సాధనచతుష్టయము (తత్త్వబోధ -1)
1) నిత్యానిత్య వస్తు వివేకము (2) ఇహాముత్రార్థఫలభోగ విరాగము (3) శమాదిషట్కసంపత్తి (4) ముముక్షుత్వము అనే నాలుగింటినీ సాధన చతుష్టయము అంటారు. వేదాంత విచారణకు ఉండవలసిన కనీస అర్హత ఈ సాధనచతుష్టయము. శంకరాచార్యులవారు తత్త్వబోధ అనే గ్రంథంలో ఈ విషయాలను వివరించారు. వీటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాము.
- నిత్యానిత్య వస్తు వివేకము: బ్రహ్మము మాత్రమే నిత్యమనీ మిగిలినవన్నీ అనిత్యమనీ గ్రహించగలగడమే నిత్యానిత్య వస్తు వివేకము. మనం ఈ ప్రపంచంలో చూస్తున్నవి ఏవీ శాశ్వతం కాదనీ అన్నీ మార్పుకు లోనయేవేననీ మనము గమనిస్తూనే ఉంటాము. మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిస్థితులే కాదు, ఇతరులతో మనకున్న సంబంధ బాంధవ్యాలే కాదు మన శరీరమూ మనసూ భావాలూ సిద్ధాంతాలూ విశ్వాసాలూ మొదలైనవన్నీ కూడా మారిపోతూ ఉండటాన్ని తెలుసుకుంటూనే ఉంటాము. అయితే కేవలం తెలుసుకోవడం కాక ఆ స్పృహని అనునిత్యం నిలుపుకోవాలి. అలా నిలుపుకోగలగడం నిత్యానిత్య వస్తు వివేకము.
- ఇహాముత్రార్థఫలభోగ విరాగము: ఇహలోక భోగాల పట్లా పరలోక భోగాల పట్లా కూడా వైరాగ్యాన్ని కలిగి ఉండడం ఇహాముత్రార్థఫలభోగ విరాగము. వైరాగ్యం అన్న లక్షణాన్ని సాధారణంగా అందరూ అసమర్థతకి పర్యాయపదంగానే భావిస్తూ ఉంటారు. ఏదైనా ఒక విషయాన్ని సాధించలేకపోయినవారే దానిపట్ల వైరాగ్యాన్ని ప్రదర్శిస్తారనీ లేదా ఏదైనా తీవ్రమైన బాధలో ఉన్నవారే వైరాగ్యంలోకి జారిపోతారనీ అపోహపడుతూ ఉంటారు. కానీ అది నిజం కాదు. నిత్యానిత్య వస్తువివేకం స్థిరంగా ఉన్నవారికి సహజంగా సిద్ధించే లక్షణం వైరాగ్యం. మనసు ఆరాటపడేది ఆనందం కోసమే. కాబట్టి ఎపుడైతే ఈ ప్రపంచంలోనివన్నీ అనిత్యమైనవేననీ శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేనివేననీ స్పష్టంగా గుర్తించగల వివేకం అలవడుతుందో అపుడు అటువంటి విషయాలపై ఆసక్తీ పోతుంది. ఆరాటమూ తగ్గుతుంది. అదే విరాగము. ఏ విషయం పట్లా రాగమూ ద్వేషమూ కూడా లేని వ్యక్తికి ఫలానా విషయాన్ని పొందలేకపోయాననో కోల్పోయాననో బాధా ఉండదు, ఇకముందు పొందలేనేమో పోగొట్టుకుంటానేమో అన్న భయమూ ఉండదు. కనుక నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము- ఈ రెండూ అలవడుతుండగానే నిజమైన ఆనందపు రుచి కూడా తెలుస్తూ ఉంటుంది.
- శమాదిషట్క సంపత్తి : శమము, దమము, ఉపరతి, తితిక్ష, సమాధానము, శ్రద్ధ అనే ఆరింటినీ కలిపి శమాదిషట్క సంపత్తి అంటారు.
- శమము : మనోనిగ్రహమే శమము. మనసును విషయాల చుట్టూ పరుగులు తీయనీయకుండా ఆలోచనల ప్రవాహంలో మునిగిపోకుండా ఆపగలగడమే శమము. మనసుదేముంది! దాని పాటికి అది ఏదో ఆలోచించుకుంటే మాత్రం నష్టమేముంది! అని నిర్లక్ష్యం చేయగల చిన్న విషయం కాదు యిది. ఎందుకంటే నియంత్రణ లేని మనసు చేయగల హానికి హద్దు లేదు. అలాగే నియంత్రణకు లొంగే మనసు ఇవ్వగల ఆనందానికీ మేర లేదు.
- దమము : ఇంద్రియాలను నిగ్రహించగలగడం దమము. మనోనిగ్రహం (శమము) సాధించిన వారికి ఇంద్రియాలను నిగ్రహించడం కష్టం కాదు. అది వారికి సహజంగా సిద్దిస్తుంది. కానీ ఒకవేళ మనోనిగ్రహాన్ని కోల్పోయే పరిస్థితీ నిలబెట్టుకోలేని పరిస్థితీ ఉన్నప్పటికీ కూడా కనీసం ఇంద్రియాలను నిగ్రహించే ప్రయత్నం చేయవచ్చు. ఒక నిషిద్ధమైన పనిని చేయాలని ‘అనిపించడాన్ని’ నిగ్రహించుకోలేక పోయినా కనీసం ‘చేయకుండా’ ఉండడానికి ప్రయత్నించవచ్చు. ఉదాహరణకి కోపాన్ని నిగ్రహించుకోలేక పోయినా ఆ కోపంలో పరుషంగా మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నించవచ్చు.
- ఉపరతి : స్వధర్మానుష్టానమే ఉపరతి. నిత్యానిత్య వస్తు వివేకము, ఫలభోగ విరాగము, శమము, దమము వంటివి సాధించే ప్రయత్నం చేస్తున్న వ్యక్తికి తన జీవితానికి సంబంధించిన కర్తవ్యాల విషయంలో స్పష్టత ఉండాలి. లేని పక్షంలో అనునిత్యమూ సంఘర్షణకి గురికావలసి వస్తుంది. ఆ స్పష్టతని ఇచ్చే అంశమే ఉపరతి. తానేమిటి తన స్థితి ఏమిటి తాను నిర్వర్తించవలసిన ధర్మమేమిటి అన్న విషయం తెలుసుకుని దానికి పరిమితమయిన వ్యక్తికి అర్థం లేని ఆరాటాలను తగ్గించుకోవడమూ సాధకుడికి అవసరమైన లక్షణాలను పెంపొందించుకోవడమూ సులభమవుతుంది.
- తితిక్ష : తితిక్ష అంటే సహనం. చలికి యెండకు ఓర్చుకోగల శక్తి. దుఃఖాలను అసౌకర్యాలను సహించే శక్తి లేనపుడు వాటిని వదిలించుకోవాలన్న ఆరాటం, అందుకోసం పరుగులు పెట్టడం, వేల కార్యక్రమాలలో తలదూర్చడం ఉంటాయి. ఆ దుఃఖానికి కారణమయిన వారిపై ద్వేషాలు కోపాలు ఉంటాయి. తితిక్షని సాధించిన వారికి అటువంటి ఆరాటపోరాటాలు ఉండవు. తితిక్షని పెంపొందించుకున్నవారికి ఉపరతిని సాధించడం సులభమవుతుంది.
- శ్రద్ధ : శ్రద్ధ అంటే విశ్వాసము. గురువు పట్ల శాస్త్రం పట్ల ఉండే అచంచలమైన నమ్మకం. అలాంటి నమ్మకం ఉన్నవారికే ఒక విషయంలోని సూక్ష్మాన్ని గ్రహించగల ప్రజ్ఞ అలవడుతుంది. ఆ ప్రజ్ఞ కేవలం పాండిత్యం వలన వచ్చేది కాదు. గురువు పట్లా శాస్త్రం పట్లా పూర్తి నమ్మకం లేనపుడు సాధన యెంత మాత్రమూ ముందుకు సాగదు. ఇక్కడ నమ్మకం అంటే అచంచలమైన నమ్మకం అని గ్రహించాలి. నమ్ముతున్నామని అంటూ అనుకుంటూ ఉండేవారికి కూడా ఆ విశ్వాసం బలంగా లేకపోవడం సాధారణంగా కనిపిస్తూ ఉండే విషయం. అటువంటపుడే ఆచరణలో ఎక్కడిక్కడే తమకు తోచిన వెసులుబాట్లు ఇచ్చేసుకుంటూ ఉండడం, తమకి అనుకూలంగా శాస్త్ర వాక్యాలనీ గురువాక్యాలనీ మార్చేసుకుంటూ ఉండడం జరుగుతుంటుంది. శ్రద్ధ గురించి ఇంతగా చెప్పుకోవడం ఎందుకంటే పైన చెప్పుకున్న శమము, దమము, ఉపరతి, తితిక్షలకు అదే ఆధారం కనుక. శ్రద్ధ ఉన్నవారే వాటిని ఎప్పటికైనా సాధించగలుగుతారు కనుక.
- సమాధానం: సమాధానమంటే తత్త్వ వస్తువుపై ఉండే ఏకాగ్రత. ఇది జన్మ సంస్కారం వలన ఏర్పడుతుంది. అలా ఏర్పడిన దానిని శ్రవణాదుల ద్వారా ప్రయత్నపూర్వకంగా పెంచుకోవాలి. ఏకాగ్రత లేకుండా మనసు ఇతర విషయముల వైపు పరుగెత్తుతున్నపుడు, వివేకంతోఆ విషయాలలోని దోషాన్ని గ్రహించి వాటి నుండి మనస్సును మరలించుకుని మరలా తత్త్వవస్తువునందు నిలపడమే సమాధానం. సమాధానం శ్రద్ధని పెంచుతుంది. శ్రద్ధా సమాధానాలు తితిక్షను, తితిక్ష ఉపరతిని, ఉపరతి దమాన్ని, దమం శమాన్ని కలిగిస్తాయి.
మోక్షము కావాలనే కోరికని చాలామంది వెలిబుచ్చుతారు కదా ముముక్షుత్వం అంటే అదేనా అంటే కాదట. మాటవరసకి మోక్షం కావాలనడం, ఇహలోకపు కోరికలన్నీ పుట్టినవి పుట్టినట్లు పుష్కలంగా తీరుతూ పోయాక చివరికి చనిపోయే సమయానికి మోక్షం కూడా వస్తే బాగుంటుందని అనుకోవడం - అది మోక్షేచ్ఛ కాదు. మంటలలో చిక్కుకున్నవాడు బయటపడడానికి ఎలా తపిస్తాడో ఎలా దారులు వెతుకుతాడో ఎలా పరుగులు తీస్తాడో – అంత తీవ్రంగా మోక్షం కోసం ప్రయత్నిస్తే అది మాత్రమే ముముక్షుత్వం అనబడుతుంది.
ఈ సాధన చతుష్టయమును సంపాదించుకొన్న వాడే తత్త్వ విచారణకు అర్హుడు.
*****
కామెంట్‌లు