకరులు తమ తత్త్వబోధ అనే గ్రంథంలో వివరించిన విషయాలను ఇపుడు చెప్పుకుందాము.
స్థూలశరీరము:
భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అనే అయిదింటినీ పంచభూతములు అంటారు. వీటి పంచీకరణముతో స్థూలశరీరము ఏర్పడుతుంది.నిజానికి స్థూలప్రపంచమంతా పంచభూతముల యొక్క పంచీకరణతోనే ఏర్పడుతుంది. మన స్థూల శరీరం ఆ స్థూలప్రపంచంలో భాగమే.ఇలా పంచభూతముల నుండి ఏర్పడిన స్థూలశరీరం మనిషి మరణించాక తిరిగి ఆ పంచభూతములలోనే కలిసిపోతుంది.
పూర్వజన్మలలోని సత్కర్మల ఫలితంగానే స్థూలశరీరం ఏర్పడుతుందని తెలుసుకోవాలి. ఎందుకంటేమానవజన్మ సృష్టిలోని అన్ని జన్మలలోను ఉత్తమమైనది. ఏది సత్యం! ఏది కాదు! అన్న వివేచన చేయగలిగినదిమనిషి మాత్రమే.
కనుక స్థూలశరీరానికి సమబంధించిన ఆ విలువను గుర్తించడమూ, ఉత్తమమైన మానవ శరీరం లభించినందుకు దానిని వృధా చేసుకోకుండా ఏ లక్ష్యాన్ని సాధించడం కోసం ఈ శరీరాన్ని పొందామో ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నించడమూ చేయాలి.
ప్రపంచంతో మన వ్యవహారాలన్నీ ఈ స్థూల శరీరంద్వారానే నడుస్తాయి. సుఖదుఃఖాలను ఈ శరీరంతో అనుభవిస్తాము. ఇంకా ఈ శరీరానికి ఉండే మరొక లక్షణం ఏమిటంటే ఇది పుట్టడం, పెరగడం, నశించడం వంటి మార్పులకు లోనవుతుంది.
ఇవీ క్లుప్తంగా స్థూల శరీరం యొక్క లక్షణాలు.
స్థూలశరీరాన్ని నిర్లక్ష్యం చేయనవసరం లేదు. చేయకూడదు. ధర్మసాధనకు, పరమార్థ సాధనకు ఉపయోగపడేస్థూలశరీరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పరమాత్మకు నెలవైన దేవాలయంగా భావించి దాని బాగోగుల పట్ల శ్రద్ధ వహించాలి. అయితే స్థూలశరీరమే “నేను” అన్న భ్రమను మాత్రం వదిలేయాలి. “నాది” అని చెప్పుకోగల స్థూలశరీరం “నేను” అయ్యే అవకాశం లేదని తెలుసుకోవాలి.ఎందుకంటే ఏవిషయాన్నయితే “నాది” అని మనం చెప్పుకోగలమో ఆ వస్తువే “నేను” అవడం సాధ్యం కాదు. ఎపుడైతే దానిని నాది అంటున్నామో అపుడు అది కచ్చితంగా మనకంటే భిన్నమని అర్థమవుతోంది. కాబట్టి “నాశరీరం” అని చెప్పుకునే శరీరమే “నేను” అయ్యే అవకాశం లేదు. కనుక “నా శరీరమే నేను” అనడమూ అనుకోవడమూ అసంబద్ధం.
సూక్ష్మశరీరము:
సూక్ష్మశరీరమూ పంచభూతాత్మకమే. అయితే ఇది పంచీకరణ జరగని పంచభూతములతో ఏర్పడుతుంది. ఇది కూడా మునుపు చేసిన సత్కర్మల ఫలితంగానే లభిస్తుంది. సుఖదుఃఖములను అనుభవించేందుకు సాధనమవుతుంది.
సూక్ష్మ ప్రపంచం అంతా పంచీకరణ జరగని పంచభూతముల సమ్మేళనమే. మన సూక్ష్మశరీరం సూక్ష్మప్రపంచంలో భాగం కనుక అది కూడా అలాగే ఏర్పడుతుంది. సూక్ష్మం కనుక ఇదిపంచేంద్రియాలకు అందదు. దీనినే లింగశరీరం అని కూడా అంటారు. ఈ సూక్ష్మ శరీరం స్థూలశరీరాన్ని వీడినపుడు ఆ మనిషి మరణించాడని అంటాము.
నిజానికి సూక్ష్మశరీరానికి సంబంధించిన మనసు, బుద్ధి - వీటివలననే భోగములను అనుభవించడమూ అనుభవించకపోవడమూ జరుగుతుంది. సూక్ష్మశరీరం యొక్క ప్రమేయం లేకుంటే స్థూలశరీరానికి సుఖమూ దుఃఖమూ తెలియవు. అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, మనసు, బుద్ధి అనే పదిహేడు విషయాలూ కలిసి సూక్ష్మశరీరం.
చెవులు, చర్మము, కళ్ళు, నాలుక, ముక్కు అనే అయిదూ జ్ఞానేంద్రియాలు. దిగ్దేవతలు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినీ దేవతలుఅనే అయిదుగురు అధిష్టానదేవతలు వరుసగా ఈ జ్ఞానేంద్రియాలను నియంత్రిస్తూ ఉంటారు.
వాక్కు, చేతులు, కాళ్ళు, పాయువు, ఉపస్థ అనేవి కర్మేంద్రియాలు.అగ్నిహోత్రుడు, ఇంద్రుడు, విష్ణువు, మృత్యువు, ప్రజాపతి అనే అయిదుగురూ వరుసగా ఈ కర్మేంద్రియాలకు అధిష్టానదేవతలు.
ఈసూక్ష్మశరీరము పరలోక యాత్రకు అనుకూలమై ఉండే శరీరం. స్థూలశరీరం వలె కాక సూక్ష్మ శరీరం మనిషికి మోక్షపర్యంతము ఉంటుంది.కారణశరీరము :
కారణశరీరాన్ని గురించి శంకరులు ఆరు మాటలు చెప్పారు - అనిర్వాచ్యము, అవిద్యారూపము, అనాది, శరీరద్వయస్య కారణమాత్రము, సత్స్వరూప అజ్ఞానము, నిర్వికల్పకరూపము.
కారణశరీరానికి ఒక రూపం లేదు. ఫలానా అంటూ చెప్పగల లక్షణాలు లేవు. కనుక దానిని వివరించడం కుదరదు. అవిద్యా స్వరూపమే కారణశరీరము. అవిద్యను మాటలతో వివరించలేము. ఎందుకంటే అవిద్యకు ప్రత్యేకమైన అస్తిత్వం లేదు. విద్య కానిది అవిద్య అంతే. ఈ అవిద్య అనాది, అనగా ఆరంభం లేనిది. దీని వలననే మనిషి తన నిజమైన తత్త్వాన్ని గ్రహించలేక తనను తాను కొన్ని పరిమితమైన అశాశ్వతమైన విషయాలతోముడిపెట్టుకుంటాడు. తాను కాని అంశాలన్నిటినీ తానుగా భావించి వాటిని సంతృప్తి పరచేందుకు మనిషి పడే ఆరాటాలూ అతను చేసే పోరాటాలూ అన్నిటికీ మూలం ఈ అవిద్యే. అంటే మనిషి యొక్క సంస్కారాలకీ అతను నిర్వర్తించే కర్మలకూ వెనుకనుండేది ఈ అవిద్యే. కర్మల ఫలితంగానే స్థూల సూక్ష్మ శరీరాలు ఏర్పడతాయి కనుక అవిద్యే స్థూల సూక్ష్మ శరీరాలు రెండూ ఏర్పడటానికి కారణం.
మనిషి తన స్వస్వరూపాన్ని గుర్తించకుండా ఉండటానికి కారణం అవిద్యే. నావి అని చెప్పుకోగల స్థూలదేహమూ, జ్ఞానేంద్రియాలూ, కర్మేంద్రియాలూ, మనసూ, బుద్ధీ మొదలైనవన్నీ “నేను” అవడం సాధ్యం కాదని గ్రహించకుండా తన దేహమే తాననీ తన మనసే తాననీ అనుకునే అజ్ఞానానికి కారణం అవిద్య. ఇది ఆలోచనలకు ఊహలకు అందనిది. అయితే ఆత్మస్వరూపం వలె అవిద్య అనంతం మాత్రం కాదు. విద్య వలన అవిద్య నశిస్తుంది. కనుక “నశించని ఆత్మస్వరూపమే నేను”, “ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడూ నేను కాదు” అన్న జ్ఞానం అవిద్యను నశింప చేస్తుంది.
*******
కామెంట్‌లు