సార్థకం
నా తండ్రి.
నా రామయ్య.
అయోధ్యకాండలో ఆయన గుణాలన్నిటినీ వర్ణిస్తూ వాల్మీకి
ఒకమాట చెప్తాడు.
“అమోఘ క్రోధహర్షశ్చ త్యాగసంయమ కాలవిత్”
చదువుతుంటే, తలుచుకుంటే ఎంత పులకింత!
అతనికి కోపమొచ్చినా సంతోషమొచ్చినా వ్యర్ధం కాదట! రెండూ
మంచి ఫలితాలనే ఇస్తాయట.
అవును. నాకు తెలీదూ!
కోపమొస్తే నన్ను బాగు చేసి కానీ పోదు. సంతోషమొస్తే
ఏం చేస్తుందో నాకు తెలీదు. నిజం. అతని చిరునవ్వు చూసిన తర్వాత నాకసలేమీ తెలీదు.
***
రాముడికి కోపం వస్తుందా అని ఆశ్చర్యపోతున్నారా!
అబ్బో ఎంత అందమైన కోపమో!
మీకసలు తెలీదన్న మాట. అయ్యో మీరసలు చూడనేలేదన్నమాట!
‘నువ్వు మాత్రం ఎలా చూశావు? రావణుడినో, శూర్పణఖనో చూస్తే
కోపం వస్తుందేమో కానీ అతని తలపుతోనే
పరవశించిపోయే నీ దగ్గర కోపమెందుకు వస్తుంది!’ అని అడుగుతున్నారా!
ఎందుకు రాదు! అపుడపుడూ నేను తెప్పిస్తాను కదా!
ఈ పని చేస్తే అన్నయ్యకు కోపమొస్తుంది అని ఆయన
పరోక్షంలోనూ జాగ్రత్తగా వుండేవారట ఆయన తమ్ముళ్ళు.
నాకేం పట్టింది! అలాటి లేనిపోని జాగ్రత్తలన్నీ
తీసుకునేందుకు! ఆయన ప్రేమా,
కోపం, చిరాకు, చిరునవ్వూ -
ఏది చూసినా పరవశమే కదా నాకు! వాల్మీకి అంత అందంగా చెప్పడం రాదు కానీ నా రామయ్య
కోపంలోనూ నన్ను వదిలిపెట్టడు, ప్రేమలోనూ నన్ను వదిలిపెట్టడు అని అర్థమయాక, ఆ సూక్ష్మం
తెలిశాక ఇక ఆ రెండిటికీ తేడా వుంటుందా!
పైగా నాకసలు పరోక్షమెక్కడుంది! అన్నీ ఆయన కళ్ళ
ముందే చేస్తాను కదా! కళ్ళు మూసుకునీ ఆయన్నే చూస్తాను కదా!
***
కోదండం మీద బిగిసే కరకమలాలు!
కమల నయనాలలో కనిపించే ఎర్రటి జీరలు!
ఆయన గుండెల్లో నుంచి ఎగసిపడే కరుణాసముద్రపు అలలు
ఎప్పుడూ తెల్లటి వెన్నెలలే చిమ్ముతాయి. వాటిని అపుడపుడూ అలా ఎర్రటి పరదాల మాటు నుండి చూడడం... అదెంత
బాగుంటుందో!
అలా చూడాలన్న కోరిక.. తెలిసో తెలియకో పుట్టే ఆ
కోరిక.. అదే కదా అతని నుంచి నన్ను విడిగా నిలిపేది!
అదొక్కటీ లేకపోతే.. ఎప్పుడూ ఆయన సంతోషాన్నే దర్శిస్తే యిక ఆయనకీ నాకూ
భేదమేముంది! అపుడు ఆయన కాకుండా ఇక విడిగా ‘నేను’ అంటూ మిగిలేది ఏముంది!
అందుకని ఏంచేస్తావు? అని ముక్కున వేలేసుకుంటున్నారు
కదూ!
పనిగట్టుకుని ఆయనకి కోపమెలా తెప్పిస్తానా అని
ఆశ్చర్యపోతున్నారు కదూ!
***
అధర్మంలో నిలబడి ఆయనకి దూరమవడమా! అబ్బే లేదు. అంత
సాహసం చేయను. ధర్మంలో నిటారుగా నిలబడని అలసత్వం చూపిస్తానంతే.
ఆచరణలో చిన్న చిన్న లోపాలు చేసి.. అవి నచ్చలేదన్నట్లుగా
ఆయన భృకుటి ముడిస్తే… కళ్ళనీళ్ళతో
నవ్వేసి కాస్తంత దుఃఖపడి కాస్త సేదతీరి మరోసారి ముందున్న గమ్యాన్ని చూసి
మురిసిపోయి... శక్తినీ బలాన్నీ నింపుకుని... మళ్ళీ బద్ధకం నన్ను ఆపేవరకూ మరో
నాలుగడుగులు వేసి... యిదీ నా స్థితి ప్రస్తుతం... అవును యిదే జీవితం!
*****
(2015 శ్రీరామనవమికి నవ్య వారపత్రికలో ప్రచురితం)
(2015 శ్రీరామనవమికి నవ్య వారపత్రికలో ప్రచురితం)
కామెంట్‌లు