అవస్థా త్రయము (తత్త్వబోధ -3)
ఆది శంకరుల తత్త్వబోధ ననుసరించి, స్వామి
తేజోమయానంద గారి వ్యాఖ్యానం ఆధారంగా అవస్థాత్రయమును అర్థం చేసుకునే ప్రయత్నం
చేద్దాము.
జాగ్రత్ స్వప్న సుషుప్త్యావస్థలు మూడింటినీ కలిపి అవస్థాత్రయం
అంటాము.
మనకి రకరకాల అనుభవాలు ఉంటాయి. చూడటంవినడం
స్పృశించడం వంటి భౌతికానుభవాలు,కామం క్రోధం స్నేహం
మోహం వంటి మానసిక అనుభవాలు, ఆలోచనలు
సిద్ధాంతాలు ఆదర్శాలు ఊహలు వంటి బౌద్ధికమైన అనుభవాలు - ఇలా రకరకాల అనుభవాలని మనం
నిరంతరం పొందుతూ ఉంటాము.
అవస్థాత్రయం అని చెప్పుకున్న జాగ్రత్ స్వప్న
సుషుప్త్యావస్థలు మూడిటినీ - మెలకువలో ఉండే సమయం, కలలు కనే సమయం, గాఢనిద్రలో
ఉండే సమయం - మనం ప్రతిరోజూ అనుభవిస్తూనే ఉంటాము
జాగ్రదవస్థ:
జాగ్రదవస్థలో మనం పూర్తిగా మెలకువలో ఉంటాము.స్థూల, సూక్ష్మ కారణ
శరీరాలనే మన మూడు శరీరాల యొక్క అనుభవాన్నీ పొందుతూ ఉంటాము. జాగ్రదవస్థలో ఉన్న
జీవుడిని విశ్వుడు అంటారు. స్థూల శరీరాన్ని జాగ్రదవస్థలో మాత్రమే గుర్తిస్తాము
మనము. స్వప్నావస్థలోను సుషుప్త్యావస్థలోను స్థూల శరీరపు స్పృహ ఉండదు.
జాగ్రదవస్థలో ఉన్నపుడు మనల్ని మనం స్థూలశరీరంగానే
భావిస్తూ ఉంటాము. అంటే స్థూలశరీరాన్ని చూస్తూ ‘నేను’ అంటే
అదేనని అనుకుంటూ ఉంటాము. అయితే ఆస్థూలశరీరం సూక్ష్మ కారణ శరీరాలతో సంబంధం లేకుండా
పని చేయలేదు.
స్థూలశరీరం పని చేస్తూ ఉన్నపుడు అనుభవానికి
సంబంధించిన అన్ని వ్యవహారాలూ దాని
ద్వారానే జరుగుతూ ఉంటాయి. జాగ్రదవస్థలో విషయానుభవం బయటినుంచి జరుగుతుంటుంది. ఇంద్రియాల ద్వారా
జరుగుతుంటుంది. ఒక పని చేస్తున్నామనీ (కర్తృత్వం) దాని ఫలితాన్ని
అనుభవిస్తున్నామనీ (భోక్తృత్వం) అనిపిస్తూ ఉంటుంది.
జాగ్రత్ప్రపంచం భౌతికంగా కనిపిస్తూ ఉంటుంది కనుక అదంతా
వాస్తవమైనదని అనిపిస్తుంది.అక్కడ ఎదురయే అన్ని
విషయాలకీ సంఘటనలకీ కార్యకారణ సంబంధాలున్నాయనిపిస్తుంది. అన్నీ ఏదో ఒక
నియమాన్ననుసరించి నడుస్తున్నాయనిపిస్తుంది. జాగ్రదవస్థలో ప్రతిరోజూ మనం ఒకే
పరిచితమైన ప్రపంచాన్ని చూస్తూ ఉంటాము కనుక ఆ ప్రపంచం వాస్తవమయినదని అనుకుంటూ
ఉంటాము. దానికి ఎక్క్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తాము. మనకు కనిపించే విషయాలతో అనుబంధాలనేర్పరచుకుని
ఆనందాన్నీ దుఃఖాన్నీ అనుభవిస్తూ ఉంటాము.
ఇందుకు భిన్నంగా స్వప్న ప్రపంచాన్ని మాత్రం
అవాస్తవమని అనుకుంటూ ఉంటాము.
స్వప్నావస్థ:
జాగ్రదవస్థలో చూసినటువంటివిన్నటువంటి విషయాల
ప్రభావంవలన ఏ ప్రపంచం మనకి కలలలో అనుభవానికి వస్తుందో అది స్వప్నప్రపంచం. స్వప్నావస్థలో ఉన్న జీవుడిని తైజసుడు అంటారు.
మెలకువలో ఉన్నపుడు విషయాలను గ్రహించడానికి మనకు
ముఖ్యంగా ఉపయోగపడేవి కళ్ళు, చెవులు.
అవి రెండూ, ఇంకా
ఇతర ఇంద్రియాలు,
మనసు, బుద్ధి
- వీటన్నిటి ద్వారా గ్రహించిన అనుభవాలన్నీ మన మనసు మీద ముద్రలు వేస్తాయి. అనుభవాలు
ఎంత గాఢమయినవయితే మనసు మీద అంత లోతైన ముద్రలుఏర్పడతాయి.
స్వప్న ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయలు మూడూ మనసే
చేస్తుంది. స్వప్నప్రపంచాన్నే కాదు దాన్ని అనుభవించేవాడిని (కల కనేవాడిని) కూడా మనసే
సృష్టిస్తుంది. కలలో ఉన్నవాడి అస్తిత్వం
మెలకువలో ఉన్నవాడి అస్తిత్వానికి పూర్తిగా భిన్నమయినది. కలలో బుద్ధికి ఏమీ పని
ఉండదు. కర్తృత్వభావనా ఉండదు. అందుకే కలలో చేసే పనులకి మంచినిగానీ చెడునిగానీ
ఆపాదించలేము. కలలో చేసే నేరాలకు శిక్షలుండవు. అక్కడ అనుభవం(భోక్తృత్వం) మాత్రమే
ఉంటుంది. అయితే మళ్ళీఅది సుఖానుభవమా దుఃఖానుభవమా అని ఎంచుకునే అవకాశం ఉండదు.
మెలకువగా ఉన్నప్పుడు అందకుండా పోయిన ఆకాంక్షలూ
అల్లుకున్న ఆలోచనలే కలలుగా మారతాయి.అవి భౌతికమైన రూపందాల్చాల్సిన అవసరం లేదు.
హటాత్తుగా బోలెడంత ఆస్తి వచ్చి పడినట్లూ, పక్షులు ఈదుతున్నట్లూ,
చేపలు ఎగురుతున్నట్లూ - ఇలా ఎన్నో రకాలుగా కలలు కనవచ్చు. మెలకువ వచ్చాక ఆ కలలు
విచిత్రంగాను అర్థరహితంగాను అనిపించవచ్చును కానీ కల కంటూన్నపుడు అలా అనిపించదు.
కలలో స్థూల శరీరాన్ని గురించిన స్పృహ ఉండదు, అక్కడ సూక్ష్మ
శరీరమూ కారణ శరీరమే ఉంటాయి.అక్కడ జీవుడు అన్నిటినీ స్థూల శరీరంతో పనిలేకుండా మనసు
ఆధారంగానే సృష్టించుకుంటాడు కనుకనే తైజసుడు అనబడతాడు.మెలకువ వచ్చాక కల అవాస్తవమని
అనిపిస్తుంది కానీ కల కంటున్నవాడికి మాత్రం ఆసమయంలో అది వాస్తవమే.
సుషుప్త్యావస్థ:
సుషుప్త్యావస్థ అంటే ఏమిటి? ఏ స్థితి
తర్వాత “నాకసలేమీ తెలియలేదు, హాయిగా నిద్ర పోయాను.” అని చెప్పగలుగుతామో ఆ
స్థితి. సుషుప్త్యావస్థని అనుభవించే జీవుడు “ప్రాజ్ఞుడు” అనబడతాడు.
స్థూల శరీరపు స్పృహా సూక్ష్మ శరీరపు స్పృహా కూడా
పోయి కేవలం కారణశరీరం మాత్రమే మిగిలే గాఢనిద్రా స్థితినే సుషుప్త్యావస్థ
అంటాము.
ఆ స్థితిలో ఉన్నపుడు బాహ్యప్రపంచమూ అందులోని
విషయాలూ ఉండవు. ఆలోచనలు, ఉద్వేగాలతో కూడిన అంతరంగ ప్రపంచమూ ఉండదు. నిద్ర
లేచాక “నేను హాయిగా నిద్రపోయాను” అన్న ఒక్క విషయం తప్ప ఆ స్థితికి సంబంధించి
మరింకే విషయాన్నీ మనం చెప్పలేము, ఎందుకంటే అక్కడ మరే యితర విషయాలూ లేవు కనుక.
అయితే “నేను ఆనందంగా నిద్రపోయాను” అని మాత్రం
చెప్పగలుగుతున్నామంటే అప్పుడు ఆ గాఢనిద్రాస్థితిలో ఆ ఆనందాన్ని అనుభవిస్తున్న “నేను”
అనేవారొకరున్నారని తెలుస్తోంది కదా! ఆ “నేను” నే “ప్రాజ్ఞుడు”అని అంటారు. అక్క్కడ “నేను”
అనుభవిస్తున్న ఆనందం ఏ బాహ్య అంతరంగిక విషయాల మీదా ఆధారపడినది కాదు కనుక ఆ
ఆనందానికి ఎటువంటి ఆలంబనా అవసరం లేదని అర్థమవుతోంది. కాబట్టి ఆ ఆనందమే “నేను”
యొక్క సహజమైన స్థితి అనమాట. ఆ విషయాన్ని
గ్రహించని మనం ప్రతిరోజూ నిద్రలేచి ఆనందం కోసం బాహ్యప్రపంచంలో వెతుక్కుంటూ ఉంటాము.
ఇంతకు ముందు చెప్పుకున్నట్లు జాగ్రదవస్థలో మనల్ని
మనం స్థూలశరీరంగా భావించుకుంటాము.కర్తృత్వ భావననీ భోక్తృత్వ భావననీ కూడా కలిగి ఉంటాం. స్వప్నావస్థలో సూక్ష్మశరీరమే నేను అన్న భావనతో కర్తృత్వం లేని భోక్తృత్వ
భావనని అనుభవిస్తాము. ఇక సుషుప్త్యావస్థలో కర్తృత్వ భావనా భోక్తృత్వ భావనా కూడా
ఉండవు. కాలమూ దేశమూ ఉండవు. అసలు “నేను” కాకుండా మరింకేదీ ఉండదు.
జాగ్రదవస్థలోను స్వప్నావస్థలోను మనం ఉన్నామని మనకు
తెలుస్తుంది. కానీ మన నిజమైన స్థితి ఏమిటో తెలియదు. మనల్ని మనం స్థూల శరీరంగానో
సూక్ష్మశరీరంగానో మాత్రమే భావించుకుని ఆయా ప్రపంచాలే వాస్తవమని అనుకుంటూ ఉంటాము.
గాఢనిద్రా స్థితిలో “నేను” అనేదీ
లేదు, ఆ “నేను” చూసే
బాహ్యప్రపంచమూ లేదు. ఏమీ లేని/తెలియని ఆ స్థితిలో ఉంటాడు కనుకనే అక్కడ జీవుడిని ప్రాజ్ఞుడు అంటారు.
మనిషికీ మనిషికీ జాగ్రత్ స్వప్నావస్థలు మారుతూ
ఉంటాయి కానీ సుషుప్త్యావస్థ మాత్రం అందరికీ ఒకటే. రాజు పేద పండితుడు పామరుడు అందరూ
సుషుప్త్యావస్థలో ఒకేరకమైన ఆనందాన్ని అనుభవిస్తారు. అక్కడ పొందే ఆనందంలో స్థాయీ
భేదాలేమీ ఉండవు. అది అఖండం, పరిపూర్ణం. అందుకే ఆస్థితి నుండి ఎవరికీ బయటకి
రావాలనిపించదు. గాఢనిద్ర తర్వాత మనకి కొత్తశక్తి
వచ్చినట్లనిపిస్తుంది. ఒక్కరోజు సరిగా నిద్ర పట్టకపోతే చాలు
పిచ్చెక్కినట్లనిపిస్తుంది. మంచి నిద్ర కోసం ప్రపంచంలో దేన్ని వదులుకోవడానికైనా
మనం సిద్ధపడతాం.
తమస్సు వల్ల జయించబడినవారమై మనం స్వప్నావస్థ నుండో
జాగ్రదవస్థ నుండో ఈ సుషుప్త్యావస్థలోకి ప్రవేశిస్తాము. కానీ వాసనా బలం వల్ల ఆ స్థితి నుండి మళ్ళీ
జాగ్రదవస్థలోకో స్వప్నావస్థలోకో నెట్టబడతాము.
మనందరికీ ప్రతినిత్యం ఈ మూడు అవస్థలూ వస్తూ పోతూ
ఉంటాయి. ఏ స్థితిలో ఉన్నపుడు అదే వాస్తవమన్న భావాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే
అవి మూడూ వాస్తవం కాదనీ ఆ మూడు అవస్థలకీ ఎవరు సాక్షిగా ఉన్నారో దానినే నిజానికి
“నేను” అని గుర్తుపట్టాలని ప్రతి ఒక్కరూ
తెలుసుకోవాలి. ‘నేను’
ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్కరకంగా
కనిపించవచ్చు. రకరకాల పాత్రలు ధరించవచ్చు, కానీ అవేవీ నా
నిజమైన తత్త్వం కాదు. మెలకువలో ఉన్నవాడు, కల గనేవాడు, గాఢనిద్రలో
మునిగినవాడు - ఈ ముగ్గురూ ‘నేను’
కాదు. ఆ ముగ్గురినీ చూడగలుగుతున్న వారెవరో ఆ చైతన్యమే “నేను” అన్న విషయాన్ని
గ్రహించాలి.
కామెంట్‌లు