కూర్పు
“అలాంటివన్నీ మధ్యాహ్నం
పూట చేసుకోవాలి గానీ పొద్దున్నే పెట్టుకుంటే ఎలా జయా?”విసుగ్గా
వినిపించిన శ్రీరాం మాటలని లెక్క పెట్టనట్లే ఉండిపోయింది జయ.
ఒక అయిదు నిమిషాలు చూసి “పది
దాటింది, లేచి పని చూడు.” అని మరొకసారి హెచ్చరించాడతను.
“అబ్బ ఉండండీ, ఇవాళ ఆదివారమే కదా! తొందరేముందీ, మెల్లగా
చేసుకోవచ్చులెండి పనులు” అంది లాప్టాప్ వైపు తదేకంగా దృష్టి సారిస్తూ.
తాను ఎంతో గౌరవించే
రచయితావిమర్శకుడూ సుధీర్ పెట్టిన ఫేస్బుక్ పోస్టు వైపు ఆమె చూపులు పరుగుతీశాయి.
ఆయన అక్కడ ఆ విషయం వ్రాసి రెండు
గంటలు కూడా పూర్తిగా కాలేదు. కానీ అప్పటికే రెండొందల యాభై లైకులూ ఎనభైకి పైగా
వ్యాఖ్యలూ ఉన్నాయి.
అన్నీ ప్రశంసలే. “మీరు నడిచే విజ్ఞానఖని. మీరు ఇలా ఈ మాధ్యమం
ద్వారా మాకు పరిచయం అవడం మా పూర్వజన్మ సుకృతం. మీరు ఇక్కడ వ్రాస్తున్న విషయాలు
చదివి మేము ఎంతో లాభపడుతున్నాం. మీకు ఋణపడిపోతున్నాం....” - ఈ రీతిగా సాగిన
వ్యాఖ్యలన్నిటినీ ముందుగా చదివి ఆతర్వాత రెట్టించిన ఆసక్తితో ఆయన వ్రాసిన విషయాన్ని
చదవడం మొదలుపెట్టింది జయ.
ఆ వ్యాఖ్యలలో వ్రాసినవన్నీ ఆమె
మనసులో కూడా ఉన్న మాటలే. ఆయనతో ప్రత్యక్షంగా చెప్పి ఆనందపడిన మాటలే. ఆయన మొదట ఒక రచయితగా మాత్రమే తెలుసు జయకి. ఆతర్వాత
ఫేస్బుక్ ద్వారా గమనించడం మొదలు పెట్టినపుడు ఆయనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు
కూడా కొన్ని తెలిశాయి. అతను తన స్నేహితురాలు లలిత భర్త అన్న విషయం కూడా అప్పుడే
తెలిసింది.
లలిత చదువుకునే రోజులలో జయకి మంచి స్నేహితురాలే
అయినా చదువులు పూర్తయ్యి విడిపోయాక కొన్నేళ్లపాటు ఒకరి సంగతులింకొకరికి తెలియకుండా పోయాయి. మళ్ళీ
ఇలా ఈరూపంగా లలిత గురించి తెలియగానే చాలా సంతోషం కలిగింది జయకి.
వెంటనే ఫోన్ నంబర్ సంపాదించి మాట్లాడింది. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి తన అభిమాన
రచయితని పరిచయమూ చేసుకుంది.
ఇవాళ సుధీర్ వ్రాసిన విషయం జయకి
పూర్తిగా అర్థం కాలేదు. అయినా నచ్చింది. ఎందుకంటే అది చాలా లోతైన విషయమని
తెలిసిపోతోంది. ఆయన ఏం వ్రాసినా అంతే. ప్రతి
వాక్యంలోనూ ఆయన పాండిత్యమూ ప్రజ్ఞా
కొట్టొచ్చినట్లు తెలిసిపోతూ ఉంటాయి. వాక్యనిర్మాణం క్లిష్టంగా ఉంటుంది, ఒక పట్టాన అర్థం కాదు.
అయితే ఏమిటి? మనకి అర్థం కానంత మాత్రాన దాని గొప్పతనానికి లోటు రాదు కదా!
ఎన్నెన్ని
విషయాలు వ్రాస్తారసలు? ఎక్కడెక్కడి విషయాలో చెప్తారు. అటు సంస్కృతం, ఇటు ఇంగ్లీషు ఇతర భారతీయ
పాశ్చ్యాత్య భాషల రచనలు...ఇక తెలుగు సరేసరి.
అసలు ఒక మనిషికి ఇన్ని విషయాలు తెలియడం ఎలా సాధ్యమా అన్న సందేహం తొలిచేస్తూ
ఉంటుంది.
దేవుడు
ప్రత్యేకంగా రోజుకి నలభై ఎనిమిది గంటలు ఇవ్వడం లాంటి మాయ ఏమన్నా చేశాడా ఆయన విషయంలో అనిపిస్తుంది.
అటు
ఉద్యోగ బాధ్యతలు.. ఇటు కుటుంబ బాధ్యతలు – అవన్నీ ఆయనకీ ఉన్నాయి కదా! మళ్ళీ ఎప్పుడు
చూసినా సభలూ సమావేశాల వంటి వాటిలోనూ పాల్గొంటూ ఉంటారు. ఇంకా ఇంతింత చదవడం.. ఇన్ని
విషయాల మీద ఇంత ధీమాగా మాట్లాడడం ఎలా చేయగలుగుతారో!
ఆ మాట
అనుకున్నపుడల్లా జయకి చాలా అబ్బురంగా అనిపిస్తుంది. ఆయన వ్రాసిన వాక్యాలు చదివిన ప్రతిసారీ ఆరాధన
పెరిగిపోతూనూ ఉంటుంది.
“లేచి
ఇల్లు చిమ్మితే నేను కాస్త దేవుడికి దండం పెట్టుకుంటాను.” తువ్వాలు పట్టుకుని
స్నానానికి వెళ్లేందుకు సిద్ధంగా నిలుచున్న శ్రీరామ్ ని చూసి ఇక తప్పదని లాప్టాప్
పక్కన పెట్టి మంచం మీద నుంచి క్రిందికి
దిగింది జయ.
ఇక
అప్పుడు కూడా తను లేవకపోతే అతనే చీపురు పట్టుకుని ఎడాపెడా చిమ్మడం మొదలుపెడతాడని
తెలుసు. అదేమంటే ‘నువ్వు ముందే చేస్తే నేను రాను కదా!’ అంటూ ఎదురు ప్రశ్న ఒకటి
వేస్తాడు.
“హు.
ఒక్క నిమిషం కూర్చున్నా సహించలేరు.” అనుకుంది చీపురు చేతిలోకి తీసుకుంటూ కొంచెం
విసుగ్గా.
“రోజూ
పొద్దున్నే లేవడమూ,హడావుడిగా పనులు చేసుకుని ఉద్యోగానికి పరుగెత్తడమూ ఎలాగూ తప్పవు. ఆదివారమన్నా కాస్త
తీరిగ్గా బద్ధకంగా గడిపే అవకాశం లేదు. లేచినప్పటి నుంచీ నసపెడుతూనే ఉంటారు”శ్రీరామ్
ధోరణి తల్చుకుని చిరాకు పడింది.
ఒకదాని
వెనకాల ఒకటి పనులన్నీ వరుసగా అయిపోవాలాయనకి. పన్నెండయ్యేసరికి కంచంలోకి అన్నం
వచ్చేయాలి. భోజనం చేసి అప్పుడు కాళ్ళు తీరిగ్గా బార చాపుకు కూర్చుని టివి చూస్తారు. లేదంటే కునుకు తీస్తారు. ఆయన
ఉద్దేశ్యం ప్రకారం తాను కూడా అలా భోజనం
చేశాక మాత్రమే పుస్తకాలు చదువుకోవడం లాంటి
పనులు చేయాలి. ఇంట్లో పనులు ప్రక్కన పెట్టి ఇతర వ్యాపకాలలో మునిగిపోకూడదు.
జయకి
అదే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సుధీర్ లాంటి వాళ్ళ భావాలు ఇందుకు పూర్తిగా
వ్యతిరేకంగా ఉంటాయి. వాళ్ళు పుస్తక పఠనానికీ కొత్తవిషయాలు తెలుసుకోవడానికీ
ఇచ్చినంత ప్రాముఖ్యాన్ని రోజువారీ పనులకి ఇవ్వరు. ఆ విషయం మీద సుధీర్ ఒక కథ
వ్రాశారు కూడా.
ముఖ్యంగా
ఆడవాళ్ళ గురించే ఆ కథ. మగవాళ్ళు ఎలాగూ
వాళ్లకి యిష్టమైన పనులు వాళ్ళు చేసుకుంటారు. ఆడవాళ్ళు కూడా అలాగే ఉండాలనీ, ఎంతసేపూ ఇంటి పనులలో
మునిగి పోయిమెదడు ఎదగకుండా ఉండిపోకూడదనీ చెప్పే కథ. అలా ఉండిపోయిన భార్యలో చక్కటి
మార్పు వచ్చేలా ప్రోత్సహించిన భర్త కథ.
అది
గుర్తు చేసుకుని నిట్టూర్చింది జయ. అసలు అలాంటి మంచి మంచి అభిరుచులు మొదట
మగవాళ్ళకి ఉంటే కదా ఆడవాళ్ళకి కూడా ఉండాలని కోరుకునేదీ అందుకు తగ్గ సహకారాన్నీ
ప్రోత్సాహాన్నీ ఇచ్చేది!
శ్రీరామ్
కి అలాంటివేమీ లేవు. ఎంతసేపూ ఉద్యోగం.. ఇల్లు.. తినడం.. పడుకోవడం.. అంతే.
ఆలోచిస్తున్న
కొద్దీ జయకి అసహనం పెరిగిపోతోందివాళ. ఆ
అసహనంతోనే అన్యమనస్కంగా ఇల్లు శుభ్రం చేసింది. ఎలాగో వంట కూడా పూర్తి
చేశాననిపించింది. శ్రీరామ్ కి భోజనం పెట్టేసి మళ్ళీ వెంటనే లాప్టాప్ తెరిచింది.
తెరుస్తూనే “అయ్యో, ఇవాళ రెండో ఆదివారమా!” అంది కంగారుగా.
సోఫాలో
కూర్చుని పేపర్ తిరగేస్తున్న శ్రీరామ్ కనీసం తలతిప్పి కూడా చూడలేదు ఆమె అరుపుకి. జయకు
వళ్ళు మండిపోయింది. “అసలు తన ఆసక్తుల పట్ల ఈయనకేమయినా లక్ష్యం ఉంటే కదా!”
అనుకుంది.
ప్రతి
నెలా రెండో ఆదివారం సుధీర్ వాళ్ళ ఇంట్లో సమావేశం ఉంటుంది. మంచి మంచి పుస్తకాల
గురించి చర్చ జరుగుతుంది. వాళ్ళతో పరిచయం అయినప్పటి నుంచీ ఆ సమావేశాలకు ఎంతో
ఉత్సాహంగా వెళ్తోంది జయ.శ్రీరామ్ కి ఆ విషయం తెలుసు.
‘ఒకవేళ
తను మర్చిపోతే ఆయన గుర్తు చేయవచ్చు కదా! సమావేశం సంగతి గుర్తు చేసుంటే పనులన్నీ
త్వరత్వరగా చేసేసుకునేదాన్ని కదా!’ అనుకుంది జయ ఉక్రోషంగా. అతనికి కూడా
గుర్తులేదేమోనన్న మాట మనసులో ఒకమూల నుంచి వినిపించినా జయ పట్టించుకోలేదు. ‘గుర్తు
చేయక పోతే పోయారు, కనీసం పొద్దున అంత నస పెట్టకుండా ఉన్నా తను ఈ విషయం అప్పుడే
చూసేది ఫేస్బుక్ లో. అసలు ఇలాంటి సమావేశాల వివరాలూ అవీ తెలుస్తాయనే కదా పొద్దున్నే
లాప్టాప్ తెరిచింది!’ అనుకుంది.
కానీ
శ్రీరామ్ పొద్దున అలా గొడవ చేయకపోయుంటే ఈమాత్రం పని కూడా అయ్యేది కాదేమో! అని కూడా
మరొక పక్కనుంచి అనిపించింది.
ఇంతకీ
ఇప్పుడేం చేయాలి?ఇప్పుడు సమయం రెండవుతోంది. మీటింగ్ నాలుగున్నరకి. వెళ్ళడానికి ఎంత లేదన్నా గంట
పడుతుంది. ఇంట్లో పనంతా అలాగే ఉంది.
ఆదివారం చేయచ్చు ఆదివారం చేయచ్చు అని వారం రోజుల నుంచీ వాయిదాలు వేసుకుంటూ వచ్చిన పని. ఇప్పుడు చేయాలనుకున్నా ఆ పనంతా ఎలాగూ
తెమలదు. వెళ్ళదల్చుకుంటే తయారయి వెళ్ళిపోవడమే. అంతకంటే ఇపుడు చేయగలిగింది ఏమీ
లేదు.
ఒక
నిశ్చయానికి వచ్చినట్లుగా లేచి నిలబడింది
జయ. నెలకొక్కసారి జరిగే సమావేశం. అది మానుకోవడం ఎందుకు? ఇంట్లో పనులు ఎప్పుడూ ఉండేవే.
గబగబా
భోజనం చేసి బయటపడింది. వెళ్తున్నానని చెప్తే శ్రీరామ్ ఒక చూపు చూసి ఊరుకున్నాడు.
అతనికి తన ధోరణి నచ్చడం లేదని అర్థమయినా జయ పట్టించుకోదలచుకోలేదు.
బయటకి
వచ్చి మెట్రో రైలు ఎక్కి కూర్చున్నాక గుర్తొచ్చింది, కాచి వంటగది గట్టు మీద పెట్టిన
పాలలో తోడు వేయలేదని. రాత్రికి పెరుగు కూడా ఉండదు. పొద్దున చేసిన కూరలూ మిగల్లేదు.
అసలు సమావేశం సంగతి గుర్తుంటే చక్కగా రాత్రికి కూడా సరిపోయేలా ఏమన్నా చేసేసి
ఉండేది. ఆ విషయం గుర్తు లేకపోవడం వల్లా శ్రీరామ్ పెట్టిన నసతో మనసు పాడవడం వల్లా
పొద్దున వంట స్థిమితంగా చేయలేదు.
ఒకసారి
తల విదిలించి ఆ ఆలోచనలు దూరం చేసుకునే ప్రయత్నం చేసింది జయ. “ఎందుకింత
ఆలోచిస్తోంది తను! ఇదేకదా ఆడవాళ్ళకీ మగవాళ్ళకీ తేడా! వంటా భోజనం తన ఒక్కదాని బాధ్యతే
కాదు కదా! ఇంట్లోనే వండుకు తినాలన్న నియమం లేదు కదా! ఆర్డర్ చేస్తే అరగంటలో కావలసిన పదార్ధాలు తెప్పించుకోవచ్చు. తినచ్చు.”
కానీశ్రీరామ్
ఆపని చేయడు చేయనివ్వడు. ఇప్పుడు బయటి తిండి తినాల్సిన అవసరమేముంది! అంటాడు. ‘అవసరం!’ నిట్టూర్పుగా
అనుకుంది జయ. తన అభిరుచులని అర్థం చేసుకోకపోవడం వలన వచ్చే ఇబ్బంది అదే. అలా అర్థం
చేసుకునే మనస్తత్త్వమే ఉంటే ఇది అనవసరంగా అనిపించదు. తను ఒకపూట వంట చేయకపోవడం బాధ్యతని వదిలేయడంగా తోచదు.
మనసంతా
చేదుగా అయిపోయింది జయకి. ఒకప్పటి సంగతి ఏమో కానీ ఈరోజుల్లో కూడా శ్రీరామ్ లాంటి చాదస్తపు
భర్తలు ఉన్నారంటే అసలెవరయినా నమ్ముతారా అనిపించింది.
ఆమాట
అనుకోగానే కొన్నాళ్ళ క్రితం సుధీర్ వ్రాసిన మాటలు గుర్తొచ్చాయి జయకి. ఎవరో
ప్రవచనాలు చెప్పే ఆయన భర్త విడిచిన బట్టలు భార్యే జాడించాలి, అలా చేస్తే అతడికి ఆయువు
పెరుగుతుంది అని చెప్పారట. దానిని ఖండిస్తూ సుధీర్ వ్యంగ్యంగా వ్రాసిన మాటలు అవి. వాటిల్ని తలుచుకుని జయ నవ్వుకుంది.
‘ఇవన్నీ
శ్రీరామ్ కి ఎలా అర్థమవుతాయి?సుధీర్ లాంటి వారి మాటలు కనీసం చదవనైనా చదవడు కదా! రోజులు
మారిపోయాయనీ ఈకాలంలో ఇంత చాదస్తంగా ఉండకూడదని అతను ఎలా తెలుసుకుంటాడు?’ అనుకుంది దిగులుగా.
ఆలోచనలు
తెగక ముందే ప్రయాణం పూర్తయింది. ఆమె గమ్యం చేరేసరికి సమయం నాలుగయింది. ఆమె
వెళ్లేసరికి ఎవరూ రాలేదు. సుధీర్ తన గదిలో
ఉన్నాడు. వంటగదిలో పని చేసుకుంటున్న లలిత బయటకి వచ్చి “రా.. రా” అంటూ ఆహ్వానించి
లోపలికి తీసుకు వెళ్ళింది.
తనకోకుర్చీ
వేసి కూర్చోబెట్టి ఒకపక్క టీ కలిపే ప్రయత్నం చేస్తూ మరొక పక్కన కూరలు తరుగుతున్న
లలితని చూసి “ఏమిటి అప్పుడే రాత్రి వంట చేసేస్తున్నావా?” అంది జయ.
“రాత్రి
కోసం కాదు,రేపు ప్రొద్దునకి, తెల్లవారితే మళ్ళీ ఉద్యోగమూ హడావుడీ కదా!” అంది లలిత చకచకా
పనులు పూర్తి చేసుకుంటూనే.
అందరూ
వచ్చేదాకా కబుర్లు చెప్పుకుంటూ వంటగదిలోనే కూర్చున్నారిద్దరూ. ముందు గదిలో నుంచి సమావేశం
మొదలవుతున్న సందడి వినపడగానే “పద, అక్కడికి వెళ్దాం” అంది లలిత. ఇద్దరూ ఇవతలికి వచ్చారు. జయ
వెనకే గుమ్మం దాకా వచ్చిన లలిత మళ్ళీ “ఒక్క నిమిషం” అంటూ వెనక్కి వెళ్ళింది.
జయ
వెళ్ళి సమావేశంలో కూర్చుంది. అన్నట్లుగానే నిమిషం తర్వాత లలిత కూడా వచ్చి జయ పక్కన
ఉన్న కుర్చీలో కూర్చుంది. “వాషింగ్ మెషీన్ ఆన్ చేసి వచ్చాను. సమావేశం అయ్యేసరికి
బట్టలపని పూర్తవుతుంది కదా!” అంది నవ్వుతూ.
జయ
కూడా నవ్వి లలితకి మాత్రమే వినబడేలా చిన్న గొంతుతో తను వస్తూ వస్తూ గుర్తు
చేసుకున్న సుధీర్ పోస్ట్ గురించి చెప్పింది. అందులో ఆ చాదస్తమాయన గురించి సుధీర్ చేసిన పరిహాసాన్ని తల్చుకుని మరొకసారి హాయిగా
నవ్వుకుంది. “ఎంత అమాయకత్వం కదా నిజంగా! అన్నిటికీ మెషీన్లు వచ్చేసిన ఈ రోజుల్లో కూడా ఇంటాయన బట్టలు భార్యో పనమ్మాయో జాడించాలి.. ఆయనే జాడించుకుంటే
దరిద్రం అని చెప్పడమేమిటసలు! ఏ కాలంలో ఏ లోకంలో ఉంటారో వీళ్ళంతా చుట్టుపక్కల
ప్రపంచాన్ని గమనించుకోకుండా?” అంది నవ్వు ఆపుకుంటూ.
“సరేలేవే,
ప్రపంచం ఏం పెద్ద మారింది కనుక! అన్నిటికీ మెషీన్లు వచ్చినా ఆ మెషీన్ వేసేది
భార్యో పనమ్మాయోనే కదా!” అంది లలిత. తాను ఊహించని ఆ స్పందనకి జయ ఆశ్చర్యపోయి
చూస్తుండగా సుధీర్ గొంతు సవరించుకుని సభ ప్రారంభించాడు. దానితో ఇక గుసగుసలు ఆగిపోయాయి.
అప్పట్నుంచి
గంటన్నర పైగా సమావేశం చాలా బాగా జరిగింది. ఆతర్వాత ఇంకొన్ని కబుర్లు
వీడుకోళ్ళు పూర్తయి జయ బయల్దేరేటప్పటికి
దగ్గర దగ్గర ఏడయింది.
పద
మెట్రో స్టేషన్ దాకా వస్తాను” అంటూ తను కూడా బయటకి వచ్చింది లలిత.
“శ్రీరాంని
కూడా తీసుకుని వస్తే బాగుండేది. ఇక్కడే భోజనం చేసేసి వెళ్ళేవారు. ఇపుడుఅలసటతో వెళ్ళి మళ్ళీ వంట చేయాలి కదా నువ్వు!” అంది నడుస్తూ ఉండగా.
“సరేలే, ఆయనకి ఇలాంటి అభిరుచులూ ఆసక్తులూ ఏవీ లేవు” అంది జయ
నిట్టూరుస్తున్నట్లుగా.
“మంచిదేగా,అదొక అదృష్టం” అంది లలిత
నవ్వుతూ.
“అదృష్టమా!”
గయ్యిమంది జయ. “ఎలా?” అంది నిలదీస్తున్నట్లు.
“అదృష్టమేనే
బాబూ. లేకపోతే ఆ అభిరుచులన్నిటికీ సహకారం
అందించాల్సిన బాధ్యత ఒకటి అదనంగా వస్తుంది భార్యలకి!” లలిత పరిహాసంగా అన్న మాటలలో
వినిపించిన కొత్త కోణానికి ఆశ్చర్యపోయింది జయ.
ఆమె
ఆశ్చర్యంలో నుంచీ ఆలోచనలో నుంచీ తేరుకోక ముందే “శ్రీరాంకి వంట వచ్చా, చేస్తారా?” అని అడిగింది లలిత.
“ఆఁ
వచ్చు ఒక మాదిరిగా. అన్నీ ఇంతింత పెద్ద పెద్ద ముక్కలు తరిగి కుక్కర్లో పడేస్తారు.”
చిరాగ్గా చెప్పింది జయ.
“నయమే”
అంది లలిత ఆ చిరాకుని పట్టించుకోకుండా తన ధోరణిలో నవ్వుతూ.
“సుధీర్
కి వంట బాగా వచ్చు కదా!” అతని రచనల ద్వారా ఆ విషయం తెలుసుకున్న జయ ఆసక్తిగా
అడిగింది. “ఎప్పుడూ చేస్తూ ఉంటారా రకరకాల వంటలు?”
“అవును
చాలా బాగా వచ్చు, కానీ చేయరు” తాపీగా చెప్పింది లలిత.
“అదేమిటి”
జయ ఆశ్చర్యపోయింది. “ఎందుకు చేయరు? తనకి వంట ఇష్టం కదా!”
“బాగుంది.
ఇష్టమైనంత మాత్రాన చేసేస్తామా! మనకి
ఇష్టమైన పనులన్నీ మనం చేసేయగలుగుతున్నామా! అవకాశం దొరకద్దూ! ఆపనికి
ప్రాముఖ్యం ఉండద్దూ?” చిలిపి కళ్ళతో
అల్లరిగాఅడిగింది లలిత.
ఆ
ప్రశ్నలోని మెలికకి జయమరొకసారి అదిరిపడింది. ఇంకొక కొత్త కోణం!
“అవకాశం
దొరకద్దూ..ప్రాముఖ్యం ఉండద్దూ” అంటూ లలిత తమాషాగా
పలికిన మాటలలో అంతులేనన్ని కోణాలూ ఆలోచించిన కొద్దీ అందే లోతులూ ఉన్నాయనిపించింది
జయకి.
“అవకాశాలు..
ప్రాముఖ్యాలు.. దొరకడాలు.. ఇవ్వడాలు... భార్యలు.. భర్తలు.. ఎవరికివారు.. ఈ పదాలన్నిటినీ కర్త కర్మ క్రియల మారుస్తూ రకరకాల కూర్పులు
చేయవచ్చనిపించింది. ఒక్కొక్క కూర్పులో ఒక
కొత్త సత్యం గోచరిస్తుందనిపించింది.
‘సుధీర్
వ్రాసే సంక్లిష్టమయిన వాక్యాలు చదివినపుడు
పైపైన పట్టు చిక్కకపోయినా లోతుగా అధ్యయనం చేస్తే ఏదో గొప్ప సత్యం
తెలుస్తుందేమోనన్న అనుమానం కలుగుతుంది. ఆ అనుమానమే అతనిపై ఆరాధన కలగడానికి
కారణమవుతుంది. కానీ ఈ లలిత మాటలేమిటి? అసలేమీ లోతు లేనట్లు చాలా తేటతేటగా కనిపిస్తున్నాయి. పైపైనే
బోలెడన్ని విషయాలు చిక్కుతున్నాయి. కానీ అడుగున ఉన్న నిధులూ నిక్షేపాలూ కూడా అనుమానంతో పనిలేకుండా స్పష్టంగానే
కనిపిస్తున్నాయి. లోపలికి దిగి అందుకునే శ్రమ పడాలంతే.’ అనిపించింది జయకి.
స్నేహితురాలి
మాటలలోని లోతులు అందుకునే ప్రయత్నాన్ని
పక్కకి నెట్టి ప్రస్తుతం తన మనసును తొలిచేస్తున్న
సందేహాన్ని బయటపెట్టింది జయ. “ఏమైనా ఏ అభిరుచులూ లేకుండా ఇల్లే లోకంగా
చాదస్తంగా ఉండే జీవిత భాగస్వామితో కంటే ఈకాలపు అభిరుచులూ అభ్యుదయభావాలు
ఉన్నవాళ్ళతో ఇబ్బందులు తక్కువ కదా...
భర్తకయినా భార్యకయినా!”
ఆ
ప్రశ్నని జయ ఎంత జాగ్రత్తగా కూర్చిందో అర్థమయినట్లుగా లలిత కిలకిలా నవ్వింది. “వాళ్ళకంటే
వీళ్ళు నయం.. వీళ్ళకంటే వాళ్ళు నయం అని సూత్రీకరించలేము కానీ ఒకవేళ
సూత్రీకరించవలసి వస్తే మాత్రం నువ్వు చెప్పిన దానికి వ్యతిరేకంగానే సూత్రీకరించాలి.”
అంది.
“అవునా? ఎందుకు?” అంది జయ ఉక్రోషంగా.
“నువ్వు
చాదస్తానికి ఇచ్చిన నిర్వచనాన్ని బట్టి అయితే అంతేమరి” అంది లలిత ఆమెని మరింత
ఉడికిస్తున్నట్లు. “తర్కం సాయం తీసుకున్నా..
మనకి పరిచయమున్న జంటలని ఆధారంగా
చేసుకుని పరిశీలించినా నీ
సూత్రాన్ని సమర్థించడం కష్టం. ఖండించడమే సులభం.” అంది లలిత మరికొంచెం
వివరిస్తున్నట్లు.
జయకి
ఏమనడానికీ తోచలేదు. స్టేషన్లో దింపి లలిత వెనక్కి
వెళ్ళిపోయింది. జయ తన ఆలోచనలన్నీ మోసుకుంటూతిరుగు ప్రయాణం చేసింది.
ఎనిమిదింటికి
భారంగా ఇంట్లో అడుగుపెడుతుంటే పెరటి గుమ్మం దగ్గర నిలబడి తన చీర మడత పెడుతున్న శ్రీరామ్ కనిపించాడామెకి.
తను బయటకి వెళ్ళగానే వాషింగ్ మెషీన్ వేశాడు కాబోలు. పెరట్లో నుంచి
ఆరినబట్టలన్నీ తెచ్చి మడత పెడుతున్నాడు.
అది
చూడగానే జయకి సగం బరువు దిగిపోయినట్లనిపించింది. లోపలికి వచ్చి కాళ్ళు కడుక్కుని
వంటగది లోకి వెళ్తే పొయ్యి మీదున్న గిన్నెలో ఇన్ని ఆవాలు పోసి చేసిన ఆలూ కూర
కనిపించింది. ఆ పక్కనే గట్టుమీద ఉన్న పాలగిన్నె మూత తీస్తే గట్టిగా తోడుకున్న పెరుగు నవ్వుతూ
చూసింది.
జయకి
ఫక్కున నవ్వొచ్చింది. గిన్నె మీద మూత పెట్టేస్తూ
“చాదస్తం” అని మురిపెంగా గొణుక్కుంది.
కామెంట్‌లు